నైలు నదీజలాలపై జగడం!

27 Jul, 2013 02:53 IST|Sakshi
నైలు నదీజలాలపై జగడం!
‘ఈజిప్టే నైలు, నైలే ఈజిప్ట్’ అనేది గ్రీస్ చరిత్రకారుడు హెరడోటస్ మాట. ‘ఈజిప్టు నైలు వరప్రసాదమైతే, నైలు ఈజిప్టు వరప్రసాదం’ అనేది గత ఆరుదశాబ్దాలుగా ఈజిప్టు నేతల మాట. ‘నైలు న దీ జలాలపై మా చారిత్రక హక్కులకు భం గం కలగడానికి వీల్లేదు. నీటికి బదులు రక్తాన్ని పారిస్తాం’ అన్నది పదవీచ్యుతుడైన అధ్యక్షుడు అబ్దుల్ ముర్సీ మాట. ఇథియోపియాను ఉద్దేశించి చేసిన హెచ్చరిక అది. ఈజి ప్టుకు పర్యాయపదమనిపించేలా మారిన నైలు నదిలో 22 శాతం మాత్రమే ఈజిప్టులో ప్రవహిస్తుంది. దక్షిణాన ఉన్న ఇథియోపియా, ఉగాండాల నుంచి మొదలై ఉత్తర కొసనున్న ఈజిప్టులోని అలెగ్జాండ్రియా వద్ద మధ్యధరాసముద్రంలో కలుస్తుంది. నదికి ఎగువన ఉన్న ఇథియోపియా, ఉగాండాలు నైలుపై భారీ రిజర్వాయర్లతో కూడిన డ్యామ్‌లను నిర్మించడానికి పూనుకోవడం ఈజిప్టుకు సంకటంగా మారింది. మరో దిగువ  దేశమైనసూడాన్‌తో (నేడు రెండు సూడాన్‌లు) కలిసి అది నైలు జలాల్లో 90 శాతాన్ని వాడుకుంటోంది. ‘నైలు ఈజిప్టు వరప్రసాదం’ అనే మాటల అం తరార్థం ఆ నదిపై తమ ‘చారిత్రక హక్కులు’ అనుల్లంఘనీయమైనవనే. నైలుపై ఈజిప్టు గుత్తాధిపత్యం ఈనాటిది కాదు. ఈజిప్టు జలదోపిడీని ప్రతిఘటించడానికి ఎగువ దేశాలు సిద్ధపడటమూ మొదలుకాదు. అయితే గతంలోలా ఈజిప్ట్ బెదిరింపులకు అవి వెనక్కు తగ్గే పరిస్థితి లేదు. మరోవంక నైలుపై గుత్తాధిపత్యాన్ని సడలించడానికి ఈజిప్టు సిద్ధంగా లేదు.   
 
 ఒప్పందాలను తోసిపుచ్చుతున్న ఎగువ దేశాలు? 
 
చీకటి ఖండంగా నిన్నా, ఆటవిక, ఆకలి ప్రపంచంగా నేడూ ఈసడింపులకు గురయ్యే ఆఫ్రికా, మానవాళిని కన్నతల్లి. ఏడు వేల సంవత్సరాల క్రితం మొగ్గతొడిగిన ప్రాచీన ఈజిప్టు నాగరికతకు ప్రాణం నైలు. చరిత్రాత్మకమైన అశ్వా న్ డ్యామ్‌ను నిర్మించి 1970ల నుంచి ఈజిప్టు వ్యవసాయాన్ని అభివృద్ధి చేసింది. అయినా 50 శాతం ఆహారాన్ని దిగుమతి చేసుకోవాల్సివస్తోంది. తాగు నీటికి నైలే దానికి ఆధారం. 2.1 జిగావాట్ల అశ్వాన్ జలవిద్యుదుత్పత్తి కేం ద్రం దాదాపు సగం దేశానికి విద్యుత్తును అందిస్తోంది. నైలు నదిపై ఇథియోపియా పునరుజ్జీవ డ్యామ్‌ను నిర్మించనున్నట్టు (2011) ప్రకటించి అదే కయ్యానికి కాలు దువ్విందని ఈజిప్ట్ వాదన. 2010 నాటికే ఈ డ్యామ్ విషయాన్ని ఇజ్రాయెల్ ద్వారా తెలుసుకున్న నాటి అధ్యక్షుడు హోస్నీ ముబారక్ దాన్ని బాంబులతో కూల్చేస్తామని హెచ్చరించాడు. సైనిక చర్య కోసం ఇథియోపియా సరిహద్దులలోని సూడాన్‌లో సైనిక స్థావరాలకు సన్నాహాలు చేశా డు.  ఒకవంక ఇథియోపియా తన డ్యామ్ నిర్మాణానికి చురుగ్గా ఏర్పాట్లు చేస్తుండగా ఉగాండా మరోవంక డ్యామ్ నిర్మాణానికి ఉపక్రమించింది. నేటి సైనికపాలనగానీ, అది నిలిపే ప్రభుత్వం గానీ ఈ ధిక్కారంపై భిన్నంగా వ్యవహరించే ఆశలేదు. ఇథియోపియా, ఉగాండాలు అంతర్జాతీయ జలఒప్పందాలను ఉల్లంఘిస్తున్నాయని ఈజిప్ట్ ఆరోపణ. ఉగాండా, ఇథియోపియా, బురుండి, టాంజానియా, కెన్యా తదితర దేశాలు 1990ల నుంచి నైలు జలాల పునఃపంపిణీని కోరుతున్నా నేటికీ అది చెవిని పెట్టడం లేదు. 1959 ఈజిప్టు-సూడాన్ ద్వైపాక్షిక ఒప్పందం ఆధారంగానే 90 శాతం జలాలను రెండు దేశాలు వాడుకుంటున్నాయి.
 
 మానవాళికి తల్లి ఒడి
 
దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రవహించే కొద్ది నదులలో నైలు ఒకటి. ప్రపంచంలోనే అతి పొడవైన (6,670 కిలోమీటర్లు) ఆ నది... లెక్కలేనన్ని చిన్న నదులు, వాటి కలయికతో ఏర్పడ్డ ఉపనదులు, సరస్సులతో పది దేశాలకు విస్తరించింది. టాంజానియా, ఉగాండా, రువాండా, బురుం డి, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, కెన్యా, ఇథియోపియా, ఎరిత్రియా, దక్షిణ, సూడాన్, ఈజిప్టులలోని 30 కోట్లకు పైగా ప్రజలకు జీవజలాలను అందిస్తోంది. టాం జానియా, కెన్యా, ఉగాండా సరిహద్దులలోని విక్టోరియా సరస్సు నుంచి నైలు ప్రధాన ఉపనదులు రెంటిలో ఒకటైన తెల్ల నైలు ప్రారంభమవుతుంది. ఆ తెల్ల నైలు మీదే ఉగాం డా డ్యామ్‌ల నిర్మాణానికి పూనుకుంది. ఉగాండా నుంచి తెల్ల నైలు డీఆర్ కాంగో, దక్షిణ సూడాన్‌ల మీదుగా సూడా న్ చేరుతుంది. రాజధాని ఖార్తుమ్ వద్ద మరొక గొప్ప ఉపనది నీలి నైలుతో కలిసి నైలుగా మారుతుంది. ఉగాండా డ్యామ్‌ల వల్ల నైలు నదికి వచ్చి చేరే నీరు తగ్గిపోతుంది. ఇక ఇథియోపియాలోని టానా సరస్సు నుంచి నీలి నైలు మొదలవుతుంది. అది సూడాన్ చేరి ఖార్తూమ్‌లో తెల్ల నైలుతో సంగమిస్తుంది. నైలు నదికి ఇథియోపియా 85 శాతం నీటిని సమకూరుస్తుంది. కీలకమైన నీలి నైలుపైనే ఇథియోపియా పునరుజ్జీవ నిర్మాణం డ్యామ్‌కు ఏర్పాట్లు సాగుతున్నాయి. అది పూర్తయితే ఈజిప్టుకు చేరే నీటికి భారీగా గండి తప్పదు. నైలు నదిపైనే పూర్తిగా ఆధారపడి ఉన్న ఈజిప్టుకు ఈ పరిస్థితి ప్రాణ సంకటమే. మరోవంక ఇథియోపియా, ఉగాండా తదితర దిగువ దేశాల్లో ఎడారిలాంటి ప్రాంతాలే ఎక్కువ. అవి తరచుగా కరువు కాటకాలకు గురవుతూ ఆకలితో అలమటించే దేశాలు. ఆకలి మంటలతో వెనుకబాటుతనంతో అలమటించడమా లేక నైలు జలాలలో న్యాయమైన వాటా కోసం ఈజిప్టుతో తలపడటమా అనే సంకటం వాటిది. 
 
 చైనా రంగప్రవేశం... ఏకాకి ఈజిప్టు 
 
సూడాన్, ఈజిప్ట్, ఎరిత్రియాలు నదికి దిగువ దేశాలు.  టాంజానియా, చాద్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, ఉగాం డా, రువాండా, బురుండి, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాం గో, కెన్యాలలో కురిసే వర్షాలే నైలు నదికి జలకళను కలగజేస్తాయి. కెన్యా, ఇథియోపియా సరిహద్దులలో ఉన్న ప్రపంచంలోని నాలుగో పెద్ద ఉప్పునీటి సరస్సు తుర్కానా కూడా నైలు జల వ్యవస్థలో భాగమే. నైలు ఆరణి ప్రాంత నదులు ఆ సరస్సు నీటిని తాగుయోగ్యంగా చేశాయి. అత్యుష్ణప్రాంతమైన ఎడారి లాంటి తుర్కానాలోనే తొలి మానవ ఆవిర్భావం జరిగిందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. అందుకే దానికి మానవ జాతి తల్లి ఒడిగా పేరు. నైలు దేశాలన్నీ చర్చల ద్వారా న్యాయమైన జలపంపిణీ చేపట్టాలన్న ఎగువ దేశాల డిమాండు చెవిటి వాడి ముందు ఊదిన శంఖమే అవుతోంది. 2010లో పది నైలు దేశాలతో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో జలాల పంపిణీ, అభివృద్ధిపై సహకార ఒప్పందం (సీఎఫ్‌ఏ)  కుదిరింది. దాన్ని ఈజిప్టు, సూడాన్ తిరస్కరించాయి. నైలుపై నిర్మించే ప్రాజెక్టులపై తనకు వీటో హక్కు ఉండాలని ఈజిప్ట్ డిమాండ్ చేసి ఏకాకిగా మారింది. అమెరికాకు నమ్మకమైన మిత్రులుగా ఇజ్రాయెల్‌తో చేయి కలిపిన అన్వర్ సాదత్, ముబారక్‌లు తోటి ఆఫ్రికా దేశాలతో సంబంధాలను చిన్నచూపు చూశారు. అమెరికా సహాయంతో ఇతర దేశాలు తలపెట్టిన ప్రాజెక్టులకు నిధులు, నిర్మాణ సహాయం అందకుండా నిరోధించగలిగారు. నేడు ఆ పరిస్థితులు లేవు. పైగా చైనా ఆఫ్రికాలో కీలక పాత్రధారిగా మారింది. ఆఫ్రికా ఖండంలో అది మొత్తం 70 చిన్న, పెద్ద డ్యామ్‌ల నిర్మాణం చేపట్టింది. అదే ఇప్పుడు ఇథియోపియా డ్యామ్‌ను నిర్మిస్తోంది. 
 
అక్కడ ఉత్పత్తయ్యే 45 వేల మెగావాట్ల విద్యుత్తును టాంజానియా, కెన్యా తదితర నైలు దేశాలకు సరఫరా చేసే ప్రాతిపదికపై ఇథియోపియా వాటినుంచి నిధులను సేకరిస్తోంది. తద్వారా ఇథియోపియా ప్రాంతీయశక్తిగా ఎదగాలని ప్రయత్నిస్తోంది. ఇథియోపియా, సోమాలియాలలో అమెరికా సాగిస్తున్న ‘ఉగ్రవాద వ్యతిరేకయుద్ధం’లో ఇథియోపియా ప్రభుత్వం కీలక భాగస్వామి. ఈజిప్టు బెది రింపులకు బెదిరే కాలం చెల్లిపోయింది. ఈ పరిస్థితుల్లో ఉగాండా కూడా ఇథియోపియా బాటనే పట్టింది. ఈజిప్ట్ ఇప్పటికైనా నైలు జలాల న్యాయమైన పంపిణీకి అంగీకరిస్తే ఇతర దేశాలు సర్దుబాటు చేసుకోడానికి సిద్ధంగా ఉన్నాయి. అదే జరిగినా... వాతావరణ మార్పుల కారణంగా ఆఫ్రికాలోని పెద్ద నదులన్నీ జలకళను కోల్పోతున్నాయి. 2025 నాటికి ఆఫ్రికా ఖండంలో కనీసం సగం జనాభాకు తాగునీరు కరువవుతుందని అంచనా. ఈ పరిస్థితుల్లో నైలు నీళ్లతో దేశాన్ని సస్యశ్యామలం చేయాలన్న ఎగువ దేశాల ఆశలకు, సస్యశ్యామలమైన భూములన్నీ ఎడారిగా మారి, నీటి చుక్కకు అలమటించాలన్న ఈజిప్ట్ భయాలూ కలిసి ఒక మహా విషాదాన్ని, నిస్సహాయతను, తప్పనిసరి సంఘర్షణను సూచిస్తున్నాయి. మనిషి తనకు తానే సృష్టించుకున్న ఆ మహా విషాద పర్వం తల్లి ఒడిలోనే మొదలు కాబోతుందా?
 -పిళ్లా వెంకటేశ్వరరావు
 
మరిన్ని వార్తలు