‘ఉస్మానియా’కు ఉరితాడు!

22 May, 2015 00:43 IST|Sakshi
- దిలీప్‌రెడ్డి

అధికార బలంతో కేసీఆర్ రేపు ఏ పదకొండు ఎకరాలో, మరెంతో స్వాధీనపరచుకోవచ్చు, కానీ విశ్వవిద్యాలయ చరిత్రలో ఈ ముఖ్యమంత్రి ఒక కబ్జాకోరుగా మిగలడం ఖాయం. ఇదే వైఖరి కొనసాగితే, దేశ దేశాల విద్యార్థులతో విరాజిల్లుతున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం క్రమంగా ప్రాభవం కోల్పోవడం జరగక తప్పని దుష్పరిణామం! ఇందిరాపార్కు, సంజీవయ్య పార్కు, కేబీఆర్ పార్కు, ఓయూ క్యాంపస్.... ఇలా వేళ్లమీద లెక్కపెట్టేంత తక్కువ సంఖ్యలో నగరంలో ఉన్న లంగ్‌స్పేస్‌లను హరించకుండా ప్రత్యామ్నాయాలు ఆలోచించవచ్చు కదా! 
 
 ఉస్మానియా యూనివర్సిటీ స్థలంలో పేదలకు ఇళ్లు కట్టిస్తామన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఆలోచనకన్నా, ఆయన మాట్లాడిన తీరు, ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ధోరణి అభ్యంతరకరంగా, అంతకుమించి జుగుప్సాకరంగా ఉంది. ‘‘బాజాప్తా తీసుకుంటాం...ఏం చేసుకుంటరో చేసుకోండి... ఏం తమాషా చేస్తున్నరా?...వాని అయ్యకు బయపడ... నెనసలే మొండోన్ని, జాగ తీసుకొని తీర్త’’ అన్న మాటల వెనుక అధికార దర్పం, అహం ధ్వనిస్తోంది. ప్రజాస్వామ్యపాలనా వ్యవస్థల్లో ఇది అనుచితం, అవాంఛనీయం. పేదలకు ఇళ్లు కట్టిస్తామంటే ఎవరూ అభ్యంతర పెట్టరు. కానీ, ఉస్మానియా యూనివ ర్సిటీ స్థలం లాక్కొని, అందులోనే పేదలకు ఇళ్లు కట్టివ్వాలన్నది మొండివా దన. సహజంగానే విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర విద్యావంతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇప్పటికే దయనీయ స్థితికి చేరిన ఉన్నత విద్య ఇటువంటి ఆలోచనా ధోరణి వల్ల మరిం త దిగజారడం ఖాయం. దాదాపు వందేళ్ల కింద ఒక చారిత్రక సన్నివేశంగా ఆవిర్భవించిన ఉస్మానియా యూనివర్సిటీ ఉనికికి, దాని స్వయంప్రతిపత్తికి ఇది పెద్ద దెబ్బ అవుతుంది. విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల్ని ఏర్పరచక, ఉపాధ్యాయుల్ని నియమించక ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నత విద్య పట్ల ప్రభు త్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరికి ఇది పరాకాష్ట. ముఖ్యమంత్రి కేసీఆర్ వేనోళ్ల పొగిడే నిజాం రాజు, ఒక నియంతై కూడా ఎంతో దూరదృష్టితో 2,800 ఎక రాలు ఈ చారిత్రక విశ్వవిద్యాలయానికి కేటాయించారు.
 
 ఇతర విద్యాసం స్థలకు కేటాయింపులు, అధికారిక, అనధికారిక కబ్జాల తర్వాత అది దాదాపు 1,300 ఎకరాలుగా మిగిలింది. కబ్జాల తొలగింపునకు ఏనాడూ చిత్తశుద్ధి చూపని ప్రభుత్వం స్వయంగా కబ్జాకు సాహసిస్తోంది. అధికార బలంతో... రేపు ఆయన ఏ పదకొండు ఎకరాలో, మరెంతో స్వాధీనపరచుకోవచ్చు, కానీ విశ్వవిద్యాలయ చరిత్రలో ఈ ప్రభుత్వం, ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి ఒక కబ్జాకోరుగా మిగలడం ఖాయం. ఇదే వైఖరి కొనసాగితే, దేశ దేశాల విద్యా ర్థులతో విరాజిల్లుతున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం క్రమంగా ప్రాభవం కోల్పోవడం జరగక తప్పని దుష్పరిణామం!
 
 పడిలేచే కడలి తరంగం....
 ఉస్మానియా విశ్వవిద్యాలయంపై ఆధిపత్యానికి రాజకీయశక్తులు యత్నించ డం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇటువంటి దాడులను తిప్పికొట్టి విశ్వవిద్యాలయం తన స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంది. ముఖ్యమంత్రిగా కాసు బ్రహ్మానందరెడ్డి విశ్వవిద్యాలయం వీసీగా డీఎస్ రెడ్డిని తేవాలని నిర్ణ యించినపుడు విద్యార్థి, ఉపాధ్యాయవర్గాలు వ్యతిరేకించాయి. ఆ నిర్ణయం స్థానిక పరిస్థితులు, ఆకాంక్షలకు వ్యతిరేకమేగాక, స్వయం ప్రతిపత్తికి భంగ కరమని సుప్రీంకోర్టుకు వెళ్లి దాన్ని నిలవరించారు. ఆ తర్వాత ఎన్టీరామారావు హయాంలో ‘ఏపీ కమిషనరేట్ ఆఫ్ హయర్ ఎడ్యుకేషన్’ను ఏర్పాటు చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని దాని పరిధిలోకి తెచ్చే యత్నం చేశారు.
 
 ఓయూ ఉపాధ్యాయుల సంఘం (ఔటా) దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది అనుచిత జోక్యమౌతుందని, విశ్వవిద్యాలయ స్వయం ప్రతిపత్తికి భంగక రమని ఉద్యమించి దాని అమలును నిలిపివేయించగలిగారు. చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పేరులో స్వల్ప సవర ణతో ‘ఏపీ ఉన్నత విద్యామండలి’ని ప్రతిపాదించారు. ఔటా దీన్నీ తీవ్రంగా వ్యతిరేకించినా, అత్యున్నత న్యాయస్థానం దాని వాదనను తిరస్కరించడంతో ‘ఏపీ ఉన్నత విద్యామండలి’ ఏర్పాటైంది. చంద్రబాబు హయాంలోనే 2000 తొలి దశకం ఆరంభంలో ప్రపంచ బ్యాంకు సూచనల మేరకు మరిన్ని సంస్కరణలకు యత్నించారు. వాటినీ విద్యార్థి సంఘాలు, ఔటా తీవ్రంగా వ్యతిరేకించి, పోరు బాట బట్టి ఆ ప్రతిపాదనల్ని నిలువరించగలిగాయి. ప్రభుత్వ అనుకూలత, వ్యతిరేకతలతో నిమిత్తం లేకుండా జరిగిన అనేక పోరా టాలకు, ఉద్యమాలకు ఉస్మానియా క్యాంపస్ వేదికైంది.అందుకే అది భావ వ్యక్తీకరణకు ప్రతీక అయిన ఉద్యమాల పురిటిగడ్డ! అంతెందుకు, ఇదే కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి నిర్వహించిన ఒక పెద్ద సమావేశానికి క్యాంపస్‌లోని ఠాగూర్ ఆడిటోరియం వేదికైంది, ఆయన ఉద్యమ గర్జనతో స్వరం కలిపింది. ‘తనకు సాయపడ్డవారిని ఎన్నటికీ క్షమించని తత్వం మనిషిద’ని చలం వ్యంగ్యంగా అన్న మాటల్ని కేసీఆర్ ఇప్పుడు నిజం చేస్తున్నారనిపిస్తుంది.
 
 బహు విధ రక్షణకు ‘సోషల్ ఫెన్సింగ్’!
 ఉస్మానియా విద్యార్థులు ఎప్పుడూ చైతన్యశీలురే. అస్థిత్వవాదం నుంచి సామ్యవాదం వరకు అన్ని రకాల పోరాటాల్లోనూ సైన్యమై నిలుస్తూనే ఉన్నా రు. కబ్జాకోర్ల భూదురాక్రమణలు, పాలకుల ఆధిపత్యం, అణచివేతలకు వ్యతి రేకంగా ‘సోషల్ ఫెన్సింగ్’ అనే కొత్త పదాన్ని వారు వాడుకలోకి తెచ్చారు. భౌతిక దురాక్రమణల నుంచే కాక భావజాలపరమైన దురాక్రమణల నుంచీ రక్షించుకుంటామంటూ పలు వైవిధ్యభరితమైన పోరాటాల్ని రచించారు. ఇప్పుడింకొకటి అంతే! దురాక్రమణల్ని అడ్డుకునేందుకు నవనీతరావు వీసీగా ఉన్నపుడు క్యాంపస్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారు. తార్నాకా, హబ్సిగూడ, రవీంద్రనగర్, రామంతాపూర్, అంబర్‌పేట వైపున ఇప్పుడున్నదదే! 2,800 ఎకరాల స్థలంలో కొన్ని వందల ఎకరాల్ని ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు విశ్వ విద్యాలయమే స్వచ్ఛందంగా ఆర్టీసీ ఆసుపత్రి, ఎన్‌ఐఎన్, రామంతపూర్ పబ్లిక్ స్కూల్ తదితర సంస్థలకి స్వచ్ఛందంగా ఇచ్చింది. మాణికేశ్వర్‌నగర్ వైపు చాలా దురాక్రమణలు జరిగాయి.
 
 నిజానికి ఉస్మానియా బహుళ ప్రాంగణ (కాంపస్) విశ్వవిద్యాలయం. ప్రధాన ప్రాంగణంలోనే కాకుండా నిజాం కాలేజీ, కోఠీ విమెన్స్ కాలేజీ, సికిం ద్రాబాద్ పీజీ కాలేజీ, బేగంపేటలో ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్’ నిర్వహి స్తున్న ప్రాంగణంతో సహా పలు స్థలాలు ఈ యూనివర్సిటీ పరిధిలోవే! ‘సెస్’కు లీజుకిచ్చిన ఐదెకరాల్లోంచి సీఎం క్యాంపు కార్యాలయం పేరిట ప్రభు త్వం ఎకరం స్థలానికి ఎసరు పెడుతుండటాన్నీ ఓయూ విద్యార్థులు తీవ్రం గానే పరిగణిస్తున్నారు. గోదావరిపై నిజామాబాద్ ఎగువన ప్రాజెక్టు కట్ట డమా? తెలంగాణ, కర్ణాటక, మరాఠ్వాడాల్లో విద్యాగంధాల్ని వెదజల్లే ఒక గొప్ప విద్యాసంస్థను నెలకొల్పడమా? అన్న ప్రశ్న తలెత్తినపుడు... నిజాం రాజు మేధావులతో, చర్చించి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పాటుకే మొగ్గారు! ఫ్యూడల్ రాజే చర్చించినపుడు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు చర్చలు, జరుపకుండా ఏకపక్ష నిర్ణయాలెలా తీసుకుంటాయో ఎవరికీ అంతుబట్టనిది.  
 
 ఎంత అవసరమో ఎవరు నిర్ణయించేది?
 విశ్వవిద్యాలయాలకు అంత స్థలం అవసరం లేదని సీఎం అనడం విస్మయ కరం. నూరేళ్ల కింద నిజాం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ ప్రపంచ పర్యటన చేసి హార్వర్డు, కేంబ్రిడ్జి తదితర విశ్వవిద్యాలయాల్ని పరిశీలించి.... క్యాంపస్ ఎంత విస్తీర్ణంలో ఉండాలో ప్రతిపాదించింది. ఈజిప్ట్‌లోని కైరో విశ్వవిద్యాలయం నమూనాలో ఆర్ట్స్ కాలేజీ నిర్మాణాన్ని సూచించింది కూడా అదే! పెరిగే జనాభా, విద్యావసరాలు, విశ్వవిద్యాలయాల భవిష్యత్ సేవల్ని దృష్టిలో ఉంచుకొనే విస్తీర్ణాన్ని నిర్ణయిస్తారు. అందుకే, ఇప్పుడు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ 8,183 ఎకరాల్లో ఉండగా,  జార్జియా (28,000), పాల్‌స్మిత్ కాలేజీ (14,200), డ్యూక్ విశ్వవిద్యాలయం (8,709), డార్ట్‌మౌత్ (50,000), యూనివర్సిటీ ఆఫ్ సౌత్ (13,000), యూనివర్సిటీ ఆఫ్ ఫిలిప్పీన్ (36,240) వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలన్నీ పెద్ద పెద్ద విస్తీర్ణాల్లోనే ఉన్నాయి. మన వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అంత స్థలం అనవసరమనడం తప్పు. అక్కడ నేరుగా పంట పొలాల్లోనే పరిశోధనలు, ప్రయోగాలు చేస్తుంటారు. కనుక అంత విస్తీర్ణం అవసరమే. జీబీ పంత్ వ్యవసాయ, సాంకేతిక విశ్వ విద్యాలయం 13,000 ఎకరాల్లో ఉంది. ఇప్పటికే కార్పొరేట్ పాఠశాలలు, డిగ్రీ, ఎంబీఏ, ఇంజనీరింగ్ తదితర ఉన్నత వృత్తి విద్యా కాలేజీలను కనీస మైదానాలు లేని బహుళ అంతస్థుల భవనాల్లో నిర్వహిస్తూ, విద్యార్థి సంపూర్ణ వికాసాన్ని గంగలో కలిపారు. పాలకుల్లో దూరదృష్టి లోపిస్తే ఇక విశ్వవిద్యాల యాలకూ ఆ దుర్గతి తప్పదు.

విశ్వవిద్యాలయం స్వయం ప్రతిపత్తి దృష్ట్యానేగాక హైదరాబాద్-సికిం ద్రాబాద్ కాంక్రీట్ జంగిల్‌లో మనిషికి స్వచ్ఛమైన గాలితో ఊరటనిచ్చే ఖాళీ స్థలాల (లంగ్ స్పేసెస్) పరంగా చూసినా ఓయూ క్యాంపస్‌ను కాపాడు కోవాల్సిందే! దాన్ని మరింత కుదిస్తామనడం పర్యావరణపరంగా ఆత్మ హత్యా సదృశమే! ‘ఓయూ స్థలం బాజాప్తా తీసుకుంటామ...’ని సీఎం ప్రక టించిన సమావేశంలోనే ఆయన మరోమాటా అన్నారు. ‘‘ఇక్కడి వాతావ రణం మనిషికి అనుకూలంగా ఉంటుంది. ఎక్కడెక్కడి వారు హైదరాబాద్‌లో ఉండటానికి ఆసక్తి చూపుతారు, మనం కాంక్రిట్ జంగిల్‌లా చేయడం వల్ల ఇక్కడ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి’’ అని సెలవిచ్చారు. ఇందిరాపార్కు, సంజీవయ్య పార్కు, కేబీఆర్ పార్కు, ఓయూ క్యాంపస్.... ఇలా వేళ్లమీద లెక్కపెట్టేంత తక్కువ సంఖ్యలో ఉన్న ఈ లంగ్‌స్పేస్‌లను హరించకుండా ప్రత్యామ్నాయాలు ఆలోచించవచ్చు కదా!
 
ఉన్నత విద్యను ఇంకా నీచ స్థితికి దిగజార్చొద్దు!

 వచ్చీ పోయే పాలకపక్షాలతో నిమిత్తం లేకుండా నిరంతరాయంగా సాగేది ప్రభుత్వం. అధికారం విషయంలోనేగాక, ప్రజలకు సేవలు, ఫలితాల నందించడంలోనూ ప్రభుత్వాలు జవాబుదారీతనం చూపే బాధ్యత నిరంత రాయంగా సాగాలి. రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాల్లో కనీసం ఒక్క దాని కైనా వీసీ లేకపోవడాన్ని బట్టి ఉన్నత విద్యపట్ల మన పాలకుల శ్రద్ధాసక్తుల్ని అంచనా వేయొచ్చు! కూర్చొని, మాట్లాడి, నిర్ణయం తీసుకోవడానికి కొన్ని గంటలు వెచ్చించలేని దుస్థితి. ఉస్మానియాలో ఒకప్పుడు 2,000 మంది బోధనా సిబ్బంది ఉండేవారు.
 
 కోర్సులు పెరిగి, విద్యార్థులు పెరుగుతున్నా క్రమంగా బోధకుల సంఖ్య 1,600కు, అటుపై 950కి, చివరకు 650కి తగ్గిపో యినా ఎవరూ పట్టించుకోరు. ఏటా రిటైరయ్యేవాళ్లు అయిపోతూనే ఉన్నారు. ఖాళీలు భర్తీ కావడం లేదు. కాంట్రాక్టు ఉద్యోగులతో కాలం వెళ్లదీస్తున్నారు. ప్రపంచంలోని 200 అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల జాబితాలో మన దేశానికి చోటు దక్కలేదు. 276 నుంచి 300 స్థానాల్లో మాత్రం... దేశంలోని రెండు సంస్థలకు చోటు లభించింది. అది చాలదని దూరదృష్టి లోపించిన ప్రభు త్వాలు... విశ్వవిద్యాలయాల స్థలాల్ని కూడా కాజేయడం మొదలెడితే ఉన్నత విద్యకు భరోసా ఏది? పిల్లల భవిష్యత్తేం కాను?

దిలీప్ రెడ్డి, సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్
ఈమెయిల్: dileepreddy@sakshi.com     

మరిన్ని వార్తలు