కవిత్వమే మతం అయిన సందర్భం

6 Aug, 2017 23:28 IST|Sakshi
కవిత్వమే మతం అయిన సందర్భం

మతం నుంచి కవిత్వం రావడం,మతం కోసం కవితా రచన జరగడం ఉన్నదే. కానీ కవిత్వం మతంగా పరిణమించడం ఒక్క లావ్‌ ట్సూ ద్వారానే జరిగింది. ఒక్క టాఔ ఇజం విషయంలోనే జరిగింది.

కవిత్వం, తత్వం అయి మతం అయింది చైనా కవి లావ్‌ ట్సూ (LAO&TZU ) కర్తృత్వంలో. ఆయన రాసిన 81 కవితలు టాఔ ఇజం అన్న మతానికి ప్రాతిపదిక అయినాయి. ప్రపంచంలో ఇలాంటి ఘటన ఇదే! మతం నుంచి కవిత్వం రావడం, మతం కోసం కవితా రచన జరగడం ఉన్నదే. కానీ కవిత్వం మతంగా పరిణమించడం ఒక్క లావ్‌ ట్సూ ద్వారానే జరిగింది. ఒక్క టాఔ ఇజం విషయంలోనే జరిగింది. ఆశ్చర్యకరమైన పరిణామం ఇది!

ప్రపంచంలోని మహోన్నతమైన కవులలో చైనా దేశపు కవి లావ్‌ ట్సూ ఒకరు. లావ్‌ ట్సూ జననం, జీవితం, మరణంలపై సరైన వివరాలు లేవు. ఆయన క్రీ.పూ. 6వ శతాబ్ది వారని విశ్వసిస్తున్నారు. అందులోనూ సందిగ్ధతే. క్రీ.పూ. 604–517 కాలం వారనీ, క్రీ.పూ. 551–479 కాలం వారనీ వేరు వేరు వాదనలు ఉన్నాయి. చైనాలో చౌ అనే ప్రదేశంలో ఒక రాజాస్థానంలో పురాతన దస్తావేజుల సంరక్షకులుగా ఆయన పనిచేసేవారనీ, ఒక దశలో అక్కడి పరిస్థితులు నచ్చక ఊరు వదిలి వెళ్లిపోతూండగా ఊరి పొలిమేరలో కాపలాదారులు పట్టుకున్నారనీ, ఆ పట్టుకున్న కాపలాదారులలో ఒకతనికి ఆయన తన జ్ఞానాన్ని కొన్ని కవితలలో చెప్పారనీ, అందుకు బదులుగా ఆ కాపలాదారు ఆయన్ను వదిలేశాడనీ, ఆయన ఎద్దునెక్కి ఎటో వెళ్లిపోయారనీ కథనం. లావ్‌ ట్సూ ఎద్దుపై కూర్చుని ఉన్న చిత్రం ప్రచారంలో ఉంది. ఆయన పొలిమేర దాటుతూండగా పట్టుకున్న కాపలాదారులలో ఒకతను ఆయన స్నేహితుడనీ, అతని పేరు యిన్‌–హ్సి అనీ, ఆ 81 కవితలూ అతని కోసం రాసిచ్చారనీ మరో కథనం.

లావ్‌ ట్సూ రాసిచ్చిన 81 కవితలు ‘టాఔ– టీ – చింగ్‌’ అయినాయి. అదే ‘టాఔ ఇజం’ అన్న మతానికి అధారం అయింది. ఆ 81 కవితలలోని భాషా సంక్షిప్తత, కవిత్వం తరువాతి కాలంలో ప్రపంచ సాహిత్యంలో ఒక సంచలనాన్ని సృష్టించాయి. టాఔ– టీ – చింగ్‌ ను ‘డాఔ–డీ జింగ్‌’ అని కూడా అంటారు. ఈ టాఔ– టీ – చింగ్‌కు చెప్పబడిన అర్థాలలో కూడా తేడాలు కనిపిస్తున్నాయి. ‘మార్గం దాని శక్తి’ అనే అర్థం కొంత కాలం వాడుకలో ఉండేది. కానీ ‘తత్త్వం దాని ఆచరణపై గ్రంథం’ అనే అర్థం తరువాతి కాలంలో వ్యాప్తిలోకి వచ్చింది. అసలు లావ్‌ ట్సూ అంటే ‘సిద్ధ గురువు’ (old master) అని అర్థమట. ఆ పేరుగల వ్యక్తే లేడన్న వాదన కూడా ఉంది.

టాఔ– టీ – చింగ్‌ కు రకరకాలైన అర్థాలు, భాష్యాలు పుట్టుకొచ్చాయి. వాటిల్లో వంగ్‌ పి, హొ షంగ్‌ కుంగ్, హన్‌ షన్‌–టీ–చింగ్‌ ప్రభృతుల భాష్యాలు ముఖ్యమైనవి. ఆ 81 కవితల టాఔ– టీ – చింగ్‌ ఒక పవిత్ర గ్రంథంగా పరిణమించింది. ఇది 2 పుస్తకాలుగా ఉంది. పుస్తకం 1, పుస్తకం 2 అని. ఆ 81 కవితలనూ 81 అధ్యాయాలుగా చూపించారు. వాటిని ఇంగ్లిష్‌లో కొందరు వచనంగా, కొందరు కవితలుగా అనువదించారు.

తత్త్వాన్ని (టాఔ) ప్రకటించే విధానం శాశ్వతమైనది కాదు
దానికి ఇవ్వబడిన పేరూ శాశ్వతమైనది కాదు

కోరికల నుంచి స్వేచ్ఛను పొందు, మర్మం విడిపోతుంది
కోరికలలో చిక్కుకుపోతే వ్యక్తీకరణ మాత్రమే కనిపిస్తుంది
లావ్‌ ట్సూ ‘టాఔ’ అంటూ చెబుతున్నది మనం ‘సర్వాంతర్యామి’ అనే పదానికి పర్యాయపదంగా కనిపిస్తోంది. ఓ కవితలో –
‘టాఔ అనంతం, శాశ్వతం
ఎందుకది శాశ్వతం?
అది పుట్టలేదు కనుక
అది మరణించదు–
అది ఎందుకు అనంతం?
దానికి కోరికలు లేవు
అది అందరి కోసమూ ఉన్నది’ – అని చెబుతారు లావ్‌ ట్సూ.
ఉపమాలంకారాన్ని చాలా చక్కగా వాడతారు లావ్‌ ట్సూ. ఓ కవితలో మంచితనాన్ని నీటితో పోలుస్తారు. ‘ఇతరులతో నిన్ను పోల్చుకోకు, ఇతరులతో పోటీ పడకు, అందరూ నిన్ను గౌరవిస్తారు’ అని సగటు మనిషికి  సందేశమిస్తారు. భగవద్గీతలో కనిపించే నిష్కామ కర్మ ప్రస్తావన టాఔ– టీ – చింగ్‌ లోనూ కనిపిస్తోంది. ‘ఎదురు చూపుతో సంబంధం లేకుండా పని చెయ్యడం మహోన్నతమైనది’ అనీ, ‘నీ పని చెయ్యి, ఆపై వదిలెయ్యి’ అనీ చెబుతారు లావ్‌ ట్సూ. ఒక భావాన్ని ఎంత గొప్పగా చెప్పొచ్చో, ఎలా కవిత్వంగా మలచొచ్చో ఈ పంక్తుల ద్వారా తెలుసుకోవచ్చు.
‘బంకమట్టితో మనం కుండను చేస్తాం
దాని లోపల ఖాళీగానే ఉంటుంది
ఆ ఖాళీనే మనకు కావలసిన నీళ్లను మోస్తుంది’
ఓ కవితలో ‘ఓటమి ఎంత అపాయకరమైనదో– విజయమూ అంత అపాయకరమైనదే’ అంటారు లావ్‌ ట్సూ.
‘భగవంతుడు(టాఔ) గొప్పవాడు
విశ్వం గొప్పది
భూమి గొప్పది
మనిషి గొప్పవాడు’– అంటారు మరో కవితలో.
‘నిజమైన పూర్ణత్వం ఏమీ లేనట్లుగానే ఉంటుంది
అయినా అందులో సంపూర్ణమైన ఉనికి ఉంటుంది’– అన్న లావ్‌ ట్సూ వాక్యాలు
‘పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణ ముదచ్యతే
పూర్ణస్య పూర్ణామాదాయ పూర్ణమేవావశిష్యతే’ శ్లోకాన్ని గుర్తుచేస్తాయి.
‘నీ తలుపు తెరవకుండా
నీ హృదయాన్ని ప్రపంచం కోసం తెరవగలవు
నీ కిటికీ వైపు చూడకుండా
బ్రహ్మ తత్వాన్ని నువ్వు చూడగలవు’ అని ఒక కవితలో అంటారు.
‘నీ స్వీయ కాంతిని ఉపయోగించు
ఆపై కాంతి యొక్క మూలాన్ని చేరుకో’ అంటారు మరోచోట. ఇక్కడ ‘స్వీయ కాంతి’ అనడం ఆది శంకరాచార్యులు ‘స్వస్య యుక్త్యాః’ అంటే ‘నీ యుక్తి చేత’ అనడాన్ని తలపిస్తోంది. వేమన పద్యాల్లాగా వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడేవి కొన్ని లావ్‌ ట్సూ కవితల్లో ఉన్నాయి.
‘చిన్న చిన్న చర్యలతో గొప్ప పనులను పూర్తిచెయ్యి’, ‘ఓటమి ఓ అవకాశం’, ‘కష్టాలతో తలపడు’, ‘నువ్వు  ప్రజల్ని పాలించాలంటే నువ్వు వాళ్లకన్నా కింద ఉండాలి, నువ్వు ప్రజలకు నాయకత్వం వహించాలంటే నువ్వు వాళ్లను అనుసరించడం నేర్చుకోవాలి’– వంటివి. వ్యక్తిత్వ వికాసానికి లావ్‌ ట్సూ కవితలు తోడ్పడతాయి అనే కోణంలో కూడా ఆయన కవితలకు భాష్యం చెబుతూ ఇంగ్లిష్‌లో పుస్తకాలొచ్చాయి. మతం గురించి లావ్‌ట్సూ–
‘నేను మతాన్ని వెళ్లిపోనిస్తాను
ఆపై ప్రజలు నిర్మలమౌతారు’ అంటారు.
ఒక చోట ‘నిజమైన మాటలు విపరీతార్థాలుగా అనిపిస్తాయి. నిజమైన మాటలు వాగ్ధా్దటితో ఉండవు. వాగ్ధాటితో ఉండేవి నిజమైన మాటలు కావు’ అంటారు.

రోచిష్మాన్‌
09444012279

మరిన్ని వార్తలు