కశ్మీర్‌కు బాటలు వేసిన ఆగ్రా

28 Dec, 2015 23:58 IST|Sakshi
కశ్మీర్‌కు బాటలు వేసిన ఆగ్రా

ఉభయులకు దిద్దుబాటు అనేది అలవడలేదు. రాజకీయ ప్రయోజనాల కోసం గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నారే తప్ప, ముఖాముఖీ చర్చలకు తగిన వాతావరణాన్ని సృష్టించుకోలేక పోతున్నారు. ఆగ్రా ప్రకటన ముసాయిదా మన దేశంలో వెలుగుచూడగలిగితే మన పాలకుల ప్రకటనలు ఎన్ని అబద్ధాలతో కూడుకుని ఉన్నవో బయటపడుతుందని కూడా నూరానీ రాశారు. వాజ్‌పేయి, జస్వంత్‌ల నోళ్లు నొక్కి, అద్వానీ ప్రభృతులు ఆగ్రా ఒడంబడికను ప్రభుత్వం తిరస్కరించేటట్టు చేశారని కూడా నూరానీ పేర్కొన్నారు.
 
 ‘ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు ఒకరోజున మళ్లీ అఖండ భారత్‌గా ఏకమైపోతాయని ఆరెస్సెస్ ఇప్పటికీ విశ్వసిస్తున్నది. ఇది యుద్ధం ద్వారా గాక ఉభయ దేశాల ప్రజల సుహృద్భావంతో సాధ్యమవుతుంది. కొన్ని చారిత్రక కారణాల వల్ల అరవైయ్యేళ్ల నాడు విడిపోయిన ఈ రెండు భాగాలు తిరిగి ఏకమయ్యే రోజు వస్తుంది. అయితే ఈ ఏకీకరణ సాంస్కృతిక జాతీయవాదంతోనే సాధ్యం’.
     -రాంమాధవ్ (బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఆరెస్సెస్ నాయకుడు, 26-12-‘15)

 ‘బీజేపీ, దాని నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఇండియా, పాకిస్తాన్‌లు రెండూ సర్వతంత్ర, స్వతంత్ర దేశాలన్న ఈ మా పార్టీ వైఖరిని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 1999లో లాహోర్ పర్యటనలోనే స్పష్టం చేశారు. పాకిస్తాన్ వేరే దేశంగా విడిపోయింది. కాబట్టి ఆ దేశ జాతీయ చిహ్నమైన మీనార్-ఎ-పాకిస్తాన్‌ను సందర్శించడం సరికాదని కొందరు వారించినప్పుడు ఆ వైఖరిని తాను తిరస్కరించానని ఒక విందులో వాజ్‌పేయి వెల్లడించారు కూడా. అప్పటి నుంచి ఆ వైఖరికే బీజేపీ కట్టుబడి ఉంది.’
     -ఎం.జె. అక్బర్ (బీజేపీ అధికార ప్రతినిధి, 27-12-‘15)

 ఆర్థిక స్వాతంత్య్రం, ప్రగతి జయప్రదంగా నిర్వహించుకోగల ప్రభుత్వాలు విదేశాంగ వ్యవహారాలను సజావుగా తీర్చిదిద్దుకోగలుగుతాయి. అలాకాక, ఆంతరంగిక వ్యవహారాలలో పరాయి దేశాల జోక్యానికీ, తీర్పరితనానికీ అవకాశం కల్పించే పాలకుల వల్ల స్వతంత్ర విధానాలు అనుసరించి నిభాయించుకురావడం ఎంత దుర్లభమో మన దేశ అనుభవమే ఉదాహరణ. అత్యున్నత స్థాయిలో కూడా గోప్యతను పాటించి ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన రహస్య, ఆకస్మిక లాహోర్ యాత్ర గురించి రాంమాధవ్, ఎంజె అక్బర్ ఇంత కంగారుగా పరస్పర విరుద్ధ ప్రకటనలు ఎందుకు చేయవలసి వచ్చింది? ఆరెస్సెస్ సహా పరివార్‌ను ఆశ్చర్యపరిచిన మోదీ ఈ పర్యటనకు కారణం ఏమై ఉండాలి? ఈ ప్రశ్నలకు సమాధానం ఢిల్లీ లేదా, ఇస్లామాబాద్‌లలో దొరకదు. ఎందుకంటే, రెండు దేశాల ప్రభుత్వాలను, ప్రధానులను (ఏ పార్టీ అయినా) ప్రభావితం చేయగల తాళాలూ, వాటి చెవులూ అమెరికా చేతుల్లోనే ఉన్నాయి.

 ఆ ఇనుపతెర అమెరికాదే
 మన వేలు విడిచిన పాత వలస సామ్రాజ్యవాదానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంగ్లో-అమెరికన్ నయా వలస పాలకులు 21వ శతాబ్దంలో కూడా ఆడింది ఆటగా, పాడింది పాటగా వ్యవహరిస్తున్నారు. దేశ విభజనకు కారకులైన ఈ శక్తులే, స్వతంత్రంగా మనుగడ సాగిస్తున్న ఇండియా, పాకిస్తాన్‌లను పెట్టుబడులు, అభివృద్ధి పేరుతో వలలో వేసుకున్నాయి. హిట్లర్ తరువాత కూడా ప్రపంచ ఆధిపత్యం కోసం ఆ విధానాలనే అనుసరిస్తూ, ఆసియా మీద పెత్తనం కోసం కాలు దువ్వుతున్నాయి. భారత్, పాక్‌ల మధ్య సఖ్యత లేకుండా చేయడం, ఇతర ఇరుగు-పొరుగుతో కూడా సుహృద్భావ సంబంధాలు ఏర్పడకుండా వ్యూహాలు రచించడం ఇందులో భాగమే.

పాక్‌తో మాత్రమే కాదు;  చైనా, శ్రీలంక, నేపాల్, మైన్మార్‌లతో భారత్‌కు స్నేహవారధి ఏర్పడకుండా ఆంగ్లో-అమెరికన్ సామ్రాజ్యవాద పెట్టుబడి కూటాలు శతథా యత్నిస్తున్నాయి. ఇందుకోసం ఏదో ఒక మిష మీద ఆసియా దేశాలనూ, అరబ్ దేశాలనూ  ఆ కూటాలు సామ్రాజ్యవాద యుద్ధతంత్రంలోకి లాగుతున్నాయి. ఈ వ్యూహంలో దిగకుండా ఎదురుతిరిగిన దేశాలను ‘ఉగ్రవాదుల’ జాబితాలో చేర్చడానికి కూడా వెనకాడడం లేదు. నిన్నటి దాకా తామే పెంచి పోషించిన తాలిబన్, ఇతర ఇస్లామిక్ ఉగ్రవాదులను ఈ పనికోసం ఎంతకాలం ఉపయోగించుకోగలిగితే అంతకాలం అగ్రరాజ్యాలు ఉపయోగించుకుంటాయి కూడా. రెండవసారి అధ్యక్ష ఎన్నికలలో గెలవడానికి జూనియర్ బుష్ చేసిన ప్రమాదకర ప్రయోగమే ట్విన్ టవర్స్ మీద దాడి అని నిపుణులతో ఏర్పడిన ట్రూత్ కమిషన్ వెల్లడించిన సంగతిని వింటున్నాం. మొదటిసారి అధ్యక్ష ఎన్నికలలో వాస్తవ కౌంటింగ్‌లో ఓడిపోయిన  బుష్ రెండోసారి నెగ్గడానికి పన్నిన వ్యూహమే, ఆ ఘటన అని కమిషన్ చెప్పింది.

ఈ అభిప్రాయాన్ని మాఫీ చేయడానికి మళ్లీ ఉగ్రవాద ముద్రనే ఆయన వినియోగించుకున్నాడు. తాను ఎవరిని ఉగ్రవాదులని ప్రకటిస్తానో, భారత్, పాక్ సహా అన్ని దేశాలు కూడా వారిని ఉగ్రవాదులేనని చెప్పాలని, లేకుంటే ఇలా చెప్పని వారిని కూడా ఉగ్రవాదులుగానే ప్రకటిస్తానని బుష్ హెచ్చరించారు. ఈ క్రమంలోనే అఫ్ఘానిస్తాన్, ఇరాక్‌లపైన దాడులకు తెగబడి పెత్త ఎత్తున ధనమాన ప్రాణాలను హరించారు. ఈ విధానంతోనే భారత్, పాక్‌లు తన చేయి జారిపోకుండా అమెరికా కూటమి జాగ్రత్త పడుతోందని గమనించాలి. మన పొరుగునే ఉన్న అఫ్ఘానిస్తాన్‌ను నాటో కూటమికి స్థావరంగా చేసినది అమెరికాయే.

అంటే ఇండియా,పాక్‌లను ఈ పరిస్థితికి అలవాటుపడేటట్టు చేసి, కూతవేటు దూరంలోనే ఉన్న జమ్మూ-కశ్మీర్‌కు నాటో సేనలను నడపాలన్నది అమెరికా యోచన. నిజానికి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వైదొలగిన తరువాత కశ్మీర్‌ను ఒక వ్యూహాత్మక స్థావరంగా భావించి అమెరికా కన్నువేసింది. ఈ చూపు అప్పుడే చెదరదు కూడా. భారత్ విభజనకు కారణమై, కశ్మీర్ భవితవ్యాన్ని ప్రపంచ దేశాల ముందు ప్రశ్నించడమే కాకుండా ఆ ప్రాంత స్వతంత్ర ప్రతిపత్తిని ఒక ముల్లుగా మార్చిన వారే  భారత్-పాక్‌ల మైత్రికి అడ్డంగా నిలుస్తూ, రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలు మెరుగు పడకుండా చూస్తున్నారు.
 సానుకూల చర్చలకు సాయపడరు
 విభజన జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు కశ్మీర్ సమస్య ఉన్నట్టా లేనట్టా అన్న ప్రశ్నకు భారత్-పాకిస్తాన్ పాలకవర్గాలు ఎవరికి తోచిన వాదన వారు వినిపిస్తున్నారు. కశ్మీర్ సమస్యను రావణకాష్టంగా మండిస్తున్నారు. రెండు దేశాల నేతలు ఐక్యరాజ్య సమితిని తీర్పరిగా పెట్టుకున్నారు. కానీ పరస్పర ద్వేషంతో పెట్టిన అర్జీలను వాపస్ తీసుకోలేదు. వాటిని వెనక్కి తీసుకునే వరకు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడవు. సరికదా, తగాదాలు ముదిరి ఆసియా, ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాలను అమెరికా లక్ష్యంగా చేసుకుంటుంది. మోదీ తాజాగా జరిపిన లాహోర్ రహస్య యాత్ర పైకి మనకు కనిపించేది ఒక ఊదరగా మాత్రమే. అయితే దీని వెనుక  జమ్మూ-కశ్మీర్ లంపటం నుంచి మోదీని బయటపడవేయాలన్న అమెరికా వ్యూహం ఉన్నదన్న సంగతి విస్మరించరాదు. భారత్, పాక్ ప్రధానులు త్వరలో వాషింగ్టన్‌లో కలవబోతున్నారు. ఇంతకు ముందు ఊఫా (రష్యా) సమావేశంలోనూ, తర్వాత పారిస్ పక్కవాటు సమావేశాలలోనూ మోదీ, షరీఫ్ కలసినట్టు కనిపించినా, ఆ ఇద్దరు ఆ సమావేశాలకు వేర్వేరు భాష్యాలు చెప్పి, ఇరుదేశాల ప్రజలను మభ్యపెట్టారని చెప్పడం అతిశయోక్తి కాదు.

అమెరికాలో జరగబోయే సమావేశం పేరుకు అణ్వస్త్ర కేంద్రాల రక్షణ వ్యవహారాల గురించి (మార్చి 31,ఏప్రిల్ 1, 2016) చర్చించేందుకు ఒబామా ఏర్పాటు చేసిన సమావేశం. వాస్తవానికి ఒబామా వారిని రప్పిస్తున్నది కశ్మీర్ సమస్య గురించి చర్చించుకోవడానికే. పాక్, భారత్ అణ్వస్త్రాల వైపు చూడకుండా తమ మీద ఆధారపడే దేశాలుగానే ఉండాలన్నదే అమెరికా ఆశయం. కానీ క శ్మీర్ సమస్య పరిష్కారం అయిపోయిందని ఇక్కడ ఎవరూ భావించడం లేదు. అయితే అంతిమ పరిష్కారం గురించి మాట్లాడరు.

 ఆగ్రా ప్రకటనను బహిర్గతం చేయాలి
 కశ్మీర్ సమస్య పరిష్కారానికి 1997 నుంచి వాజ్‌పేయి అనుకూలుడేనని ఇప్పుడు చెబుతున్నారు. పర్వేజ్ ముషార్రఫ్, వాజ్‌పేయి జూలై 2001లో ఆగ్రాలో సమవేశమయ్యారు. అయితే ఆ సమావేశం ఫలితం ఏమిటన్నది ఇంతవరకు వివరించలేదు. కానీ నాటి పాక్ విదేశాంగ మంత్రి అబ్దుల్ సత్తార్ మాత్రం ఆగ్రాలో ఉభయులకూ ఆమోదయోగ్యంగా వెలువడిన ముసాయిదా ప్రకటన చర్చలకు సానుకూల వాతావరణం సృష్టించిందనీ, అదే భవిష్యత్తులో చర్చలకు పునాది అనీ ప్రకటించాడు. కానీ సత్తార్ పత్రాన్ని ఆ రోజు రాత్రే వాజ్‌పేయి కేబినెట్ తారుమారు చేసిందని, ఈ విషయాన్ని జూలై 19, 2001న ‘ది హిందు’ వెల్లడించిందని న్యాయనిపుణుడు ఏజీ నూరానీ తెలిపారు (ది కశ్మీర్ డిస్ప్యూట్, వాల్యూం:2, 1947-2012). అక్కడికీ మన విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి నిరుపమారావు సయితం ఆగ్రాలో కుదిరిన ఒప్పంద పాఠం ముసాయిదా పత్రం తుదిరూపం పొందవలసి ఉందనే చెప్పారు. అయితే ఇలా కుదిరినట్టే కుదిరి మళ్లీ విఫలం కావడం 1955 నుంచి, 1999 వరకు జరుగుతూనే ఉంది. అంటే ఉభయులకు దిద్దుబాటు అనేది అలవడలేదు.

రాజకీయ ప్రయోజనాల కోసం గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నారే తప్ప, ముఖాముఖీ చర్చలకు తగిన వాతావరణాన్ని సృష్టించుకోలేక పోతున్నారు. ఆగ్రా ప్రకటన ముసాయిదా మన దేశంలో వెలుగుచూడగలిగితే మన పాలకుల ప్రకటనలు ఎన్ని అబద్ధాలతో కూడుకుని ఉన్నవో బయటపడుతుందని కూడా నూరానీ రాశారు. వాజ్‌పేయి, జస్వంత్‌ల నోళ్లు నొక్కి, అద్వానీ ప్రభృతులు ఆగ్రా ఒడంబడికను ప్రభుత్వం తిరస్కరించేటట్టు చేశారని కూడా నూరానీ పేర్కొన్నారు. కాబట్టి ఇరు దేశాల శ్రేయస్సు కోసం ఆగ్రా ప్రకటనను ఇప్పటికైనా విడుదల చేయాలి.

 1947లో లోయలో పర్యటించినప్పుడు అమృత్‌సర్ ఒడంబడికను (మార్చి 16, 1846)గాంధీజీ ‘కశ్మీర్‌ను చుప్తాగా అమ్మేసిన విక్రయ దస్తావేజు’ అన్నారు. ఉర్దూ కవి హఫీజ్ జలందారీ లాహోర్-అమృత్‌సర్ ఒప్పందాలను ఇలా వ్యంగ్యంగా కవిత్వీకరించాడు, ‘క శ్మీర్ ప్రజల భవితను రూ. 75 లక్షలకు కుదువపెట్టారు/ స్వర్గతుల్యమైన కశ్మీర్ విలువను రూ. 75 లక్షలకు కుదించారు/ అవును రూ. 75 లక్షలకే/ నమ్మండి కేవలం రూ. 75 లక్షలే కశ్మీర్ విలువ’ నాటి నుంచి నేటి దాకా కశ్మీరీల కడుపుమంటకు కారణం అదే. 

(వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు)

 

మరిన్ని వార్తలు