చండీదేవి కాదు వాగ్దేవి...!

26 Dec, 2015 10:06 IST|Sakshi
చండీదేవి కాదు వాగ్దేవి...!

చండీయాగం పుణ్యమా అని మీడియా వారు వైదిక పరిభాషని పుక్కిట పట్టేశారు. కనీసం రెండువందల కొత్తమాటలు పత్రికలకెక్కించి, పాఠకుల్ని పునీతుల్ని చేశారు. ఎందరో స్వాముల పేర్లు, దేవీదేవతల పేర్లు, కైంకర్యాలు... ఇలా ఎన్నని చెప్పడం! ఆమె చండీదేవి కాదు మీడియా పాలిట వాగ్దేవి.
 
 ‘‘మహాద్భుతం... నైమిశను తలపిస్తోంది!’’ అన్నాడొకాయన. శ్రోత నోరు చేసుకుని, ‘‘మీకు బుద్ధీ జ్ఞానం ఉందా? శౌనకాది మహామునులు సత్రయాగం సాగించిన నైమిశలో ఏముంది, ఒక్క హోమ గుండం తప్ప. తమ బొంద... ఇక్కడ లాగా మైకులు, గొట్టాలు ఉన్నాయా? టీవీ కెమెరాలు న్నాయా? ఇంత లైటింగ్ ఉందా? కవరేజీ ఉందా? అంటూ ఉతికి ఆరేస్తే మొదటాయన నిర్ద్వంద్వంగా లెంపలేసుకున్నాడు. అతడనేక యాగముల నారియు తేరిన అను భవజ్ఞుడు. యాగం అంటే కల్వకుంట్లకి వెన్నతో పెట్టిన విద్య. పైగా యజ్ఞాలన్నీ ఆయనకు ఫలిం చాయి కూడా. ఈ మహాయజ్ఞం ఫలితాలు 2016లో గాని బయటపడవు.

 కొందరంటారూ-ఇదంతా ఎవరో స్వప్రయో జనం కోసం తయారుచేశారు గానీ ఫాయిదా ఉండ దని. మరికొందరు సైన్స్ చదువుకున్న వాళ్లు మంత్రా లకు చింతకాయలు రాల్తాయా అని సూటి ప్రశ్న వేస్తున్నారు. చరిత్ర బుక్స్ చదివిన వాళ్లు గతంలో జరిగిన యజ్ఞయాగాది క్రతువులను తారీకుల వారీగా వల్లించి, వాటివల్ల ఒనగూడిన ఫలితాలు ఎక్కడా కనిపించడం లేదంటున్నారు. లెక్కలొచ్చిన వాళ్లు యాగద్రవ్యాలను తూనికలు కొలతలు వేసి, మార్కెట్ ధరతో లెక్కించి గ్రాండ్ టోటల్స్ తలోరకంగా చెబుతున్నారు. కెమిస్ట్రీ మేధావులు ఇలా అగ్నికి నానావిధ ఫలపుష్ప ఘృత వస్త్రాదులు సమర్పించినందువల్ల, అక్కడ పుట్టే పొగ ఎలాంటి శక్తివంతమైన మేఘాలనూ సృష్టించలేదని లేబోరేటరీ ప్రయోగాల ద్వారా తేలిందని వాదిస్తున్నారు. కానీ జ్ఞానవూడలను వెండిగడ్డాలుగా ధరించిన పెద్దలు మాత్రం, ‘‘మీ ప్రయోగాలలో వేదమంత్రాలు కలి శాయా?’’ అని నిగ్గదీస్తున్నారు. మామూలు గడ్డిపరక మంత్ర సహితంగా హోమగుండంలో పడినప్పుడు అది సమిధ అవుతుంది. ఊడలను దువ్వుతూ వారేమన్నారంటే, మీరిప్పుడు పది నెంబర్లు మీటితే అది కలవాల్సిన వారిని నిద్రలేపి మరీ కలపడం లేదా, అలాగే ఇదీను. ఇ-మెయిల్‌లో ప్రతి అక్షరం, చిన్న చుక్కతో సహా సరిగ్గా ఉంటేనే కదా అడంగు చేరుతుంది. ఇది కూడా అంతే. అనుదాత్త ఉదాత్త స్వరాలు పకడ్బందీగా, బీజాక్షరాలు సక్రమంగా పడితే ఇవన్నీ చేరాల్సిన వాళ్లకి ఎందుకు చేరవు? ఇవన్నీ సరేగానీ, నాకు ఒకందుకు సంతోషంగా ఉంది.

ఈ అయుత చండీయాగం పుణ్యమా అని మీడియా వారు వైదిక పరిభాషని పుక్కిట పట్టేశారు. కనీసం రెండు వందల కొత్తమాటలు పత్రికల కెక్కించి, పాఠకుల్ని పునీతుల్ని చేశారు. ఇవిగాక ఎందరో స్వాముల పేర్లు, దేవీదేవతల పేర్లు, కైంకర్యాలు... ఇలా ఎన్నని చెప్పడం! ఆమె చండీదేవి కాదు మీడియా పాలిట వాగ్దేవి. తెలుగురాష్ట్రాలే కాదు, మొత్తం దేశమంతా ఎర్రవల్లి వైపు చూస్తోంది. ఎర్రవల్లికి బోలెడు చరిత్ర ఉంది. గతంలో అనేక యజ్ఞగుండాలకది నిలయం. అన్ని వేలమంది రుత్విక్కులు రోజుకో రంగు దుస్తులతో రుక్కుల్లా వెలిగిపోవడం బావుంది. కాకపోతే మొదటిరోజు అంతా పసుపుమయం అయ్యేసరికి కొందరికి భయం వేసింది.    
   

 (వ్యాసకర్త శ్రీరమణ, ప్రముఖ కథకుడు)

మరిన్ని వార్తలు