చిదంబరం వాగాడంబరం

19 Mar, 2014 23:45 IST|Sakshi
చిదంబరం వాగాడంబరం

విశ్లేషణ,
 వి.హనుమంత రావు
 
 గత సంవత్సరంలో జపాన్ ప్రధాని షింబో ఆబె ఎన్నికై ద్రవ్యోల్బణంపై దృష్టి కేంద్రీకరించారు. తన పాలన మొదటి వార్షికోత్సవం బ్రహ్మాండంగా జరుపుకున్నారు. ఆయన ఎన్నికల్లో ఒకే ఒక వాగ్దానం చేశారు- ‘నాకు ఓటు వేయండి! ద్రవ్యోల్బణం మెడలు వంచుతాను.’ అని. జనం ఓట్ల వర్షం కురిపించారు. మరి చిదంబరం ఏం చేశారు?
 
 కొద్ది వారాల్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. దేశం మాంద్య పరిస్థితిలో ఇరుక్కుపోయింది. కార్మికులు ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తున్నారు. కొద్దిమాసాల క్రితమే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు దేశ వ్యాప్తంగా రెండు రోజుల సమ్మె చేశారు. నిన్నకాక మొన్ననే ఓ రాష్ట్రంలో బ్యాంకు అధికారులు కూడా రెండు దినాల సమ్మె చేశారు. పారిశ్రామిక రంగాన్ని చూస్తే తయారీ రంగం కునికిపాట్లు పడుతూనే ఉంది. బొగ్గు, చమురు, గ్యాస్, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ (కోర్ పరిశ్రమలు) ఇలా ఏ రంగంలో చూసినా మాంద్యం, కొరతలతో సతమతమవుతూనే ఉన్నాయి. వ్యవసాయ రంగాన్ని చూస్తే కార్పొరేట్లు, విదేశీ సంస్థలు, వ్యవసాయ భూములను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆక్రమిస్తున్నాయి.

 

చిన్న రైతులు, వ్యవసాయ కూలీల వలసలు, వ్యవసాయోత్పత్తుల ధరవరలు షరా మామూలే. ఆత్మహత్యలు సరేసరి. ఈ సంవత్సరం పంటలు బాగా ఉండబోతున్నాయనుకుంటే వరదలు, తుపానుల్లో ఆశలు కొట్టుకుపోయాయి. దేశ ద్రవ్య పరిస్థితి మాంద్యంలో కొట్టుకుపోతుంటే ఆర్థికమంత్రికి ఇవేమీ పట్టడం లేదు. కరెంట్ ఎకౌంట్‌లో నుంచి (క్లుప్తంగా అర్థం చెప్పాలంటే దేశంలోకి వచ్చే/పోయే విదేశీ నిధుల మధ్య తేడా) జీడీపీలో 4.6 శాతాన్ని సాధించబోతున్నాం అని ప్రకటించి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తున్నారు.
 
 మధ్య తరగతినీ పట్టించుకోలేదు
 
 బ్రిటిష్ సామ్రాజ్యవాదుల విభజించి పాలించే విధానంతో ఆ తరగతిలో ఉన్నత మధ్య తరగతి వర్గాన్ని సృష్టించి వాళ్లకు బ్యాంకు రుణాల సరళీకరణ చేసి పబ్బం గడుపుతోంది. ఈ మధ్య తరగతి కింద స్థాయి  కార్మికులతో చేతులు కలపలేదు. తమ తరగతిలోనూ ఇమడలేదు. భూమ్యాకాశాల మధ్య వేలాడుతుంటుంది (ఇటీవలి కాలంలో కొంత మార్పు కనిపిస్తోంది). పైన ఉదహరించిన ఉన్నత మధ్య తరగతికి విదేశీ వస్తువులపై మోజు పెరుగుతున్నది. కార్లు, ఫ్రిజ్‌లు లాంటి విలాస వస్తువులను దిగుమతి చేసుకోవడానికి అనుమతి లభిస్తోంది. కార్లు తయారు చేసే విదేశీ సంస్థలకు ధారాళంగా అనుమతినిస్తుంటే కార్ల ఉత్పత్తి పెరుగుతోంది. పెట్రోల్ దిగుమతులు వంటి వాటితో ఎగుమతులకు, దిగుమతులకు మధ్య వ్యత్యాసం పెరుగుతోంది. ఇది ఒక ఉదాహరణే అయినా, మన ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేయడానికి ఇదొక్కటి చాలు.
 
 కార్పొరేట్ల సేవలో...
 
 122 కోట్ల ప్రజల బాగోగులు పట్టించుకోకుండా, కార్పొరేట్టకూ విదేశీ పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేస్తూ ద్రవ్య పరిస్థితులను ప్రభుత్వం గాలికి వదిలేసిందని కేంద్ర ప్రభుత్వంలో సంయుక్త కార్యదర్శి, ఐ.ఎం.ఎఫ్ బడ్జెట్ సలహాదారు ఎ.రంగాచారి విమర్శించారు. ప్రజల రాష్ట్రాదాయం(జీడీపీ), ధరల పెరుగుదల దేశాన్ని పట్టిపీడిస్తుండడమే ఈ దుస్థితికి కారణాలని ఆయన అన్నారు.
 
 జనాన్ని ఇలా గాలికి వదిలేసిన, ముఖ్యంగా వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిన చిదంబరం (ఆయన సంవత్సరానికి ఒక్కసారే, అదీ బడ్జెట్ ప్రసంగంలో వ్యవసాయం గురించి ప్రస్తావిస్తారు). ద్రవ్యోల్బణం, జీడీపీ పెరుగుదల, ద్రవ్యలోటు, ధరల పెరుగుదల, ఎగుమతులూ దిగుమతుల గురించి అఖిల భారత స్థాయి విషయాల గురించే మాట్లాడతారు. దేశపాలనలో ఇవన్నీ ముఖ్యమే కానీ వీటన్నింటికీ మూలం ప్రజలు, వారి బాగోగులు. అంటే పునాదుల్లేని భవన నిర్మాణానికే ప్రాధాన్యం ఇస్తున్నారన్నమాట. పోనీ ఆ కేంద్రంలోనైనా ఏమైనా వెలగబెట్టారా? జీడీపీ ఈ శతాబ్దంలోనే తొమ్మిది శాతం పెరుగుదల చూపగా, చిదంబరం అయిదు శాతం కన్నా తక్కువకు తీసుకురావడంలో గొప్ప విజయం సాధించారు. ధరల తగ్గింపును పట్టించుకునేవారు లేరు. ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్మును సంవత్సరానికి అయిదు లక్షల కోట్ల మేరకు కార్పొరేట్లకు ధారబోశారు.
 
 కుదేలైన ప్రపంచ బ్యాంకు


 కార్పొరేట్లు ప్రతి సంవత్సరం తామెంత పన్ను కట్టాలో, ఆ మొత్తంలో కొంత అడ్వాన్సుగా చెల్లించాలి. సంవత్సరం ఆఖరున నికరంగా ఎంత చెల్లించాలో లెక్కలు తయారవుతాయి. చెల్లించాల్సిన సొమ్ము కన్నా ఎక్కువ చెల్లించిన పక్షంలో ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఏళ్ల తరబడి అలా చెల్లించని మొత్తం రూ. 37365 కోట్లు కక్కాల్సి వచ్చింది (2006-07, 2010-11 మధ్య). ఇదీ చిదంబరం నిర్వాకం. ఈ ‘దోపీడీ’లో ప్రణబ్ ముఖర్జీ నిర్వాకం కూడా ఉంది. ఇక్కడ కేంద్రం చేసిన నిర్వాకాలు ఎన్నయినా చెప్పవచ్చు.
 
 ఉదాహరణకు మిలియన్లు, బిలియన్ల డాలర్ల రుణాలిచ్చిన ప్రపంచ బ్యాంకు భారత ప్రభుత్వం అమలు చేస్తున్న అస్తవ్యస్త ద్రవ్య విధానాలను చూసి, దాని నెత్తిన మేకు కొట్టింది. లేకపోతే తానిచ్చిన రుణాలు తిరిగి చెల్లించే పరిస్థితి  మాట అటుంచి బంగాళాఖాతంలో మునిగిపోతుందని గ్రహించి ఊజీటఛ్చి ఖ్ఛటఞౌటజీఛజీజ్టీడ ్చఛీ ఆఠఛీజ్ఛ్ట క్చ్చజ్ఛఝ్ఛ్ట అఛ్టి ను పార్లమెంటులో ఆమోదింపజేసింది. దీనినే రాష్ట్రప్రభుత్వాలు కూడా అమలు పరచాలని కేంద్రం ఆదేశించింది. దీని ప్రకారం ద్రవ్యలోటు జీడీపీలో మూడు శాతం మించరాదు. 2013లో ఆమోదించిన ఈ చట్టాన్ని ఈ రోజు వరకు ఏ సంవత్సరంలోనూ అమలు చేయలేదు. అంటే ద్రవ్యపరిస్థితి అదుపులోకి తీసుకొనిరావడంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు విఫలమయ్యారు. ఇటు ప్రజల గోడూ పట్టించుకోలేదు. అటు దేశ ద్రవ్యపరిస్థితిని అదుపులోనూ పెట్టలేదు. మరి ప్రపంచ బ్యాంకు ఊరుకుందా? ఆ బ్యాంకు లక్ష్యం వేరు, తానిచ్చిన రుణం తిరిగి తీసుకోవటం కన్నా, దాని మీద వచ్చే వడ్డీ అంటే దానికి ముద్దు. అమెరికాలో వడ్డీరేటు 2-3 శాతం మాత్రమే. ఇంకా ఎక్కువ సంపాదించటం దాని లక్ష్యం. అంతేకాదు: ఇండియా రాజకీయ పిలక ప్రపం చ బ్యాంకు ద్వారా అమెరికా చేతుల్లో, అక్కడి బిలియనీర్ల చేతుల్లో ఉంటుంది.
 
 అన్నీ వైఫల్యాలే
 
 ద్రవ్యోల్బణం మన దేశ ప్రజలకు మొదటి శత్రువు. రిజర్వు బ్యాంకు గవర్నరుగా సుబ్బారావు ఉన్నప్పుడు ద్రవ్యలోటు తగ్గించడంపై దృష్టి కేంద్రీకరించారు. చిదంబరానికీ ఆయనకూ మధ్య సంబంధాలు ఎప్పుడూ సరిగ్గా లేవు. దీనికన్నా వడ్డీ రేట్లు తగ్గించాలనేది చిదంబరం వాదన. ఇక్కడ జపాన్ ఉదాహరణ- గత సంవత్సరంలో జపాన్ ప్రధాని షింబో ఆబె ఎన్నికై ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించారు. తన పాలన మొదటి వార్షికోత్సవం బ్రహ్మాం డంగా జరుపుకున్నారు. ఆయన ఎన్నికల్లో ఒకే ఒక వాగ్దానం చేశారు- ‘నాకు ఓటు వేయండి! ద్రవ్యోల్బణం మెడలు వంచుతాను.’ అని. జనం ఓట్ల వర్షం కురిపించారు. మరి చిదంబరం ఏం చేశారు? ఆప్రశ్నకు జవాబు మీ దగ్గరే ఉంది.
 
 కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ వైఫల్యాలు కోకొల్లలు. ఉదాహరణకు ద్రవ్య పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్నప్పుడల్లా ఖర్చులు తగ్గించుకోవాలని ఆర్థికశాస్త్రవేత్తలు సూక్తులు చెబుతుంటారు. ప్రభుత్వం పదిశాతం ఖర్చులు తగ్గించుకోమని ఆదేశిస్తుంది. కానీ, ఈ ఆదేశం అమలు పరిచాం, ఇంత మేరకు ఖర్చులు తగ్గించుకొన్నామని ఎవరూ చెప్పిన దాఖలాలు లేవు. లేకపోగా, తాజా తాత్కాలిక బడ్జెట్‌లో సామాజిక సంక్షేమానికి కేటాయించిన మొత్తంపై కోత విధించారు చిదంబరం. ఇటు మానవాభివృద్ధి లేదు, అటు ఆర్థికాభివృద్ధి లేదు. కాంగ్రెస్, బీజేపీ, రెండు ప్రభుత్వాలు ఒక వర్గం ప్రతిని ధులే. చిదంబరానికీ కార్పోరేట్ రంగానికీ ఎలాంటి పేగు బంధం ఉందో, మోడీకి అంతే. వచ్చే ఎన్నికల్లో ఈ ఇద్దరిలో ఎవరు గెలిచినా మన గతి ఇంతే.
 (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్)
 

మరిన్ని వార్తలు