లోకారాధన

17 Nov, 2015 01:11 IST|Sakshi

రఘువంశరాజుల సద్గుణాలను కీర్తించకుండా ఉండ లేక రఘువంశ మహాకావ్యాన్ని తాను రచిస్తున్నానని కాళిదాస మహాకవి పేర్కొన్నాడు. సద్గుణ నిధులైన రఘువంశ రాజులు తమకు లభించిన రాజ్యాధికారం ప్రజలపై పెత్తనం చెలాయించడానికి అని ఎన్నడూ భావించలేదు. తమ వంశంలో పుట్టిన వారికి అన్ని యోగ్యతలుంటేనే వారిని రాజ్యపాలనకు అర్హులని భావించారు.

 తమ సంతానంలో ఎవరైనా ప్రజలకు ఇబ్బందు లను కలిగిస్తూ, తమ వంశ మర్యాదకు కళంకాన్ని తీసుకొని వస్తూ ఉంటే వారిని రాజ్యం నుండి బహిష్కరించడా నికి కూడా రఘువంశ రాజులు ఏ మాత్రం వెనుకంజ వేసేవారు కారు. సామాన్య ప్రజలలో సద్గు ణములను, తగిన సామర్థ్య మును కూడా ఎవరైనా కలిగి ఉంటే వారితో తమకు రక్తసంబంధం లేకపోయినా వారిని చేరదీసేందుకు రఘువంశ రాజులు ఏమాత్రం సంకోచించే వారు కారు.
 రఘువంశరాజులు రాజ్యపరిపాలనను భగవదా రాధనగా భావించేవారు. శ్రీరామచంద్రుడు 11 వేల సంవత్సరాల కాలం భగవంతుని ఉపాసనారూపంగా రాజ్యాన్ని పరిపాలించాడు అని సంక్షేప రామాయణం లోని ‘‘దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ / రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి॥అనే శ్లోకం ద్వారా తెలుస్తోంది.

 శ్రీరామచంద్రుడు ధర్మబద్ధమైన పరిపాలనను అందించినందువల్లనే ప్రజలు కూడా ధర్మమార్గాన్ని అనుసరిస్తూ జీవనాన్ని కొనసాగించారు. శ్రీరామచం ద్రుడు తన ప్రాణానికి ప్రాణమైన లక్ష్మణునికన్న, ప్రియ మైన ధర్మపత్నియైన సీతాదేవికన్న తనకు మహోన్న తమైన కీర్తిప్రతిష్టలను కలిగిస్తూ ఉండే, తనలోని స్నేహము దయ మొదలగు గుణాలకన్న తనకు లభించే రాజ్యసుఖాలకన్న లోకారాధన రూపమైన రాజ్యపరి పాలనే ముఖ్యమని భావించినాడు.

 అందుకే లోకారాధన రూపంగా కొనసాగే రాజ్య పరిపాలన నిమిత్తం దేనినైనా ఎంత ముఖ్యమైన వారి నైనా వదులుకోవడానికి సిద్ధమని, తాను రాజ్యపరిపా లన విషయంలో అవసరమైతే ప్రాణాలను అయినా విడుస్తాను కాని ప్రజలకిచ్చిన వాగ్దానములను వదల లేనని శ్రీరామచంద్రుడు ప్రతిజ్ఞా పూర్వకంగా పేర్కొ న్నాడు. రఘువంశ రాజులు ప్రజలను ప్రభువులుగా, తమను ప్రజాసేవకులుగా భావించుకున్నారు. అంతే తప్ప ప్రభువులం అనే అహంకార ధోరణిని వారు ప్రదర్శించనేలేదు.

 రాజు ధర్మాత్ముడైతే ప్రజలు ధర్మాత్ములౌతారు. రాజు పాపాత్ముడైతే ప్రజలు పాపకార్యాల్లో ఆసక్తి కలిగియుంటారు. రాజునే ప్రజలు అనుసరిస్తారు అనే విషయాన్ని ‘‘యథా రాజా తథా ప్రజా’’ అనే సూక్తి ధృవ పరుస్తున్నది. ప్రజలను పరిపాలించాలనే భావనతో కాకుండా వారిని ఆరాధించాలనే సంకల్పంతోనే రాజ్యాధికారాన్ని చేపట్టిన ఆదర్శ ప్రభువు శ్రీరామచం ద్రుడు. అందుకే నాటి నుండి నేటి వరకు రామరాజ్య మనే ప్రసిద్ధి చెక్కుచెదరకుండా ఉన్నది. శ్రీరామచం ద్రుని ప్రజాపరిపాలనా విధానం పరిపాలకులందరికీ ఆదర్శప్రాయం కావాలని ఆశిద్దాం.
 సముద్రాల శఠగోపాచార్యులు
 

మరిన్ని వార్తలు