నవ నిర్మాణానికి రాళ్లెత్తే కూలీలెవరు?

22 Dec, 2014 01:15 IST|Sakshi
నవ నిర్మాణానికి రాళ్లెత్తే కూలీలెవరు?

తెలంగాణ రాష్ట్రం భవిష్యత్‌ను కలగంటున్న చారిత్రక సందర్భమిది. కొత్త ఆలోచనలకు పురుడు పోసుకుంటున్న తరుణంలో బంగారు తెలంగాణను విద్యార్థి యువజనుల చేతులతోనే నిర్మించాలి. అందుకు యువతను మహా సైన్యంగా మార్చాలి. గ్లోబల్ సంస్కృతి గూట్లో చిక్కుకొంటున్న యువతను తన మట్టిపై గౌరవం కలిగించటం కంటే మించినది మరొకటి లేదు.
 
ప్రతివారిలో వ్యక్తిత్వ వికాసం వెల్లివిరియాలి. కానీ అది సామా జిక వికాసానికి దోహదపడాలి. వ్యక్తులు శక్తివంతులు కావాలి. అది సమాజాన్ని సుసంపన్నం చేసే శక్తిగా మారాలి. ఏ నేల తనను పెంచి పెద్ద చేసిందో, ఏ నేల తనను ఇంత వాణ్ణిగా తీర్చిదిద్దిందో, ఆ మట్టిపై ప్రజలు పడే బాధలను పార ద్రోలటమే ఆ నేల బిడ్డలుగా తాము చేయాల్సిన కర్తవ్యం అన్నది మరువరాదు. అదే సామాజికమైన జ్ఞానం. ఈ సామాజికమైన చింతన యువతరంలో ఎంత విస్తృతంగా వాపిస్తే ఆ ప్రాంతం తద్వారా దేశం అంత వేగంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది. కొత్త సమాజ నిర్మా ణాలు యువత పిడికిళ్ల నుంచే పురుడు పోసుకుంటాయి. ఉరవళ్లు పరవళ్లు తొక్కే యువతరంలోని మహత్తర శక్తిని నవ నిర్మాణానికి మళ్లించగలిగితే 29వ రాష్ట్రంగా తెలంగాణ మహోజ్వలంగా వెలుగొందుతుంది.
 
తెలంగాణ రాష్ట్రం కోసం ఎగిసిపడ్డ ఉద్యమ చైతన్యం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో కూడా అదే స్ఫూర్తి కొనసాగాలి. వెనుకబడిన ప్రాంతం, దారిద్య్రం, పేదరికం తాండవిస్తున్న తెలంగాణను సంపన్న రాష్ట్రంగా మార్చాలి. తెలంగాణ భూముల్లో సాంకేతిక పరిజ్ఞానం వెల్లివిరిసి సాంకేతిక తెలంగాణగా మారాలి. అందరికీ విద్య, ప్రతి వ్యక్తి ఉద్యోగం పొందే విధంగా శక్తివంతమైన తెలంగాణ నిర్మించబడాలి. ఆకలికేకలు వినిపించని మరో కొత్త తెలంగాణను ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి వూరు పసిడి పచ్చని సంపదల పాన్పుగా మారాలి. ప్రతి పట్టణం ప్రతి నగరం అన్ని వసతులతో తులతూగాలి.  

ఇప్పటి వరకు చూసిన కాలానికి భిన్నంగా భవిష్యత్‌ను కలగంటున్న చారిత్రక సందర్భమిది. కొత్త ఆలోచనలకు పురుడు పోసుకుంటున్న తరుణంలో బంగారు తెలంగాణను విద్యార్థి యువజనుల చేతులతోనే నిర్మించాలి. అందుకు యువతను మహా సైన్యంగా మార్చవలసి ఉంది. గ్లోబల్ సంస్కృతి గూట్లో చిక్కుకొంటున్న యువతను తన మట్టిపై గౌరవం కలిగించటం కంటే మించినది మరొకటి లేదు. తెలంగాణ యువత, విద్యార్థులు ఉద్యమంలో సివంగుల్లా దూసుకుపోయారు.

ఇదే చైతన్యపు దూకుడు ను నవ తెలంగాణ నిర్మాణంలోనూ కొనసాగించాల్సి ఉంది. యువత ఆత్మస్థైర్యంతో ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉంది. తొలి తెలంగాణ ప్రభుత్వం కూడా అందుకు కార్యరంగ భూమిక కోసం కసరత్తు చేస్తుంది. ప్రభుత్వం ఉద్యమ నెలబాలుని దశ నుంచి పాలనా పగ్గాలను అందుకుని కొత్త రచనకు శ్రీకారపు అడుగులు వేస్తుంది. కొత్త అంశాలు ముందుకు వస్తున్నాయి. కొత్త సవాళ్లు ముందుకొస్తున్నాయి.
 
ఈ కష్టాల బండిని నడిపించేందుకు పాలకుల చిత్త శుద్ధి, పాలనా యంత్రాంగం నిమగ్నతలకు తోడుగా తెలం గాణ యువ చైతన్యసైన్యం అండగా నిలవాలి. ఈ యవ్వ న తేజం ఉట్టిపడే విద్యార్థి యువజనులు నవ తెలంగాణ నిర్మాణానికి నడుంకట్టే సాహస యోధులుగా మారాలి. తమ చదువులు తాము చదువుకుంటూ విద్యారంగంలో దూసుకుపోతూనే సమాజ నిర్మాణ పనుల్లో పని చేసే విధంగా వారు తయారు కావాలి. ఆ విద్యార్థి యువజ నులు సామాజిక చింతనతో ముందుకు సాగినప్పుడే తెలంగాణ రాష్ట్రంలో అన్నీ చక్కబడతాయి.

తాము పుట్టి పెరిగిన మట్టిపై మమకారాన్ని రేకెత్తిస్తూ సిలబస్‌లో లేని పాఠాలను పిల్లలకు చెప్పే మహత్తర కర్తవ్యాన్ని ఉపాధ్యా యులు, అధ్యాపకులు తమ భుజస్కంధాలపై వేసుకోవా లి. సిలబస్‌లో పాఠ్యాంశాలు చెప్పటం వాటికి స్థానిక విషయాలను జోడించి బోధనలు చేయాలి. ఆ స్కూలు ఉన్న ప్రాంగణం దగ్గర నుంచి, ఊరు, మండలం, డివిజ న్, ఆ జిల్లాకు సంబంధించిన వక్తృత్వ వ్యాసరచనల పోటీ లు నిర్వహించాలి. ‘పుట్టుకనీది, చావు నీది, బతుకంతా దేశానిది’ అన్న కాళోజీ కవిత్వ పంక్తుల సారాన్ని కొత్తతరం పిల్లలకు ప్రాథమిక దశ నుంచే నూరిపోయాలి.

తెలంగాణ సంస్కృతిని, ఈ నేల కోసం పోరాడిన వీరుల చరిత్రను చెప్పి విద్యార్థుల్లో సృజనను రగిలించాలి. పాఠ్యాంశాలతో పాటుగా తను పుట్టి పెరిగిన మట్టిపై మమకారం పెంచగలిగితే కొత్తతరాన్ని తెలంగాణ పునర్నిర్మాణానికి పునరంకితం అయ్యేలా చేయవచ్చును. అన్యాయాలను, అక్రమాలను ఎదుర్కొనే యువతే ఇది తమ పనికాదను కుని వదిలేస్తే ఎన్నెన్నో దుర్మార్గాలు జరుగుతాయి. ఒక ఊర్లో, ఒక పట్టణంలో యువత కలిసికట్టుగా చేసే మంచి పనులు ఇతర ప్రాంతాలకు ప్రేరణగా మారుతాయి. ఊర్లో ఉన్న వేల యువ పిడికిళ్లు ఒక్కటైతే బండలను సైతం పిండిచేయగలరు. పూడిపోయిన చెరువును పూడిక తీయ టానికి యువత శపథం చేస్తే ఊరు ఊరంతా కదలి వస్తుంది. యువత తమ చేతులతో పచ్చని మొక్కలు నాటి తే దానికి ఊరంతా నీరు పోసి పెంచుతుంది.

తాగటానికి నీళ్లులేకపోతే జలవృద్ధి చేయటానికి ఏం చేయాలో? ఉన్న జలాలను ఎలా సంరక్షించుకోవాలో? నీళ్లను మళ్లించటా నికి ప్రజలంతా ఎలా నడుంగట్టాలోనన్న వెంటాడే సమ స్యలకు కూడా తమ చేతులతో చేయగలిగిన పరిష్కార మార్గాలను యువత చేసే చూపించగలదు.
 
ఈ తరం విద్యార్థులు చేసే పునర్నిర్మాణ పనులకు పూర్వ విద్యార్థులు సంపూర్ణ చేయూతనివ్వాలి. దేశ దేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థులంతా తీమ తమ ఊళ్లలో  చేపట్టే పనులకు సంపూర్ణ సహకారం అందించాలి. విదేశా ల్లో ఉన్న తెలంగాణ పూర్వ విద్యార్థులు దేశ దేశాల్లో స్థిర పడ్డవాళ్లు ఆర్థిక, హార్ధిక చేయూతనందిస్తే ఊహించనంత అభివృద్ధి జరుగుతుంది.

ఈ క్రమంలోనే చితికిపోతున్న పల్లెలను, కన్నీరు పెడుతున్న అభివృద్ధి దశ వైపునకు తీసుకుపోగలుగుతాం. సర్వరంగాలను ప్రక్షాళన చేసేందు కు చైతన్యవంతమైన యువతరం ముందుకు సాగితే మొత్తం ప్రజాక్షేత్రాలను చైతన్యవంతం చేయగలుగుతారు. అన్యా యాలని ప్రతిఘటిస్తూ.. అక్రమాలను తరిమి కొడుతూ.. మనిషిని మనిషి గౌరవించే మానవీయ సమాజ నవ నిర్మా నానికి యువతరమా.. అదను ఇదే కదలిరమ్ము. యువతరం లక్ష్యాల పిడికిళ్లనించే నవ సమాజ నిర్మాణం జరగాలి.    

(వ్యాసకర్త, కవి, సీనియర్ జర్నలిస్టు)
 

మరిన్ని వార్తలు