ఈసారి ‘తుపాను’ సమావేశాలే

20 Jul, 2015 01:19 IST|Sakshi
ఈసారి ‘తుపాను’ సమావేశాలే

ఇరు పక్షాలు దాడి ఎత్తుగడలతోనే బరిలోకి దిగుతున్న ఈ పార్లమెంటరీ సంగ్రామం... పోల్చడానికే వీల్లేని మోదీ, రాహల్‌లకు అగ్నిపరీక్షే. నిరాసక్త నేతగా ప్రసిద్ధుడైన రాహుల్ కాంగ్రెస్ పగ్గాలు పట్టనున్న నేత. ఇప్పుడు చూపుతున్న సమరోత్సహం ఎలా ఉన్నా, సభలో ప్రధాన విపక్ష సేనాని పాత్రను ఎలా నిభాయి స్తారనేది ఆయన భవితకు కీలకం.  ఇక మోదీ పార్లమెంటుకు తక్కువగా, విదేశాలకు ఎక్కువగా వెళ్లే ప్రధానిగా ఇప్పటికే గుర్తింపు పొందారు. ఈసారి కూడా మొహం చాటేసి ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల ఏమంత గౌరవం లేదనే భావన బలపడేట్టు చేస్తారా? లేక సభలో కూడా సమర్థ నేతగా రుజువు చేసుకుంటారా?
 
 సాధారణంగా మన రాజకీయ పరిశీలకుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం అరుదు. కానీ ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల ‘వాతావరణం’పై అందరిదీ ఒకటే మాట... ఉత్తరాది వరదలను మించిన ఉధృతితో ఉభయ సభల్లోనూ తుపానులు చెలరేగనున్నాయి. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఏ అస్త్రాలను ప్రయోగించి కాంగ్రెస్‌ను చిత్తుచేసిందో సరిగ్గా అవే అస్త్రాలను ఎదుర్కోడానికి అది నేడు అధికార పక్షంగా రక్షణ వ్యూహాలను రచిస్తుండటం ఆసక్తికరం. రేపు ప్రారం భం కానున్న పార్లమెంటు సమావేశాలకు వ్యూహ, ప్రతివ్యూహాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. అటు కేంద్రంలోనూ, ఇటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ కూడా వరుసగా వెలుగుచూస్తున్న అవినీతి, కుంభకోణాలను కేంద్రంగా చేసు కొని అధికార పక్షాన్ని చుట్టుముట్టి దాడి చేసే విషయంలో విపక్షాలన్నీ ఏకా భిప్రాయంతో ఉన్నాయి. ప్రత్యేకించి ఇటీవల కొంత కాలంగా మీడియాలో నూ, రాజకీయాల్లోనూ తీవ్ర ప్రకంపనలను సృష్టిస్తున్న ‘లలిత్ గేట్’, ‘వ్యాపం’ వంటి కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ... గత ప్రధానులు పీవీ, మన్మోహన్ లను మించిన ‘మౌన ముద్ర’ దాల్చటం ప్రతిపక్షాలకు బల మైన అంశంగా మారింది. ఒకప్పటి ఐపీఎల్ షోమేన్, నేటి ‘పరారీలోని నింది తుడు’ లలిత్ మోదీకి సాయం చేసిన వ్యవహారంలో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌తోపాటూ, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఇరుక్కు పోయా రు. ఇక వ్యాపమ్ కుంభకోణంకేసుతో సంబంధమున్న వారు 48 మంది సాక్షులు, దోషులు, పాత్రికేయులు వరుసగా ఆత్మహత్యలకో, హత్యలకో, అనుమానాస్పద మరణాలకో గురికావడం ప్రత్యేకించి అధికార పక్షాన్ని రక్షణ స్థితిలోకి నెట్టేస్తోంది. సుష్మా, రాజే, చౌహాన్‌లను పదవుల నుంచి తాత్కాలి కంగానైనా తప్పించకపోతే ప్రజలు తమ పార్టీని కాంగ్రెస్‌తో కలిపి ఒకే గాటన కట్టేస్తారని పలువురు బీజేపీ నేతలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి చాలదన్నట్టు మహారాష్ట్ర మంత్రులు పంకజ ముండే, వినోద్ తావ్డేలపై అవినీతి ఆరోపణల కారణంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను, ప్రజా పంపిణీ నిధుల కుంభకోణంలో ఆరోపణలను ఎదుర్కొం టున్న ఛత్తీస్‌గడ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ను గద్దె దింపాలని కాంగ్రెస్, తదితర ప్రతిపక్ష పార్టీలన్నీ బలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో అధికార పార్టీకి చెందిన పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్రాల మం త్రులు వివిధ వివాదాల్లో ఇరుక్కున్నారు. ఇంతవరకు ఈ సమస్యలన్నిటిపైనా మాటా పలుకూ లేకుండా ఉన్న ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని ప్రతి పక్షాలు పార్లమెంటును స్తంభింపచేయడం తప్పదు. ఇక.. మోదీ సర్కారు  భూసేకరణ బిల్లును ప్రవేశపెడితే దానికదే ఒక పెద్ద రణక్షేత్రం కానుంది. జీఎస్‌టీ బిల్లు, కులగణన వివరాలను సర్కారు వెల్లడించకపోవటం, నల్ల ధనంపై ఇచ్చిన హామీల అమలు వంటి అంశాలు ఎలాగూ ఉండనే ఉన్నాయి.

 ఈ సమావేశాలు వర్షార్పణమే?!
 ఈ నెల 21 నుంచి ఆగస్టు 13 వరకూ సాగనున్న ఈ సమావేశాల్లో .. రాజ్య సభలో పెండింగ్‌లో ఉన్న 9 బిల్లులు, లోక్‌సభలో పెండింగ్‌లో ఉన్న 4 బిల్లుల తోపాటు 11 కొత్త బిల్లులను ఆమోదం కోసం ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో వివాదాస్పద భూసేకరణ బిల్లు, జీఎస్‌టీ బిల్లు వంటి పలు కీలక బిల్లులు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల తదుపరి అస్తిత్వ పరమైన ముప్పును ఎదుర్కొంటున్నట్టనిపించిన కాంగ్రెస్‌కు ‘కాలం కలిసి వచ్చినట్ట’నిపిస్తోంది. అధికార పక్ష అవినీతి సెల్ఫ్‌గోల్స్ పరంపర ఆ పార్టీకి ఊపిరిపోసింది. అది ప్రత్యేకించి రాహుల్ గాంధీ సమరోత్సాహంలో కనిపిస్తోంది. పైగా బిహార్‌లో నితీష్‌కుమార్, లాలూ యాదవ్‌ల సయోధ్య ప్రాతిపదికగా బీజేపీయేతర ప్రతిపక్షాలన్నీ ఒక్క తాటిపైకి వచ్చే పరిస్థితి నెలకొంది. ప్రకాశ్ కారత్‌కు భిన్నమైన వ్యవహార శైలితో పట్టువిడుపులను ప్రదర్శించే సీతారాం ఏచూరి ప్రధాన వామపక్షమైన సీపీఎం పగ్గాలు చేపట్ట డం ప్రతిపక్షాలకు కలసి వచ్చే అంశం. బెంగాల్‌లోని వామపక్షాల ప్రత్యర్థి మమతా బెనర్జీ సైతం బీజేపీతో తలపడే వైఖరిని చేపట్టడం విపక్షాలకు అను కూలాంశంగా మారింది. విపక్షాలు ఒక్కటిగా నిలిచి ప్రభుత్వాన్ని ముట్టడిలో ఉన్న స్థితికి నెట్టేయడం నేరుగా బిహార్ ఎన్నికల తీరును ప్రభావితం చేస్తుంది. అందుకే అధికార, విపక్షాలలో ఏ ఒక్కటీ వెనక్కు తగ్గే సూచనలు కనిపించటం లేదు. ఈ నేపధ్యంలో ఈ పార్లమెంటు సమావేశాల్లో ఉభయ సభల కార్యకలా పాలు పూర్తిగా స్తంభించిపోవడం తప్పక పోవచ్చు.
 ఎదురు దాడే అత్యుత్తమ రక్షణ
 విపక్షాల దాడుల నుంచి రక్షణ కోసం యత్నించే కంటే వారిపై తామే ఎదురు దాడికి దిగడమే అత్యుత్తమమని గత నెల 24వ తేదీన జరిగిన పార్లమెంటరీ వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సమావేశంలోనే ఎన్‌డీఏ వ్యూహ రచన చేసి నట్టు తెలుస్తోంది. ఎక్కడా వెనుకడుగు వేస్తున్నట్లు కనిపించకుండా ఉండట మే గాక, ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ మంత్రులను, ముఖ్యమంత్రుల ను సమర్థించుకుంటూ.. ప్రతిపక్షాలపై, ముఖ్యంగా కాంగ్రెస్‌పై ఎదురు దాడికి దిగేందుకు సిద్ధమవుతోంది. విపక్షాల దాడుల నేపథ్యంలో అవసరమైతే సమావేశాలను మరో వారం పొడిగించడానికి సిద్ధపడాలే తప్ప, కుదిస్తే ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందన్న సంకేతాలు వెళతాయని అది భావిస్తోంది.
 మనీ లాండరింగ్, హవాలా, బెట్టింగ్ కేసుల్లో ఆరోపణలను ఎదుర్కొం టూ లండన్‌లో తలదాచుకున్న లలిత్ మోదీకి పోర్చుగల్ వెళ్లి వచ్చేందుకు సుష్మా సహాయపడటమే కాదు, ఆమె భర్త, కుమార్తె ఆయనకు ఉచిత న్యాయ సహాయం అందించారు. అలాగే రాజే కుటుంబంతో లలిత్‌కున్న వ్యాపార లావాదేవీలు కూడా రట్టయ్యాయి. వారిని పదవుల నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు పట్టుపడుతున్నాయి. సుష్మా, రాజేలు లలిత్‌కు సాయం చేయటం లో ఎలాంటి తప్పూ లేదని బీజేపీ, కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే సమర్థించుకుంటున్నారు. వారు పదవుల నుంచి తప్పుకోవాల్సిన అవసరం లేదని స్పష్టంచేస్తున్నారు. పార్లమెంటులో కూడా ఇదే వైఖరిని కొనసాగించ నున్నారు. పైగా  కాంగ్రెస్ నేతలపై లలిత్ మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావి స్తూ ఎదురు దాడికి దిగాలని భావిస్తున్నారు.
 మధ్యప్రదేశ్‌లో 2007-2013 మధ్య జరిగిన ‘వ్యవసాయిక్ పరీక్షా మండల్ (వ్యాపమ్)’ కుంభకోణంలో ఆ రాష్ట్ర గవర్నర్ రాంనరేశ్‌యాదవ్, ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్ సన్నిహితుల పాత్రపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి. రెండేళ్ల క్రితం ఈ కుంభకోణంపై  దర్యాప్తు ప్రారంభమైనప్పటి నుంచి  దాదాపు ఈ కుంభకోణంతో ప్రత్యక్షంగా సంబంధమున్న వారిలో పలువురు అసహజ, అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తున్నారు.  తాజాగా ‘ప్రజాభిప్రాయం’ మేరకు సీబీఐ దర్యాప్తు జరిపించాలని చౌహాన్ సర్కార్ కోర్టును కోరిందనే ‘రక్షణ’తో ఆయన రాజీనామా విషయాన్ని దాటవేయా లని చూస్తోంది. కాంగ్రెస్ హయాంలోని వివిధ కుంభకోణాలను ప్రస్తావిస్తూ ఎదురు దాడి చేయడంతో చర్చను పెడదోవ పట్టిస్తే గందరగోళం తప్పదనే ఎత్తుగడను ప్రయోగించనుంది. ఇక ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్న కుంభకోణం విషయంలోనూ, మహారాష్ట్ర మంత్రులు పంకజ ముండే, వినోద్ త్వాండేలపై అవినీతి ఆరోపణల విష యంలో ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌ను ఆ పదవి నుంచి తప్పించాలనే అంశం పైనా బీజేపీ అదే ఎదురు దాడి వ్యూహాన్ని అనుసరించనుంది. భూసేకరణ బిల్లును అవసరమైతే వాయిదా వేసుకుని, అనవసర పోరాటానికి దిగకుండా ఉండాలని ఆలోచిస్తోంది. కాకపోతే వస్తువులు, సేవల పన్ను (జీఎస్‌టీ) బిల్లు కాంగ్రెసేతర ప్రతిపక్షాల సహాయంతో సులభంగానే గట్టెక్కనుంది.
 
 ఇద్దరికీ అగ్నిపరీక్షే
 ఇరు పక్షాలు దాడి ఎత్తుగడలతోనే బరిలోకి దిగనున్న ఈ పార్లమెంటరీ సంగ్రామం... పోల్చడానికే వీల్లేని నేతలుగా కనిపించే నరేంద్ర మోదీ, రాహల్ గాంధీలిద్దరికీ లిట్మస్ టెస్ట్ కానుండటం విశేషం. లోక్‌సభలో నిదురించే బాలునిగా ప్రసిద్ధుడైన రాహుల్ నేడో రేపో కాంగ్రెస్ పగ్గాలు పట్టే ముహూర్తం కోసం ఎదురు చూస్తున్న నేత. పార్లమెంటుకు బయట చూపుతున్న సమరో త్సహం సంగతి ఎలా ఉన్నా, లోపల ప్రధాన విపక్ష  సేనాని పాత్రను ఎలా నిభాయిస్తారనేది ఆయన భవితకు కీలకం.
 
 ఆయన నాయత్వశక్తిపై ఆ పార్టీ లోనే ఉన్న సందేహాలను తొలగించడానికి లభించిన మంచి అవకాశమిది. ఏం చేస్తారో చూడాలి. ఇక మోదీ పార్లమెంటుకు అతి తక్కువగా హాజరై, విదేశా లకు అతి ఎక్కువగా వెళ్లే ప్రధానిగా ఇప్పటికే గుర్తింపు పొందారు. లోక్‌సభలో ఎలాంటి దాడినైనా తిప్పికొట్టగల సమర్థ నాయకురాలు సుష్మా స్వయంగా ఈ సమావేశాల్లో విపక్షాలకు ముఖ్య లక్ష్యం కానున్నారు. ఇక మోదీయే ముం దుండి పార్లమెంటరీ పోరును నడపాల్సి ఉంటుంది. పార్లమెంటుకు మొహం చాటేసి ఆయనకు ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల ఏమంత గౌరవం లేదనే భావన బలపడేట్టు చేస్తారా? లేక సభలో కూడా తాను బయటిలాగే ప్రత్యర్థు లను బెంబేలెత్తించగల సమర్థ నేతగా రుజువు చేసుకుంటారా?    
     - పృథ్వీరాజ్
 

>
మరిన్ని వార్తలు