కథకుడు, నవలాకారుడు

24 Apr, 2017 02:46 IST|Sakshi
కథకుడు, నవలాకారుడు
ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఒక మంచికథకి కావాల్సిన ‘అనుభవం’, సంఘటన, వస్తువు వుండి తీరతాయి. వ్యక్తి సంస్కారాన్ని బట్టి, ఆ అనుభవం వత్తిడి వైశాల్యం నిర్ణీతమవుతాయి. ఆ రెంటికీ సమన్వయం కుదిరినప్పుడు ఒక కథ వూడిపడొచ్చు. గొప్పకథ కాకపోయినా ఆ కథ మంచి కథ కావచ్చు. కానీ అది రచించిన వ్యక్తిని కథకుడు అనలేము. మరి ఎవరు కథకుడు? జీవితంలో తాను తెలుసుకున్న విషయాలను కుదించి, తాను పొందిన అనుభూతిని కళగా మార్చి యితరులతో పంచుకునేటందుకు కృషి చేసేవాడు కథకుడు. కుదించడం, సంక్షిప్తం చెయ్యడం ముఖ్యం. అది లేకుంటే నవలా రచయిత అవగలడు.

నవలాకారుడికి కుదించడం అవసరం లేదని కాదు. నవలకీ స్వరూపం, అంతం వుంటాయి. కథకి మల్లేనే నవలాకారుడి అభిమాన పాత్రలు ‘కాలం’, ‘స్థలం’ అనేవి. ఈ రెంటి సమన్వయం సాధించిన పరిణామంతో నిమిత్తం వున్నవాడు నవలాకారుడు. అతని జగత్తు సముద్రం అయితే కథకుడి జగత్తు అందులో ఒక కెరటం. ఎక్కడో మధ్యలో ఎప్పుడు లేస్తుంది– కదుల్తుంది– చుట్టూ వున్న మరికొన్ని తుంపరలని, పిల్ల కెరటాలని తనతో లాక్కుపోతుంది– వెళ్లినకొద్దీ ఆకృతి పెంచుకుంటుంది. దానికొక శిఖరం ఏర్పడుతుంది. మనం చూస్తూ వుండగానే తుంపరల కింద విడి, అవతారం చాలించుకుంటుంది. ఆ క్షణికమైన దృశ్యం చూసేవారిలో ఒక అనుభూతిగా నిలిచిపోతుంది. కెరటాన్ని లేవదీసేవాడు కథకుడు.
(బుచ్చిబాబు సాహిత్య వ్యాసాలు మొదటి సంపుటం లోంచి; ప్రచురణ: నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌) 
మరిన్ని వార్తలు