జ్ఞానానికి సంకెళ్లు, జాతికి సవాళ్లు

3 Feb, 2016 23:56 IST|Sakshi
జ్ఞానానికి సంకెళ్లు, జాతికి సవాళ్లు

కొత్త కోణం
 
దేశ విద్యావిధానం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సరైన ప్రయోజనం సాధించలేక పోతోందంటే దానికి ప్రధానమైన బాధ్యత 2వేల ఏళ్లపాటు అక్షరజ్ఞానాన్ని ఇతరులకు అందకుండా, తమ ఆధిపత్య చెరసాలల్లో బంధించిన వాళ్లది కాదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అదేవిధంగా ఏ దేశంలోనైనా సాంప్రదాయికంగా వస్తున్న శాస్త్ర, సాంకేతిక అంశాలపై ఆధారపడి ఆధునిక పరిశోధనలు జరుగుతాయి. అయితే శూద్రులు, అంటరాని కులాలు కొనసాగించిన వృత్తులను, నైపుణ్యాలను హీనమైనవిగా చూసిన ఘనచరిత్ర మనది.

 
ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో/ ఎక్కడ మనుషులు తలెత్తుకుని తిరుగుతారో/ ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా ఉంటుందో/ సంకుచిత భావాలతో ముక్కలుగా చీలిపోదో/ ఎక్కడ సత్యవాక్కులు వెలువడతాయో/ఎక్కడ నిర్విరామ కృషి పరిపూర్ణత కోసం చేతులు చాస్తుందో/ఎక్కడ స్వచ్ఛమైన వివేకధార ఇంకిపోకుండా ఉంటుందో/ ఎక్కడ నిరంతర ఆలోచన, ఆచరణ వైపు నీవు/బుద్ధిని నడిపిస్తావో నా తండ్రీ/ ఆ స్వేచ్ఛా స్వర్గానికి నా దేశాన్ని మేల్కొల్పు. రవీంద్రనాథ్ టాగూర్ ‘గీతాంజలి’లో వాక్యాలివి. స్వేచ్ఛాయుతమైన జ్ఞానం స్వర్గానికి దారులుతీస్తుందని విశ్వసించేవిగా ఈ వాక్యాల్ని నేను భావిస్తున్నాను.
 
ఆర్మీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సెన్సైస్‌లో అడ్మిషన్లు కేవలం ఆర్మీ వారికే వర్తిస్తాయన్న కాలేజీ యాజమాన్యం వాదనలోని తప్పిదాన్ని ఎత్తిచూపుతూ సరిగ్గా ఈ గీతాన్నే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి తన తీర్పులో ఉటంకించారు.
 
ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌కూ, ఆర్మీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ సంస్థలకూ మధ్య నడిచిన  కేసులో 2011 మే, 12వ తేదీన, జస్టిస్ సురీందర్ సింగ్ నిజ్జర్‌తో కలసి ఇచ్చిన తీర్పులో ఈ కవితను ప్రస్తావించారు. ఆర్మీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సెన్సైస్‌లో ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు మాత్రమే ప్రవేశాలు ఉండే విధంగా నిబంధనలు  రూపొందించుకున్నారు. అవి రాజ్యంగ స్ఫూర్తికి భిన్నంగా ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై ఇచ్చిన తీర్పు అది.
 
జ్ఞానం అందరిదీ!
ప్రభుత్వ సొమ్ముతో, సహాయంతో నడిచే ఏ విద్యా సంస్థ అయినా అందరికీ అందుబాటులో ఉండాలనీ, అవి కొన్ని వర్గాలకు, కొంతమందికి మాత్రమే పరిమితమయ్యే స్థలాలుగా ఉండకూడదనీ న్యాయమూర్తి పేర్కొన్నారు. తరతరాలుగా భారత సమాజంలో ఆధిపత్య కులాలు, వర్గాలు తమ అధికా రాన్ని నిలబెట్టుకోవడం కోసం జ్ఞాన సంపద మీద గుత్తాధిపత్యాన్ని చెలా యించాయని ఆ తీర్పులో స్పష్టం చేశారు.
 
అందువల్లనే ఈ సమాజంలో అంతరాలు పెరుగుతున్నాయని,  పై అంతస్తులో ఉన్న కొన్ని సమూహాలు విజ్ఞానాన్ని సొంతం చేసుకోవడం వల్ల మన దేశం బలహీన పడుతున్నదని స్పష్టం చేశారు.  ఇదే విషయాన్ని ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారా యణమూర్తి మరొక కోణంలో చెప్పిన మాటలు కూడా ఆలోచింపజేస్తాయి. 2015 సంవత్సరం, జూలై 15న బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్ స్నాతకోత్సంలో ఆయన కీలకోపన్యాసం చేశారు.
 
అందులో, దేశ ప్రగతిలో శాస్త్ర సాంకేతిక రంగాల విజయాలు కీలకపాత్ర వహిస్తాయనీ, ఈ కృషిలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్ ముఖ్య భూమిక పోషించాలని కోరారు. ఎంతోమంది యువశాస్త్ర వేత్తలను ఈ సంస్థ సృష్టించిందని, వారు రాణిస్తున్నారని కూడా కొనియాడారు. ఇక్కడే దేశం యావత్తు విస్తుపోయేలా, దేశ శాస్త్ర, సాంకేతిక రంగాల దైన్యాన్ని కూడా బయటపెట్టారు.
 
తాను కేంబ్రిడ్జి మసాచుసెట్స్ విశ్వవిద్యాలయాల్లో రెండు నెలల క్రితం  ‘ఫ్రం ఐడియాస్ టు ఇన్‌వెన్షన్స్’ అనే పుస్తకాన్ని చూశానని అందులో ఎంఐటి విద్యార్థులు, పరిశో ధకులు, ప్రొఫెసర్లు కేవలం 50 సంవత్సరాల్లో ఆవిష్కరించిన 101 పరిశోధక విజయాలను పొందుపరిచారని చెప్పారు. కానీ భారతదేశంలో గత అరవై సంవత్సరాల్లో ప్రకంపనలు సృష్టించే ఎటువంటి ఆవిష్కరణను శాస్త్ర సాంకే తిక సంస్థలుగానీ, బయట వ్యక్తులుగానీ సాధించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రపంచ ప్రజలందరితో పాటు మనం అనుభవిస్తున్న సౌకర్యాలు ఇతర సదుపాయాలు అన్నీ పాశ్చాత్య దేశాల సృష్టి అంటే మీరు కాదనగలరా అని ప్రశ్నించారు. అందులో కార్లు, ఎలక్ట్రిక్ బల్బ్, రేడియో, టెలివిజన్, కంప్యూటర్స్, ఇంటర్నెట్, వైఫై మ్యూజిక్ ప్లేయర్స్ అన్నీ ఇతర దేశాల కృషి ఫలితమేనని గుర్తు చేశారు.
 
కానీ మన శాస్త్రవేత్తలు, సంస్థలు ఇటువంటి కృషికి పూనుకోవడం లేదు. వాటికి కారణాలు వెతకడానికి, పరిష్కారాలు కనుగొనడానికి మనం సిద్ధంగా ఉండం. కారణం దేశ ప్రజలందరూ ఒక్కటిగా లేరు. ఇక్కడ మనుషులను విడగొట్టి కుల సమాజం రెండువేల ఏళ్లకు పైబడి ప్రజల్లో ఐక్యతను సమ ర్థంగా దెబ్బకొడుతోంది. ఆవిష్కరణలకు మేథస్సు కారణమైనా అది సమష్టి కృషివల్లనే ఒక రూపం సంతరించుకుంటుంది. ఆ ఏకీభావం లేనికారణంగానే మేథోజగత్తుని మథించే ఒక వర్గాన్ని వేలయేళ్లుగా మట్టిమనుషులుగా కొనసాగిస్తున్నారు.
 
అర్థంలేని ప్రచారం

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే, రిజర్వేషన్ల వల్లనే ప్రతిభ, నైపుణ్యాలు దెబ్బ తింటున్నాయనీ, శాస్త్ర సాంకేతిక సంస్థలు నిరుపయోగంగా మారుతున్నాయనీ ప్రచారం చేస్తున్నారు. శాస్త్ర సాంకేతిక సంస్థల్లో ప్రారంభం నుంచి రిజర్వేషన్లు లేవన్న విషయం ముందు గ్రహించాలి. ఉన్నా ఆ సంఖ్య స్వల్పం. రిజర్వేషన్ల ద్వారా ప్రవేశాలు పొందిన వారి, ఉద్యోగాలు చేస్తున్న వారి సంఖ్య పాతిక శాతానికి మించదు. 1950 నుంచి ప్రారంభమైన స్వతంత్ర పాలనలో 1974 తర్వాతనే ఎస్సీ, ఎస్టీలకు ఈ సంస్థల్లో రిజర్వేషన్లు వచ్చాయి.
 
ఇందులో కూడా పూర్తిస్థాయిలో వీరి నియామకం జరగలేదు. 1974కి  ముందే ఆధిపత్యకులాల వాళ్లు జ్ఞానాన్ని తమ చెప్పుచేతల్లో ఉంచు కోవడంలో కృతకృత్యులయ్యారు. మరి ఎందుకు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రగతి సాధించలేదు అని ఒక్కసారి ఆలోచిస్తే మళ్లీ అదే సమాధానం వస్తుంది. అందుకు వేళ్లూనుకున్న కుల వ్యవస్థే కారణం. ఒకవైపు భారత దేశంలో అక్షర జ్ఞానాన్ని కేవలం ఒకటి రెండు కులాలు సొంతం చేసుకున్న వాస్తవాన్ని చరిత్ర మనముందుంచుతుంది.
 
రెండోవైపు సాంప్రదాయికంగా శ్రమతో నిర్మితమైన సాంకేతిక, వృత్తిపరమైన జ్ఞానాన్ని అక్షరం మీద పెత్తనం కలిగిన వర్గాలు నిజమైన విజ్ఞానంగానే గుర్తించలేదు.వేదాలు ప్రామాణికంగా ఉన్న కాలం నుంచి ఈ నిషేధాలు అమలులో ఉన్నాయి. వేదాలు చదవడమే కాదు, వినడం కూడా నేరమైన చోట విజ్ఞానం కోసం నిమ్న వర్గాల ప్రజలు వేనవేల సంవత్సరాల నుంచి ఎదురుచూస్తూనే ఉన్నారు.
 
అంటే దాదాపు రెండువేల ఏళ్ల నాడు  90 శాతం మందికి అక్షరజ్ఞానం అందుబాటులో లేదన్నది కఠిన వాస్తవం. బ్రిటిష్ వారు 19 వ శతాబ్దంలో ప్రవేశపెట్టిన విద్యావిధానం, క్రైస్తవ మిషినరీలు అందించిన అక్షర జ్ఞానంతో ఈనాటి సార్వత్రిక విద్యకు పునాది పడింది. అయితే భారతదేశ స్వాతంత్య్రం వరకు ఇది నూటికి నూరు శాతం ఫలితం సాధించలేక పోయింది. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సారథ్యంలో విరచితమైన రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో ప్రజలందరికీ చదువుకునే హక్కు లభించింది.
 
ఇటువంటి నేపథ్యం కలిగిన భారతదేశ విద్యావిధానం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సరైన ప్రయోజనం సాధించలేకపోతోందంటే దానికి ప్రధానమైన బాధ్యత రెండు వేల సంవత్సరాలపాటు అక్షరజ్ఞానాన్ని ఇతరులకు అందకుండా, తమ ఆధి పత్య చెరసాలల్లో బంధించిన వాళ్లది కాదా? అని మనల్ని మనం ప్రశ్నించు కోవాలి. అదేవిధంగా ఏ దేశంలోనైనా సాంప్రదాయికంగా వస్తున్న శాస్త్ర, సాంకేతిక అంశాలపై ఆధారపడి ఆధునిక పరిశోధనలు జరుగుతాయి.
 
అయితే శూద్రులు, అంటరాని కులాలు కొనసాగించిన వృత్తులను, నైపు ణ్యాలను హీనమైనవిగా చూసిన ఘనచరిత్ర మనది. కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, నేత పనులతో పాటు, పద్దెనిమిది కులాలను, తాము శుభ్రపరిచిన జంతు చర్మాల ద్వారా ఉత్పత్తి పరికరాలను అందించిన మాదిగలను, చెరువుల నిర్మాణంలో, నిర్వహణలో నిర్విరామంగా కృషిచేసి, నిలకడ గలిగిన వ్యవసాయ విధానాన్ని అందించిన మాలలను అక్షరాధిపత్యం కలిగిన కులాలు గుర్తించనేలేదు. దీనితో తరతరాలుగా వచ్చిన సాంప్రదాయిక వృత్తులు, నైపుణ్యం ధ్వంసం అయ్యాయి. నిజమైన ప్రయోజనం కలిగించే పరిశోధనలు, ఆవిష్కరణలను చేయలేకపోయాయి.
 
పంచుకునే తత్వం లేకనే!
కుల సమాజంలోని మరో లక్షణం కూడా ఈనాటి దౌర్భాగ్యానికి కారణం. ఏ శాస్త్రసాంకేతిక, పరిశోధనలైనా సంగీతం లాగా ఒక మిశ్రమంగా సాగాలి. మన కుల సమాజానికి జ్ఞానంగానీ, విజ్ఞానంగానీ పంచుకునే తత్వం లేదు. దేశంలోని సగభాగంగా ఉన్న ప్రజల మేథస్సుని కనీసం ఉపయోగించే అవకా శాన్ని కూడా  కుల సమాజం ఇవ్వలేదు. వైద్యరంగానికి ఎంతగానో ఉపయో గపడే ఆకుపసరుతో చేసే చాలా రకాల మందులు భవిష్యత్ తరాలకు అంద కుండా పోయాయి.
 
మందు రహస్యం ఇతరులకు చెప్పకూడదన్న నియమం విధించడం వల్ల వారి జ్ఞానం అంతా వారితోనే సమాధి అవుతోంది. భాషల విషయంలో కూడా ఇదే జరిగింది. బౌద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన ప్రాకృతం, పాళి భాషలను ప్రయత్న పూర్వకంగానే ఆనాటి ఆధిపత్య కులాలు అణచివేశాయి. సంస్కృతం అంతరించి పోవడానికి కూడా ఇదే కారణం. బ్రాహ్మణ పురోహిత వర్గం తమ వ్యక్తిగత పరిజ్ఞానంగా సంస్కృతాన్ని భావించి దాన్ని ఇతరులు నేర్చుకునే  అవకాశాన్నివ్వకపోవడంతో, మృత భాషగా తయారయ్యే దుస్థితికి వచ్చింది.
 
అందుకే  టాగూర్ పేర్కొన్నట్లు విజ్ఞానానికి, ఆలోచనకు స్వేచ్ఛని వ్వాలి. ఎవరైనా జ్ఞాన సముపార్జనకు  అర్హులేనన్న భావం రావాలి. అంతే కానీ విజ్ఞాన భాండాగారాలుగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు కులం పేరుతోనో, మతం పేరుతోనో ఎవరో కొందరి గుత్త ఆస్తిగా ఉంటే  శాస్త్ర, సాంకేతికాభివృద్ధికి అవరోధంగా నిలుస్తాయి. మేధస్సు విస్తరిస్తే అది మానవ జాతి పురోభివృద్ధికి తోడ్పడుతుంది. మేథస్సుకి సరి హద్దులు గీస్తే, రంగులు పులిమి, అంధకారంలోకి నెడితే అది విస్ఫోటనం చెందుతుంది. ఎందుకంటే జ్ఞానాన్ని బంధించలేం. కాకుంటే కాలం పరిష్కారాన్ని వెతుక్కుంటుంది.
 
మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు  మొబైల్: 97055 66213

మరిన్ని వార్తలు