మన నవలలు: అసందిగ్ధ జీవితపు అగమ్య ప్రయాణం

15 Mar, 2014 00:17 IST|Sakshi
మన నవలలు: అసందిగ్ధ జీవితపు అగమ్య ప్రయాణం

దేవుడికి లోబడిపోదాం. ఈశ్వరా... అంతా నువ్వే చూసుకో తండ్రీ. సంతోషంగా ఉంటున్నామా? అంతా అనుకున్నట్టుగా జరుగుతోందా? అంతా మంచే సంప్రాప్తిస్తోందా. లేదే! పోనీ ప్రకృతికి లోబడిపోదాం. ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై... స్వచ్ఛంగా పవిత్రంగా హాయిగా... సంతోషంగా ఉన్నామా? పేదరికం... దరిద్రం... ఆకలి... విషజ్వరాలు. సరే. ఉద్యమానికి లోబడిపోదాం. చిత్రం. ఒక వీరుడు మంటల్లో. ఒక ఉపన్యాసకుడు అందలం మీద. సమానమైన ప్రతిఫలమేనా ఇది? మరి హేతువాదానికి లోబడటమే మేలు. దేవుడూ లేడూ దెయ్యమూ లేదు. మంచిదే. కాని ప్రతిదానికీ మనసు పీకుతూ ఉందే. ఏ నమ్మకమూ లేని బతుకు. మార్క్స్‌ను పట్టుకొని ఆ దారిలో? స్థిరం లేదు. హిట్లర్‌ను పట్టుకొని ఈ దారిలో? శాంతి లేదు.  ఇంతకీ ఏ దారిలో వెళితే ఈ జీవితం సంతోషంగా ఉంటుంది? అసలు ఏ దారిలో వెళ్లినా సంతోషం దొరకని జీవితంలో అసందిగ్ధతను మోస్తూ బతకడం ఎట్లా?
           
 మధు కోరుకున్నదల్లా ఎంఏలో క్లాసు రావడం. ఆ తర్వాత ఏదో ఒక ఉద్యోగం. ఆ తర్వాత ఉన్నంతలో జీవితం. అతడు ఊహించింది ఇంత వరకే. అతని ఇంగితానికి దొరుకుతున్న జీవితమూ ఇంత వరకే. ఇంతకు మించి లేదు. ఎందుకంటే జీవితం గురించి ఆలోచించాలంటే అతడికి భయం. దాని గురించి ఆలోచించాలంటే ముందు అతడు తన తల్లి గురించి ఆలోచించాలి. ఆమె ఊళ్లో ఉంటుంది. తను హైదరాబాద్‌లో. ఊళ్లో ఉన్న తల్లి తను ఊహించిన తల్లిలానే ఉందా? ఏం లేదు. చిన్న వయసులోనే భర్త పోయాడని ఎవరితోనో సంబంధం పెట్టుకుంది. అదీ అన్యకులం వాడితో.
 
 ఆమెకు వచ్చిన పరిస్థితులు అలాంటివి. ఆమె దృష్టిలో నుంచి చూసినప్పుడు సమర్థనీయం. తన దృష్టిలో నుంచి చూస్తే కాదు. కాని ఆమె జీవితాన్ని తను వ్యాఖ్యానించాల్సి రావడమే ఇబ్బంది కదా. మరి తను ఆమెకు పుట్టిన కొడుకు. ఇద్దరి జీవితాలకూ సంబంధం ఉంది. కాని విడివిడిగా చూస్తే ఎవరి జీవితం మీద వారికి హక్కు ఉండొద్దా? ఈ కలివిడి, విడివిడి పరిస్థితి మీద మధుకు అయోమయం ఉంది. అందుకే జీవితం వైపు కన్నెత్తి చూట్టానికి అతడికి భయం.
 
 సరే. పట్నంలో ఖాళీగా ఉండటం ఎందుకని చదువుకు నాలుగు డబ్బులు అక్కరకొస్తాయని జాగీర్దారు ఉమామహేశ్వరరావు ఇంట్లో ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకున్నాడు. ఈ జాగీర్దారు ఎలా ఉంటాడో ఎవ్వరికీ తెలియదు. ఎక్కడో తాగి తందనాలాడుతుంటాడట. అప్పటికే జాగీర్ పోయింది. కాని ఈలోపే ఆయన అక్కగారు మేలుకొని ఆ వచ్చే నష్టపరిహారం జాగ్రత్త చేయడంతో పరిస్థితికి కొదవ లేకుండా ఉంది. ఇంట్లో ఆ అక్కగారు. ఆమె కూతురు నళిని. జాగీర్దారు కూతురు కుసుమ, ఇంకా పసితనం వీడని కుమారుడు కిశోర్.  ఈ కిశోర్‌కు నాలుగు పాఠాలు చెప్పి కాసింత కాలక్షేపం చేద్దామనుకొని ఆ ఇంట అడుగుపెట్టాడు మధు.
 
 కాని జరిగిందేమిటి? జీవితం అతణ్ణి చేర్చిన దరి ఏమిటి? మొదట కుసుమ ఆకర్షణలో పడ్డాడు. కుసుమ ఇతడి ఆకర్షణలో పడింది. ఇద్దరూ సికిందరాబాద్ ప్యారడైజ్ టాకీస్‌లో ‘నౌరంగ్’ సినిమాకు వెళ్లి బాక్స్‌లో కూచుని ఆ చీకటిలో ఒకరినొకరు ముద్దులు పెట్టుకున్నారు. నళిని ఇందుకు పరోక్షంగా సహకరించింది. అంతా కుదిరితే కుసుమకు, మధుకు వివాహం. ఇంతలో ఏదో జరిగింది. ఏం జరిగింది? ఒకరోజు సాయంత్రం కుసుమను మధు గట్టిగా కావలించుకున్నాడు. గాజులన్నీ పగిలిపోయాయి. ఒక గాజుముక్క గుచ్చుకుని మధు ఛాతీలో చిన్నబొట్టు చిమ్మింది. తలెత్తి చూస్తే ఆ ప్రణయచేష్టలో ఆమె బొట్టు చెరిగిపోయి ఉంది.
 
వెల్లువలో పూచికపుల్లలు  
 నవల: వెల్లువలో పూచికపుల్లలు; రచయిత: భాస్కరభట్ల కృష్ణారావు; తొలి ప్రచురణ: 1960
 తెలుగులో అస్తిత్వవాదాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన నవల. పాఠకులను ఒక కొత్త ఎరుకలోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించిన నవల. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ప్రాంతానికి చెందిన భాస్కరభట్ల కృష్ణారావు కథా రచయితగా, నవలా రచయితగా సుప్రసిద్ధులు. మధ్యలో ఆయన రచనలు కనుమరుగైనా ఇటీవల పుస్తకాలుగా వెలువడటం వల్ల ఆయన ప్రతిభ కొత్త తరాలకు పరిచయం చేయడం వీలవుతోంది. భాస్కరభట్ల చిన్న వయసులో మృతి చెందకపోయి ఉంటే మరిన్ని గొప్ప రచనలు చూసి ఉండేవాళ్లం. ఆయన రచనలు రెండు వాల్యూములు విశాలాంధ్రలో లభ్యం. ఆయన ‘యుగసంధి’ నవల తెలంగాణ జీవితానికి దర్పణం.

బొట్టు చెరగడం... గాజులు పగలడం... దేనికి సంకేతం? ఇద్దరి మనసూ వికలమైంది. బుద్ధి- ఇది మామూలు ఘటన అంటోంది. హృదయం- దుశ్శకునాన్ని సూచిస్తోంది. ఇద్దరూ తాత్కాలికంగా దూరమయ్యారు. ఈలోపు అక్కగారు గుండెజబ్బుతో గుటుక్కుమంది. లంకంత కొంప. మగతోడు లేదు. తల్లి పోయిన దుఃఖంలో నళిని ఏడ్చి ఏడ్చి సున్నమవుతుంటే ఆ సాయంత్రం ఆమెను ఉపశమింపజేయడానికి మధు గండిపేట తీసుకెళ్లాడు. అప్పటికే చీకటయ్యింది. వెన్నెల పూస్తోంది. తోటలో పూలూ మకరందమూ మత్తెక్కించే గాలి తప్ప వేరే ఏం లేదు. ఒకవైపు ఏకాంతం. మరోవైపు యవ్వనం. జరగాల్సింది జరిగిపోయింది. మరో రెండు వారాలకు ఇద్దరికీ పెళ్లయిపోయింది!
 
 ఆశ్చర్యమే ఇది. ట్యూషన్ చెప్పడానికి వచ్చినవాడు ఆ ఇంటి అల్లుడయ్యాడు. కాకపోతే ఒకరిని అనుకొని మరొకరిని చేసుకున్నాడు. ఇందులో తన తప్పు ఉందా? తన తప్పు ఏం ఉంది? పరిస్థితులు అలా తోసుకొచ్చాయి. ఆ పరిస్థితులకు తగినట్టుగా తాను వ్యవహరించాడు. అంతే. అయితే జీవితం ఇలా ఉంటుందని కుసుమకు తెలియదు. తాను వలచినవాడు తన కళ్లెదురుగా మరొకరికి భర్త అవుతాడని ఆమె ఊహించలేదు. అందుకే స్తబ్దుగా అయిపోయింది. ఎంత స్తబ్దుగా అంటే మామూలు ప్రపంచం నుంచి దాదాపుగా విరమించుకుంది.
 
 మతిభ్రమణం! పిచ్చి! ఆమె వైపు నుంచి చూస్తే నళినికి, మధుకు గిల్ట్. కాని తమ వైపు నుంచి చూస్తే తామే తప్పూ చేయలేదు. మరికొన్నాళ్లకు తాగీ తాగీ జాగిర్దారు పోయాడు. లంకంత కొంప దెయ్యాల కొంపలా మారింది. అక్కగారు లేదు. అయ్యగారు లేడు. ఒక కూతురుకి పిచ్చిపట్టింది. కిశోర్ ఇంకా పసివాడే. ఈ పరిస్థితుల్లో నళినికి, మధుకి ఏం సంతోషం ఉంటుంది? ఒక బిడ్డ పుట్టాడు. జీవితం మళ్లీ వెలిగింది. అమ్మయ్య జీవితంలో ఏదో ఒక పద్ధతి ఉన్నట్టే ఉంది అనుకున్నాడు మధు. నాలుగు రోజులు గడిచాయి. ఈ ఇల్లు బాగలేదని కొత్త ఇంట్లోకి మారదామని భారీ ఇంటికి నళిని ప్రణాళిక వేసింది.
 
 అందమైన భవిష్యత్తు కోసం కలలు. ఇంతలో ఆమెకు మళ్లీ గర్భం వచ్చింది. కాని ఈసారి జీవితం వెలగలేదు. ఆరిపోయింది. ఆ గర్భమే నళినిని ఈలోకం నుంచి తీసుకెళ్లిపోయింది. చీకటి. మధు జీవితంలో కటిక చీకటి. అంతా చేసి మూడేళ్లు. మూడేళ్ల క్రితం అతడో మామూలు కుర్రవాడిగా ఒక ట్యూషన్ మాస్టారుగా ఆ ఇంట అడుగుపెట్టాడు. మూడేళ్లు ముగిసేసరికి  కొన్ని సంయోగాలని కొన్ని వియోగాలని కొన్ని ఆనందాలని కొన్ని భయంకరమైన విషాదాలని కొన్ని తనకు నిమిత్తమైన సంగతులని కొన్ని తన ప్రమేయం లేకుండా జరిగిపోయిన సంఘటనలని అన్నీ చూసేశాడు. ఇంత చూశాక అతడికి మళ్లీ సందేహం వచ్చింది. ఇంతకీ జీవితం అంటే ఏమిటి? నవల ముగిసింది.
           
 ‘కేవలం నీ చర్యలకు నువ్వు బాధ్యత వహిస్తూ పర్యవసానం ఏమిటో తెలియకుండా గమ్యం ఎటో తెలియకుండా జీవితాన్ని నిర్వహించుకుంటూ వెళ్లడం ఏ మనిషికైనా చాలా బరువుతో కూడుకున్న పని’- అస్తిత్వవాదానికి ఒక వ్యాఖ్యానం ఇది. మనిషి ఒక ఉనికి అయితే అతడి జీవితం ఏ ఉనికి ఆధారంగా నడుస్తుంది? దైవం ఉంది అనుకుంటే అంతా మంచే జరగాలి. జరగడం లేదు. దైవం లేదు అనుకుంటే అంతా చెడే జరగాలి. అలా జరగడం లేదు. పోనీ జీవితం ఇలా ఉంటుందని ఊహిస్తే అలా ఉండటం లేదు. అసలేమీ ఊహించకుండా ఊరుకుంటే జడత్వం వల్ల కదలడం లేదు. చలనం కావాలి. కాని అది మనం కోరుకున్నట్టుగా కావాలి అనుకోవడం అసాధ్యం. అసంభవం. అంటే జీవిత గమనం, ప్రపంచ గమనం ఒక అసంబద్ధం. అబ్సర్డ్. అందువల్ల అది ఎలా ఎదురుపడితే అలా స్వీకరించడమే చేయదగ్గది. జీవితాన్ని జీవించడమే, నిండుగా ఎదుర్కొనడమే చేయదగ్గది. దాన్నుంచి ఆశించినా భంగమే. దానికి దూరంగా పారిపోయినా నష్టమే. దాంతో పాటు నడుస్తూ మన ఉనికికి,  
 
 చేష్టలకు బాధ్యత వహిస్తూ ఫలితంగా వచ్చే ఇష్ట/అయిష్టమైన  పర్యవసానాలను సమైక్య దృష్టితో చూస్తూ ముందుకు సాగితే కొంత నయం. ఇలాంటి భావజాలాన్ని ‘అస్తిత్వవాదం’ పేరుతో కిర్క్‌గార్డ్‌లాంటి తత్త్వవేత్తలు ప్రవేశపెడితే జీన్ పాల్ సార్త్,్ర ఆల్బర్ట్ కామూలాంటి వాళ్లు సాహిత్యంలో ప్రవేశపెట్టి జగద్విదితం అయ్యారు. తెలుగులో అలాంటి భావజాలాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టడం, అదీ ఒక శక్తిమంతమైన నవలగా తీర్చిదిద్దడం రచయిత భాస్కరభట్ల కృష్ణారావు సాధించిన ఘనత. ఈ నవలలో పాత్రలు అంతవరకూ వచ్చిన నవలల్లోలాగా కంట్రోల్డ్‌గా ఉండవు. తాము ఊహించినట్టుగా ఉంటూ జీవితాన్ని తాము ఊహించినట్టుగా ఉంచుకోవు. సహజంగా ఉంటాయి. పరిమితులకు బాహ్యంగా వ్యవహరిస్తాయి. పరిస్థితులు తోసుకొచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి మల్లే వెల్లువలో పూచికపుల్లల్లా కొట్టుకుపోతాయి. ప్రతి వ్యక్తి ఒక ఇండివిడ్యువల్.
 
 అతని జీవనసూత్రాలకీ మరొకరి జీవనసూత్రాలకీ పోలిక లేదు. అంటే ఎవరినీ దేనినీ వ్యాఖ్యానించడానికి ఒక కచ్చితమైన కొలబద్ద ఉండదు. ఒక రకంగా చూస్తే మధు తల్లి చేసింది ఒప్పు. మరో రకంగా చూస్తే మధు అభ్యంతరపడటం కూడా ఒప్పు. కాని ఒక తప్పుకు రెండు ఒప్పులు ఎలా ఉంటాయ్? అది ఆలోచించాలి. దేనికైనా ఒక మోడల్ అంటూ ఉంటే ఆఖరుకు విజేతలు, శ్రీమంతులు, ప్రపంచాధిపతులు కూడా అశాంతితో ఎందుకు ఉన్నారు? అది ఆలోచించాలి. అంటే ఏమిటి? ప్రతి ఒక్కరిని పట్టి కుదేలు చేయడమే జీవితం పని. ఆ ఎరుక కలిగించే నవల ఇది. జీవితంలో డిస్టర్బెన్స్ ఉండటం గురించి కాకుండా అసలు డిస్టర్బెన్సే జీవితం అనే అవగాహన కలిగించి పాఠకులకు తమ జీవితాన్ని ఎదుర్కొనడం నేర్పే ఉత్కృష్టమైన నవల.  అసలు సిసలు తెలుగు నవల.                    

మరిన్ని వార్తలు