కవిత: పావురం కళ్లు

22 Feb, 2014 00:54 IST|Sakshi
కవిత: పావురం కళ్లు

మెల్లిగా లోకం పై వెలుతురు పరుచుకునేవేళ
 ఎక్కడి నుంచి వచ్చి వాలుతుందో
 ఒక తెల్లటి పావురం నా కిటికీ మీద
 అప్పుడు నేను నా విచారాల్ని, సంతోషాల్నీ
 తెల్లటి కాగితంపై అక్షరాలుగా చల్లుతూ ఉంటాను
 అద్దం పై నిలిచిన నీళ్లలా అవి నన్ను ప్రతిబింబిస్తూ
 కవిత్వంలా రూపుదిద్దుకోవడాన్ని చూస్తుంటాను
 కిటికీ గాజు తలుపుల్ని ముక్కుతో కొడుతూ
 పావురం పిలుస్తుంది నన్ను
 పావురాలు కవిత్వం కన్నా గొప్పవి కావన్న
 అతిశయంతో దాన్ని ఎన్నడూ పట్టించుకోను
 ఎన్నో ఏళ్లుగా అది వదలకుండా
 అట్లా నన్ను పిలుస్తూనే ఉంది
 చివరకి తలెత్తి చూస్తే దాని చిన్ని
 నక్షత్రాల్లాంటి కళ్లలో అనిర్వచనీయ
 జీవ కవిత్వపు జాడలు కదలాడుతూ నన్ను పలకరిస్తాయి
 అప్పుడు కాగితంపై నేను చల్లిన అక్షరాలన్నీ
 హటాత్తుగా మాయమై ఎటో ఎగిరిపోయాయి
 అనాదిగా కవులు రాసిన కవిత్వాలన్నీ
 పావురాలై ఆకాశంలోకి ఎగిరిపోయాయేమో
 అందుకేనేమో అవి అట్లా రెక్కల్ని విప్పి
 రెండు ఆలీవ్ కొమ్మల్ని పట్టుకొని
 స్వేచ్ఛా కాంక్షని, శాంతి సందేశాన్ని మోస్తూ
 లోకం అంతటా ఎగురుతున్నాయి
 పావురం కళ్లలోని దయకన్నా
 ఎవరి కవిత్వం గొప్పది చెప్పు?
 - విమల

మరిన్ని వార్తలు