రాస్‌ను మరిచారు సరే...?

20 Aug, 2015 00:46 IST|Sakshi
రాస్‌ను మరిచారు సరే...?

రోనాల్డ్ రాస్ హైదరాబాద్‌లోని బేగంపేట పరిశోధనా కేంద్రంలోనే దోమ కాటు మలేరియాకు కారణమని కనిపెట్టారు. ఆయనను మరిస్తే మరిచారు... మలేరియా నిర్మూలన పట్ల అయినా పాలకులు వీసమెత్తు శ్రద్ధ చూపడం లేదు. కారణం మలేరియా పేదల రోగం, అందులోనూ ఆదివాసీలకే ఎక్కువగా వచ్చే రోగం. మలేరియా నుంచి ప్రజలను కాపాడాలని రాస్ పడ్డ తపనలో ఒక వంతైనా ప్రభుత్వాలకు, పౌర సమాజానికి ఉండాలి. మలేరియాను పారద్రోల గలిగీ, ఆ పని చేయలేకపోవడమంటే రాస్ కృషిని అవహేళన చేయడమే అవుతుంది.

 ప్రపంచ ప్రజారోగ్యానికి సంబంధించి చిరస్మరణీయమైన గొప్ప రోజు.. 1897 ఆగస్టు 20. అంతకుముందు వరకు ప్రాణాంతకమైన మలేరియా వ్యాధి చెడుగాలుల వల్ల వస్తుందని ప్రపంచం విశ్వసించేది. రోనాల్డ్ రాస్ అనే శాస్త్రవేత్త అలుపెరుగక సాగించిన నిరంతర పరిశోధనల ఫలితంగా అది తప్పని తేలింది. మలేరియా వ్యాధి దోమ కాటు వల్ల సంక్రమిస్తుందని రాస్ చారిత్రాత్మకమైన ఆ రోజునే కనుగొన్నారు. అదీ మన హైదరాబాద్ నగరం లోనే! దోమలో, మనిషిలో రెండు దశలుగా మలేరియా పరాన్నజీవి జీవిత చక్రం సాగుతుందని రాస్ తేల్చారు. ఆయన శాస్త్రీయ ఆవిష్కరణ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 111 దేశాల్లోని కోట్లాది మంది మలేరియా వ్యాధి నుంచి విముక్తి చెందడానికి దోహదం చేసింది.

భారతదేశం మాత్రం ఇంకా మలేరియా వ్యాధి నుంచి విముక్తి చెందలేకపోవడమే విషాదం. దోమలకు నిలయమైన కొండకోనల్లో మలేరియా జ్వరంతో రాలిపోతున్న గిరిజనుల ప్రాణాలు లెక్కలకు అందవు. అందుకే మరపునపడ్డ చరిత్రగా మారిన రోనాల్డ్ రాస్‌ని సంస్మరించుకోవాల్సిన సందర్భమిది. హైదరాబాద్‌లోని బేగంపేట నుంచి సికింద్రాబాద్ వైపు వస్తుంటే, పాత విమానాశ్రయం దగ్గరలో ఎడమవైపున ‘రోనాల్డ్ రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పారసైటాలజీ’ అనే బోర్డు కనిపిస్తుంది. లోపలికి వెళ్లి చూస్తే  శిథిలావస్థలో ఉన్న ఓ పరిశోధనాలయం కనిపిస్తుంది. దాని ఆలనా పాలనా ఉస్మానియా విశ్వవిద్యాలయం జంతుశాస్త్ర విభాగం బాధ్యత. కానీ అలాంటి దాఖలాలేవీ లేవు. మంగళవారం ఒక ఉస్మానియా వర్సిటీ ఉద్యోగి, చెత్తను, గడ్డిని, పిచ్చి మొక్కలను పెరికివేస్తు న్నాడు. ఎందుకని అడిగితే ఆగస్టు 20వ తేదీన ఇక్కడేదో మీటింగు ఉంద న్నాడు. అది ఎందుకో కూడా అతనికి తెలియదు. రాస్ మలేరియా పరిశోధ నలు ఆ సంస్థలోనే జరిగాయి.

 వానాకాలం దోమ గండం
 మన దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో, ప్రధానంగా ఆదివాసీ ప్రాంతాల్లో వర్షాకాలం అంటే ప్రజలకు ప్రాణగండమే. ఏటా మలే రియా మహమ్మారి వల్ల మరణిస్తున్నవారి సంఖ్య అధికంగానే ఉంటోంది. ఇటీవలే ఢిల్లీకి చెందిన ‘తెహల్కా’ ఫొటో జర్నలిస్టు తరుణ్ శరావత్ సైతం ఆదివాసీ జీవితాలపై పరిశోధన కోసం వెళ్లి మలేరియా బారినపడి చని పోయారు. మావోయిస్టు అగ్రనేత అనురాధాగాంధీ లాంటి ఉద్యమకారులు సైతం మలేరియాకు బలైపోయారు. అయితే అతి తక్కువ ఖర్చుతో లభించే మందు సాధారణ మలేరియాను నయం చేయగలుగుతుంది. అది సైతం అందుబాటులో లేక, కొనలేక ఏటా వందలాది విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. 1998లో ఒక్క ఆదిలాబాద్‌లో, కేవలం మూడు నెలల్లో 2,200 మంది ఆదివాసులు మరణించారు. 118 ఏళ్ళ క్రితమంటే ఈ జ్వరా లకు కారణం తెలియదు. ఇటాలియన్‌లో ‘మలే అంటే చెడు అని, ‘ఏరియా’ అంటే గాలి అని అర్థం. ఈ జ్వరాలకు చెడుగాలే కారణమని అంతవరకు పరి శోధకులు భావించేవారు. 1895లో హైదరాబాద్ రావడానికి ముందే మలేరి యాకు దోమలకు సంబంధం ఉందని విశ్వసిస్తున్న రాస్ బేగంపేటలోని పరిశోధన సంస్థలో 1897 జూన్‌లో 20 దోమలను కల్చర్ చేసి పెంచాడు. ఆగ స్టులో హుస్సేన్ ఖాన్ అనే మలేరియా రోగగ్రస్తుని ద్వారా ఎనిమిది దోమల రక్తంలోకి మలేరియా పరాన్నజీవి ప్రవేశించినట్టు కనిపెట్టాడు. దోమలే మలే రియా వ్యాధికి మూలమని ఆగస్టు 20న నిర్ధారించి ప్రపంచానికి చాటాడు.

 ఇష్టం లేకుండానే డాక్టరై...
 భారత సైన్యంలో జనరల్‌గా పనిచేసిన సర్ సీసీజీ రాస్, మటెల్డ దంపతులకు రోనాల్డ్ 1857లో హిమాలయాల సమీపంలోని అల్మోరాలో జన్మించారు. అయితే విద్యాభ్యాసం ఇంగ్లండ్‌లోనే సాగింది. కవిత్వం, సాహిత్యం, సంగీ తం, గణితశాస్త్రాల పట్ల మక్కువ ఉన్న రోనాల్డ్ వైద్య విద్య పట్ల అంత ఆసక్తి లేదు. తండ్రి కోరిక మేరకు  వైద్య విద్యనభ్యసించాడు. అన్ని అర్హతలుగల డాక్టర్‌గా రోనాల్డ్ రాస్ 1881లో భారత్‌కు తిరిగి వచ్చి, ఇండియన్ మెడికల్ సర్వీసులో చేరారు. మొదట మద్రాసు, బర్మా, అండమాన్‌లలో పనిచేశారు. అప్పట్లోనే ఆయనలో ఉష్ణదేశమైన భారతదేశంలో ప్రజల ఆరోగ్య సమ స్యలపై, ముఖ్యంగా జ్వరాలపై పరిశోధనలు చేయాలనే ఆసక్తి కలిగింది. 1892 నుంచి మలేరియానే ఆయన తన ముఖ్య పరిశోధనాంశంగా ఎంచుకు న్నాడు.

1894లో ఇంగ్లండ్ వెళ్ళి డాక్టర్ పాట్రిక్ మాన్సన్ మార్గదర్శకత్వంలో తన పరిశోధనలు ప్రారంభించారు. అప్పటికే డాక్టర్ పాట్రిక్ మాన్సన్ ఉష్ణ మండల దేశాల్లో ప్రబలే ప్రధాన వ్యాధులపై పరిశోధనలు చేస్తున్నారు. మలే రియా జ్వరానికి దోమలు కారణం కావచ్చని డాక్టర్ మాన్సన్ మొదట అభి ప్రాయపడ్డారు. ఆ విషయం రోనాల్డ్ రాస్‌ను అమితంగా ఆకర్షించింది. అయితే దాన్ని రుజువు చేసి చూపాలి. అందుకు భారతదేశమే సరియైన ప్రయోగశాల కాగలదని ఆయన భావించారు. అప్పటి భారత ప్రభుత్వం రోనాల్డ్ రాస్‌ను 1895లో ఇండియన్ మెడికల్ సర్వీసులోకి తీసుకొని, సికిం ద్రాబాద్‌లో ఆర్మీ డాక్టర్‌గా నియమించింది. అలా రాస్ 1895 నుంచి 1897 వరకు దాదాపు రెండేళ్లు బేగంపేట పరిశోధనా కేంద్రంలోనే మలేరియా పరిశో ధనలు చేశారు. దోమ కడుపులో మలేరియా పరాన్నజీవి జీవితం తొలి దశ గడుస్తుందని కనుగొన్న రాస్... బేగంపేటలోనే దోమకు మనిషి ద్వారా, మనిషికి దోమ ద్వారా మలేరియా పరాన్నజీవి వ్యాపిస్తోందని రుజువు చేశాడు. ఆ పరిశోధనలు మన దేశంలోనే, అదీ తెలుగు నేలపైనే జరగడం మనకి గర్వకారణం. రోనాల్డ్ రాస్ సేవలను గుర్తించి 1902లో నోబెల్ బహుమతిని ప్రసాదించారు. ఆయన పేరు మీద 1926లో లండన్‌లో ఉష్ణ మండల వ్యాధుల పరిశోధన సంస్థను ప్రారంభించారు. రాస్ జీవిత చర మాంకం ఆర్థిక ఇబ్బందులతో గడిచింది. 1932, సెప్టెంబర్ 16న 75 ఏళ్ల వయసులో రాస్ మరణించారు.
 మలేరియాలో మన ఘనత  
 మరి ఆయన త్యాగానికి మనం ఇస్తున్న విలువేమిటి? ఆయన అసాధారణ సేవకు కొనసాగింపేమిటి? ఆలోచించాలి. హైదరాబాద్‌లోని విశ్వవిద్యాల యాలు, ప్రభుత్వాలు ఆయనను పూర్తిగా మరచాయి. మలేరియా నిర్మూలన పట్లగానీ, ఆ వ్యాధికి బలైపోతున్న వారి పట్ల గానీ ప్రభుత్వాలకు వీసమెత్తు శ్రద్ధలేదు. అందుకు కారణం మలేరియా ప్రధానంగా పేదల రోగం, అందు లోనూ ఆదివాసీలకే ఎక్కువగా వచ్చే రోగం. దోమలు దూరని కోటల్లాంటి ఇళ్లలో ఉండే వారికి అది పట్టదు. ఒకవేళ ఎక్కడైనా దోమ కుట్టి మలేరియా వచ్చినా సులభంగా నయం చేసే డాక్టర్లున్నారు, మందులున్నాయి. వైద్య సౌక ర్యాలు లేని, అడవుల్లో మురికినీళ్ళ పక్కన, చెట్ల చేమల మధ్య జీవిస్తున్న వాళ్ళు, పట్టణ, నగర మురికివాడల్లో బతికే వారే ఈ వ్యాధికి బలైపోతు న్నారు. ప్రపంచవ్యాప్తంగా 2010లో 21 కోట్ల 90 లక్షల మందికి మలేరియా సోకగా, 40 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్టు అంచనా.

అయితే ఈ లెక్క లన్నీ అరకొర సమాచారమే. ఆదివాసీ ప్రాంతాల్లో, పల్లెల్లో చనిపోతున్న వారి వివరాలను సేకరించేవారే లేరు. ఆసుపత్రిలో మరణిస్తే తప్ప ప్రభుత్వం దాన్ని మలేరియా మరణంగా లెక్కించదు. మన దేశంలో ప్రభుత్వాసుప త్రులు ఎన్ని గ్రామాలకు అందుబాటులో ఉన్నాయో తెలియందికాదు. చాలా దేశాలు మలేరియాను అతి తీవ్ర సమస్యగా భావించి తరిమేసినట్టు ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటించింది. ఇటీవలనే యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మలే రియా లేదని ఆ దేశం సగర్వంగా ప్రకటించింది. ప్రపంచంలో 111 దేశాలు మలేరియా నుంచి విముక్తి కాగా ఇంకా 34 దేశాల్లో ప్రజలు ఆ వ్యాధి బారిన పడుతున్నారు. వాటిలో మన దేశమూ ఒకటి.
 పేదలపైనే దోమల కన్ను
 ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఆదివాసీ గూడేలలో ప్రజలు జ్వరాలతో బాధప డుతున్నట్టు గత వారం రోజులుగా పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఏటా ఇది సర్వసాధారణమైపోయింది. దోమల ద్వారానే వ్యాపించే డెంగ్యూ కూడా గతంలో ఎన్నడూలేని విధంగా వ్యాపిస్తున్నది. ఇది చాలా తీవ్రమైన సమస్య. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గంగదేవిపల్లి ‘గ్రామ జ్యోతి’ కార్యక్రమంలో మాట్లాడుతూ... దోమల వల్ల జ్వరాలు వస్తాయని, దోమలు లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. దోమకాటుకు గురయ్యేది ఎక్కువగా పేదలేననే విషయాన్ని అధికారులు గుర్తిస్తే మంచిది. ధనవంతుల నివాస ప్రాంతాలను అత్యంత పరిశుభ్రంగా ఉండేలా చూసి, పేదల మురికివాడలను పట్టించుకోకపోతే వారి ప్రాణాలకు దోమ గండం తప్పదు.

ప్రజల భాగస్వామ్యంతో పరిసరాల పరిశుభ్రతలో ప్రధానాంశంగా ఉండాల్సింది ఇదే. ఎటువంటి వైద్య సౌకర్యాలూ లేని అటవీ ప్రాంతాల్లోని ప్రజలకు ఆరోగ్య, వైద్య సదుపాయాల కార్యక్రమాలను అందు బాటులోకి తేవాలి. ఆదివాసీ ప్రాంతాల్లోనే కాదు, గ్రామాల్లో సైతం పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు ఉండటంలేదు. మలేరియాలాంటి జ్వరా ల నుంచి ప్రజలను కాపాడాలని రాస్ పడ్డ తపనలో ఒక వంతైనా ప్రభుత్వా లకు, పౌర సమాజానికి ఉండాలి. మలేరియాను పారద్రోలగలిగీ, ఆ పని చేయలేకపోవడమంటే రాస్ కృషిని అవహేళన చేయడమే అవుతుంది.
 

(వ్యాసకర్త: మల్లేపల్లి లక్ష్మయ్య.. సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213
 

Read latest Opinion News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు