ఆశాదేవి (నిర్భయ తల్లి) రాయని డైరీ

20 Dec, 2015 09:17 IST|Sakshi
ఆశాదేవి (నిర్భయ తల్లి) రాయని డైరీ

నేరము-శిక్ష! చట్టానికి ఇంతవరకే తెలుసు. మహామహులు దీర్ఘంగా ఆలోచించి, ఆ ఆలోచనల్ని పెద్ద బౌండ్ బుక్కులా కుట్టి, దానికో గట్టి అట్ట వేసి, అల్మరాలో భద్రంగా పెట్టి వెళ్లిన చట్టానికి ఇంతవరకే తెలుసు. పుస్తకంలో ఏ నేరానికి ఏ శిక్ష రాసి ఉంటే ఆ శిక్షను వేసి చేతులు దులుపుకుంటుంది చట్టం. పుస్తకానికి అంటుకుని ఉన్న దుమ్మును మాత్రం దులపదు. చేతులు దులుపుకున్నాక పుస్తకాన్ని దులిపితే మళ్లీ ఆ దుమ్ము తన చేతులకు అంటుకుంటుందనేమో.. తిరిగి ఆ పుస్తకాన్ని ముట్టుకోదు. తిరిగి ఆ పుస్తకాన్ని తిరగేయదు. తిరిగి ఆ పుస్తకాన్ని తిరగరాయదు. ఎప్పుడో ఇంకో నేరస్థుడు వస్తాడు. అప్పుడే ఆ పుస్తకమూ బయటికి వస్తుంది.

 నేరస్థుడిని బోనులో నిలబెట్టాక న్యాయకోవిదులు వాదనలు వినే చట్టం ఒకటి, నేరస్థుడిని విడిపించుకోడానికి కోర్టు మెట్లు ఎక్కి వస్తూ న్యాయవాదులు తమ వెంట తెచ్చుకునే చట్టం ఒకటి. వాదనల కోసం రాసుకున్న ఈ పుస్తకాలలో వేదనలకు ఉపశమనాలుంటాయా?! ఉంటే ఈ తీర్పులు ఇలా ఉంటాయా?

 నేరస్థుడిని విడుదల చేస్తున్నారట! ఇవాళో రేపో బయటికి వస్తాడట. ‘పిల్లవాడు’ అని వదిలేస్తున్నారట! అలా అని చట్టంలో ఉందట! మృగాన్ని బయటి ప్రపంచంలోకి వదిలిపెడితే మనుషులు ఏమైపోతారోనని చట్టం ఆలోచించడం లేదు. మృగానికి మనుషులెక్కడ హాని తలపెడతారోనని ఆలోచిస్తోంది! మనుషుల్లోకి  వెళ్లబోతున్న మృగం.. మనిషిలా మారడానికి చేయవలసిన ఏర్పాట్ల గురించి ఆలోచిస్తోంది! ఆ మృగం చేత టైలరింగ్ షాపు పెట్టిస్తోంది. ఆ షాపుకో సైన్ బోర్డు రాయిస్తోంది. షాపులోకి టైలరింగ్ మెటీరియల్‌ని, రసీదు పుస్తకాలను తెప్పిస్తోంది. షాపు ప్రారంభోత్సవానికి తప్పనిసరిగా ముఖ్యమంత్రి కూడా వెళ్లి తీరాలన్న రూలు చట్టంలో లేదేమో మరి! ఇన్నాళ్లూ చట్టం ఆ మృగం పేరును మాత్రమే దాచిపెట్టింది. ఇప్పుడు ఆ మృగాన్నే దాచిపెడుతోంది.

 నాకైతే ‘చట్టం’ అనే పుస్తకాన్ని కడిగిపారేయాలనిపిస్తోంది. నా కూతురు.. మా జీవనజ్యోతి.. ప్రాణాలతో పోరాడి పోరాడి, ఆశలలో రెపరెపలాడి ఆడి, ఆరిపోయాక.. ఈ ప్రపంచమే నాకు ధైర్యం చెప్పింది. చెంతకొచ్చి కన్నీళ్లు తుడిచింది. చనిపోయిన నా కూతురికి నామకరణం చేసింది. ఇక నుంచీ ప్రతి కూతురి పేరూ ఇదేనని ఇల్లిల్లూ ప్రతిధ్వనించేలా చెప్పింది. నిర్భయంగా చదువుకొమ్మని, నిర్భయంగా ఉద్యోగాలు చేసుకురమ్మని ఆడపిల్లలకు చెప్పింది. మీ కూతుళ్లను నిర్భయంగా బయటికి పంపండని కన్నవాళ్లకు చెప్పింది. కన్నబిడ్డను పోగొట్టుకున్న తల్లి పడే ఆవేదన లోకంలో ఎవరూ తీర్చలేనిదని తీర్పునిచ్చింది. ఆ మాత్రం తీర్పును ఈ చట్టం ఇవ్వలేకపోయింది!

 కడుపు రగిలిపోతుంటే.. నాకివాళ కన్నీళ్లు ఉబికి ఉబికి వస్తున్నాయి. కన్నీళ్లతో కడిగితే చట్టం ప్రక్షాళన అవుతుందా? ఓ తల్లి కన్నీళ్లకు కరిగిపోయేంత మానవీయత ఈ చట్టానికి ఉందా? చట్టాలను తీర్చిదిద్దడానికి మహామహులు మాత్రమే సరిపోరు. వారిలో మహనీయులు కూడా ఉండాలి.
                                                                                                                                                     -మాధవ్ శింగరాజు

మరిన్ని వార్తలు