అమాంతంగా ఎదిగిన మోదీ

29 Nov, 2015 01:38 IST|Sakshi
అమాంతంగా ఎదిగిన మోదీ

రాజకీయ ప్రసంగాలలో అసహనం, ద్వేషం, అహంకారం కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నాయి. కొన్ని టీవీ న్యూస్ చానళ్లలో చర్చ పేరిట మర్యాద, మన్నన లేకుండా నోటికి వచ్చినట్టు దుర్భాషలాడటం, తర్జని చూపిస్తూ, గుడ్లు ఉరుముతూ కేకలు వేయడం వీక్షకుల రక్తపోటు పెంచడం తప్పితే ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎటువంటి ప్రయోజనమూ చేకూర్చడం లేదు.
 
దేశ చరిత్రలో, ప్రధాని నరేంద్రమోదీ జీవితంలో మొన్నటి శుక్రవారం అత్యంత ముఖ్యమైన రోజు. ఆ రోజు పార్లమెంటులోనూ, పార్లమెంటు సమావేశం అనం తరం ప్రధాని నివాసంలోనూ కనిపించిన సుహృద్భావం, రాజకీయ పరిపక్వత, నిర్మాణాత్మక దృక్పథం అవిచ్ఛిన్నంగా కొనసాగితే కొంతకాలంగా మేధావు లనూ, ప్రజాస్వామ్యవాదులనూ వేధిస్తున్న అనేక చిక్కు ప్రశ్నలకు సమాధా నాలు లభిస్తాయి. రాజ్యాంగ దివసం, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ 125వ జయంత్యుత్సవాలు ఆరంభం సందర్భంగా రెండు రోజులు జరిగిన పార్లమెంటు సమావేశాలను ముగిస్తూ ప్రధాని చేసిన ప్రసంగం దేశ రాజకీయాలను మేలు మలుపు తిప్పే శక్తి కలిగినట్టిది.

రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజును స్మరించుకుంటూ రెండురోజులు పార్లమెంటు ప్రత్యేకంగా చర్చ జరపాలన్న నిర్ణయం గొప్పది. ఇండియా పార్ల మెంటరీ ప్రజాస్వామ్య దేశంగా కొనసాగడానికి అనేక మంది మహానుభావులు కారకులు. వారిలో ముగ్గురు చిరస్మరణీయులు. భారత రాజ్యాంగం ఉత్కృష్టమై నది. రాజ్యాంగ రచనలో కీలకమైన భూమిక పోషించిన దార్శనికుడు అంబే డ్కర్. రాజకీయ స్వాతంత్య్రమే కాకుండా సామాజిక, ఆర్థిక స్వాతం త్య్రానికి సైతం తోడ్పడే విధంగా, సమాజంలోని అంతరాలను తగ్గించే దిశగా రాజ్యాంగాన్ని నిర్మించిన స్రష్ట ఆయన. దేశ విభజన జరిగిన తీరు కారణంగా చెలరేగిన హింస, కల్లోలం మధ్య, మత కలహాల మధ్య తొలి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన  నెహ్రూ దేశాన్ని పరిపాలించేందుకు అవసరమైన వ్యవస్థను నిర్మించాడు.

పేదరికం, అవిద్య, మూఢనమ్మకాలతో కునారిల్లుతున్న దేశానికి దిశానిర్దేశం చేసి అభివృద్ధికి బాటలు వేసిన తొలి ప్రధాని పండిట్ నెహ్రూ.  అయిదు వందల పైచిలుకు సంస్థానాలను విలీనం చేసి భారతదేశాన్ని నిర్మించిన రూపశిల్పి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ ముగ్గురిలో ఇద్దరు విస్మృతిలోకి వెళ్లవచ్చును కానీ రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థకు  దిక్సూచి కనుక దాని నిర్మాత ప్రాధాన్యం ఎప్పటికీ ఉంటుంది. రాజ్యాంగం సర్వోన్నతమైనది కనుకనే నెహ్రూ, పటేల్  కంటే అంబేడ్కర్‌కు కాలక్రమేణా జనాదరణ , ఆరాధనా భావన అసాధరణంగా పెరుగుతూ వస్తున్నది. ఎవరి పాత్ర వారు ప్రతిభావంతంగా పోషించారు కనుక అందరికీ చరిత్రలో చెరగని స్థానం ఉంటుంది.
 
కాంగ్రెస్‌పై జైట్లీ దాడి
ఒక ప్రతిభావంతుడైనా రాజకీయవాదికీ, ఒక దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడికీ వ్యత్యాసం ఏమిటో శుక్రవారం (నవంబర్ 27, 2015)నాడు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, ప్రధాని నరేంద్రమోదీ జాతికి స్పష్టంగా చూపించారు. చర్చను ప్రారంభించిన దేశీయాంగ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తన పరిమితులలోనే మాట్లా డారు. ధర్మనిరపేక్షత, పంథ్‌నిరపేక్షత అంటూ, సెక్యులరిజం అన్న పదాన్ని ఈ దేశంలో దురుపయోగం చేశారంటూ పాత ధోరణిలోనే ప్రసంగించారు. దేశంలో అసహనం పెరుగుతోందనీ, రాజ్యాంగ నిర్మాణంలో పాలుపంచుకోని పార్టీ, రాజ్యాంగం పట్ల విశ్వాసం లేని పార్టీ  రాజ్యాంగ దివసం నిర్వహించడం విడ్డూ రంగా ఉన్నదనీ కాంగ్రెస్ అధ్యక్షురాలు చేసిన విమర్శకు అరుణ్ జైట్లీ అత్యంత సమర్థంగా, నిర్దాక్షిణ్యంగా, కర్కశంగా సమాధానం ఇచ్చారు.
 
హిట్లర్‌తో ఇందిరకు పోలిక
ఆత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించిన ఇందిరాగాంధీని జర్మనీ నియంత హిట్లర్‌తో పోల్చి జైట్లీ కాంగ్రెస్‌వాదుల గుండెల్లో గునపం దింపారు. హిట్లర్ జర్మనీ రాజ్యాంగాన్ని వినియోగించుకొని 1933లో అదే రాజ్యాంగానికి తూట్లు పొడిచి నాజీ నియంతృత్వాన్ని నెలకొల్పిన క్రమంలోని కొన్ని ఘట్టాలను వివరించి అటువంటి ఘట్టాలే ఇందిర ఆత్యయిక పరిస్థతి విధించి నియంతగా మారిన క్రమంలోనూ  ఉన్నాయని సోదాహరణంగా వివరించారు. హిట్లర్ సర్వాధికారాలను హస్తగతం చేసుకునేందుకు ముందుగా ఎమర్జెన్సీ విధించాడు. జర్మన్ పార్లమెంట్‌లో తనకు మెజారిటీ లేని కారణంగా ప్రతిపక్ష సభ్యులను నిర్బంధించాడు. పత్రికలపైన సెన్సార్‌షిప్ విధించాడు. తాను చేస్తున్నదంతా జర్మన్ల మంచికోసమేనని నమ్మబలికాడు. 25 అంశాల ఆర్థికాభివృద్ధి కార్య క్రమం ప్రకటించాడు. ప్రభుత్వం తీసుకునే చర్యలను న్యాయస్థానాలు ప్రశ్నించ కూడదంటూ ఒక చట్టం తీసుకొని వచ్చాడు.

హిట్లర్ సలహాదారు రుడాల్ఫ్ హెస్ ‘హిట్లర్ ఈజ్ జర్మనీ, జర్మనీ ఈజ్ హిట్లర్’ అన్నాడు.  ఇదే రీతిలో మన దేశంలో సైతం 1975లో  ఎమర్జెన్సీ విధించారనీ, ప్రతిపక్ష నేతలను నిర్బంధించారనీ, పత్రికలపైన సెన్సార్‌షిప్ విధించారనీ, ఇదంతా దేశ ప్రజల మేలుకోరే చేస్తున్నట్టు చెప్పారనీ, 20 అంశాల ఆర్థిక కార్యక్రమాన్ని ప్రకటించారనీ, నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు దేవకాంత్ బారువా ‘ఇండియా ఈజ్ ఇందిర’ అన్నారనీ ఇందిరాగాంధీ పేరు ప్రస్తావించకుండానే  జైట్లీ  చెప్పవలసిందంతా చెప్పారు. రెండేళ్ల ఆత్యయిక పరిస్థితి తర్వాత ఇందిరే స్వయంగా ఎన్నికలు ప్రకటించిన సంగతి జైట్లీ చెప్పలేదు. అంబేడ్కర్ అనంతరం దేశంలో దళితులలో ఆత్మ విశ్వాసం పెంచిన నేత కూడా ఆమేనన్న వాస్తవాన్నీ ప్రస్తావించలేదు. తన వాద నకు అవసరమైన అంశాలనే ఏరుకున్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇందిరా గాంధీ తీవ్ర విఘాతం కలిగించిన మాట వాస్తవమే. నియంతృత్వ పోకడలను ప్రతిఘటించే శక్తిని ప్రసాదించిన భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాదులు వేసినవారిని స్మరించుకోవలసిన సందర్భం ఇది. జైట్లీ ఒక సమర్థుడైన న్యాయవాదిగా కాంగ్రెస్ పార్టీ వాదనను చీల్చి చెండాడేందుకు ఇందిరను హిట్లర్‌తో పోల్చారు. ఆ క్రమంలో తన స్థాయిని తగ్గించుకున్నారు.
 
అరుణ్‌జైట్లీ కాంగ్రెస్ పార్టీని ఉతికి ఆరేస్తుంటే పక్కనే మౌనంగా, గంభీ రంగా కూర్చున్న ప్రధాని చివరి వక్తగా గొప్పగా మాట్లాడారు. సామరస్యపూ రితంగా, హుందాగా, బాధ్యతాయుతంగా, వివేకవంతంగా ప్రసంగించి తోటి  రాజకీయవాదులనూ, దేశ ప్రజలనూ ఆశ్చర్యంలో, ఆనందంలో ముంచెత్తారు. ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ (కాంగ్రెస్ రహిత భారతదేశం) కావాలంటూ 2014లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మోదీ మొన్నటి వరకూ దేశంలో మాట్లాడినా, విదేశాలలో ప్రవాస భారతీయుల సభలలో మాట్లాడినా ఎన్నికల భాషే మాట్లాడారు. విదేశీ సభలలో సైతం కాంగ్రెస్ నాయ కులను దుయ్యబట్టడం, ఇంతవరకూ ప్రధానులుగా పని చేసినవారు దేశాన్ని భ్రష్టపట్టించారన్నట్టు  పొగరుగా మాట్లాడటం కొనసాగించారు. మొన్న అకస్మాత్తుగా అద్భుతంగా ప్రసంగించి తన స్థాయిని పెంచుకున్నారు. రాజ నీతిజ్ఞుడైన ప్రధానిలాగా మాట్లాడారు.
 
ఈ మార్పుకు కారణాలు ఏమిటి?
బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి మొదటిది. తన హవా తగ్గిపోతున్నదనే అంశం మోదీకి అర్థమై ఉండాలి. తనకు వ్యతిరేకంగా ఏర్పడిన మహాకూటమి (గ్రాండ్ అలయెన్స్) మాదిరి ప్రతిపక్ష సంఘటనలు వచ్చే సంవత్సరం ఎన్ని కలు జరగబోయే రాష్ట్రాలలో కూడా ఏర్పడితే బీజేపీకి కనుచూపు మేర విజయా వకాశాలు కనిపించవనే ఎరుక రెండో కారణం. బీజేపీలోనే సీనియర్ నాయకుల నేతృత్వంలో తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉన్నదనే భయం మూడో కారణం. ఆర్థిక రంగంలో మాటలే కానీ చేతలు లేకపోవడం, మోదీకి వీరాభిమానులైన కార్పొరేట్ దిగ్గజాలూ, వణిక్ ప్రముఖులూ పెదవి విరవడం, ప్రతిపక్షాన్ని కలుపుకొని పోకుండా జిఎస్‌టి (గుడ్స్ అండ్ సర్వీస్ టాక్స్)వంటి బిల్లులకు ఆమోదం లభించదనీ, ఆర్థిక సంస్కరణలు అడుగు ముందుకు సాగదనీ గ్రహించడం  నాలుగో కారణం.

సొంత పార్టీలోని హిందూత్వవాదుల వల్ల తనకూ, తన పార్టీకీ, తన ప్రభుత్వానికీ అప్రతిష్ఠ వస్తున్నదనీ, విదేశాలలో భారత ప్రతిష్ఠ దిగజారుతున్నదనీ తెలుసుకోవడం అయిదో కారణం. తనపైన మోజు తగ్గడంతో కాంగ్రెస్ యువనాయకుడు రాహుల్‌గాంధీకి ఎంతో కొంత ఆదరణ పెరుగుతోందన్న అభిప్రాయం ఆరో కారణం. మోదీ మొండివాడనీ, ఆహంకారి అనీ, వ్యతిరేక భావాలను సహించే మనస్తత్వం లేదనీ, నెహ్రూను కురచగా చూపించేందుకు సర్దార్ పటేల్‌నూ, అంబేడ్కర్‌నూ కీర్తిస్తున్నాడనే అభిప్రాయం ప్రబలడం మంచిది కాదనే స్పృహ ఏడో కారణం.
 
 రాజ్యాంగంపైన పార్లమెంటులో చేసిన ప్రసంగంలో మోదీ తనపైన ప్రజ లకున్న అంచనాను కొన్ని అడుగుల ఎత్తు పెంచుకున్నారు. తన ముందు పని చేసిన ప్రధానులంతా దేశాభివృద్ధికి కృషి చేశారనీ, దానికి కొనసాగింపుగానే తాను బాధ్యతలు నిర్వర్తిస్తున్నాననీ చెప్పడం ఒక ఆరోపణకు సమాధానం. అంబేడ్కర్‌ను ఆకాశానికెత్తుతూనే నెహ్రూ గురించి రెండు మంచి మాటలు చెప్పడం విశేషం. ‘మేడమ్ సోనియాజీ’ అంటూ సంబోధించడం ద్వారా ప్రతిపక్షం పట్ల గౌరవం ప్రదర్శించారు. పార్లమెంటులో ప్రతిష్టంభన నివారిం చేందుకు సమాలోచనలకు రావలసిందిగా మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌నూ, సోనియాగాంధీనీ తన ఇంటికి ఆహ్వానించాలన్నది గొప్ప నిర్ణయం. కాంగ్రెస్ నాయకులు సైతం సముచితంగా స్పందించి ప్రధాని నివాసానికి వెళ్ళి 45 నిమిషాల పాటు చర్చలు జరిపారు. తమ వాదన వినిపించారు. తొలి విడత సమాలోచనలో అంగీకారం కుదరకపోయి ఉండవచ్చు. అధికార, ప్రతిపక్ష నేతలు ఒక చోట కూర్చొని సమస్యలపైన చర్చించడమే స్వాగతించవలసిన సందర్భం.
 
 పెరుగుతున్న అసహనం, ద్వేషం
 కొంతకాలంగా దేశంలో రాజకీయాలు బాగా దిగజారాయి. రాజకీయ ప్రసం గాలలో అసహనం, ద్వేషం, అహంకారం కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నాయి. కొన్ని టీవీ న్యూస్ చానళ్లలో చర్చ పేరిట మర్యాద, మన్నన లేకుండా నోటికి వచ్చినట్టు దుర్భాషలాడటం, తర్జని చూపిస్తూ, గుడ్లు ఉరుముతూ కేకలు వేయడం వీక్షకుల రక్తపోటు పెంచడం తప్పితే ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎటువంటి ప్రయోజనమూ చేకూర్చడం లేదు. ఇటీవల అసహనంపైన జరిగిన చర్చలో ప్రయోగించిన పదజాలం, ప్రదర్శించిన శరీరభాష నాగరిక సమాజంలో ఆమోదయోగ్యం కానివి. మొన్నటి వరకూ ప్రధాని స్వయంగా పరుషంగా మాట్లాడటంతో అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు వంటి అనుభవజ్ఞులైన అమాత్యులే కాకుండా స్మృతి ఇరానీ వంటి కొత్త మంత్రులు సైతం ప్రతిపక్షాలనూ, ప్రతిపక్ష నాయకు లనూ అవహేళన చేయడం, కటువుగా మాట్లాడటం దేశ ప్రజలు గమనిస్తు న్నారు. మహేశ్ శర్మ వంటి హిందూత్వవాద మంత్రులూ, పార్లమెంటు సభ్యులూ, అసోం గవర్నర్ వంటి ఉన్నత పదవులలో ఉన్నవారూ భిన్నాభి ప్రాయం వెలిబుచ్చిన  ముస్లింలను ఈ దేశం విడిచి పాకిస్తాన్‌కో, బంగ్లాదేశ్‌కో వెళ్ళిపొమ్మంటూ హుంకరించడం ప్రజలకు దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. రాజ్యాంగ దివసం సందర్భంగా మోదీ చేసిన ప్రసంగం ఈ పెడధోరణులన్నింటికీ అడ్డుకట్ట వేయాలి.

‘మై ఐడియా ఆఫ్ ఇండియా (ఇండియా అంటే నా ఉద్దేశం)’ ఇదీ అంటూ మోదీ అనేక విధాలుగా హిందీలో, సంస్కృతంలో, ఇంగ్లీషులో చెప్పినా, ‘ఇండియా ఫస్ట్’ అన్నదే తన మతమనీ, రాజ్యాంగమే పవిత్రగ్రంథమనీ స్పష్టం చేసినా  ఆయన వీరాభిమానులు అర్థం చేసుకోకుండా పాత మానసిక ధోరణినే కొనసాగిస్తే వారిని దారిలో పెట్టవలసిన బాధ్యత ప్రధానమంత్రిదే. అధికార పక్షంలో వచ్చిన లేదా వచ్చినట్టు కనిపిస్తున్న పరివర్తన ప్రతిపక్షాలనే కాకుండా సమస్త రాజకీయ వ్యవస్థనే ప్రభావితం చేస్తుంది. పార్లమెంటులో ప్రతిష్టంభన తొలగకపోతే ప్రజలకు అపకారం. అధికార పక్షానికి నష్టం. ప్రధానికి కోలుకో లేని దెబ్బ. అనేక దేశాలలో పర్యటించి ఆయా దేశాధినేతలకూ, అక్కడి పారిశ్రా మికవేత్తలకూ ఇండియాలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉన్నదనీ, త్వరలోనే జీఎస్‌టీ అమలులోకి వస్తుందనీ గొప్పలు చెప్పిన ప్రధాని అన్ని పక్షాలనూ కలుపుకొని ముఖ్యమైన బిల్లులకు ఆమోదం పొందకపోతే నవ్వులపాలు అవుతారు. కోతలరాయుడుగా తేలుతారు. ప్రతిపక్షాలను కలుపు కొని ప్రజాహితానికి  పాటుపడితే ఆదర్శవంతమైన ప్రధానిగా చరిత్రలో ఉన్నత స్థానం సంపాదించుకుంటారు. ఇప్పటికీ సమయం మించిపోలేదు. నిర్ణయం మోదీదే. అమలు చేయవలసిన బాధ్యతా ఆయనదే.
 

కె.రామచంద్రమూర్తి (సాక్షి, ఎడిటోరియల్ డైరెక్టర్)

మరిన్ని వార్తలు