తెల్లవారని తెలంగాణ పోరు!

1 Aug, 2013 02:38 IST|Sakshi
తెల్లవారని తెలంగాణ పోరు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ సందర్భంగా కుదుర్చుకున్న పెద్ద మనుషుల ఒప్పందం 12 ఏళ్ల గడువు పూర్తయినా, అన్ని అంశాలలో విఫలం కావడంతో 1968 చివరినాళ్లలో  తెలంగాణలో ‘వేరు కుంపటి’ రగిలింది. 33 కోట్ల రూపాయల మిగులు నిధుల వ్యయానికి సంబంధించి తలెత్తిన వివాదం 1956 నాటి ఒప్పందం డొల్లతనాన్ని బయటపెట్టింది. 1969, జనవరి 8న ఖమ్మం పట్టణంలో ఎ.రవీంద్రనాథ్ అనే విద్యార్థి తెలంగాణకు‘రక్షణ’ కోరుతూ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టకముందే, అదే జిల్లాలోని పాల్వంచ పట్టణంలో విద్యుత్ బోర్డు (ఏపీఎస్‌ఈబీ) సిబ్బంది మధ్య పొడ చూపిన తగాదా ప్రత్యేక తెలంగాణ డిమాండ్ వెనుక దాగి ఉన్న అసలు వాస్తవాన్ని వెలికి తెచ్చింది. ఉద్యోగావ కాశాలలో ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలకు మధ్య అప్పటికే నెలకొని ఉన్న అసమానతలకు సంబంధించిన ఈ ‘పంచాయితీ’ రాష్ట్ర హైకోర్టు దాకా పాకి, తెలంగాణ వ్యతి రేక తీర్పునకు దారితీసింది. విద్యుత్ బోర్డు వంటి స్వతం త్ర ప్రతిపత్తి గల కార్పొరేషన్‌లలో ముల్కీ నిబంధనలు వర్తించవని న్యాయస్థానం చెప్పిన తీర్పు తెలంగాణ ప్రాంత ఉద్యోగులను తీవ్ర అసహనానికి గురిచేసింది. ఉద్యో గాలలో తమకు న్యాయమైన వాటా జనాభా దామాషా మేరకు దక్కడం లేదనే అసంతృప్తికి ఈ తీర్పు ఆజ్యం పోసింది. నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి పరోక్ష మద్దతుతో, తెలంగాణకు ‘రక్షణలు’ చాలు, ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదని ఉద్యమం పరిమిత స్థాయిలో సాగించిన విద్యార్థి నాయకులపై, ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌పై రాజీపడని విద్యార్థి నాయకులదే పైచేయి కావడంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపందుకుని, అన్ని జిల్లాలకు కార్చిచ్చులా వ్యాపించింది. 
 
 నిజానికి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అందరూ అనుకుంటున్నట్లు 1969, మే నెలలోకాక అంతకు ఆరు నెలల ముందే 1968, డిసెంబర్‌లో ఊపిరి పోసుకుంది. హైదరాబాద్‌లో వివేక్‌వర్ధిని కళాశాల విద్యార్థులు ఆ నెల 6న తెలంగాణ డిమాండ్‌తో పెద్ద ఊరేగింపు నిర్వహించారు. పోలీసుల లాఠీఛార్జిలో ఎందరో విద్యార్థులు గాయ పడ్డారు. విద్యార్థులు నిర్వహించిన తొట్టతొలి ఊరేగింపుపై పోలీసుల దౌర్జన్యం ఫలితంగా ఉద్యమం అనతి కాలంలో ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాలకు విస్తరించింది. 1969 జనవరి 15న జంటనగరాల విద్యార్థులు తరగతు లను బహిష్కరించారు. ఆ రోజు నిజాం కాలేజీలో జరిగిన బహిరంగ సభలో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం నాయకుడు మల్లికార్జున్ వంటి ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఉద్యమ తీవ్రతను తగ్గించే ఉద్దేశంతో నాన్ ముల్కీ ఉద్యోగులను నెలరోజుల్లోగా తప్పించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం  ఆ నెల 22న జీవో జారీ చేసింది. ముల్కీ నిబంధనలను విద్యుత్ బోర్డుకు కూడా వర్తింపచేస్తున్నట్లు కూడా ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇవేవీ అమలులోకి రాలేదు. అదే నెల 25న మెదక్ జిల్లా సదా శివపేటలో పోలీసుల కాల్పుల్లో ఒక విద్యార్థి చనిపో యాడు, మరెందరో గాయపడ్డారు. సదాశివపేట కాల్పుల సంఘటన రగిలించిన చిచ్చు విద్యార్థి ఉద్యమాన్ని ఆది లాబాద్ జిల్లాలోని నిర్మల్ వంటి దూర ప్రాంతాలకు సైతం వ్యాపించింది. ఇంతలో ఫిబ్రవరి 17న నాన్ ముల్కీ ఉద్యోగుల తొలగింపు జీవోపై సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ జారీ చేసింది. ఇది ఉద్యమకారుల్లో మరింత అసంతృప్తిని, ఆగ్రహాన్ని రేపింది. మార్చి 6న సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులను ధృవీకరించింది. ఈ తీర్పు తెలంగాణ ఉద్యోగుల ప్రయోజనాలను రక్షించే అవకాశం ప్రభుత్వానికి లేకుండా చేసిం ది. కానీ అటు పిదప 1970, డిసెంబర్ 10న రాష్ట్ర హైకోర్టు ముల్కీ నిబంధనలు చట్టసమ్మతమైనేనని తాజాగా తీర్పు నిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఆంధ్రా ప్రాంతం ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగా ణకు చెందిన ఎమ్మెల్యేలు మార్చి 16 లోగా ‘రక్షణ’లను అమలు చేయాలని కాసు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుని అమలుచేయని పక్షంలో సత్యాగ్రహానికి పూనుకుంటామని తెలంగాణ వృద్ధనేత కొండా వెంకటరంగారెడ్డి అదే నెల 20న ప్రకటించారు. పెద్ద మనుషుల ఒప్పందంపై తెలం గాణ తరఫున సంతకం చేసిన నలుగురిలో ఆయన ఒకరు. తెలంగాణ రాష్ట్ర సాధనకు మంత్రి పదవిని త్యజించిన టి.ఎన్. సదాలక్ష్మి హైదరాబాద్ రెడ్డి హాస్టల్‌లో నిర్వహించిన భారీ సభ తెలంగాణ ఉద్యమంలో ఒక మైలురాయి. 
 
 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేవరకు విద్యార్థులు తరగతులను బహిష్కరిస్తారని ఆమె ఆ సభలో ప్రకటన చేశారు. తెలంగాణ అంతటా విద్యార్థి ఉద్యమం ఉధృత మవుతున్న నేపథ్యంలో కమ్యూనిస్టు, కాంగ్రెస్‌పార్టీల ముఖ్యనేతల నేతృత్వంలో సమైక్యవాదులు సికింద్రాబాద్ బూరుగు మహదేవ్ హాల్‌లో ఏప్రిల్ 4న సమావేశమ య్యారు. సమావేశాన్ని రద్దు చేయాలని కోరుతూ హాలు బయట పెద్ద సంఖ్యలో నిరసన ప్రదర్శనలకు దిగిన విద్యార్థులపై ముందస్తు హెచ్చరిక లేకుండా పోలీసులు కాల్పులు జరపడంతో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. ఆ రోజు కాల్పుల్లో వాస్తవానికి 18 మంది విద్యార్థులు చనిపోయా రని ఉద్యమ నాయకత్వం ప్రకటించింది. తెలంగాణ ప్రజాసమితి ఆవిర్భవించింది కూడా అప్పుడే. ప్రతాప్ కిషోర్, రఘువీర్‌రావు, ఇ.వి.పద్మనాభం వంటి పాత్రికే యుల సారథ్యంలో ఏర్పడిన ప్రజాసమితికి రాజకీయా నుభవం కొరవడిన యువ న్యాయవాది ఎ.మదన్‌మోహన్ అధ్యక్షు నిగా ఎన్నికవడం ఓ వైచిత్రి. సికింద్రాబాద్ కాల్పుల సంఘటన అనంతర కాలంలో ప్రజా సమితి, విద్యార్థి కార్యాచరణ సంఘాల నేతృత్వంలో ఏకైక నాయ కుడు కానీ కేంద్రీకృత నాయకత్వం కానీ లేకుండానే ఉద్య మం ఉగ్రరూపం దాల్చింది. ఏప్రిల్ 4 సంఘటనకు నిరసనగా మే 1న ర్యాలీ నిర్వహించాలని ప్రజా సమితి నిర్ణ యించింది. చార్మినార్ నుంచి రాజ్‌భవన్ దాకా 50 వేల మందితో సాగిన ఊరేగింపును పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. భాష్పవాయు ప్రయోగానికి, లాఠీఛార్జీకి పోలీసులు విచక్షణారహితంగా పాల్పడ్డారు. కె.వి. రంగా రెడ్డి ఆశీస్సులతో ఆరంభమైన ఈ ఊరేగింపుపై ప్రభుత్వం విచ్చలవిడిగా దమనకాండకు పాల్పడింది. ‘బానిస బతుకుకన్నా చావు మేలు’ అని రంగారెడ్డి ఆ రోజు తన ప్రసంగాన్ని ముగిస్తూ అన్నమాట ఉద్యమాన్ని ఉన్నత ప్రమాణాలతో సాగించేందుకు ఊతం ఇచ్చింది. ఊరేగింపు రాజ్ భవన్ చేరుతుందనగా సికింద్రాబాద్ కాలేజీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు ఉమేందర్‌రావు పోలీసు తూటాలకు నేలకొరిగాడు. అటు పిదప ఉద్యమం మరింత తీవ్ర రూపం తీసుకుంది. 
 
 ఉద్యమానికి అనుభవజ్ఞుడైన నాయకుడి అవసరం ఉందనే భావనతో ప్రజాసమితి నాయకత్వాన్ని డాక్టర్ మర్రి చెన్నారెడ్డికి అప్పగించేందుకు  బి.సత్యనారాయణ రెడ్డి, బద్రీ విశాల్ పిత్తి వంటి సోషలిస్టు నేతలు ప్రారంభించిన ప్రయత్నాలు ఆ నెల 21 నాటికి ఓ కొలిక్కి వచ్చాయి. ఆ రోజు నుంచి ప్రజాసమితి నాయక త్వం చెన్నారెడ్డి చేతుల్లోకి వెళ్లింది. జూన్ 1 నుంచి ఆరంభమయ్యే పరీక్షలను బహిష్కరిం చాల్సిందిగా ప్రజా సమితి పిలుపునిచ్చింది. అప్పటికే ఎన్జీవోల సమ్మె సాగు తున్నది. పరీక్షల బాయ్‌కాట్ కార్యక్రమంలో పాల్గొన్న ఎందరో హైస్కూల్ విద్యార్థులు ఆ రోజున పోలీసుల తూటాలకు బలైపోయారు. 
 
 ఇంతలో ఉద్యమాన్ని చల్లార్చేందుకు ప్రధాని ఇందిరాగాంధీ హైదరాబాద్‌కు ఓ అర్ధరాత్రి ఆకస్మి కంగా వచ్చారు. ప్రజాసమితి నాయకులతో రహస్య మంతనాలు జరిపి వెళ్లిపోయారు. ఇందిర పర్యటన ఫలితంగా చెన్నారెడ్డి ఉద్యమాన్ని విరమిస్తున్నట్లు ప్రకటించారు. 1971 మధ్యంతర ఎన్నికల్లో శాసన సభకు నాగం కృష్ణారావు, మదన్ మోహన్ ఎన్నికైన తరువాత జరిగిన పరిణామం ఇది. అదే ఏడాది లోక్‌సభకు జరిగిన ఎన్నికలలో ప్రజాసమితి 14 లోక్‌సభ స్థానాలకు పోటీ చేసి 10 స్థానాలలో గెలుపొందింది. అటు తరువాత కొద్ది రోజులకే చెన్నా రెడ్డి తెలంగాణ ప్రజాసమితిని కాంగ్రెస్‌లో విలీనం చేసి, తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నీరు గార్చారు. తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు చేపట్టిన ప్రత్యేక రాష్ర్ట ఉద్యమం ఆ విధంగా అర్ధాంతరంగా నిలిచిపోయింది.
 ఎడిట్ పేజీ డెస్క్
 
మరిన్ని వార్తలు