రచయితలు... వింత అలవాట్లు....

9 Sep, 2013 00:06 IST|Sakshi

‘అలవాట్లదేముందిలేండి... రోజూ రాయడం ముఖ్యం’ అంటాడు టాల్‌స్టాయ్. ఎందుకు రాయాలంటే సాధన తప్పిపోకుండా ఉండేందుకు. కాని రాయడం సామాన్యమైన విషయమా? అందునా రోజూ రాయడం. రాయడానికి కావలసిన ఉద్దీపన కోసం రచయితలు నానా పాట్లు పడేవాళ్లనడానికి బోలెడన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఈ ఉద్దీపనలు అలవాట్లుగా మారి ఆయా రచయితలను జీవితాంతం వెంటాడాయి కూడా.
 
 ఉదాహరణకు అగాతా క్రిస్టీ తెలుసు కదా. గిన్నెస్ వరల్డ్ రికార్డు ప్రకారం పుస్తక ప్రచురణ చరిత్రలో ఆల్‌టైం బెస్ట్ సెల్లింగ్ నావలిస్టు ఆమె. తను రాసిన ‘దెన్ దేర్ వర్ నన్’ అనే నవల వంద మిలియన్ల కాపీలు అమ్ముడుపోయింది. మిస్టరీలు రాసే అగాతా క్రిస్టీకి బాత్‌టబ్‌లో కూచుని రాయడానికి ఆలోచనలు చేయడం అలవాటు. ఉత్త కూచోవడమే కాదు ఆపిల్స్ కూడా తినాలి. అంటే మనం చదువుతున్న ఆమె నవలలు బాత్‌టబ్‌లో ఆపిల్స్ తింటూ ఉండగా పుట్టాయన్న మాట. జేమ్స్ జాయిస్‌ది వేరే కథ. ప్రపంచ సాహిత్యంలో ‘చైతన్య స్రవంతి’ ధోరణికి పురుడుబోసిన ఈ రచయిత రాసిన ‘యులిసీస్’ (1922) జగత్ప్రసిద్ధం. ఈయన తొలిరోజుల్లో తెల్లకోటు తొడుక్కుని, పక్క మీద వాలి, బ్లూ పెన్సిల్‌తో మాత్రమే రాసేవాడట. ఆ తర్వాత దృష్టి సమస్యలు పెరిగి అంధత్వానికి చేరువైన చివరి దశలో రంగు రంగుల క్రెయాన్లతో కార్డుబోర్డు మీద రాయడం అలవాటు చేసుకున్నాడు.

ఫ్రెంచ్ రచయిత విక్టర్ హ్యూగో తన ‘లే మిజరబుల్స్’తో చిరకీర్తిని సంపాదించాడు. ‘ఈ లోకంలో అన్యాయం, అక్రమం, పేదరికం, దోపిడీ ఉన్నంత కాలం అంతఃపురాల్లోని కుబేరుల పక్కన నరక కూపాలలో నరులు నివసించినంత కాలం’  లే మిజరబుల్స్ నవల ఉంటుంది అనే ఘనత పొందాడాయన. ఆయన జీవితంలో ఒక వింత జరిగింది. 1830లో ‘జిఠఛిజిఛ్చఛిజు ౌజ ౌ్టట్ఛ ఛ్చీఝ్ఛ ’ అనే నవల రాస్తున్న రోజులు. మరో మూడు నెలల్లో ఆ నవల ముగించాలి. లేకుంటే కాంట్రాక్ట్ ప్రకారం వారానికి 1000 ఫ్రాంకుల జరిమానా విధించాలి. చాలా ఖరీదైన పెనాల్టీ అది. ఏం చేయాలో తోచక మూడ్ కోసం మూడు నెలల పాటు తలుపులన్నీ బిగించుకొని దేవతా వస్త్రాల్లో కూచుని నవలను ముగించాడాయన. ‘మేరి స్టువర్ట్’, ‘విలియం బెల్’ వంటి ప్రఖ్యాత రచనలు చేసిన జర్మన్ రచయిత ఫ్రెడ్రిక్ షిల్లర్  రాత్రి పూట మాత్రమే రాసేవాడు. అది కూడా గదికి ఎర్రటి పరదాలు కట్టుకుని. దానికి తోడు టేబుల్ సొరుగులో కుళ్లిన ఆపిల్స్ ఉండి వాటి వాసన ఆయనకు సోకుతూ ఉంటే తప్ప కలం కదిలేది కాదు.
 
 నవలల ఫ్యాక్టరీగా అందరూ ముద్దుగా పిలుచుకునే అలెగ్జాండర్ డ్యూమా (1802 - 1870) రాసిన త్రీ మస్కటీర్స్, కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్టో అందరికీ తెలుసు. కేవలం మూడు రోజుల్లో ఒక నవలను పూర్తి చేసిన కీర్తి ఈయన సొంతం. ఈయనకు రంగుల పిచ్చి. కవిత్వానికి పసుపు పచ్చ, వ్యాసాలకు ఎరుపు, నవలలకు వూదా రంగు కాగితాలు వాడేవాడు. ఈయన తూర్పు యూరప్ పర్యటనలో ఉన్నప్పుడు ఊదా రంగు కాగితాల స్టాకు నిండుకోవడంతో నానా యిబ్బందీ పడ్డాడు.  ఇక ఆధునిక కథా లక్షణాలను నిర్వచించిన అమెరికన్ కథా రచయిత ఎడ్గార్ ఆలన్‌పో (1809 - 1849) డిటెక్టివ్, హారర్ కథలకు ఆద్యుడు. ఈయన ‘బెల్స్’ గేయాన్ని శ్రీశ్రీగారు అనువదించారు. ఈయన సృజనా రహస్యం ఏమిటో తెలుసా? చంకలో పిల్లి. పిల్లిని నిమిరితే తప్ప కలం కదలిదీ జీనియస్‌కు. అన్నట్టు ఈయన బ్లాక్ క్యాట్ అనే కథ కూడా రాశాడు. ఇక తాగితే తప్ప రాయలేడు విలియమ్ ఫాక్నర్. రాసినంత సేపూ కాఫీ తాగుతూ జీవితకాలంలో 50 వేల కప్పుల కాఫీ తాగి మరణించాడు బాల్జాక్.
 ఇలా ఎందరో. రాయడం ఒక అవస్థ. అదే స్వర్గం. అదే నరకం.
 
 - ముక్తవరం పార్థసారథి

మరిన్ని వార్తలు