భారతంలో ‘అనంత’ కీర్తి

22 Dec, 2013 00:01 IST|Sakshi
భారతంలో ‘అనంత’ కీర్తి

కొద్ది కాలం ప్రధానిగా ఉన్న చరణ్‌సింగ్  కొన్ని నిముషాలలో బల నిరూపణ జరగవలసి ఉండగా రాజీనామా చేసి, లోక్‌సభ రద్దుకు సిఫారసు చేశారు. ఈ సిఫారసును నీలం ఆమోదించకుండా, జనతా పార్టీ నేత బాబూ జగ్జీవన్‌రామ్‌ను లేదా పార్టీ అధ్యక్షుడు  చంద్రశేఖర్‌ను పిలిచి ఉంటే ఉప ఎన్నిక  తప్పేదని ఒక వాదన ఉంది. కానీ ప్రధాని, మంత్రిమండలి ఇచ్చిన సలహాను  రాష్ట్రపతి పాటించడమనే విధిని నీలం  నిర్వహించారన్న ఖ్యాతి కూడా ఉంది.

 స్వాతంత్య్రానంతర భారతచరిత్రలో, ఆంధ్రుల చరి త్రలో ఐదారు కీలక ఘట్టాలు పరిశీలిస్తే వాటిలో ప్రధాన పాత్రధారిగా కనిపించే నాయకుడు డాక్టర్ నీలం సంజీవరెడ్డి (మే 19, 1913-జూన్1, 1996). ఆయన మహోద్య మం నుంచి వచ్చారు. మహోన్నతుల మధ్య ఎదిగారు. గాంధీజీ, నెహ్రూ, పట్టాభి, ప్రకాశం, మద్దూరి అన్నపూర్ణయ్య, బులుసు సాంబమూర్తి, కొండా వెంకటప్పయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, కళా వెంకటరావు, కామరాజ్ నాడార్, బెజవాడ గోపాలరెడ్డి వంటి వారితో నీలం భుజం భుజం కలిపి నడిచారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ, ఆంధ్రప్రదేశ్ అవతరణ- రెండు చారిత్రక ఘట్టాలలోను ఆయన పేరు చిరస్మరణీయం. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి ఆయనే. లాల్ బహదూర్‌శాస్త్రి, ఇందిరాగాంధీ ప్రభుత్వాలలో సభ్యుడు. రాయలసీమ వంటి కరవు ప్రాంతం దేశానికి అందించిన ఆరవ రాష్ట్రపతి.

 భూస్వాముల కుటుంబం నుంచి వచ్చిన నీలం సంజీవరెడ్డిని 1929 నాటి గాంధీజీ అనంతపురం యాత్ర సామాజిక కార్యకర్తగా మార్చింది. ఉప్పు సత్యాగ్రహం దేశాన్ని ఉర్రూతలూగిస్తున్న వేళ, 18 ఏళ్ల వయసులో నీలం ఉద్యమంలో ప్రవేశించారు. పాతికేళ్ల వయసులో 1938 లోనే ప్రాంత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఎంపికయ్యా రు. అక్కడ నుంచి సాగిన ఆయన ప్రయాణం సంభ్రమంగానే ఉంటుంది. ప్రథమ ప్రధాని నెహ్రూ కాలంలో 1959 లో నీలం అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. 1967 లో లోక్‌సభ స్పీకర్‌గా ఎంపికయ్యారు.

 అంతరాత్మ ప్రబోధం

 చైనా దాడితో మొదలైన 60వ దశకం ‘అంతరాత్మ ప్రబో ధం’ వివాదంతో ముగిసింది. ఈ రెండూ భారతీయ సమాజానికి కుదుపులే. నెహ్రూ, లాల్‌బహదూర్ శాస్త్రి అకాల మరణాల తరువాత ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు. బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు వంటివి అప్పుడు ఇందిర తీసుకున్న సంచలన నిర్ణయాలు. కానీ అప్పటికే భారత జాతీయ కాంగ్రెస్‌లో చీలికకు సంకేతాలు పొడసూపుతున్నాయి. ఇలాంటి తరుణంలో భారత రాజకీయాలలో వచ్చిన కీలక పరిణామానికి నీలం కేంద్ర బిందువయ్యారు. 1969 మే మాసంలో జాకీర్ హుస్సేన్ హఠాన్మరణంతో రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. సిండికేట్‌గా పేరుపడిన వర్గం పార్టీ సమావేశంలో నీలం సంజీవరెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఇది ముమ్మాటికీ పార్టీ నిర్ణయ మే. నీలం స్పీకర్ పదవికి రాజీనామా చేసి, పోటీ చేశారు. కానీ ఇందిర ఉప రాష్ట్రపతి వీవీ గిరి పేరును రంగం మీద కు తెచ్చారు. అప్పుడే ఆమె ‘అంతరాత్మ ప్రబోధం’ పిలుపునిచ్చారు. ఇందిర తీసుకున్న ఈ నిర్ణయం, ఆ ధోరణి ఇప్పటికీ దేశ రాజకీయాలలో వివాదాస్పదమే. పార్టీ అధికారిక అభ్యర్థి నీలం (4,18,169 ఓట్లు), ఇండిపెండెంట్ అభ్యర్థి గిరి (4,20,077 ఓట్లు) చేతిలో ఓడిపోయారు. దీనితో పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలతో ఇందిరకు నోటీసు ఇచ్చారు. నిజానికి పార్టీలో ఇందిర హవా ఏమిటో పార్టీ అభ్యర్థి ఓటమితోనే రుజువైంది. నోటీసుకు జవాబు ఇవ్వకుండా సిండికేట్‌లోని కామరాజ్ నాడార్, మొరార్జీదేశాయ్, ఎస్. నిజలింగప్ప, అత్యుల ఘోష్, ఎస్‌కె పాటిల్, హితేంద్రనాథ్ దేశాయ్, జీకే మూపనార్, రామకృష్ణ హెగ్డే, సికిందర్ భ క్త్ వంటి వారిని పార్టీ నుంచి నవంబర్ 12, 1969న ఇందిరే బహిష్కరించారు. పార్టీ చీలిపోయింది. వీరే తరువాత వ్యవస్థా కాంగ్రెస్‌ను స్థాపించుకున్నారు. నీలం మాత్రం రాజకీయాలు విరమించి స్వస్థలం ఇల్లూరు చేరుకున్నారు. సాక్షాత్తు ప్రధాని అనుసరించిన అనుచిత వైఖరి వల్ల దేశం ఎంతటి మూల్యం చెల్లించిందో పీవీ నరసింహారావు ‘లోపలి మనిషి’లో అంచనా వేశారు. భారత నాయకత్వంలో వచ్చిన ఈ స్ఫుటమైన చీలికను చూసిన పాకిస్థాన్, ప్రజానీకంలో కూడా ఈ చీలిక ఉందని నమ్మి, అది లాభిస్తుందనే ఆశతోనే 1971 యుద్ధానికి దిగిందని పీవీ అంటారు.

 రాష్ట్రపతిగా నీలం

 1969 ఎన్నికలో ఓడినా, 1977లో నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి పదవిని చేపట్టారు. ఈ పదవిలోకి రావడం, నిర్వహణ రెండూ సున్నితంగా సాగలేదు. 1974లో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ‘సంపూర్ణ విప్లవం’ ప్రారంభించారు. నాటి అవినీతి, ఆశ్రీత పక్షపాతాలకు వ్యతిరేకంగా బీహార్ నుంచి ప్రారంభమైన ఉద్యమమిది. ఇందిర ఎన్నిక (1971, రాయ్‌బరేలీ) చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టులో తీర్పునివ్వడం, దీనిపై సుప్రీంలో వీఆర్ కృష్ణయ్యర్ షరతులతో కూడిన స్టే ఇవ్వడం, దరిమిలా తొలిసారిగా అత్యవసర పరిస్థితి విధించడం వరసగా జరిగిపోయాయి. ఈ పరిణామాల పరాకాష్ట జనతా ప్రభుత్వ ఏర్పాటు. అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పెల్లుబికిన నిరసనోద్యమం ద్వారానే నీలం మళ్లీ రాజకీయాలలోకి వచ్చారు. దేశమంతా జనతా హవా వీచగా, రాష్ట్రంలో నీలం (నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం) ఒక్కరే ఎన్నికయ్యారు. రాష్ట్రపతి పదవి ఆయనను వరించింది. అయితే, రెండున్నర సంవత్సరాల తరువాత జనతా పార్టీలో ద్వం ద్వ సభ్యత్వం వంటి సమస్యలతో మొరార్జీ ప్రభుత్వం కూలింది. నాటి ఆరోగ్యమంత్రి రాజ్‌నారాయణ్‌తో కలిసి హోంమంత్రి, ఉపప్రధాని చరణ్‌సింగ్ కూలదోశారు. కానీ కొద్ది కాలం ప్రధానిగా ఉన్న చరణ్‌సింగ్ కొన్ని నిముషాలలో బల నిరూపణ జరగవలసి ఉండగా రాజీనామా చేసి, లోక్‌సభ రద్దుకు సిఫారసు చేశారు. ఈ సిఫారసును నీలం ఆమోదించకుండా, జనతా పార్టీ నేత బాబూ జగ్జీవన్‌రామ్‌ను లేదా పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ను పిలిచి ఉంటే ఉప ఎన్నిక తప్పేదని ఒక వాదన ఉంది. కానీ ప్రధాని, మంత్రిమండలి ఇచ్చిన సలహాను రాష్ట్రపతి పాటించడమనే విధిని నీలం నిర్వహించారన్న ఖ్యాతి కూడా ఉంది. చాలా అంశాలను నీలం తన ఆత్మకథ ‘వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్’లో నమోదు చేశారు. నీలం రాజకీయ చతురత, రాజనీతిజ్ఞత కలగలసిన కాలంలో రాణించారు. తన ముం దుకాలం నాటి రాష్ట్రపతులు మూటకట్టుకున్న ‘రబ్బరు స్టాంపు’ అపఖ్యాతిని ఒదిలించుకోగలిగారు. వ్యవస్థలో గ్రామీణ ప్రాతినిధ్యానికి నీలం నిలువెత్తు నిదర్శనం.
 డా॥గోపరాజు నారాయణరావు  (నీలం శత జయంతి సభ కోసం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రేపు అనంతపురం వస్తున్న సందర్భంగా...)
 

మరిన్ని వార్తలు