ఏడాది తెలంగాణం

8 Jun, 2015 01:04 IST|Sakshi
ఏడాది తెలంగాణం

( సందర్భం)
 తెలంగాణ ఏర్పడి ఏడాది గడచి పోయింది. ఈ ఏడాది ఎట్లా గడిచిందో, మన ప్రయాణం ఎటు సాగుతున్నదో బేరీజు వేసుకోవడానికి ఇది సరైన సమయం.  ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చాలా ప్రయోజనాలనే తెచ్చిపెట్టింది. తెలం గాణకు మునుపెన్నడూ లేని గుర్తింపు దొరికింది. తన అస్థిత్వాన్ని కాపాడు కోవడానికి అవకాశం కలిగింది. తెలంగాణ అభివృద్ధికి కావలసినన్ని నిధులు దక్కినాయి. కృష్ణా, గోదావరి జలాలలో దాదాపు 1,000 టీఎంసీల నీళ్లు న్యాయసమ్మతంగా తెలంగా ణకు దక్కుతాయి. భారత రాజ్యాంగం నీటి పంపకాల విషయంలో రాష్ట్రాన్ని ఒక యూనిట్‌గా గుర్తిస్తుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు, జిల్లాలకు తమ వాటాను అడిగే హక్కు లేదు. ఆ కారణం చేత గతంలో తెలంగాణకు నదీ జలాలలో వాటా దక్కలేదు. ప్రత్యేక రాష్ట్రంగా నేడు ఆ హక్కు వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో, ప్రత్యేకించి సరళీకరణ యుగంలో కాంట్రా క్టర్లు, కార్పొరేట్ శక్తులు, రియల్ ఎస్టేట్ డీలర్ల ప్రయోజనాలను నెరవేర్చాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వ అధికారాన్ని చలాయిం చారు. తెలంగాణ ప్రభుత్వంపై ఆ శక్తుల ప్రత్యక్ష పెత్తనం పో యింది. ప్రజల కొరకే పనిచేయగల పాలనా వ్యవస్థ ఏర్పడింది. తెలంగాణ సమస్యలు ఎజెండా మీదికి వచ్చినాయి. వివిధ రంగాలలో స్థానిక నాయకత్వం ఎదిగే అవకాశం కలిగింది.

 మనకై  మనం ఏర్పర్చుకున్న ప్రభుత్వ పని విధానాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సంవత్సరం చాలదు. అందులోనూ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగుతున్నది. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్‌లో ఉన్న ఆఫీసులను రెండు ప్రభు త్వాలు పంచుకోవాలి. చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందిన కొద్ది రోజులకే ఎన్నికల ప్రకటన వచ్చింది. ఎన్నికైన ప్రభుత్వం రద్ద యి, గవర్నర్ పాలన వచ్చింది. ఈ పరిస్థితులలో ఏ నిర్ణయం జరగలేదు. కాబట్టి రెండు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు ఏర్ప డిన తరువాతనే విభజన ప్రక్రియ ప్రారంభమైంది. దాని వలన ప్రభుత్వం స్థిరంగా పనిచేయడానికి చాలా చాలా సమయం పట్టింది.

ఇంకా విభజన ప్రక్రియ పూర్తికాలేదు. ఉద్యోగుల విభ జనలో కమలనాథన్ కమిటీ తాత్సారం చేస్తున్నది. పబ్లిక్ రంగ సంస్థల విభజన  నత్తనడకన సాగుతున్నది. రెండు రాష్ట్రాలకూ విడి విడిగా హై కోర్టులు ఏర్పడవలసి ఉన్నది. ఉమ్మడి సంస్థలను అడ్డుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు తరచుగా ఇబ్బందులను సృష్టిస్తున్నది. అందువలన విభజన జరిగి సం పూర్ణ తెలంగాణ ఏర్పడకుండా ఏ ప్రభుత్వమూ సమర్థవం తంగా పనిచేయలేదు. ఈ పరిమితులను దృష్టిలో పెట్టుకుని గత ఏడాది పాలనను చూడాలి.
 తెలంగాణ ఉద్యమ ప్రభావం విధాన రూపకల్పనపై ఉన్న ది. కార్పొరేట్ రంగానికి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాధాన్యత తగ్గింది. తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రభుత్వరంగ సంస్థలపై కేంద్రీకరణ పెరిగింది. ప్రభుత్వ వైద్యరంగాన్ని పటిష్ట పరచ డానికి చర్యలు మొదలయ్యాయి. కేజీ నుండి పీజీ వరకూ ఉచి తంగా విద్యను అందించాలన్న ఆలోచన ఈ కోవకు చెందినదే. అదే విధంగా విద్యుత్తును ప్రైవేటు పరం చేయకుండా పబ్లిక్ రం గంలో కొనసాగించడానికి కృషి జరుగుతున్నది. సంక్షేమ రంగంలో కూడా మంచి మార్పులు వచ్చినాయి. పింఛన్లు పెరిగాయి. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని నిర్ణయం జరిగింది. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం జరుగుతున్నది. ఇంటింటికి నీళ్లందించాలన్న వాటర్‌గ్రిడ్ కార్యక్రమం కూడా ప్రజల అవసరాలను తీర్చే పథకమే. అయితే, ఈ పథకాలు సమగ్రంగా అమలులోకి రావలసి ఉన్నది.
 అయితే కొన్ని రంగాలలో ఇంకా కార్యాచరణ రావలసి ఉన్నది. అందులో ప్రముఖమైనవి రెండు. మొదటిది యువతకు సంబంధించిన విధానం. 18-30 ఏళ్ల వయస్కులు మన రాష్ట్ర జనాభాలో దాదాపు 30 శాతం. వీరి ప్రధాన సమస్య ఉపాధి. సరళీకరణ యుగంలో ఉపాధి అవకాశాలు బాగా దెబ్బతి న్నాయి. పబ్లిక్ రంగ సంస్థలను మూసివేసి... ఉన్న పరిశ్రమ లలో కార్మికుల సంఖ్యను తగ్గించి గత ప్రభుత్వాలు ఉద్యోగా వకాశాలను కుదించాయి. కరెంటు కోతలతో చాలా కంపెనీలు ఖాయిలా పడ్డాయి. వ్యవసాయంలో పెట్టుబడులు లేక అభి వృద్ధి మందగించింది. ఆదుకునే నాథుడు లేక చేతి వృత్తుల నడ్డి విరిగింది.

 సరళీకరణ విధానాల వలన కొంతమందికి సంపద దక్కి నా, ఉపాధిలేని అభివృద్ధి కారణంగా మిగతావర్గాలు సంక్షో భంలో చిక్కుకున్నాయి. యువతకు ఉపాధి అవకాశాలు కరువయ్యాయి. ప్రభుత్వ నోటిఫికేషన్లు రాలేదు... అరకొరగా వచ్చిన డీఎస్‌సీ, కానిస్టేబుల్ నోటిఫికేషన్లు తప్ప. ఈ పరిస్థి తుల్లో చాలీచాలని జీతాలతో ప్రైవేటు రంగంలోనో, అసంఘ టిత రంగంలోనో బతుకుదెరువు పొందినవారు కొందరు. బతకలేకపోతున్నవారు మరికొందరు.

 ఈ పరిస్థితిలో యువత తెలంగాణ ఉద్యమాలలో పాల్గొ న్నారు. వారందరూ బతుకుదెరువు అవకాశాలకై ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక నోటిఫికేషన్ రావలసిన అవసరం ఉన్నది. నోటిఫికేషన్ పరిధిలోకి రాని యువకులకు- పది, ఇంటర్‌తో చదువు ఆపినవారు, ఐటీఐ, పాలిటెక్నిక్ చదివినవారు- ఉపాధిలో శిక్షణ ఇవ్వాలి. ఉపాధి అవకాశాలను పెంచాలి. ఈ విషయంలో ఒక విధాన ప్రకటన, కార్యాచరణ వెలువడవలసిన అవసరం ఉన్నది. ఇక వ్యవసాయం ప్రభుత్వం పట్టించుకోవలసిన రెండవ రంగం. మిగిలిన రాష్ట్రాల వలెనే తెలంగాణలో  వ్యవసాయం ప్రధాన జీవనాధారం. మొత్తం జనాభాలో గ్రామాలలో జీవించేవారు దాదాపు 61 శాతం. సగటున ప్రతి రైతు కుటుంబానికి 3.51 ఎకరాలు ఉండగా, అందులో సగం సాగునీటి సౌకర్యం లేనిది.  వీరందరికీ వ్యవసాయం తప్ప వేరొక ఆదాయ మార్గం లేదు. నీటి అవకాశాలు తక్కువగా ఉన్న తెలంగాణవంటి ప్రాంతాలలో హరిత విప్లవం రైతును ఆదుకోలేకపోయింది. ఈ ప్రాంతంలో చిన్న రైతులు ఎక్కువ. నీటి వసతి లేక ఖర్చుతో కూడిన హరిత విప్లవావం వల్ల అప్పులపాలయ్యారు. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి ఒక కార్యాచరణను తయారుచేయడం చాలా అవసరం.
 ఇంకొక విషయం ప్రత్యేకంగా చెప్పుకోవలసి ఉన్నది. తెలంగాణ ఏర్పాటుతో ప్రజల చైతన్యం బాగా పెరిగింది. గతం లో ఆంధ్ర పాలకులు తెలంగాణను విస్మరించినందునే ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేశారు. మన రాష్ట్రంలో అందరి సమస్యలు పరిష్కారమౌతాయన్న భావనతో ప్రజలున్నారు. ప్రభుత్వంవైపు ఆశతో చూస్తున్నారు. తమ సమస్యలను పట్టించుకోకపోతే తీవ్ర మనస్థాపానికి, నిరాశకు గురవుతు న్నారు. ఆయా వర్గాలు సమస్యలను లేవనెత్తినప్పుడు వెంటనే స్పందించడం చాలా అవసరం. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చిన లేక మంత్రులకు తెలిసిన సమస్యలపట్ల చర్యలు ఉంటున్నాయి. కానీ మొత్తంగా పాలన మరింత మెరుప డాలంటే ప్రజల నివేదనలపై స్పందించే తత్వాన్ని పాలనా యంత్రాంగం అలవర్చుకోవాలి. ఆఖరుగా ఒకమాట. తెలంగాణ ఉద్యమంలో ప్రజలు సంఘటితంగా నిలబడి సానుకూల నిర్ణయాన్ని సాధించుకు న్నారని మరిచిపోవద్దు. ప్రజలు చైతన్యవంతులైతే పాలన కూడా బాధ్యతాయుతంగా సాగుతుంది. తెలంగాణ నిర్మాణం లో విద్యావంతులు మౌనంగా ఉండరాదు.

ప్రొఫెసర్ జయ శంకర్ చెప్పినట్లు ప్రజల సమస్యలకు కారణాలు తెలుసుకొని, పరిష్కారాలను అన్వేషించి ఆ విషయాలపై ప్రజలను చైతన్య వంతులను చేయగలిగితేనే అందరికీ న్యాయం చేయగల అభి వృద్ధి సాధ్యమని గ్రహించాలి. ఆయనే చెప్పినట్టు పౌర వేదికలు తెలంగాణ నిర్మాణానికి తోడ్పడగలవు. ఈ సంవత్సర కాలంలో పౌరవేదికలు నిలదొక్కుకొని భవిష్యత్తు కార్యాచ రణను రూపొం దించుకోవడం ఒక శుభ పరిణామం.
 


(వ్యాసకర్త: కోదండరాం,  తెలంగాణ జేఏసీ చైర్మన్,
 ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆచార్యులు )

 మొబైల్ : 9848387001

మరిన్ని వార్తలు