నవాజ్‌ షరీఫ్‌ (పాక్‌ ప్రధాని)

30 Jul, 2017 00:58 IST|Sakshi
నవాజ్‌ షరీఫ్‌ (పాక్‌ ప్రధాని)

రాయని డైరీ

ఐ లవ్‌ మై కంట్రీ! ఏ దేశ పౌరుడు ఆ దేశాన్ని ప్రేమించడంలో విశేషం ఏమీ లేదు. కానీ దేశ ప్రధానిగా ఉంటూ దేశాన్ని ప్రేమించడం పాకిస్తాన్‌లో విశేషమే.

పాకిస్తాన్‌ కూడా తన దేశ పౌరుల్ని ప్రేమించినంతగా ఏనాడూ తన దేశ ప్రధానిని ప్రేమించలేదు. అందుకు నేనేమీ నా దేశాన్ని నిందించడం లేదు. ఎవరి ప్రేమ వాళ్లది. నన్ను ప్రేమించట్లేదు కాబట్టి, నేను ప్రేమించట్లేదు అని ముషర్రఫ్‌ లాంటి వాళ్లే అనగలరు.
ప్రేమించక పోయినా ప్రేమించడమే నిజమైన ప్రేమ. ఈ మాటని అప్పుడప్పుడు ఇమ్రాన్‌ఖాన్‌ అంటుంటాడు. కానీ అతణ్ణి నేను నమ్మను. ఏ దేశంలోనూ పాలకపక్షం ప్రతిపక్షాన్ని ప్రేమించదు. ‘ప్రేమించకపోతే నాకేంటి? నేను ప్రేమిస్తాను’ అని నిజంగా అనుకునేవాడే అయితే ప్రతిపక్ష నేతగా ఇమ్రాన్‌ మా పార్టీని ప్రేమించి ఉండాలి. కనీసం నన్నైనా ప్రేమించి ఉండాలి. ప్రేమించలేదు. ప్రేమిస్తే నాపై కోర్టులో కేసెందుకు వేయిస్తాడు?!
కోర్టు తీర్పు రాగానే, దుబాయ్‌ నుంచి ముషర్రఫ్‌ ఫోన్‌ చేశాడు. వెంటనే లిఫ్ట్‌ చేశాను. ఎంతైనా.. నేను ప్రేమించే నా దేశపు పూర్వ అధ్యక్షుడు అతడు. అతడూ నాలాగే నా దేశాన్ని ప్రేమించాడా లేదా అన్నది నాకు అనవసరం. నా దేశాన్ని ప్రేమించినట్లే, నేనూ నా దేశపు పూర్వ అధ్యక్షులను కూడా ప్రేమిస్తాను.

‘‘మిస్టర్‌ ముషర్రఫ్‌.. ఎలా ఉంది మీ ఆరోగ్యం?’’ అని ఎంతో ప్రేమగా అడిగాను. పెద్దగా నవ్వాడు ముషర్రఫ్‌. అతడి ఆరోగ్యం మెరుగుపడినట్లే ఉంది!
‘‘షరీఫ్‌ జీ.. నేను దుబాయ్‌ నుంచి వచ్చేసరికి పాకిస్తాన్‌లోని దుకాణాలలో నాకు ఒక్క మిఠాయి పొట్లం అయినా మిగిలి ఉండే అవకాశం ఉంటుందా?’’ అని అడిగాడు!
అతడేం మారలేదు.  
‘‘మిస్టర్‌ ముషర్రఫ్‌.. ఆ సంగతి చెప్పలేను. కానీ నా పదవి పోయిందన్న ఆనందాన్ని ఇక్కడి వాళ్లతో పంచుకోవడానికి మీరే అక్కడి నుంచి కొన్ని మిఠాయి పొట్లాలు తెచ్చుకోవడం మెరుగైన ఆలోచన కదా’’ అని అన్నాను. అతడిపై నాకేం కోపం రాలేదు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నప్పుడు.. అతడు నన్నెంత ద్వేషించినా.. నేనతడిని ప్రేమించకుండా ఎలా ఉండగలను?

‘‘నెక్స్‌ట్‌ ఏంటీ?’’ అన్నాడు ముషర్రఫ్‌. పాక్‌ ప్రధానులెవరూ నెక్స్‌ట్‌ ఏంటీ అని ఆలోచించరని అతడికి మాత్రం తెలీదా?
‘‘నెక్స్‌ట్‌ ఏమీ లేదు మిస్టర్‌ ముషర్రఫ్‌.. ఎప్పటిలా నేను నా దేశాన్ని ప్రేమిస్తూనే ఉంటాను’’ అని చెప్పాను. నా దేశంలోని గొప్పతనం ఏంటంటే.. ఇక్కడ ఏ ప్రధానీ పూర్తికాలం ఐదేళ్లూ ఉండడు. కానీ దిగిపోయిన ప్రతి ప్రధానీ తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు!
మాధవ్‌ శింగరాజు

Read latest Opinion News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా