కవిత్వంపై కవిత్వం లాంటి పుస్తకం

29 May, 2017 00:01 IST|Sakshi
కవిత్వంపై కవిత్వం లాంటి పుస్తకం

కవిత్వంలో నేను – మరికొన్ని వ్యాసాలు; రచన: విన్నకోట రవిశంకర్‌; పేజీలు: 288; వెల: 150; ప్రచురణ: వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా; ప్రతులకు: జె.వి.పబ్లిషర్స్, నవోదయా బుక్‌ హౌజ్‌

విన్నకోట రవిశంకర్‌ తెలుగు కవిత్వంలో బాగా విన్న పేరే. ‘కుండీలో మర్రిచెట్టు’, ‘వేసవి వాన’, ‘రెండో పాత్ర’ సంకలనాలతో తనదైన ముద్ర వేసినవాడు. కవిత్వ రచనలో భాగంగా తన అనుభవాలనుంచి తను గ్రహించిన విషయాలు, ఇతర కవుల రచనలను చదివే సమయంలో తను గమనించిన వివరాలను అనేక వ్యాసాలుగా రాశాడు. అలా గత 18 సంవత్సరాలుగా వివిధ అంతర్జాల పత్రికలలో రాసిన వ్యాసాలు, సమీక్షలు, మరికొన్ని ప్రసంగ పాఠాలతో కూర్చిన సంకలనం ‘కవిత్వంలో నేను’.

ఇస్మాయిల్‌ అభిమానిగా, ఆరాధకుడిగా రవిశంకర్‌కు కవిత్వం పట్ల, కవుల పట్ల కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి. సరళత, నిరాడంబరత, స్పష్టత, గాఢతలను మంచి కవిత్వానికి మూలసూత్రాలుగా భావిస్తాడు. కవులకు పొయెటిక్‌ ఈగో లేకపోవడాన్ని అనగా కవి పాఠకుని కంటే ఒక ఉన్నతాసనం మీద ఉండి ప్రవచించటం కాకుండా వారిలో ఒకనిగా వారి కష్టాలు, సుఖాల గురించిన స్పందనలందించటాన్ని అభిమానిస్తాడు. ఏ కవి గురించి మాట్లాడ్తున్నా, ఎవరి కవిత్వాన్ని విశ్లేషిస్తున్నా పుస్తకంలోని వ్యాసాలన్నింటా ఇదే అంతస్సూత్రంగా ఆవరించి వుంటుంది.

‘కొన్ని సందర్భాల్లో కవిత రాయకపోవడం కన్నా రాయటమే ఒక రకమైన ఇన్సెన్సిటివిటీని సూచిస్తుంది’ అన్నప్పుడూ, ‘మరణించినవారిని ఇంటికి చేర్చకముందే మన కవులు పద్యం మొదలు పెడుతున్నారా, అంత్యక్రియలు పూర్తి కాకుండానే అంత్యప్రాసల కోసం వెతుకుతున్నారా అని నాకు అనుమానం కలుగుతుంది’ అన్నప్పుడూ అది మనకూ నిజంగానే తోస్తుంది.

మంచి కవిత్వాన్ని చదవాలి, మళ్ళీమళ్ళీ మననం చేసుకోవాలి, విశ్లేషణ బహానాతో దాన్ని మరో నలుగురికి చేరవేయాలి, తద్వారా మంచి కవిత్వం కొనసాగింపునకు మనకు తోచిన బాట వెయ్యాలి అనే తపన పుస్తకంలో సుస్పష్టం. అలా తనకు నచ్చిన కవిత్వాన్ని పాఠకులతో పంచుకునే క్రమంలో ఇస్మాయిల్, ఆశారాజు, శిఖామణి, సిద్ధార్థ, శ్రీకాంత్, బి.వి.వి.ప్రసాద్, రమణజీవి, కొత్తపల్లి శ్రీమన్నారాయణ, యార్లగడ్డ రాఘవేంద్రరావు మొదలైన కవుల కవిత్వాన్ని ప్రేమగా తడిమాడు. సూటిగా, క్లుప్తంగా, అవసరమైన చోటల్లా అవసరమైనంత మేరకు కవితాత్మక ఉదాహరణలతో రసవంతంగా పుస్తకాన్ని తీర్చిదిద్దాడు. ‘ఎందుకు బతకాలి?’ అనే ప్రశ్నకు ఇస్మాయిల్‌ చెప్పిన సమాధానం ‘ఎండ వెచ్చగా వుంది, పచ్చిక పచ్చిగా వుంది, ఇక్కడింత హాయిగా వుంటే బతకటానికేమయ్యిందయ్యా నీకు?’ లాంటి సమయస్ఫూర్తి సంభాషణలు మరోమారు గుర్తుకు తెచ్చుకోవడానికి ఈ పుస్తకం ఒక మంచి సందర్భం.

వ్యాసాల్లో వీలు దొరికినప్పుడల్లా తను రాసిన కవిత్వాన్ని ముందుకు తీసుకురావడానికి కవి రచయిత పడ్డ అదనపు తాపత్రయం కలిగించే కొంత అసౌకర్యం తప్పిస్తే, ఇది మంచి కవిత్వ వ్యాసాల సంకలనం!

ఎమ్మార్‌ ఆనంద్‌
emmar.anand@gmail.com

మరిన్ని వార్తలు