పేద కలలు... పెద్ద కలలు

29 Nov, 2014 00:31 IST|Sakshi
పేద కలలు... పెద్ద కలలు

రెండు తెలుగు రాష్ట్రాల పాలకులు పోటాపోటీగా కలలు కనేసి జనం మీదకు వదులుతున్నారు. జనం ఎన్నికల హామీల మాటే మరచేంత గా ఈ కలల వరద పారుతోంది. పాలకుల్లాగే పాలితులను కూడా పగలూ, రేయీ కలలు వెన్నాడుతున్నాయి. రైతులు, కూలీలు, కార్మికులు, మధ్యతరగతి వేతన జీవులు, శ్రామిక మహిళలు తదితర ఓటర్ల జాబితా జీవులందరి కలలు కామన్‌గా పీడ కలలే. పాలకుల కలల్లా అవి అరచేత స్వర్గం చూపడం లేదు, నిత్య నరకాన్ని చూపుతూ, భయపెడుతున్నాయి. తోడేళ్లలా తరుముతున్నాయి. చురకత్తుల్లా గుండెల్ని కోస్తున్నాయి.
 - వర్ధెల్లి మురళి
 
 కలలు రెక్కలు తొడగకపోతే రైట్ సోదరులు విమానయానాన్ని కనిపెట్ట గలిగేవారేనా?గ్రాహంబెల్‌కు టెలిఫోన్ ఆలోచన తట్టేదా? మార్కోని రేడియోను సృష్టించేవాడేనా?... ప్రపంచంలోని అద్భుత ఆవిష్కరణలన్నీ కొందరు గొప్పవాళ్ల మహా స్వప్నాలేనంటారు అబ్దుల్ కలామ్. ‘కలలు కనండి, వాటిని సాకారం చేయడం కోసం పనిచేయండి’ అని యువతకు ప్రబోధిస్తూ ఆయన దేశవ్యాప్తంగా ప్రచారం సైతం సాగించారు. ఇంటర్నెట్‌లో వెతికితే కలలు కనడంపై గొప్పవాళ్ల ఉత్తేజపూరిత సందేశాలు కుప్పలు తెప్పలు. ఈ సందేశాలన్నింటి సారాంశమొక్కటే... ‘స్వప్నాలు మన ఔన్నత్యానికి సోపా నాలు’. ఈ లెక్కన మన రెండు తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు ఎంతో బ్రహ్మాం డంగా ఉన్నట్టే. ఎందుకంటే, ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ కలల సేద్యం మహా జోరుగా సాగుతోంది. పేద, ధనిక తేడా లేకుండా ఈ కలల ప్రభంజనం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది.
 
 కలలు కామన్ పాయింటే కానీ, కలల్లోని కథల్లో, కథనాల్లో చాలా తేడాలుంటున్నాయి. కథా కథనాల ప్రకారం విభజిస్తే పేదల కలలు వేరు. ‘పెద్దల’ కలలు వేరు. పాలకుల కలలు వేరు, పాలితుల కలలు వేరు. పాలకులంటే ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు, ఎన్నికల్లో వారికి పెట్టుబడులు పెట్టినవారు... వారి అడుగులకు మడుగులొత్తే ఉన్నతాధికార బృందాలు, ‘పెద్దలు’ మెచ్చిన కాంట్రాక్టర్లు, ప్రభుత్వమేదైనా పని చక్కబెట్టు కోగల నేర్పున్న వ్యాపార వర్గాలు తదితరులు. వారి కలలు సహజంగానే నవనవోన్మేషంగా కళకళలాడుతూంటాయి. అధికారం, వనరులు చేతుల్లోనే ఉన్నందున, వారి కలలు కూడా  స్పెషల్ గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ దట్టించిన కలర్‌ఫుల్ డిజిటల్ సినిమాలను తలదన్నేలా ఉంటాయి. దోసిళ్లతో అమృతాన్ని జుర్రుకున్న అదృష్టవంతులు వారు. వారికి ప్రతి రాత్రి అమృతం కురిసిన రాత్రే. స్వప్నాల్లోనూ జాజి పూల అత్తరు దీపాలు, మంత్రలోకపు మణిస్తంభాలు మెరుస్తుంటాయి. సృజనాత్మక ఆలోచనా తరంగాలు శివమెత్తుతుంటాయి.
 
 ఇటీవలే చీలిపోయిన రెండు రాష్ట్రాల్లోని పాలక వర్గాలు అన్నిట్లో పోటీ పడుతున్నట్టే... పోటాపోటీగా కలలు కనేసి, రోజుకొకటిగా తాజా కలలను జనం మీదకు వదులుతున్నాయి. జనం ఎన్నికల హామీల మాటే మరచేంత గా తెలుగునాట కలల వరద పారుతోంది. ఒకరు సింగపూర్‌ను ఎత్తుకొచ్చి దొడ్లో కట్టేసుకుంటే, మరొకరు బుర్జ్ ఖలీఫాను పీక్కొచ్చి పెరట్లో నాటేసుకుంటున్నారు. భజన బృందాల కలల సందడి తోడై అధినేతలు కలల పూనకం ఆవహించి ఊగిపోతున్నారు. కనులు మూసినా, కనులు తెరచినా వారికి కలలే కలలు...  కోటి రంగుల్లో, హైటెక్ హంగుల్తో వెలిగిపోతున్న ఆ కలల లోకంలోకి ఒక్కసారి తొంగిచూద్దామా?
 
 బాబుగారు తృప్తిగా నిద్రపోతున్నారు... ఆయన నొసటి మీద మొదలైన స్వప్న వృత్తాలు గిర్రున రోదసికి ఎగిశాయి. అంతే... కృష్ణాతీరం వెంబడి ఒక మహా ఆధునిక ఆంధ్రనగరం ప్రత్యక్షం! అది డజన్ సింగపూర్‌లకు, అరడజన్ షాంఘైలకు సమానమని భజంత్రీల మోత ఘోషిస్తోంది. పున్నమి రాత్రి నిండు చందమామ పండు వెన్నెల్లో తన నగర సౌందర్యాన్ని తనివితీరా చూసుకుం దామనుకున్న బాబుగారికి... కృష్ణానదికి రెండువైపులా విస్తరించిన మహాన గరం కనిపించింది. అసెంబ్లీ, సచివాలయం లాంటి  పరిపాలనా భవనాలన్నీ నదికి దక్షిణం వైపున కొలువు తీరగా, సీఎం క్యాంపు కార్యాలయం మటుకు ఉత్తరం వైపునుంది. హైదరాబాద్, విజయవాడ రహదారిలో ఇబ్రహీంపట్నం దాటగానే కుడివైపు తిరిగి, ఒక కిలోమీటర్ వెళ్లగానే క్యాంపు కార్యాలయం. దాని వెనుక లంకంత పెరడు. ఆ పెరటి లంకలో  అశోకవనం లాంటి ఉద్యానవనం. అందులో కోకిల కూజితాలు, మయూరాల నాట్యాలు, బంగారు లేళ్ల పరుగులు. వనం దాటగానే కిందకు మెట్లు...వాటిని తాకుతూ ప్రశాంతంగా, నిండుగా ప్రవహిస్తున్న కృష్ణానది. చివరి మెట్టు మీద నిలబడ్డ బాబుగారికి ఎదురుగా హంస వాహనంలాంటి నౌకను చూస్తే... నదీ విహారం చేస్తూ నగర సౌందర్యం చూడాలనిపించింది. నింగిలోని నిండు చంద్రుడు నదిలో పున్నమి దీపాన్ని వెలిగించాడు.
 
 వెన్నెలలాగే వెలిగిపోతున్న నదిలో, అదిగో అల్లంత దూరాన... భవానీ ద్వీపం స్పష్టంగా కనబడుతోంది. నౌక మెల్లగా కదులుతోంది. నదికి రెండు వైపులా ఆకాశహర్మ్యాలు, వాటిలో వెలుగుతున్న విద్యుద్దీపాల ధగధగలు. దూరానికి కూడా కళ్లు మిరుమిట్లు గొలిపిస్తున్నాయి. పకడ్బందీగా ప్లాన్ చేసి మరీ కంటున్న కలగదా... దక్షిణం వైపంతా ప్రభుత్వ కార్యాలయ భవనాలు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు తదితరాలు. ఉత్తరం వైపంతా ఐటీ కంపెనీలు, ఫైనాన్స్ సంస్థలు, వాణిజ్య సంస్థలు వగైరా. ఈ భవనాలన్నీ మనవాళ్లవే. ముందు జాగ్రత్తతో ఆ భూములన్నీ మనోళ్ల చేత కొనిపించేశాంగా... మనక్కావల్సిన వారంతా రెండు చేతులా ఆర్జించారు. మరో నాలుగైదు ఎన్నికల వరకు ఢోకా లేదు.
 
 పడవ భవానీ ద్వీపం పక్క నుంచి వెళ్తోంది. ఎదురుగా ప్రకాశం బ్యారేజీ. ముందు ముందు చినబాబు ఈ రాజ్యాన్నీ, ఐశ్వర్యాన్నీ ఎలా నెట్టుకొస్తారో? అయినా చినబాబు ఆంధ్రావనికే పరిమితమవడం దేనికి? అప్పుడెప్పుడో భారతీయులు ఆగ్నేయాసియా దేశాలను కూడా పరిపాలించారట. సింగపూర్‌ను రాజధానిగా చేసుకొని చినబాబు కూడా ఆ దేశాలన్నిటినీ పాలిస్తే ఎంత బాగుండు! అన్నట్టు... ఏనాటికైనా ఒక తెలుగువాడు అమెరికా అధ్యక్షుడు కావాలన్నది ఎన్టీఆర్ కోరిక. తాతగారి కోరికను చినబాబుగాక మరెవరు తీరుస్తారు? బయట అలికిడికి నిద్రా భంగమైంది. కల చెదిరింది. బాబుగారికి ఆగ్రహం కలిగింది. ఆరా తీశారు. రాజధాని ప్రాంత నిర్వాసిత రైతులట. అన్యాయం జరిగిందంటూ తెల్లవారకముందే క్యాంపు కార్యాలయం ముట్టడించేశారు. పోలీసులు లాఠీలతో పరామర్శిస్తున్నారు. అదీ సంగతి. అభివృద్ధిని మన ప్రజలు ఎప్పటికి అర్థం చేసుకుంటారో, ఏమోనని గొణుక్కుంటూ బాబుగారు పట్టె మంచం దిగారు.
 
 ఆంధ్ర పాలకుడైన చంద్రబాబు ‘సింగపూర్ నైట్స్’ కలలు కంటుంటే, తెలంగాణ పాలకుడు కేసీఆర్ ‘అరేబియన్ నైట్స్’కు అమ్మమ్మల్లాంటి కలలుగంటున్నారు. స్వతహాగా భావుకుడు, సహజ కవి కావడం వల్ల కలలు కనడానికి ఆయనకు భజంత్రీల సాయం అక్కర్లేదు. తనంతట తానుగానే ఎన్ని కొత్త కొత్త మాయాలోకాలనైనా సృష్టించేయగలరు. ఇప్పటికే అనేక స్వప్నాలను ఆయన జనం మీదకు వదిలారు. ఊరూరా ఆయన కలలు ఊట చెరువుల్లా ఊరి, జనాలకు నోరూరిస్తున్నాయి. తాజాగా మరికొన్ని కొత్త కలలు గిర్రుగిర్రున సుళ్లు తిరుగుతున్నాయి.
 
  హైదరాబాద్ నగరంలో అందమైన, సువిశాలమైన మంచినీటి తటాకం. దాని పేరు హుస్సేను సాగరం. దాని పక్కనే ప్రపంచంలోనే ఎత్తయిన కొత్త భవనం. మూడువేల అడుగుల ఎత్తు! దాని చివరి అంతస్తుపై కుర్చీలో దర్జాగా కేసీఆర్. ఆయనకు ఎడమ పక్కన పశ్చిమాసియాకు ప్రాతినిధ్యం వహిస్తూ దుబాయ్ షేక్ బుర్జ్ ఖలీఫాపై ఆశీనులయ్యారు. ఇక ఈశాన్య దిక్కులో తూర్పు ఆసియాకు ప్రాతినిధ్యం వహిస్తూ చైనా అధ్యక్షుడు షాంఘై టవర్‌పై సిద్ధంగా ఉన్నారు. ప్రపంచంలోనే సంపన్నుడైనందువల్ల బ్రూనై సుల్తాన్ కౌలాలంపూర్‌లోని పెట్రోనాస్ టవర్స్‌ను అద్దెకు తీసుకుని మరీ ఆగ్నేయాసియా తరఫున ఆ టవరెక్కారు. దక్షిణాసియా నుంచి కేసీఆర్ ఉండనే ఉన్నారు. ‘ప్రపంచంపై ఆసియా ఆర్థిక ఆధిపత్యం కోసం’ ఆ నలుగురి ఈ ‘శిఖరాగ్ర’ సమావేశం. సింబాలిక్‌గా ఉంటుందని ‘శిఖరాల’పెకైక్కి బైఠాయించారు.
 
 టెలీకాన్ఫరెన్స్ ప్రారంభమైంది. కేసీఆర్ కీలకమైన రెండు ప్రెజెంటేషన్స్ ఇవ్వబోతున్నారు. ఒకటి... వర్షాల కోసం ఎదురు చూడకుండా, మబ్బుల్లోనే విత్తనాలు చల్లి ఆనపకాయలు (సొరకాయ పదం నిషేధం) విరగ పండించి గ్రహాంతర జీవులకు ఎగుమతి చేసేయడం. ఇందుకు అవసరమైన సాంకేతిక సహకారం ఇచ్చి పుచ్చుకోవడం. రెండు... అంతరిక్షం అంతటా సోలార్ ప్యానెళ్లను వేలాడదీసి లక్షలాది మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేయడం. దీంతో తెలంగాణలో అన్ని అవసరాలకు 24గీ7 ఉచిత విద్యుత్ సరఫరాకు గ్యారంటీ. మిగిలిన విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు చౌకధరలకు సరఫరా చేస్తారు. బాబుకు మాత్రం డబుల్ రేటు. పైసా తగ్గేది లేదు. రవ్వంత ప్రతిపక్షం వాడొకడు ఇంటి ముందట నానా రభస చేయడం మొదలెట్టాడు.
 
  కల చెదిరింది. ఆసియా ‘శిఖరాగ్ర’ సమావేశం రద్దయింది. ఇదే సమయంలో రెండు రాష్ట్రాలనూ మరో కలల ప్రపంచం కుదిపేస్తోంది. పాలకుల్లాగే పాలితులను కూడా పగలూ, రేయీ కలలు వెన్నాడుతున్నాయి. రైతులు, కూలీలు, కార్మికులు, మధ్యతరగతి వేతన జీవులు, శ్రామిక మహిళలు వగైరా... ఓటర్ల జాబితా జీవులందరి కలలు కామన్‌గా పీడకలలే. తెలుగు పాలకుల కలల్లా అవి అరచేతి స్వర్గం చూపడం లేదు, నిత్య నరకాన్ని చూపుతూ, భయపెడుతున్నాయి. తోడేళ్లలా తరుముతున్నాయి. చుర కత్తుల్లా గుండెల్ని కోస్తున్నాయి. ప్రాణాల్ని తోడేస్తున్నాయి.
 
 కూటికోసం, కూలికోసం పెద్ద నగరానికో, గల్ఫ్‌కో వెళ్లిన బతుకు బాటసారి ఆచూకీ తెలియదు. ‘పల్లెటూళ్లో తల్లికేదో పాడు కలలో పేగు కదిలింది’. అర్ధరాత్రులూ, అపరాత్రులూ, ఎప్పుడైనా చెప్పకుండానే వచ్చి, పోయే కరెంటు కోసం బావికాడి మోటరు దగ్గరే పడున్న మొగుడ్ని పాము కాటేసినట్టు, ప్రాణం పోయినట్టు కట్టుకున్న ఆలికి ఎందుకో పీడకల. అప్పులిచ్చి, నెత్తురు పీల్చి, పరువుదీసిన వడ్డీ బాబుల అవమానాలు తట్టుకోలేక... తలొంచి కష్టం చేయడమే తప్ప నడుం వాల్చి ఎరగని కొడుకు కరెంటు తీగకు వేలాడినట్టు ఓ వృద్ధుడిని ఎందుకో నిత్యమూ వెంటాడుతుందీ దుర్మార్గపు పీడ కల.
 
 రుణ మాఫీ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసి...చూసి...దగాపడ్డ  రైతులకు క్షణక్షణమొక పీడకల. అసలు, వడ్డీలు మాయమై చితికిన బతుకులు కాస్త తెరిపిన పడతాయనుకుని మోసపోయిన డ్వాక్రా మహిళలకు వెన్నాడే నీడల్లా పీడకలలే కలలు. ప్రకృతి  ప్రకోపానికి రెక్క విరిగిన రైతులకు, ఇల్లువాకిళ్లు పోగొట్టుకున్న బాధితులకు... ఆదుకునే నాథుడే కరువై బతుకే బరువైన పీడకల. కొత్త రాష్ట్రాలు, కలలుగనే ముఖ్యమంత్రుల నయా జమానాలో ఉద్యోగం వెదుక్కుంటూ ఇంటికే వస్తుందనుకున్న నిరుద్యోగికి చావుకి, బతుక్కి మధ్య తేడా ఏముందనిపించే వైరాగ్యపు పీడకలలు.
 
 పెరిగే ఖర్చులతో, పెరగని జీతంతో రోజురోజుకీ అథోజగతికి, అధ్వాన స్థితికి దిగజారుతున్న అనునిత్య సతమతపు మధ్యతరగతి వేతన జీవికి... అంతులేని అగాథాల్లోకి పడిపోతున్నట్టు విడవక వచ్చే చేటు కల. కలలోనైనా, ఇలలోనైనా కష్టాలు, కన్నీళ్లతో భయం భయంగా బతకాల్సివస్తున్న సమస్త వృత్తుల జీవులంతా, శ్రమ జీవులంతా కలిసి హైటెక్ కలలుగంటున్న భాగ్యశాలులకు సమష్టిగా చేసుకుంటున్న విజ్ఞాపన ఒక్కటే...   ఓట్లేసి మిమ్మల్ని శిఖరాగ్రాలకు ఎక్కించిన వారి పీడ కలలకు కారణాలను కనిపెట్టేందుకు తక్షణమే ఒక విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసి, నివారణ చర్యలు చేపట్టండి.   

మరిన్ని వార్తలు