మెహర్‌బాబా ‘గాడ్ స్పీక్స్’

10 May, 2014 00:49 IST|Sakshi
మెహర్‌బాబా ‘గాడ్ స్పీక్స్’

హోలీ బుక్: సృష్టి గురించి దాని ప్రయోజనం గురించి తెలియజెప్పే గ్రంథాలు ఇటీవలి కాలంలో చాలా వచ్చినవిగాని ఇంగ్లిష్‌లో మెహర్‌బాబా రచించిన ‘గాడ్ స్పీక్స్’ గ్రంథం చెప్పినంత సాధికారికంగా, సమగ్రంగా మరే గ్రంథం చెప్పలేదంటే అతిశయోక్తి కాదు. దీనిని చదువుతుంటే ప్రపంచంలోని గొప్ప మతాల్లో ఉన్న సిద్ధాంతాలు, బోధనలు అన్నీ కూడా ఒకే తీగకు గుచ్చబడిన పూసల్లా ఉన్నవని అనిపిస్తుంది. ఈ గ్రంథం స్థూలంగా ఆత్మ సుదీర్ఘ ప్రయాణాన్ని చెబుతుంది. ఆ ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ‘నేనెవరు?’ అనే ప్రశ్న నుండి ‘నేను భగవంతుడను’ అనే సమాధానం వరకు.
 
 సృష్టి మొదలు అవటానికి ముందు ఉన్న స్థితి ఏమిటో ఎలాంటిదో ఎవరూ చెప్పలేరు. అలాంటి స్థితిలో పరమాత్మ తప్ప వేరే ఏమీ లేదు. ఆ స్థితిలో ఉన్న పరమాత్మకు తానెవరో తనకు తెలియదు. తానెవరో తెలుసుకోవాలనే ఒకానొక ఊహ పరమాత్మలో కలిగింది. ప్రశాంతంగా ఉన్న సముద్రంలో గాలి వీస్తే కదలిక కలిగి ఎట్లా బుడగలు ఏర్పడతవో అట్లా ఆ ఊహ వల్ల సృష్టి ప్రారంభమైంది. ఆ ఊహే ఆత్మకు చైతన్యం కలిగించి అది పరిణామం చెందటానికి దోహదపడుతుంది.
 
 మానవరూపం పొందటానికి ముందు ఆత్మ- రాయి, లోహం, మొక్క, పురుగు, చేప, పక్షి, జంతువు- రూపాలను ఒకదాని తరువాత ఒకటి పొందుతూ ఉంటుంది. మానవరూపం వచ్చినాక ఆత్మకు సంపూర్ణ చైతన్యం కలుగుతుంది. అలా కలగటంతో ఆత్మ చేసే మొదటి ప్రయాణం ముగుస్తుంది. ఈ ప్రయాణాన్ని అధోముఖ ప్రయాణం అంటారు. అయితే ఈ ప్రయాణంలో ఆత్మకు సంస్కారాలు ఏర్పడి ఏ సంస్కారాలైతే తన చైతన్య పరిణామానికి దోహదపడ్డాయో ఆ సంస్కారాలే మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఆత్మ తనను తాను తెలుసుకోవడానికి ఆటంకంగా అడ్డు తెరలుగా నిలుస్తవి. ఆ ఆటంకాన్ని తొలగించుకోవడానికి ఆత్మ తదుపరి ప్రయాణం చేస్తుంది. అదే పునర్జన్మ.
 
 జీవాత్మ కచ్చితంగా ఎనభై నాలుగు లక్షల సార్లు మానవ రూపంలో పుడుతది. కొన్నిసార్లు స్త్రీగా, మరికొన్నిసార్లు పురుషుడుగా, అన్ని జాతుల్లో అన్ని దేశాల్లో. పరిణామ దశలో సంస్కారాలు బలపడి గట్టి బంధంగా ఏర్పడుతవి. పునర్జన్మ దశలో ఆ సంస్కారాలు బలహీనపడి వదులు అవుతవి. అనేక జన్మలు కలగటం వల్ల పేరుకు పోయిన వివిధ రకాల సంస్కారాలు అన్నింటిని అనుభవించటానికి అవకాశం ఏర్పడుతుంది. ఒకవైపు ఉన్న సంస్కారాలు అనుభవించడం ద్వారా ఖర్చు అవుతుంటే మరోవైపు కొత్త సంస్కారాలు ఏర్పడుతుంటవి. ఇలా కొత్తగా ఏర్పడిన సంస్కారాల్ని అనుభవించటానికి మళ్లీ జన్మ ఎత్త వలసి వస్తుంది. ఈ విధంగా జన్మ పరంపర కొనసాగుతూ ప్రాపంచిక విషయాలు ఎందుకూ కొరగానివని ఎప్పుడైతే తెలిసి వస్తుందో అప్పుడు ఆత్మ తన  జీవితలక్ష్యం చేరుకోవటానికి మూడో దశలోకి అంటే ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగుపెట్టడం జరుగుతుంది. జీవాత్మ చేసే చివరి ప్రయాణం ఇదే.
 
 ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో భగవంతుని ప్రత్యక్ష అనుభూతి, ఆత్మ సాక్షాత్కారం  కలుగుతుంది. ఆత్మ సాక్షాత్కారం పొందిన జీవి తాను వేరు, భగవంతుడు వేరు అనికాక తాను, భగవంతుడు ఒక్కటే అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. అన్ని బంధనాల నుండి విముక్తుడవుతాడు. అలా విముక్తి చెందినవారిలో నుండి కొందరు సద్గురువులుగా ఉంటూ అజ్ఞానంలో ఉన్న వారికి సరైన తోవ చూపిస్తుంటారు. అధర్మం పెచ్చు మీరినప్పుడు వారు భగవంతుని ఒప్పించి భూమ్మీదకు మానవునిగా అవతరింప జేస్తారు. సంగ్రహంగా గాడ్‌స్పీక్స్‌లో ఉన్న విషయం ఇదీ. గ్రంథం పూర్తిగా చదివిన తర్వాత నిజంగానే  భగవద్వాణి విన్న అనుభూతి కలుగుతుంది.
 - దీవి సుబ్బారావు

మరిన్ని వార్తలు