మోదీ ప్యాకేజీల రాజకీయం

6 Sep, 2015 01:22 IST|Sakshi

నరేంద్ర మోదీకి మంచి వాగ్ధాటి ఉన్న దనీ, సభా ప్రాంగణంలో లైట్లూ, కెమెరా లకిచ్చే ప్రాధాన్యం ఆచరణలో తన మాటలకు ఇవ్వడం లేదనీ 'ది ఎకన మిస్ట్' ఆగస్టు 29 సంచికలో వ్యాఖ్యానిం చింది. కటువైన పదజాలాన్ని అరుదుగా వినియోగించే ఆ పత్రిక వ్యాఖ్యలు ఆశ్చ ర్యపరుస్తున్నా, అవి వాస్తవాలేనని చెప్ప కతప్పదు. మోదీ మాటలకీ, చేతలకీ మధ్యనున్న వైరుధ్యాలు ఒకటి తర్వాత మరొకటి వెలుగు చూస్తున్నాయి. మోదీ జనాకర్షణ నినాదాలను, వాటిని ఆచరిస్తున్న తీరును లోతుగా పరిశీలిస్తేనే అంతరార్థాలు బైటపడతాయి.


 కోఆపరేటివ్ ఫెడరలిజం ద్వారా దేశం రూపురేఖలను మార్చనున్నట్లు మోదీ తన ఎర్రకోట తొలి ప్రసంగంలో ప్రకటిం చారు. తర్వాత ప్రణాళికా సంఘం, జాతీయ అభివృద్ధి మండలి రద్దు, వాటి స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పాటు జరిగాయి. దీనితో సహకార సమాఖ్య, కింది నుంచి పైకి ప్రణాళికా రచనలూ సాకారం కానున్నాయన్న భావన కలిగించారు. ఇది జరగాలంటే కేంద్రం కొన్ని అధికారాలను వదులుకోవడానికి సిద్ధపడాలి.

ప్రణాళికా నిధులు, రద్దు చేసే కేంద్ర పథకాల నిధులు, రద్దయ్యే కొన్ని కేంద్ర ప్రభుత్వ శాఖల నిధుల విడుదలకు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన పంపిణీ పద్ధతిని రూపొందించాలి. రాష్ట్రాలు తమ స్వంత అభివృద్ధి ప్రణాళికలకు వినియోగించుకొనే స్వేచ్ఛను కల్పించాలి. చివరగా వివిధ రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఎన్నికల సంఘర్షణను పక్కన పెట్టి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలుగా వాటిని గుర్తించి సహకార సమాఖ్యలో వివక్ష లేకుండా భాగస్వాములను చేసే విశాల దృక్పథం ఉండాలి. ఇవి జరిగితే ప్రధాని ఎవరైనా, ముఖ్యమంత్రలుఎవరైనా టీం ఇండియాగా పనిచేసే పరిస్థితి వస్తుంది.


 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు కేటాయించే పన్నుల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచడంతో సహకార సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా నిధుల వికేంద్రీకరణకు మోదీ ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లుగా విస్తృత ప్రచారం జరిగింది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ పథకాలలో, ఇతర బదలాయింపులలో కోతలతో రాష్ట్రాలకు జరగాల్సిన మొత్తం బదలాయింపులలో లక్ష కోట్లకు పైగా తగ్గిపోయింది. ఆర్థిక సంఘం పెంచిన వాటా కంటే కేంద్రం కోసిన కోతలు ఎక్కువయ్యాయి.


 కొత్తగా ఏర్పాటు చేసిన సంస్థ నీతి ఆయోగ్. కేంద్రం అనుసరించాల్సిన విధానాలను సూచించడానికి, సహకార స్ఫూర్తితో రాష్ట్రాలతో విధానపరమైన అనుసంధానానికి సూచనలిచ్చే మేధోమథన సంస్థగాను దానికి రూపునిచ్చారు. ప్రణాళికా సంఘం స్థానంలో వచ్చినప్పటికీ నీతి ఆయోగ్‌కు ప్రణాళికా నిధులను కేటాయించే అధికారాలు ఇవ్వలేదు.  అవసరమైతే అడ్డం పెట్టుకోవడానికి ఉపకరించే ఉత్సవ విగ్రహం మాదిరిగా దానిని మలిచారు. ప్రణాళికా సంఘం ఏటా రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వ శాఖలకు కేటాయిస్తున్న నిధులు 5, 6 లక్షల కోట్ల రూపాయలు. వీటిని పంపిణీ చేసే అవకాశం కూడా నేరుగా కేంద్రమే స్వంతం చేసుకుంది. ఇదంతా సహకార సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. అధికార, ఆర్థిక వికేంద్రీకరణకు విరుద్ధం. మోదీ మాటలకు అర్థాలే వేరు అనడానికి ఇది అద్దం పడుతుంది.


 గతంలో రాష్ట్రాలకు ప్రణాళికా నిధుల పంపిణీకి గాడ్గిల్- ముఖర్జీ ఫార్ములా ఉండేది. విచక్షణతో ఇచ్చే అదనపు లేదా ప్రత్యేక ప్రణాళికా నిధులు కేటాయించడానికి కొన్ని కొలబద్దలు ఉండేవి. ఇప్పుడవి లేవు. ప్రాతిపదికలు లేని ప్యాకేజీలకు ద్వారాలు తెరుచుకున్నాయి. రాజకీయ లబ్ధి ప్రాతిపదికగా ప్యాకేజీలు పుట్టుకొస్తున్నాయి. రాష్ట్రాల మీద రాజకీయ ఆధిపత్యాన్ని తెచ్చి పెట్టే సాధనాలవుతున్నాయి. రాష్ట్రాలను రాజకీయంగా అస్మదీయులు, తస్మదీయులుగా విభజించి ప్యాకేజీల అస్త్రాన్ని ప్రయోగించడం మొదలైంది. కలసొచ్చే వారికి ప్యాకేజీల బొట్టు పెట్టి బుట్టలో వేసుకోవడం, రాజకీయంగా ప్రత్యర్థులైతే అక్కడి ప్రజలకు భారీ ప్యాకేజీలతో భ్రమలు కల్పించి ఎన్నికలలో శత్రు కూటమిని మట్టి కరిపించాలనే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. మమతా బెనర్జీకి ప్రత్యేక సహాయాలు, రాష్ట్ర రుణ విముక్తి వంటి ఆశలు చూపించడం, జయలలితకు 12 స్మార్ట్ సిటీలను కానుకగా ఇవ్వడం మొదటి తరహాది కాగా, బిహార్ ప్యాకేజీ రెండో తరహాది. బిహార్ ప్రభుత్వం ఈ ప్యాకేజీని కోరలేదు. నీతి ఆయోగ్ ఆ రాష్ట్రంతో చర్చలు జరపలేదు. ప్యాకేజీ ఇవ్వాలని ప్రధానికి సూచించనూ లేదు. బడ్జెట్ ఆమోదాలూ లేవు. ఐనా మోదీ 1 లక్షా 65 వేల కోట్లతో ప్రత్యర్థులను చిత్తు చేసే సాధనంగా ఆ రాష్ట్రం మీద ప్యాకేజీని ప్రయోగించారు.


 ఇక ఆంధ్రప్రదేశ్‌కి వచ్చే సరికి మాత్రం నీతి ఆయోగ్‌నీ, ఆర్థిక సంఘాన్నీ మోదీ ప్రభుత్వం ముందుకు తెస్తున్నది. ప్రత్యేక హోదాకీ, పారిశ్రామిక రాయితీలకీ సంబంధం లేదంటూనే రాయితీల ప్రకటనను దాటవేస్తున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ఇచ్చిన బుందేల్‌ఖండ్, కేబీకే తరహా ప్యాకేజీల ఊసులేదు. పోలవరానికి తగినన్ని నిధులివ్వడానికి చేతులు రావడం లేదు. పైవాటికి అదనంగా కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ రాజధాని నిర్మాణానికి, రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు, విభజన చట్టంలోని హామీల అమలుకు 4 లక్షల 80 వేల కోట్ల ప్యాకేజీని సిఫారసు చేసింది. ఈ నివేదిక ఉందన్న విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాట మాత్రంగా కూడా ప్రస్తావించడం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడే ఎన్నికలు లేవు. అధికారంలో ఉన్నది నిగ్గదీసేవారు కాదు, ఉభయతారకంగా సర్దుకుపోయే అస్మదీయులు. ఈ రాష్ట్రంలో నమో అంటే నమ్మించి మోసం చెయ్యడం అన్నది ఫేస్‌బుక్ నానుడి అయింది. మోదీ మాటలకి అర్థాలు వేరైనప్పుడు ఇలాంటి అధిక్షేపణలు తప్పవు.
 వ్యాసకర్త అధ్యక్షులు,
 ఆంధ్రప్రదేశ్ లోక్‌సత్తా పార్టీ, మొబైల్  9866074023

మరిన్ని వార్తలు