నసీరుద్దీన్ షా ఆత్మకథ

20 Sep, 2014 03:37 IST|Sakshi
నసీరుద్దీన్ షా ఆత్మకథ

నసీరుద్దీన్ షా చడీ చప్పుడు కాకుండా తన ఆత్మకథ ‘అండ్ దెన్ వన్ డే’ విడుదల చేశారు. వచ్చే నెల మొదటి వారం నుంచి ఇది మార్కెట్‌లో అందుబాటులో రానుంది. నసీరుద్దీన్ షా భారతదేశపు అతి కొద్ది మంది మంచినటుల్లో ఒకరుగా మనకు తెలుసు. అయితే గొప్ప గొప్ప కళాకారులు, రచయితల జీవితాల్లో ఉండే సంఘర్షణలు తెలియవు. నసీరుద్దీన్ జీవితం సాధారణంగా పత్రికల్లో కనిపించదు. ఆయన కూడా ఇంటర్వ్యూలు ఇవ్వరు. అయితే ఇప్పుడు కొన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. నసీరుద్దీన్ ఉత్తరప్రదేశ్‌లో బారాబంకీలో జన్మించారు. వాళ్లది బాగా కలిగిన కుటుంబం. తండ్రి చాలా గొప్ప దర్జాతో మెలిగేవాడు. పిల్లలకు చనువు ఇవ్వలేదు. ఆయన తన తండ్రిని ‘అబ్బా’ అని పిలవకుండా ‘సర్కార్’ అని పిలిచేవాడట. తన పిల్లలు కూడా అంత గౌరవం ఇచ్చి పైస్థాయిలో ఉంచాలని కోరుకోవడం నసీరుద్దీన్‌కు కలిగిన పసితనపు గాయం. తనకు ఐదేళ్లు, తన అన్నయ్యకు ఏడేళ్లు ఉండగా వారిరువురినీ తండ్రి నైనిటాల్ బోర్డింగ్ స్కూల్‌కు పంపడం మరో గాయం. ఇరవై ఏళ్ల వయసులో తన నిమిత్తం లేకుండా ఇష్టాన్ని పట్టించుకోకుండా పర్వీన్ మురాద్ అనే వైద్యురాలితో తండ్రి పెళ్లి చేశాడు. ఆ పెళ్లి ఏ మాత్రం నిలవలేదు. ఒక కూతురు పుట్టాక ఆమె విడిపోయింది. మరొకరిని వివాహం చేసుకొని ఇరాన్ వెళ్లిపోయింది. ఆ కూతురు ఎలా ఉందో కూడా తెలియనివ్వలేదు.

ఇలాంటి జ్ఞాపకాలు అనేకం ఈ పుస్తకంలో మనం చూస్తాం. నసీరుద్దీన్ ఇష్టాయిష్టాలు కూడా కొన్ని తెలుస్తాయి. ఆయన అభిమాన నటుడు షమ్మీ కపూర్. అంత బాగా నటించగలిగే నటుడు లేడన్నది నసీరుద్దీన్ అభిప్రాయం. ఆయనకు అమితాబ్ అన్నా ‘షోలే’ సినిమా అన్నా ఏ మాత్రం గౌరవం లేదన్నది బహిరంగ రహస్యం. నసీరుద్దీన్ షా అన్నయ్య జమీరుద్దీన్ షా భారత పదాతిదళంలో కల్నల్‌గా రిటైరయ్యి ప్రస్తుతం అలీగఢ్ ముస్లిం యూనివర్సిటి వైస్ చాన్స్‌లర్‌గా ఉన్నారని కూడా చాలామందికి తెలియదు. నసీరుద్దీన్ షా నటించిన నిశాంత్, భూమిక, ఆక్రోశ్, స్పర్శ్... ఇటీవలి వెన్స్ డే వంటి సినిమాల వలే ఈ పుస్తకం కూడా అభిరుచి ఉన్న పాఠకులను ఆకర్షిస్తుందనడంలో సందేహం లేదు.
 
Hamish Hamilton
 
 

మరిన్ని వార్తలు