చరిత్రమీద రైతు సంతకం ఎన్‌జీ రంగా

17 Jun, 2017 01:32 IST|Sakshi
చరిత్రమీద రైతు సంతకం ఎన్‌జీ రంగా

ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో వచ్చిన పేరెన్నికగన్న సాహిత్యాన్ని తెలుగు భాషలోకి తీసుకురావాలనే ధ్యేయంతో ఏర్పడి, ఇప్పటికే తెలుగు పాఠక లోకంమీద తనదైన ముద్ర వేసిన సంస్థ పీకాక్‌ క్లాసిక్స్‌. వారు ఇటీవల వెలువరించిన ‘ఆచార్య రంగ’ స్వీయచరిత్ర, ‘ఫైట్‌ ఫర్‌ ప్రీడమ్‌ యాన్‌ అటోబయోగ్రఫీ ఆఫ్‌ ప్రొఫెసర్‌ ఎన్‌జీ రంగా’ అనే ఇంగ్లిష్‌ పుస్తకానికి తెలుగు సేత. నిశితంగా పరిశీలిస్తే రంగాగారి పూర్తి ఆత్మకథ కాదు ఇది. ఇందులో ఆయన జీవితంలో బాల్యం (1900) నుంచి 1959 (స్వతంత్ర పార్టీ చేరే వరకు) మధ్యకాలంలో జరిగిన ఘట్టాలు మాత్రమే కన్పిస్తాయి. ఆ తరువాత మూడున్నర దశాబ్దాల పాటు రంగా జీవిం చారు. ఆ కాలపు అంశాలను ఇందులో పేర్కొనలేదు. అందువల్ల దీనిని మనం పూర్తి ఆత్మకథ అని చెప్పలేం.

ఈ సంగతి అటుంచితే 1900 నుంచి 1959 మధ్యకాలంలో అంతర్జాతీయ, జాతీయ, మదరాసు ప్రెసిడెన్సీతో పాటు స్వతంత్ర భారతం తొలి రోజుల చారిత్రక అంశాలను, ఆ కాలంలో రైతుల సమస్యలు, వాటి పరి ష్కారం కోసం వివిధ స్థాయిల్లో జరిగిన పోరాటాలు, సాధించిన విజయాలు, ఆ సందర్భంగా ఎజెండా మీదకు వచ్చిన అంశాలు మనకు ఈ పుస్తకంలో సవివరంగా తెలుస్తాయి. ప్రధానంగా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, ప్రగతి, పురోభివృద్ధి గ్రామీణ ఆర్థిక వ్యవస్థతోనే ముడిపడి ఉందని ప్రగాఢంగా నమ్మి ఆ దిశగా జీవితాంతం శ్రమించిన రైతు రంగా పోరాట స్ఫూర్తి కన్పిస్తుంది. ముఖ్యంగా కేంబ్రిడ్జ్‌లో చదివినా, జాతిపిత గాంధీ పిలుపు మేరకు, జాతీయోద్యమంలో భాగస్వామ్యం అందుకుని, రైతాంగ పోరాటాలను కూడా స్వతంత్ర పోరాటంలో విలీనమయ్యేలా చేసేందుకు రంగా చేసిన మహత్తర కృషిని పుస్తకం వివరిస్తుంది.

అంతేగాకుండా స్వతంత్ర పోరాట నేతలు గాంధీ, నెహ్రూ, పటేల్, బోస్‌లలో రంగాగారు పలు సందర్భాల్లో చర్చించిన అంశాలు, నెహ్రూ విధానాలు రైతాం గానికి చేటు అని నమ్మి, రంగా.. నెహ్రూని ఢీకొట్టిన తీరు తెలుస్తుంది. జాతీయోద్యమంతోపాటు ఆ తరువాత కాలంలో రంగా కాంగ్రెస్‌ నాయకుల మధ్య విభేదాలు, పొరపొచ్చాలు, పదవీలాలసత్వంతో పాటు కాంగ్రెస్‌ సంస్కృతిపై ఒక స్పష్టమైన అవగాహన కూడా స్ఫురి స్తుంది. రాజకీయ పాఠశాలల నిర్వహణ, గ్రామాలకు వెళ్లి దళితులతో మమేకం కావటం, సహపంక్తి భోజ నాలు, కుల వ్యతిరేక పోరాటాలు, కార్యకర్తల శిక్షణకు ప్రాధాన్యతనిచ్చి వాటిని ఆచరణలో నిర్వహించి చూపిన రంగా కమ్యూనిస్టులకే ఆదర్శమయ్యారా అనిపిస్తుంది. 450 పుటలున్నా సరళమైన తెలుగుభాషలో రావెల సాంబశివరావు చేసిన అనువాదం పాఠకులకు ఏకబిగువున చదివిస్తుంది. రైతుల సమస్యలు కార్మికవర్గ నియంతృత్వంతో పరిష్కారం కావని, మార్క్సిజం రైతు స్వేచ్ఛ ను హరిస్తుందని నమ్మిన రంగా చివరివరకు రైతునేతగా, కమ్యూనిస్టులకు కరుడుకట్టిన వ్యతిరేకిగానే మిగి లిపోయారన్న చారిత్రక వాస్తవం పుస్తకం ద్వారా మనకు బోధపడుతుంది.

చివరగా ఒక్క విషయం. దేశవ్యాప్తంగా రైతాంగ నిరసనలు పెల్లుబుకుతున్న సమయంలో ఈ పుస్తకానికున్న ప్రాసంగికత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పుస్తకంలో ఆ రోజుల్లో రైతులు, చేనేత కార్మికులు, దళితుల సంక్షేమం కోసం జరగాల్సిన భవిష్యత్‌ కార్యక్రమాల గురించి రంగా లేవనెత్తిన అంశాలు ఈనాటికీ సమాజంలో అపరిష్కృతంగానే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ చదవాల్సిన, చదవదగ్గ పుస్తకముంది. మార్కెట్‌తో సంబంధం లేకుండా కేవలం మంచి పుస్తకాన్ని అందించాలనే ఏకైక భావనతో శ్రమకోర్చి వెలువరించిన ‘పీకాక్‌ క్లాసిక్స్‌’ వారికి ప్రత్యేక ధన్యవాదాలు.పుస్తకాలు అన్ని ప్రధాన కేంద్రాలలో దొరుకుతాయి. అమెజాన్‌ ద్వారా తెప్పించుకోవాలంటే amazon.inMìS ÐðlãÏ  acharya ranga telugu peaco-ck అని టైప్‌ చేసి చూడాలి. పేజీలు–450, ధర: 300

                                 – వి. గోపీచంద్, ఆకాశవాణి కార్యక్రమ
                                 నిర్వహణాధికారి ‘ మొబైల్‌ : 94412 76770

 

మరిన్ని వార్తలు