ప్రకృతి శాపం, ప్రభువుల పాపం

30 Nov, 2015 10:14 IST|Sakshi
నెల్లూరు, చిత్తూరు, కడప, ఉభయగోదావరి జిల్లాల్లో పడిన అకాల వర్షాల వల్ల రూ.3,819 కోట్లు నష్టం జరిగినట్లు అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం తక్షణం రూ.1,000 కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని అర్థించింది. తమిళనాడు రాష్ట్రానికి రూ.939 కోట్ల వరద సాయం ఆగమేఘాల మీద ప్రకటించిన కేంద్రం.. మన రాష్ట్రం పంపిన నివేదికపై ఇప్పటికీ స్పందించ లేదు. ‘హుద్‌హుద్’ తుపాను నష్టానికి కేవలం 3% నిధులు మాత్రమే ఇచ్చిన కేంద్రాన్ని నిలదీయలేకపోయిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈసారి ఏ మేరకు నిధులు సాధించగలదో మరి!
 
రాష్ట్రానికి ప్రకృతి వైపరీత్యాల బాధ ఉధృతమవుతోంది. ప్రభుత్వ చర్యలు, సాయం మాత్రం క్షీణిస్తున్నాయి. కరువు నివేదిక సిద్ధం చేసి సాయం కోసం కేంద్ర ప్రభుత్వానికి నివేదించే తరుణంలోనే, వరద బీభత్సం సృష్టించిన నష్టం పైన మరో నివేదికను కూడా పంపవలసిన అసాధారణ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురైంది. యాదృచ్ఛికమే అయినా, మరో చిత్రం కూడా జరిగింది. నవంబర్ 19న విశాఖపట్నంలో ‘విపత్తుల యాజమాన్యం’ (కెలామిటీ మేనేజ్‌మెంట్) అనే అంశం మీద వేయి మంది అంతర్జాతీయ ప్రతినిధులతో రెండో ప్రపంచ సదస్సు జరుగుతున్న సమయంలోనే దక్షిణకోస్తా, రాయలసీమ వర్షాలతో అతలాకుతలమైనాయి (1977లో దివిసీమ ఉప్పెన వచ్చి, 17,000 మంది మృత్యువాత పడినది కూడా నవంబర్ 19వ తేదీయే). విపత్తుల బాధితులను ప్రభుత్వం ఎలా ఆదుకోవాలి? వాటిని తట్టుకునేందుకు ముందస్తు చర్యలు ఏవి? వంటి అంశాల మీద ప్రపంచ సదస్సు తీర్మానాలు చేస్తున్నవేళ- నెల్లూరులో సాయం కోసం వరద బాధితుల ఆక్రందనలు మిన్నంటాయి. 
 
దేశానికీ, రాష్ట్రానికీ ప్రకృతి వైపరీత్యాలూ, విపత్తులూ కొత్తేమీ కావు. దేశంలోని 593 జిల్లాలలో 199 జిల్లాలు తరచూ ప్రకృతి వైపరీత్యాలతో ప్రభావితమవుతున్నాయని కేంద్రం గుర్తించింది. విపత్తులతో జరిగే ఆస్తి, ప్రాణ నష్టాలు పెరుగుతున్నాయి. పూర్తిగా వాతావరణ పరిస్థితులపైననే ఆధారపడి ఉండడం వల్ల వ్యవసాయం మరింత సంక్షోభంలో కూరుకుపోతున్నది. గణాంకాల ప్రకారం, దేశంలో ఏటా 70 లక్షల హెక్టార్ల భూభాగం వరద తాకిడికి గురవుతోంది. 
 
సమన్వయ లోపంతో నష్టం
ప్రకృతి వైపరీత్యాలను నివారించడం కష్టమే. కానీ, అందుబాటులోకి వచ్చిన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ, అభివృద్ధి చెందిన దేశాలు ఏ విధంగా ప్రజలను ముందస్తు హెచ్చరికలతో అప్రమత్తం చేసి నష్టాన్ని తగ్గించుకుంటున్నాయో, అదే బాటలో మనమూ  వెతలను తగ్గించుకోవచ్చు. అయితే ఈ పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో ప్రభుత్వాల మధ్య సమన్వయం లోపిస్తున్నది. డిసెంబర్ 26, 2004 నాటి సునామీతో దేశం వణికిపోయింది. ఆ తరహా విపత్తును ఎదుర్కొనడం మనకు అదే మొదటిసారి. ఆ అనుభవంతోనే నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ)ను, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(జాతీయ విపత్తుల ప్రతిస్పందన దళాలు) ఏర్పాటు చేశారు. ప్రధాని అధ్యక్షతన పనిచేసే ఈ సంస్థతో చాలా వరకు నష్టాలు తగ్గుతాయని ఆశించారు. కానీ అది సమర్థంగా పనిచేయడం లేదని తేలింది. ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, విశాఖ హుద్‌హుద్ ఘటనలు ఇందుకు తార్కాణాలు. ఈ విపత్తుల సమయంలో నివారణ చర్యలు తీసుకోవడంలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ సమర్థంగా పని చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. 
 ఏ విపత్తుకైనా సంసిద్ధత, ఉపశమనం, సహాయం, పునరావాసం అనే నాలుగు అంశాలు కీలకం. ఇందులో మొదటి మూడు జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ పరిధిలోనివి. అయితే  ఈ సంస్థ 2005లోనే ఏర్పాటైనప్పటికీ  2008 నుంచి 2012 వరకు ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. 
ఈ వాస్తవాన్ని గమనిస్తే ఇలాంటి సంస్థను మెరుగుపర్చాలన్న శ్రద్ధ కేంద్రానికి ఉన్నదా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. నిజానికి, ఈ సమస్యపై మన ప్రభుత్వాలకు స్పష్టమైన విధానం లేదు. 
 
రాష్ట్రానికి దాదాపు 972 కి.మీ. తీరప్రాంతం ఉంది. 9 జిల్లాలలో విస్తరించిన ఈ తీరానికి 15 కి.మీ. పరిధిలోని ప్రజలకు బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు ప్రాణాంతకాలవుతున్నాయి. మరోపక్క రాయలసీమ తరచూ కరువు బారిన పడుతుంటుంది. దివిసీమ ఘటన మొదలు, రాష్ట్రం విడిపోయేవరకు రాష్ర్టంలో 14 అతిపెద్ద తుపానులు వచ్చాయి. దాదాపుగా ప్రతి ఏటా కరువు, వరదలు, తుపానుల వంటి వాటితో పంట నష్టం జరగటం, రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం జరుగుతూనే వచ్చాయి. ఇక ‘ఎల్‌నినో’ కారణంగా ఈశాన్య రుతుపవనాల ప్రభావం క్రమేపీ తగ్గుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో సాధారణంగా నమోదుకావాల్సిన వర్షపాతంలో 22 నుంచి 35 శాతం తగ్గుదల నమోదు కావటం వల్ల.. రైతులు సకాలంలో పంటలు వేసుకోలేని దుస్థితి నెలకొన్నది. నవంబర్‌లో తుపానుల రాక సర్వసాధారణమైపోయింది. వాతావరణంలో ఏర్పడిన మార్పులతో నెల్లూరు జిల్లాలో నవంబర్ 9-19 మధ్య ఏకధాటిగా కురిసిన వర్షాలతో గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 740.40 మి.మీ. వర్షపాతం నమోదైంది. 54 మంది మృత్యువాతపడగా, వేలాదిమంది  నిరాశ్రయులయ్యారు. నష్టం 3,819 కోట్లు ఉంటుందని, తక్షణం వెయ్యి కోట్లు సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
 
నష్టం కొండంత, సాయం గోరంత
‘ప్రపంచ విపత్తుల సదస్సు’లకు వేదికగా నిలుస్తున్న భారత్‌లోనే విపత్తు సహాయ నిధులు అరకొరగా ఉంటున్నాయి. 9వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ప్రకృతి వైపరీత్యాల సహాయానికి అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వాలకు అందించడానికి కేంద్ర ప్రభుత్వం విపత్తు సహాయ నిధి (సీఆర్‌ఎఫ్)ని 1990లో ఏర్పాటు చేసింది. ఈ నిధిలో 75 శాతం కేంద్రం, మిగతా 25 శాతం నిధులను రాష్ట్రాలు అందించాలి. అయితే, కేంద్ర నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. పైగా జరిగిన నష్టంలో 10 శాతమైనా సాయంగా రావడంలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 నుండి 2013 మధ్య విపత్తులతో జరిగిన నష్టం మొత్తం రూ. 52,305 కోట్లు. కానీ, కేంద్రం ఇచ్చింది రూ.3,507 కోట్లు. అంటే జరిగిన నష్టంలో వచ్చింది 6 శాతానికి మించలేదు. ‘హుద్‌హుద్’ నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరిన మొత్తం రూ.21,640 కోట్లు. మొదటి రోజునే బీభత్సాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ ఇది జాతీయ విపత్తు లాంటిదని పేర్కొన్నారు. తక్షణ సాయంగా రూ.1,000 కోట్లు ప్రకటించారు. ఇచ్చింది- రూ.737 కోట్లు. అంటే జరిగిన నష్టంలో కేంద్ర సాయం 3 శాతమే. ఇక, నవంబర్ 3వ వారంలో  నెల్లూరు, చిత్తూరు, కడప, ఉభయగోదావరి జిల్లాల్లో పడిన అకాల వర్షాల వల్ల రూ.3,819 కోట్లు నష్టం జరిగినట్లు అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం తక్షణం రూ.1,000 కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని అర్థించింది. పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రానికి రూ.939 కోట్ల వరద సాయం ఆగమేఘాల మీద ప్రకటించిన కేంద్రం.. మన రాష్ట్రం పంపిన నివేదికపై ఇప్పటికీ స్పందించలేదు. ‘హుద్‌హుద్’ తుపాను నష్టానికి కేవలం 3% నిధులు మాత్రమే ఇచ్చిన కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేకపోయిన తెలుగుదేశం ప్రభుత్వం.. ఈసారి ఏమేరకు నిధులు సాధించగలదో మరి!
 
విపత్తులు, వైపరీత్యాలతో జరిగిన నష్టం అంచనా వేయటంలో శాస్త్రీయత లోపిస్తున్నది. ఇలాంటి నష్టాలను శాస్త్రీయంగా అంచనా వేసి, సాయం అందించటానికి 2012లో ‘భూపేంద్రహుడా కమిటీ’ స్పష్టమైన సూచనలు చేసింది. పంట నష్టపరిహారాన్ని మూడు రెట్లు ఎక్కువగా సూచించిన హుడా నివేదిక పట్ల రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, డాక్టర్ స్వామినాథన్ నివేదిక బుట్టదాఖలైనట్టే, హుడా కమిటీ నివేదిక అటకెక్కింది. ఇక, ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక జవసత్వాలు కల్పించటంలో భాగంగా పట్టణీకరణతో 65 శాతం ఆదాయం పట్టణాల నుంచి వస్తుందన్న అంచనాలతో శివారు ప్రాంతాల్లో ఎడాపెడా కట్టడాలకు అనుమతులు ఇస్తున్నారే తప్ప, భారీవర్షాలు, వరదలు వస్తే జరిగే అనర్థాలపై దృష్టి పెట్టడంలేదు. ఈ అనర్థం అమరావతి సహా అంతటికీ పొంచి ఉంది. ఇక రాష్ట్రానికి దక్కాల్సిన నిధులపై కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేని అశక్తత రాష్ట్ర ప్రభుత్వానిది. హేతుబద్ధతతో సమస్యల్ని సకాలంలో పరిష్కరించకుంటే అంతిమంగా నష్టపోయేది ప్రజలే.
 
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
వ్యాసకర్త ఎమ్మెల్సీ, కేంద్ర మాజీ మంత్రివర్యులు
Read latest Opinion News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు