జైలుపక్షి అద్భుత రచన అవర్ లేడీ ఆఫ్ ది ఫ్లవర్స్

2 Aug, 2014 01:16 IST|Sakshi
జైలుపక్షి అద్భుత రచన అవర్ లేడీ ఆఫ్ ది ఫ్లవర్స్

తెలుసుకోదగ్గ పుస్తకం: ఆ రచయిత తల్లి వేశ్య. పిల్లాణ్ణి కని ఏడు నెలలు మాత్రమే పెంచి పిల్లాణ్ణి ఒక వడ్రంగికి దత్తత ఇచ్చింది. పిల్లాడు సరిగా పెరగలేదు. తరచూ ఇంట్లోంచి పారిపోవటం, చిల్లర దొంగతనాలు బాల్యం నుంచే అలవడ్డాయి. పదిహేనవ ఏటనే ఒక కరెక్షనల్ స్కూల్లో గడిపాడు. పద్దెనిమిదవ ఏట ప్రభుత్వోద్యోగంలో చేరాడుగాని అతణ్ణి హోమో సెక్సువల్‌గా గుర్తించి తొలగించారు. ఆ తర్వాత దొంగతనాలతో పాటు అనేక ఇతర నేరాలు చేస్తూ పురుష వేశ్యగా యూరప్‌లో తిరిగాడు. వరుసగా పది శిక్షల తర్వాత 1949లో యావజ్జీవ కారాగార శిక్ష విధించినప్పుడు ఫ్రాన్స్‌లో మహామహులైన జా హుక్తూ, జా పాల్ సార్త్,్ర పికాసోల అప్పీలుతో శిక్ష రద్దు చేశారు. ఆ తర్వాత తిరిగి ఎప్పుడూ జైలుకెళ్లలేదు.
 
 ఇంతకూ మనం మాట్లాడుకుంటున్నది గొప్ప ఫ్రెంచి నవలా నాటక రచయిత, కవి  ‘జా జెనె’ గురించి. పలు జైళ్లలో రకరకాల నేరస్తుల మధ్య గడిపిన ఈయన తొలి నవల ‘అవర్ లేడీ ఆఫ్ ది ఫ్లవర్స్’ (1943). ఈ నవల కూడా జైలులోని రహస్య జీవితం గురించే. ఇందులోని పురుష పాత్రలన్నింటికీ ఆడపేర్లే ఉంటాయి. అందరూ ఆంటీలూ క్వీన్‌లూ. ఇది ‘సెలబ్రేషన్ ఆఫ్ బ్యూటీ ఇన్ ఈవిల్’.
 
 సార్త్‌క్రు ఈయనంటే ఎంత గౌరవం అంటే ‘సెయింట్’ అని పోలుస్తూ ఈయన మీద పెద్ద పుస్తకమే రాశాడు. మరో తాత్వికుడు జాన్ డెరిడా కూడా ఈయన జీవితాన్నీ కృషినీ అధ్యయనం చేశాడు.  నేరస్తుల గురించి అందరూ ఎంతో కొంత రాస్తారు చదివీ వినీ. కాని నేరస్తులే తమ ప్రత్యామ్నాయలోకం గురించి రాస్తే సాహిత్యం మరెంత సుసంపన్నం అవుతుంది! జెనె నాటకాలు ‘ది బాల్కనీ’, ‘ది బ్లాక్స్’ జగత్ప్రసిద్ధం. జెనె రాసినవి కన్ఫెషన్స్ కావు. అవి విజయగాథలు. ‘నేరంలో ఒక అలౌకిక సౌందర్యం ఉంది’ అంటాడు జెనె.
 - ముక్తవరం పార్థసారథి

మరిన్ని వార్తలు