కవిత్వానికి కన్నీరద్దిన కవి జాషువ

24 Jul, 2016 02:14 IST|Sakshi
కవిత్వానికి కన్నీరద్దిన కవి జాషువ

 కవులు మూడు రకాలుగా ఉంటారు. మొదటి రకం వాళ్ళు తాము కవిత్వం రాసిన కాలానికి ప్రాతినిధ్యం వహించి, తర్వాతి కాలంలో తెరమరుగుకు వెళ్ళిపోతారు. భావ కవులు ఇలాంటి వాళ్ళు. రెండవ రకం వాళ్ళు తాము కవిత్వం రాసిన కాలంలో సూర్యతేజంతో వెలిగిపోతారు. తర్వాతి కాలంలో తమ అవ సరం లేకపోయినా, తమవర్గ వారసుల ద్వారా చర్చలో నలు గుతూ ఉంటారు. పౌరాణిక చారిత్రక కవులు ఇలాంటి వాళ్ళు. మూడవరకం వాళ్ళు తాము కవిత్వం రాసిన కాలంలో నిరాదర ణకు, వివక్షకు గురై తర్వాతి కాలంలో తిరుగులేని దీపధారు లుగా వెలుగొందుతారు. గురజాడ, గుర్రం జాషువ ఇలాంటి వారు. (‘‘గురజాడ 1915లో మరణించినా. ఆ తర్వాతనే జీవించడం ప్రారంభించారు’’ అన్న కృష్ణశాస్త్రి మాట జాషు వకు కూడా వర్తిస్తుంది.)
 
 గుర్రం జాషువ 19వ శతాబ్దం చివరలో పుట్టిన భారతీయ దళితకవి. సంఘ సంస్కర ణోద్యమం ఉచ్ఛదశలోను, భారత స్వాతంత్య్రోద్యమం పరిణామ దశలోను ఉండగా పుట్టి, నగ్జల్బరీ ఉద్యమం పురుడు పోసుకుంటున్న కాలం దాకా బతికిన కవి (28-9-1895  24-7-1971). భావకవిత్వం తొలిదశలో ఉన్నకాలంలో కలం బట్టి అభ్యుదయ సాహి త్యోద్యమ కాలమంతా గొప్ప రచనలు చేసిన కవి జాషువ. విప్లవ సాహిత్యం మొలకదశలో ఉండగా ఆయన మరణించాడు. 76 ఏళ్ళ జీవితంలో 50 ఏళ్ళకు పైగా సాహిత్య జీవితం గల జాషువ ఆధునిక తెలుగు కవులలో అనేకవిధాలుగా విశిష్టత గల కవి. సంఘ సంస్క రణ, భారత స్వాతంత్య్ర భావ, అభ్యుదయ కవిత్వాల సంగమం ఆయన.
 
 సగర మాంధాతాది షట్చక్రవర్తుల సంకీ ర్తన దశ నుంచి కొత్తలోక దర్శనం దాకా పరిణమించిన కవి జాషువ. దేవుడు లేడనే నాస్తికులను హెచ్చరించే దశ నుండి దేవుడినే హెచ్చరించే ధైర్యం చేసిన కవి. పద్య కవిత్వ యుగంలో పుట్టి, గేయం, పాట, వచన కవిత్వ యుగాలలో ప్రధాన రచనలు చేసినా, పద్య కవిగానే స్థిరపడిన కవి జాషువ. చాతుర్వర్ణ వ్యవస్థను వందలేళ్లుగా కీర్తించిన పద్యంతోనే ఆ వ్యవస్థను చీల్చి చెండాడాలన్న పట్టుదల కూడా కావచ్చు. శత్రువు ఆయుధంతోనే శత్రు వును జయించాలన్న లక్ష్యం కూడా కావచ్చు. ఆధునిక భావాలను అభివ్యక్త్తం చేయడానికి కూడా పద్యాన్ని ఉపయోగించవచ్చునని జాషువ నిరూపించాడు.
 
 భావకవులలో జాషువ ప్రత్యేకమైన కవి. ఆయన ఊహాలోక విహారి కాదు. వాస్తవ ప్రపంచ సంచారి. కావ్యఖండికలు, ఖండకావ్యాలు స్వీకరించి దైనందిన జీవిత సత్యాలనే చిత్రించాడు. వాటికి కండపుష్టి కలిగించాడాయన. తెలుగు కవిత్వంలో ‘జీవునివేదన’ స్థానంలో ‘జీవన వేదన’కు పీటవేసిన కవి జాషువ. పౌరాణిక, చారిత్రాత్మక, సాంఘిక వస్తువులలో దేనిని స్వీకరించి కవిత్వం రాసినా, అందులో తనదైన దళితానుభవం అంత స్సూత్రంగా ఉంటుంది. భారతదేశ చరిత్రను జాషువ ఎక్కడా అగౌరవపరచలేదు. సామా జిక వ్యవస్థ మీద ఆర్థిక, సాంఘిక, రాజకీయ దృష్టి కోణాలనుంచి విమర్శనాత్మక కవిత్వం రాశాడు. హిందూ, ముస్లిం, క్రైస్తవ వస్తువులన్నిటినీ కవిత్వీకరించాడు.
 
 గౌతమ బుద్ధుడు, ఏసుక్రీస్తు, గాంధీ వీరిని ఒక త్రయంగా జాషువ అనేక పర్యా యాలు కీర్తించాడు. అంబేడ్కర్‌ను గురించి జాషువ తక్కువగా పద్యాలు రాసినట్లు కని పిస్తున్నప్పటికీ. ఆయన కవిత్వమంతా అంబేడ్కర్ ప్రచారం చేసిన సౌభ్రాతృత్వ భావన పరచుకొని కనిపిస్తుంది. అంబేడ్కర్ బోధించిన ‘‘బోధించు, పోరాడు.’’ అనే గుణాలు ఆయన మరచిపోలేదు. మార్క్సిజాన్ని జాషువ జీవితావసానదశలో ఆమోదించినట్లు కని పిస్తుందిగాని, ఆయన మొదటి నుంచి శ్రమ దోపిడిని గర్హిస్తూ సమసమాజాన్నే కోరు కున్నాడు. ఈ రకంగా జాషువలో సమకాలీన సమాజంపై ప్రభావం చూపిన మూడు తాత్విక భావజాలాలు సంగమించాయనిపిస్తుంది. సాంఘిక వివక్ష, ఆర్థిక అసమానత, రాజకీయ అవినీతి, తాత్విక మౌఢ్యం ఈ నాల్గింటిపైన  జీవిత కాలం యుద్ధం చేసిన విశిష్ట కవి జాషువ. ‘నాది కలికి తెలుగు కులము’ అని గర్వంగా చెప్పుకున్నాడు. స్వాతంత్రం వచ్చిన వెంటనే ‘‘అచ్చముగ భారతీ యుడనైతి నేడు’’ అని ప్రకటించాడు. ‘‘విశ్వనరుడ నేను’’ అని అనేక పర్యాయాలు చాటుకున్నాడు.
 
 గుర్రం జాషువ నిబద్ధత గల కవి. ఆయన నిబద్ధత బహుముఖీనమైనది. క్రైస్తవుడని హిందువుల చేత, హిందూకావ్యాలు రాస్తున్నాడని క్రైస్తవుల చేత నిరాదరణకు గురైనజాషువ ముస్లిం సమాధులలో కూర్చొని చదువుకున్నాడని ఆయన జీవిత చరిత్ర కారులు చెబుతారు. ఆయన ఎంతైనా పద్యకవే గదా అని ఆధునికులు, ఆయన సాంఘిక విమర్శను చూసి సంప్రదాయవాదులు జాషువను నిరాదరించినా తనంతట తానుగా విశిష్ట కవిగా ఎదిగాడు. ఆయన కవిత్వం తాను  జీవించి రచించిన కాలం నాటికన్నా  ఇవాళ ఎక్కువగా ప్రజలకు సన్నిహితమైంది. అదే ఆయన విశిష్టత. అదే ఆయన విజయం.
 (నేడు గుర్రం జాషువ 45వ వర్ధంతి సందర్భంగా)
 వ్యాసకర్త ప్రముఖ సాహితీ విమర్శకులు  మొబైల్ : 9440222117
 - రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

మరిన్ని వార్తలు