తొలకరి పలకరింత దూరం

29 Mar, 2016 00:56 IST|Sakshi
తొలకరి పలకరింత దూరం

తెలుగు రాష్ట్రాలు సహా సహా ప్రపంచాన్ని ఆవరిస్తున్న తీవ్రాతి తీవ్ర ఉష్ణోగ్రతల ప్రభావాన్ని తక్కువ అంచనా వేయకూడదు. మన దేశంలో దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి మరింత ఘోరంగా ఉండబోతోంది. వ్యవసాయ శాస్త్రజ్ఞుల తాజా అంచనాల ప్రకారం ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ నాటికి కానీ తెలుగు రాష్ట్రాలలో తొలకరి  పలకరింతలు లేకపోవచ్చు. ఆగస్టు వరకు ఎల్-నీనో పరిస్థితులు హెచ్చుతగ్గులు లేకుండా కొనసాగి, సెప్టెంబర్‌కుగానీ వానలు కురవకపోవచ్చనే వాదనా వినవస్తోంది.
 
 ప్రసిద్ధ వ్యంగ్య చిత్రకారుడు దీపాంకర్ భట్టాచార్య వికటిస్తున్న ప్రపంచ వాతావరణ, పర్యావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రజాబాహుళ్యానికి వారి వృత్తులకు, వ్యావృత్తులకు శరవేగాన ముంచుకొస్తున్న ప్రమాదం గురించి హెచ్చరికగా ఇటీవల ఒక వ్యంగ్య చిత్రం గీశాడు. వర్షాలు దూరమై, నదీనదాలు, చెరువులు, వాగులూ వంకలూ ఎండిపోతున్న దుస్థితిలో చేపల వేటకని వెళ్లిన నిరుపేద బెస్తవారు... నీరు ఇంకిపోగా ప్రాణావస్థలో కొట్టుమిట్టాడుతున్న చేపలను చూసి విలవిలలాడుతున్న దృశ్యమది. చేపలకే కాదు, అసలు మానవుల మనుగడకే ఎన్నడూ లేని ఒక పెను ఉపద్రవాన్ని వాతావరణ, పర్యావరణ శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. గత 2,800 సంవత్సరాలలో ఎన్నడూ లేనంత శరవేగంతో సముద్ర మట్టాలు పెరిగిపోయాయని శాస్త్రవేత్తల తాజా అంచనా.
 
 మానవుల కార్యకలాపాలతో ప్రమేయం లేకుండానే వాతావరణ మార్పుల వల్ల ఈ కాలంలో కొన్ని సందర్భాల్లో సముద్ర మట్టాలు పడిపోయి ఉండవచ్చు. కాని 1900 నుంచి 2000 సంవత్సరం మధ్య మాత్రం సముద్ర మట్టాలు ప్రపంచవ్యాపితంగానే 5.5 అంగుళాలు (14 సెంటీ మీటర్లు) పెరిగాయి. అయితే అంతకు ముందటి శతాబ్దంలో ప్రపంచ వ్యాపితంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయే వైనం మందకొడిగా సాగడం సముద్ర మట్టాల పెరుగుదల వేగాన్ని మనం గమనించకపోవడానికి కారణమని నిపుణుల అంచనా. ఈ తాజా అధ్యయనాన్ని, నివేదికను రట్జర్స్ యూనివర్సిటీ పరిశోధక బృందం నిర్వహించింది.
 
 ఉష్ణోగ్రతలకు కళ్లెం వేస్తేనే జీవరాశి మనుగడ
 ప్రపంచ వ్యాపితంగా ఉష్ణోగ్రతలు ఇప్పటిలా ఉగ్రాతిఉగ్రంగా లేనందువల్లే సముద్రమట్టాల పెరుగుదల గత శతాబ్దంలో 1.2 అంగుళాలు (3 సెంటీ మీటర్లు) మేరకే పరిమితమైనాయని తేల్చారు. 20 శతాబ్దిలో సముద్రమట్టాల పెరుగుదల గత 3 వేల సంవత్సరాలలో నమోదైన మట్టాల పెరుగుదలతో పోల్చితే అసాధార ణమైనదని భావిస్తున్నారు. ఇక గత 20 ఏళ్ల వ్యవధిలోని సముద్ర మట్టాల పెరుగుదల అత్యంత వేగవంతమైనదిగా నమోదైందని భూ-ఖగోళ శాస్త్రాధ్యయన సంస్థ నిపుణుడు ప్రొఫెసర్ రాబర్ట్ కోప్ వెల్లడించాడు. ఈ లెక్కన భూగర్భ ఇంధన శిలాజాలపైన ప్రపంచ దేశాలు అధికాధికంగా ఆధారపడితే ఈ 21వ శతాబ్దిలోనే ప్రపంచ సముద్ర మట్టాలు 1.7 నుంచి 4.3 అడుగుల ఎత్తుకు (50 నుంచి 130 సెంటీమీటర్లు) పెరిగిపోయే ప్రమాదం పొంచి ఉందని ప్రసిద్ధ పరిశోధకుల అంచనా (23-02-2016). అలా కాకుండా, ఒకవేళ ఈ ఇంధన శిలాజాలను ఒక్కసారిగా కాకుండా దశలవారీగా తవ్వి వాడకంలోకి తెచ్చినా సముద్రమట్టాలు ఈ శతాబ్ది ఆఖరికల్లా 0.8 నుంచి 2 అడుగుల  వరకూ పెరుగుతాయని అంచనా.
 
 ఇప్పటికే 19వ శతాబ్దినాటి కన్నా ప్రపంచ వ్యాపిత సగటు ఉష్ణోగ్రతలు ఒక డిగ్రీ (సెల్సియస్) ఎక్కువగా నమోదైనాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 24 ప్రదేశాలలో గత 300 ఏళ్లలోని సముద్రపు అలల ఉధృతికి సంబంధించిన అధ్యయన రికార్డుల ఆధారంగా ఈ అంచనాలు కట్టారు. బొగ్గుపులుసు వాయువులు (గ్రీన్ హౌస్ గ్యాసెస్), ఇతర విషపదార్థాలను వాతావరణంలోకి విసర్జించిన ఫలితంగా శృతిమించుతున్న ఉష్ణోగ్రతలు అదుపు కానంతవరకూ మానవుల ఉనికికి, పాడిపంటలకు, పశుపక్ష్యాదులకు ఒక్కమాటలో యావత్ జీవరాశి మనుగడకు హామీ లేదని శాస్త్రవేత్తలు పదేపదే హెచ్చరిస్తున్నారని మరవరాదు.
 
 దక్షిణాది రాష్ట్రాలకు మరింత ముప్పు   
 ఈ పూర్వరంగంలోనే, నేడు భారత ఉపఖండం సహా ప్రపంచాన్ని ఆవరిస్తున్న తీవ్రాతితీవ్ర ఉష్ణోగ్రతల (రెండు తెలుగు రాష్ట్రాలు సహా 44 నుంచి 50 డిగ్రీల సెంటీగ్రేడ్ దాకా) ప్రభావాన్ని తక్కువ అంచనా వేయకూడదు. పసిఫిక్ మహా సముద్రం కేంద్రంగా ఏర్పడిన ‘ఎల్-నీనో’, ‘లా-నీనో’ అనే రెండు వాతావరణ వ్యవస్థలూ హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రాలపై కొన్నేళ్లుగా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎల్-నీనో వల్ల కరువు కాటకాలు సంభవిస్తే, లా-నీనో వల్ల అసాధారణ వర్షపాతం లేదా వరదలు, సునామీలు సంభవిస్తాయి. ఎప్పటికప్పుడు ఇదిగో వర్షం, అదిగో వర్షం అని వాతావరణ  శాఖలు వ్యవసాయదారులను, ఇతర వృత్తిజీవుల్ని బుజ్జగించ చూస్తున్నా, అసలు వాస్తవం వేరుగా ఉంటోంది.
 
 ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలకన్నా  దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి మరింత ఘోరంగా ఉండబోతోంది. ప్రతి ఆరేళ్లకూ వర్ష రుతువు వెనకబడిపోతూ వ్యవసాయ రంగాన్ని రైతాంగాన్ని, వృత్తిదారులమీద ‘సమ్మెట’ దెబ్బలు పడబోతున్నాయి. పాలకులు అధికారానికి రావడానికి ముందు రైతు రుణాలు మాఫీ చేస్తామని ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయి. ‘వ్యవసాయం దండగ’ని, కార్పొరేట్ వ్యవసాయానికి తాకట్టు పడిపొమ్మని హితవులు చెప్పిన ముఖ్యమంత్రులున్న చోట నిరంతర దుర్బిక్ష పరిస్థితులు గతంలోనూ తాండవించాయి. అధికారం కోసం తెలుగుజాతిని విడగొట్టినాగానీ, దుర్భిక్షం పాలకుల్ని వెన్నాడుతూనే ఉంది. నిజానికి జూలై-ఆగస్టులలోనైనా కనీసం 70 శాతం వర్షపాతం ఆశిస్తున్నాం.
 
 కానీ, నిపుణ వ్యవసాయ శాస్త్రజ్ఞుల తాజా అంచనాల ప్రకారం ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ నాటికి కానీ రైతు, వ్యవసాయ కార్మికులను తొలకరి పలకరించే అవకాశం లేకపోవచ్చు. ఈసారి వర్షాలు సెప్టెంబర్‌లో గానీ కనికరించక పోవచ్చనీ, కరువు పరిస్థితులకు కారణమయ్యే ఎల్-నీనో ఇప్పుడిప్పుడే తోకముడుస్తుందా, లేదా? అని శాస్త్రవేత్తలు నిక్కచ్చిగా చెప్పలేకపోతున్నారు. వర్షాలు ‘రావొచ్చు’, ‘రాకపోవచ్చు’ననే కొత్త భాషకు వారూ అలవాటుపడుతున్న ఘడియలివి! ఎల్-నీనో ప్రభావం బహుశా ఆగస్టు దాకా ఉధృతం కాకుండా, అలా తటస్థంగా ఉండవచ్చునని మరొక ఊహాగానం కూడా శాస్త్రవేత్తలలో పచార్లు కొడుతుండటం మరొక విషయం.
 
 దేవతలకే తప్పింది కాదు భూతాపం బాధ
 మరోమాటలో కవితాపరంగా లేదా కవి సమయంగా చెప్పాలంటే రుతువులలో ఆహ్లాద ఘడియలకు ఆలవాలంగా మనం భావించుకునే రుతువుల రాణి వసంతాన్ని మనం 19వ శతాబ్ది కవి కొత్తలంక మృత్యుంజయుడు మనుష్య జాతికి విరోధిగా భావించాడు. ఎందుకో తెలుసా వసంతుడనే ఒక రాజు దుర్మార్గపు పాలనకు ఒడిగడితే అతడి రాజ్య పాలనలో ఏం జరిగిందట? చెట్లు చిగర్చడం మానేశాయి. పుప్పొడులు నింపుకోవలసిన పువ్వుల ప్రవృత్తి కాస్తా దారి తప్పిందట. కోకిలలు గొంతు విప్పడం లేదు. మల్లెలు మొగ్గలు తొడగటం లేదు. పాలకుల అహంకారమూ తగ్గలేదట. అలా దారి తప్పిన దుర్మార్గ పాలకుల్ని ఉద్దేశించి, ప్రేమికుల రసానుభూతిని స్వతహాగా ఉద్దీపింపజేసే వసంతున్ని కాస్తా తెరగా పెట్టుకుని కవి, పాలకులను వీరబాదుడు బాదాడు. అలాగే భీకరమైన వేడికి నేల బీటలివ్వడమే కాక, చివరికి సూర్యుడి పాదాలు (కిరణాలు) కూడా ఆ నెరియల్లో ఇరుక్కుని బయటపడలేకపోయాయని రఘునాథ భూపాలుడు (17వ శతాబ్ది) చమత్కరించాడు.
 
 ఆధ్యాత్మికవాదులు ఎంతగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను దేవుళ్లుగా భావించుకున్నా.. కావ్యకర్తలు మాత్రం వాళ్లను మనుషులుగానే సంభావించుకుని పౌరాణిక కల్పనా మూర్తులైన ఆ ముగ్గురూ వేడిమిని తట్టుకోలేక ఎలా ఈ నేలతల్లినీ, ప్రకృతినీ తిరిగి ఆశ్రయించాల్సి వచ్చిందో చూపించారు. వేడిమికి తాళలేని శివుడు తన నివాసమైన కైలాసగిరిని వదిలేసి భూమ్మీదికి దిగి మర్రి చెట్టు కొమ్మల నీడలో విశ్రమించాల్సి వచ్చింది. విష్ణుమూర్తి ఎండ తాపాన్ని తగ్గించుకోవడానికి మంత్రతంత్రాలను ఆశ్రయించక, పాల సముద్రంలోకి దూకాల్సి వచ్చింది. ఇక బ్రహ్మ, వికసించిన పద్మాన్ని ఆశ్రయిస్తేనే గాని తేరుకోలేక పోయాడని సారంగి తమ్మయ్య (16వ శతాబ్ది) ముచ్చటగా చెప్పాడు. ఇక కుండపోత వర్షాలకూ, ముంపులకూ, సునామీలకు కారణమయ్యే ‘లానీనా’ను స్వయంగా చూశాడో ఏమో గానీ సముద్రం ఉప్పొంగి మొత్తం భూభాగాన్ని తనలోనే లయించే ‘సునామీ’ గురించి 19వ దశాబ్దపు కాకరపర్తి కృష్ణశాస్త్రి అనే కవి ‘ప్రళయ సంరంభం’ కవితలో కళ్లకు కట్టి చూపించాడిలా.
 
 ఆ సాగర తరంగాలు...
‘‘ఆకసమంటుచున్ దిశలన్ స్పృశించున్
 భీకరలీల లేచి, అతి వేలంబున వచ్చి
 దుస్సహమై ధరముంచి వెచై...‘‘ అన్నాడు.
 ఈ రెండు రకాల ప్రకృతి వైపరీత్యాలే అయినందున  అతివృష్టినీ అనావృష్టినీ పరిగణనలోకి తీసుకుంటూనే పర్యావరణ రక్షణకు మానవ ప్రయత్నంగా మన వంతు ధర్మాన్ని మనం నిర్వర్తించక తప్పదు.
 - ఏబీకే ప్రసాద్
 సీనియర్ సంపాదకులు
 abkprasad2006@yahoo.co.in

Read latest Opinion News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు