మార్కెట్ల జాతరగా మోడీ ‘వంద’

10 Sep, 2014 23:55 IST|Sakshi
మార్కెట్ల జాతరగా మోడీ ‘వంద’

ప్రజల తీర్పును మార్పు కోసం ఉపయోగించాలనే నిజమైన ఆకాంక్ష మోడీలో కనిపిస్తోంది. కానీ ఆహార, వ్యవసాయ శాఖ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే సాకుతో రైతును శిక్షిస్తోంది. ప్రభుత్వ సేకరణ ధరలను దాదాపు స్తంభింపజేయడమేగాక, ఆ విధానాన్నే రద్దు చేయాలని చూస్తోంది. సేకరణ ధరల రద్దు రైతు పాలిటి మరణ శాసనమే.
 
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ వంద రోజుల పాలన భారీ మార్కెటింగ్ మేళాగా మారిన వైనాన్ని మీరు గుర్తించే ఉంటారు. ఒక ప్రభుత్వం వంద రోజుల పాలనపై బడా మీడియా సంస్థలు జాతీయ సర్వేలను నిర్వహించి, ఫలితాలను మొదటి పేజీల్లో, టీవీ తెరలపై మెరిపించడం, చర్చలను నిర్వహించడం ఇదే మొదటిసారి కావచ్చు. ఇంతవరకు పాత్రికేయ విన్యాసంగా ఉంటున్న ‘వంద రోజుల పాలన’ ఇప్పుడు మార్కెట్ల స్థాయికి చేరింది. వాలెంటైన్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డేలలాగే ముందు ముందు  ఈ వంద రోజుల పాలన కూడా ఐదేళ్ల కొకసారి జరిగే మార్కెటింగ్ తంతుగా మారిపోయినా ఆశ్చర్యపోను. ఒకసారి ఇలాంటి సందర్భం మార్కెట్ల పరం అయిందంటే ఇక మారుమోగేది బడా వ్యాపార వర్గాల గొంతే. ‘బిగ్ టికెట్ రిఫార్మ్స్’ను (మౌలిక ఆర్థిక సంస్కరణలు) ప్రవేశపెట్టేలా ప్రధానిని ఒప్పించడానికి, ప్రేరేపించడానికి ఈ సందర్భమే అత్యంత అనువైనదని ఆ వర్గాలు భావించాయి. ఎగుస్తున్న స్టాక్ మార్కెట్లు వాటికి దన్నుగా ఉన్నాయి మరి. ఈ సర్వేలన్నిటినీ చూస్తే పూసల్లో దారంలా అన్నిట్లోనూ.... మౌలిక సంస్కరణలను, సబ్సిడీల తగ్గిం పును, పారిశ్రామిక రంగానికి మరిన్ని రాయితీలను, ప్రోత్సాహకాలను చౌకగా, తేలికగా భూ సేకరణను కోరడం కొట్టవచ్చినట్టు కనిపించింది. మరింకేమీ వాటికి పట్ట లేదు.
 మార్కెట్లను ఉత్సాహపరచని చర్యలు

 మొత్తంగా ఈ 100 రోజుల మార్కెటింగ్ వ్యవహారమంతా ప్రధానంగా బిగ్ టికెట్ రిఫార్మ్స్‌ను ప్రవేశపెట్టేలా ప్రధానిపై ఒత్తిడి చేయడం కోసమే సాగిందని కొన్ని పత్రికల కాలమ్స్‌లో రుజువైంది. ఈ ప్రచార దుమారం మోడీ  ఆలోచనను, వైఖరిని ఏ మేరకు ప్రభావితం చేస్తుందనేది నాకు అనుమానమే. ఇప్పటికైతే ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నారు. మరుగు దొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యాన్ని ఇచ్చి, ఎంపీ నియోజకవర్గ నిధులను పాఠశాలల్లో, బహిరంగ స్థలాల్లో, ఇంటింటా వాటిని నిర్మింపజేయడానికే వినియోగించాలని ఎంపీలు, ఎంఎల్‌ఏలను మోడీ కోరారు. మార్కెట్లలో అదేమీ ఉత్సాహాన్ని రేకెత్తింపజేసేది కాదు. భారతదేశ ఆహార భద్రత పరిరక్షణకు శాశ్వత పరిష్కారాన్ని చూపే వరకు వాణిజ్య సౌలభ్య ఒప్పందంపై సంతకాలు చేసేది లేదంటూ ప్రధాని ప్రపంచ వాణిజ్య సంస్థకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడటం కూడా విపణి విధానాల వకాలతుదారులకు మింగుడు పడేది కాదు. ‘‘అంతర్జాతీయ, జాతీయ మీడి యాలో ఈ నిర్ణయం పట్ల విమర్శ ఎదురు కావచ్చు. కానీ రైతాంగం జీవనోపాధి విషయంలో దేశం రాజీపడజాలదు’’ అని మోడీ అన్న తీరు నచ్చింది. ఆయనకు ముంద టి ప్రధానులెవరూ అంతర్జాతీయ వాణిజ్య సమాజాన్ని ఉద్దేశించి అంత శక్తివంతమైన ప్రకటనను ఇవ్వలేదని నా అభిప్రాయం.
 
క్రమశిక్షణ, పని సంస్కృతి


వంద రోజుల పాలనను అంచనా కట్టడంపై పలు టీవీ చర్చల్లో ఒక విషయం నొక్కి చెప్పాను. అది ప్రధాని నిర్ణయాత్మక పాత్రను పోషించిన ఫలితంగా ఫలితాలు కనిపిస్తున్న అంశమది. మోడీ మంత్రివర్గ సహచరుల క్రమశిక్షణ, పని సంస్కృతి ప్రభుత్వ యంత్రాంగంలోకి కూడా  వ్యాపిస్తోంది. ఇదేమీ చిన్న విజయం కాదు. ఉన్నతాధికారులు, ఉద్యోగులు సమయానికి విధులకు హాజరవుతున్నారు, ఏళ్ల తరబడి చేస్తున్నట్టు ఇప్పుడు ప్రభుత్వ ఖజానా నిధులను వృథా చేయడం లేదు. ఈ పని సంస్కృతి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా విస్తరించేట్టయితే తప్పకుండా ఆ తేడా తెలుస్తుంది. ప్రభుత్వాధికారులు నవ్వు మొహంతో ఆహ్వానించి, తక్షణమే మన ప్రశ్నలకు జవాబు చెప్పే రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. ప్రజలు తనకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును మార్పు కోసం ఉపయోగించాలనే నిజమైన ఆకాంక్ష మోడీలో స్పష్టంగా   కనిపిస్తోంది.  అయితే ఆ మార్పును తీసుకురావాల్సింది మాత్రం సామాజిక, పర్యావరణపరమైన కల్లోలాల మూల్యాన్ని చెల్లించడం ద్వారా మాత్రం కాదు.  

రైతుకు శిక్షే ధరల నియంత్రణా?

ఆహార ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టడం ప్రభుత్వ ప్రథమ  ప్రాధాన్యాంశం. దానర్థం ఎక్కువ ఉత్పత్తి చేసినందుకు రైతాంగాన్ని శిక్షించడం కాదు. ద్రవ్యోల్బణాన్ని అల్ప స్థాయిలో ఉంచే సాకుతో ఆహార, వ్యవసాయ శాఖ ప్రభుత్వ సేకరణ ధరలపై విరుచుకుపడింది. ప్రభుత్వోద్యోగులు 107 శాతం కరువు భత్యాన్ని అందుకుంటున్న ఈ ఏడాది... సేకరణ ధరలను దాదాపు గత ఏడాది స్థాయిలోనే స్తంభింపజేసి రైతాంగాన్ని శిక్షించింది. అంతకు మించి, సేకరణ ధరలపై బోనస్‌ను ఇవ్వరాదని, ఇచ్చిన రాష్ట్రాల్లో కేంద్రం సేకరణ నుండి ఉపసంహరించుకుంటుందని ఆహార శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు తాఖీదును జారీ చేసింది. ఈ ఆదేశాలు ఒక విధంగా చెప్పాలంటే... రైతులకు అధిక సేకరణ ధరలను ఇస్తామంటూ ఎన్నికల్లో చేసిన వాగ్దానాన్ని ఉల్లంఘించడమే.

కొత్త సీసాలో పాత సారా

జన్యుమార్పిడి పంటలకు మౌన అంగీకారం, ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ నిర్ణయాలను కూడా పునఃసమీక్షించాల్సి ఉంది. ఒక వంక రైతులకు రక్షణ కల్పించడం పేరిట డబ్ల్యూటీఓ నిబంధనలను వ్యతిరేకించడ మూ, మరోవంక మార్కెట్లకు స్వయంప్రత్తినిచ్చే సరళీకరణ చర్యలను చేపట్టడమూ ప్రభుత్వం ఒకేసారి చేయజాలదు. ప్రభుత్వ సేకరణ ధరల రద్దు అంటే   రైతాంగం పాలిటి మరణ శాసనమే. కానీ ప్రభుత్వం ఆ పనిచేయాలని అమితాసక్తిని కనబరుస్తున్నట్టు అనిపిస్తోంది. గత పదేళ్ల కాంగ్రెస్ దుష్పరి పాలనలో ఆర్థిక సలహాదారులుగా వెలిగిన వారే నేడు మళ్లీ రంగ ప్రవేశం చేసి మోడీ ప్రభుత్వానికి సలహాలిస్తుండటమే అందుకు ప్రధాన కారణం. నేటి ఈ సంక్షోభానికి కారణమైన వాళ్లే పరిష్కారాన్ని కూడా చూపగలరని ఆశించరాదని నేను ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను.

‘‘దుష్ఫలితాలు శూన్యం’’ బుట్టదాఖలు

ఎర్రకోట నుండి ప్రధాని ప్రశంసనీయమైన ఒక వాగ్దానం చేశారు. మన దేశాన్ని వస్తు తయారీ కేంద్రంగా మార్చాలని ఆకాంక్షిస్తూ ఆయన  ‘‘లోపాలు శూన్యం, దుష్ఫలితాలు శూన్యం’’ అనే విధానం పట్ల అనుకూలతను వ్యక్తం చేశారు. పర్యావరణం, అడవుల విధ్వంసాన్ని అనుమతించేది లేదని ఆ విధానం సారం. కానీ పర్యావరణం, అడవుల శాఖ సరిగ్గా అందుకు విరుద్ధంగా పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులను మంజూరు చేస్తోంది. సున్నితమైన జీవావరణాన్ని దృష్టిలో ఉంచుకుని పశ్చిమ కనుమలను గనుల తవ్వకాలకు, ఇతర హానికరమైన పరిశ్రమలకు దూరంగా ఉంచాలన్న మాధవ్ గాడ్గిల్ నివేదికను తిరస్కరించింది. అదే సమయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్, అటవీ హక్కుల చట్టం, భూసేకరణ చట్టాలను నీరు గార్చడానికి అది ప్రయత్నిస్తోంది. ఇది ‘‘దుష్ఫలితాలు శూన్యం’’ విధానాన్ని బహిరంగంగా ఉల్లంఘించడమే.  

మార్కెట్లు ఈ సమస్యల గురించి ఎప్పుడూ నోరెత్తవు. కారణం స్వయం విదితమే. పర్యావరణ నిబంధనలు వేగవంతమైన పారిశ్రామికాభివృద్ధికి   అడ్డంకిగా నిలుస్తున్నాయని వాటి భావన. దేశం సామాజిక, పర్యావరణ పరమైన దుష్ఫలితాల పట్ల జాగ్రత్త వహించాలని ప్రధాన స్రవంతి మీడియా ఎన్నడూ మాట్లడక పోవడం అందుకే. ఈ నేపథ్యంలోనే మోడీ ప్రభుత్వ పాలనపై చర్చనంతటినీ మార్కెటింగ్ ఏజెన్సీలు స్వాధీనం చేసుకోవడం నాకు చికాకు పుట్టిస్తోంది. అభివృద్ధి ప్రజానుకూలమైనదిగా లైంగిక న్యాయాన్ని కల్పించేదిగా, పర్యావరణానికి అనుకూలమైనదిగా ఉండేలా ప్రధాని హామీని కల్పిస్తారని భావిస్తున్నాను. ఈ విషయంలో రాజీకి తావే లేదు.
 
(వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు)  -  దేవేందర్ శర్మ
 
 
 

మరిన్ని వార్తలు