విమర్శకు పట్టం

22 Dec, 2013 23:55 IST|Sakshi
విమర్శకు పట్టం

 జాతీయ పురస్కారం
 సుప్రసిద్ధ విమర్శకురాలు, ప్రజాస్వామికవాది, అధ్యాపకురాలు అయిన కాత్యాయనీ విద్మహేకు సాహిత్య అకాడెమీ పురస్కారం ప్రకటించిన సందర్భంగా...
 
 ‘ఉత్తముల మహిమ నీరు కొలదీ తామర సుమ్మీ’ అన్నాడొక ప్రాచీన కవి. తమ విద్యని ఎదుటివారు ఎంత వరకు గ్రహించగలరో అంత వరకే ప్రకటిస్తారట పండితులు. అది ఎట్లా ఉంటుందంటే సరస్సులో నీరు ఎంత వరకు ఉంటే తామర అంతవరకు పెరిగినట్లుగా...
 2007లో ఆంధ్ర విశ్వకళా పరి షత్తులోని ఒక పురాతన సభా మందిరంలో మొదటిసారి కాత్యాయనీ విద్మహేని చూశాను, విన్నాను. ఆరోజు ఆమె కట్టిన నెమలిపురి కంటి రంగు చీర గురించి, అది ఆమెకిచ్చిన హుందాతనపు మెరుపు గురించి  వినవచ్చిన ప్రశంసాఝంకారాల రొద నుంచి నన్ను నేను ఏకాంత పరుచుకుని మరీ విన్నాను. ఆ తర్వాత కలిసి పని చేసే క్రమంలో వరంగల్, హైదరాబాద్, కడప, గుంటూరు, నరసాపురం, విశాఖ వేదికల మీదా విన్నాను. సాహిత్య సభలూ, క్షేత్ర పర్యటనలు, సాహిత్య సంస్థల నిర్మాణ సందర్భాల్లోనూ విన్నాను. ఆడంబరమూ పలుచదనమూ లేని ఉత్తముల మహిమలాంటి ఆమె రచనల సారమే తన ఉపన్యాస సారంగా, జీవన సారంగా అర్థం చేసుకున్నాను.
 
 ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి గురించి ఇపుడు మాట్లాడుకోడానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఒక సందర్భం మాత్రమే. వేలాది కవులూ రచయితలూ కొద్దిమంది విమర్శకుల నిష్పత్తిలో నుంచి గత మూడున్నర దశాబ్దాలుగా తెలుగు విమర్శాకాశంలో నిండుగా వెలుగుతున్నారు కాత్యాయని.
 
 ఒక రచనపై మన భావోద్వేగాలే ప్రామాణిక విమర్శగా దబాయింపు సత్యాలు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లోనూ తనని తాను ఆవల బెట్టుకుని లోచూపుకి సాధనాలు సమకూర్చుకున్నారు. కొ.కు, రావిశాస్త్రిల దృక్పథం గురించీ, కన్యాశుల్కం, రాబందులూ- రామచిలుకలు లాంటి మంచి పుస్తకాల గురించి, అస్తిత్వ సాహిత్యం, ప్రపంచీకరణల సంక్లిష్టతల గురించి విస్తృతాధ్యయనపు ఫలితాలను ప్రకటిస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా సంప్రదాయ సాహిత్యాన్ని స్త్రీవాద దృష్టికోణపు సాయంతో పునర్నిర్మించే పనిని నిలకడగా చేస్తుండటం విమర్శారంగానికి ఒక చేర్పు.
 
 ‘ఉనికిలో ఉన్న సామాజిక నిర్మాణాన్ని మార్చగల కార్యక్రమం లేకపోవడం వల్ల స్త్రీవాదం తరచుగా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దానిని అధిగమించడానికి విశాలమయిన, పునాది మార్పుకు సంబంధించిన చైతన్యం కలిగిన రాజకీయార్థిక పోరాటాలతో సమన్వయం సాధించాల్సి ఉంది’ అన్నది కాత్యాయని అవగాహన. 1980ల తర్వాత వెల్లువెత్తిన అనేక అస్తిత్వ చైతన్యాల మధ్య మార్క్సిస్ట్ ఫెమినిస్ట్‌గా తనని తాను స్థిరపరుచుకున్నారు. ఈ ఆచరణలో భాగంగా స్త్రీల సాహిత్య పోరాటాలను సామాజిక పోరాటాలతో అనుసంధానం చేసే లక్ష్యంతో ఏర్పడిన ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక నిర్మాణంలో కీలక భాగస్వామి అయ్యారు.


 ప్రజాస్వామిక ఉద్యమాల పట్ల సహానుభూతితో స్పందిస్తూ తన కలాన్నీ, గళాన్నీ పదును పెట్టుకున్నారు. తోటివారితో కలిసి పని చేయడంలో కాత్యాయనిది ఒక ప్రత్యేక వ్యాకరణం. సామూహికత ఒక్కటే సమాపకం. ప్రొఫెసర్లు, స్కాలర్లు, కొత్త రచయితలు, గొప్ప రచయితలు, మేధావులు, కార్యకర్తలు ఎవరితో కలిసి పని చేయడమయినా అసమాపకం.
 
 1982లో రూపొందించకున్న స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ ద్వారానూ, జ్యోతీరాణి, శోభ, గిరిజారాణి, బుర్రారాములు వంటి వారితో కలిసి సామాజిక స్థితిగతులను అధ్యయనం చేయడం ద్వారానూ తన కార్యక్షేత్రాన్ని విస్తరింప చేసుకున్నారు. తాను నిత్య విద్యార్థిగా ఉండటం ద్వారా తన విద్యార్థులను ప్రభావితం చేశారు.
 
 ఓరుగల్లు ఆకాశంలో అందుకోలేని ఎత్తులో ఎగిరే కాకతీయ తెలుగు శాఖ పతాకపు రెప రెపలు విన్నపుడల్లా మనసులో ఒక స్పర్థ. విశ్వవిద్యాలయం కల్పించే ఏ చిన్న అవకాశాన్నీ వదలుకోకుండా సభలూ, సమావేశాలూ, అధ్యయన యాత్రలూ, ప్రాజెక్టులూ, పరిశోధనలూ పుస్తక ప్రచురణలూ అన్నింటి వెనుకా చోదకశక్తి వలే పని చేసిన విద్యావేత్త కాత్యాయని.
 
 ఈ పురస్కార సందర్భం కొందరికయినా ఎందుకు పండగ సందర్భం కావాలి? కాత్యాయని జిజ్ఞాస కలిగిన విమర్శకురాలయినందుకు కావొచ్చు. ప్రజాస్వామికవాది అయినందుకు, తెలంగాణని హత్తుకున్నందుకు కావొచ్చు. సమూహంలో తనని తాను నిలబెట్టుకున్నందుకూ మంచి ఉపన్యాసకురాలయినందుకు కూడా కావొచ్చు. మగవారి సత్యాలకే చెల్లుబాటు ఉన్న విమర్శారంగంలో నిక్కచ్చి స్వరం వినిపిస్తున్న స్త్రీ అయినందుకు మరీ మరీ కావొచ్చు.
 
 సామాజిక దుర్భిక్షాలకి సాహిత్యమొక నివారణోపాయం. వానలతో ఎడతెగక పారే జీవనది సాహిత్యం. ముంతతో వెళితే ముంతెడు నీళ్లు, కడవతో వెళితే కడివెడు నీళ్లు తెచ్చుకోవచ్చు. పరిశోధనా దాహం మెండుగా ఉన్న కాత్యాయని బహుశా ఒక నదీపాయని తన జ్ఞానంతో అనుసంధానం చేసుకుని ఉంటారు... చిరకాలం సారవంతమైన విమర్శాఫలాలను వాగ్దానం చేస్తూ...
 - కె.ఎన్.మల్లీశ్వరి

మరిన్ని వార్తలు