దరహాసాల దేశంలో విషాదస్వామ్యం

30 May, 2014 01:23 IST|Sakshi
దరహాసాల దేశంలో విషాదస్వామ్యం

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన  యింగ్‌లుక్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి థాయ్ ప్రతిపక్షాలు ఆరు నెలలుగా చేస్తున్న అందోళనలు దేశాన్ని సైన్యం చేతుల్లోకి నెట్టాయి. ఎన్నికలకు సైతం అంగీకరించక రాజ్యాంగేతర అధికారం కోసం అంగలార్చి ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చాయి.
 
 ‘ప్రజాస్వామ్యం చూడక తప్పని విషాదాంత ప్రహసనం’ అని నమ్మక తప్పేట్టు లేదు. ‘ప్రజాస్వామ్యం దేశానికి చాలా కీడు చేసింది’ అంటూ థాయ్‌లాండ్ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ ప్రయుత్ చాన్ ఓచా ప్రవచిస్తుంటే నోళ్లు తెరుచుకు వినాల్సిన రోజులొచ్చాయి. 1932లో రాచరికం రద్దయినప్పటి నుంచి పద్దెనిమిదిసార్లు సైనిక తిరుగుబాట్లు జరిగిన ఆ దేశంలో మే22న పందొమ్మిదో కుట్రకు పాల్పడ్డందుకు ప్రయుత్‌ను తప్పు పట్టాల్సిన పని లేదు. ప్రజాసామ్యమంటే ప్రజా తీర్పుకు కట్టుబడటం కానప్పుడు సైనిక జుంటాలు కబంద హస్తాలు చాచడం తప్పదు. ప్యూథాయ్ పార్టీకి పట్టంగట్టి మెజారిటీ ప్రజలు తప్పు చేశారన్నట్టు... వీధులకెక్కి, పరిపాలనను స్తంభింపజేసి, సైనిక జోక్యానికి ‘రాచ’ బాట వేసిన డెమోక్రటిక్ పార్టీ ప్రతిపక్ష నేత సుతెప్ తౌగ్సుబెన్‌ను తప్పు పట్టాలి. ప్యూథాయ్ నేత్రి యింగ్‌లుక్ షినావత్ర మాజీ ప్రధాని తక్సిన్ షినావత్రకు చెల్లెలుగా పుట్టడం మహా పాపమే కావచ్చు.
 
 విదేశాల్లో ఉన్న అన్న తెర వెనుక నుంచి ఆమె పార్టీని నడిపిస్తున్న మాటా నిజమే కావచ్చు. కానీ థాయ్ ప్రజలకు తక్సిన్ అవినీతి చరిత్రా తెలుసు, ఘోర నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ ప్రజలకు, పేదలకు చేసిన మేలూ తెలుసు. వృద్ధి వెలుగులకు నోచుకోని ఉత్తర, వాయవ్య ప్రాంతాల ప్రజలు తక్సిన్ వల్ల జరిగిన మేలును మరచిపోలేకపోవడం తప్పే కావచ్చు. కానీ వాళ్లు మరచిపోలేదు. తక్సిన్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా అవినీతి రొంపిలో మునిగి తేలుతున్న సెతెప్‌కు నగరాల, పరిశ్రమల వృద్ధి వెలుగులే తప్ప, వృద్ధి రేట్ల జిలుగులే తప్ప మురికివాడల, గ్రామీణ ప్రాంతాల చీకట్లు పట్టవనీ తెలుసు. అందుకేనేమో తక్సిన్ దుబాయ్‌లో స్వచ్ఛంద ప్రవాసంలో ఉన్నా 2011లో ఆయన చెల్లెలికి పట్టంగట్టారు.
 
 ప్రజాస్వామ్యమంటే కుల,మత, వర్గ, లైంగిక వివక్షకు తావు లేకుండా పౌరులందరికీ ఒక్కొక్కరికి ఒక ఓటు ప్రాతిపదికపై జరిగే ఎన్నికలనీ,  రాజ్యాగబద్ధంగా నిర్దేశితమైన మెజారిటీ ప్రజలు ఎన్నుకున్న పరిపాలన అనీ మనకు తెలిసిన నిర్వచనానికి కాలదోషం పట్టిపోయిందని సుతెప్ తదితర ప్రతిపక్ష నేతలు తేల్చేశారు. ప్రజాస్వామ్య మంటే పరిపాలనా దక్షత, వ్యవహార శైలి కూడా అని కొత్త నిర్వచనం చెప్పారు. యింగ్‌లుక్‌కు అవి లేవని తేల్చేసి ప్రజలు చెప్పిన తప్పుడు తీర్పును మార్చే ప్రయత్నంలో మునిగి తేలారు. పార్లమెంటును రద్దు చేసి తిరిగి ఎన్నికలకు యింగ్‌లుక్ సిద్ధమయ్యారు.
 
 2006లో సైనిక కుట్రతో తక్సిన్‌ను గద్దెదించినప్పటి నుంచి 2011 సార్వత్రిక ఎన్నికల వరకు జరిగిన ప్రతి ఎన్నికలోనూ ప్రజలు ‘తప్పుడు తీర్పులు’ చెబుతూనే ఉన్నారు.  యింగ్‌లుక్  నేతగా ఉన్న ప్యూథాయ్‌కి పట్టంగడుతూనే ఉన్నారు. నేడే కాదు మరో నాలుగేళ్ల తర్వాతైనా గెలవలేమని తెలిసిన ప్రతిపక్షాలు రాజ్యాంగ విరుద్ధంగా తమకు అధికారం అప్పగించాల్సిందేనని పట్టుబట్టాయి. నేటి సైనిక కుట్రకు తలుపులు బార్లా తెరిచాయి. గత ఆరునెల్లుగా తక్సిన్‌ల మద్దతుదార్లయిన గ్రామీణ, పేద ‘ఎర్రచొక్కాలు’, ప్రతిపక్షాల మద్దతుదార్లయిన ‘పచ్చ చొక్కాలు’ వీధుల్లో ప్రదర్శనలు చేస్తూనే ఉన్నాయి. ఘర్షణల్లో 30 మంది మృతి చెందారు కూడా.
 
 ఈ నెల 7న థాయ్ రాజ్యాంగ న్యాయస్థానం ప్రధాని యిం గ్‌లుక్ రాజ్యాంగ ఉల్లంఘనకు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తీర్పు చెప్పింది. దీంతో ఆమె స్థానంలో తాత్కాలిక ప్రధానిగా నివత్తమ్‌రోంగ్ బూన్సోంగ్‌పైసాన్ ప్యూధాయ్ పార్టీ ఎన్నుకుంది. ప్రయుత్ ఆయన్ను కూలదోసి ప్రజాస్వామ్యం ‘ముప్పు’ నుంచి థాయ్‌లాండ్‌ను రక్షించారు! 2006లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తస్కిన్ ప్రభుత్వాన్ని కూలదోసినప్పటి నుంచి 2014 సైనిక తిరుగుబాటు వరకు ప్రధాని కార్యాలయంలో జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న పౌర అధికారిని బదిలీ చేయడమే ప్రధానిగా యింగ్‌లుక్ చేసిన మహా నేరం. మే 22న జరిగిన సైనిక కుట్రలో ‘న్యాయ వ్యవస్థ’ భాగస్వామి. అలంకారప్రాయమైన రాజు భూమిబల్ అదుల్యదేజ్‌కు (86) గట్టి మద్దతుదారు ప్రయుత్‌కు సింహాసనం ఆశీస్సులు తక్షణమే లభించి తాత్కాలిక ప్రధాని కాగలిగారు.
 
  ప్రాధాన్యం కోల్పోతున్న రాచరికం సైన్యం సహాయంతో సైనిక తిరుగుబాటుకు సమంజసత్వాన్ని ఆపాదించాలని ప్రయత్నిస్తోంది. సైన్యమే 2006 కుట్ర తర్వాత రచించిన 2007 రాజ్యాంగాన్ని రద్దుచేయడం దేశాధినేతగా ప్రయుత్ చేసిన మొట్టమొదటి పని. విదేశీ చానళ్లు సహా మీడియా బ్లాకౌట్, సామాజిక వెబ్‌సైట్ల నిషేధంతో ప్రతిపక్షాల గోలను అవినీతి వ్యతిరేక ప్రజాస్వామ్య పోరాటంగా భ్రమించి వీధులకెక్కిన మధ్యతరగతి విద్యావంతుల కళ్లను తెరిపించారు. సైనిక కుట్రను వ్యతిరేకిస్తున్న అధికార, ప్రతిపక్షాల నిరసనకారులకు ‘ఆట ముగిసిపోయింది’ అని చెప్పేసి అన్ని ఆందోళనలను నిషేధించారు. పారిశ్రామిక వర్గాలు ఈ  ‘అస్థిరత’ తొలగిపోతుందని సెలవిస్తున్నాయి. అంటే ప్రయుత్ అంటున్నట్టే సైనిక పాలనకు ఇప్పట్లో తెరపడే అవకాశం లేదు. బ్యాంకాక్ విశ్వవిద్యాలయానికి  చెందిన రాజ కీయ విశ్లేషకులొకరు అన్నట్టు ’థాయ్ ప్రజలు మళ్లీ బహుశా చీకటి రోజులను చూడాల్సి వస్తుంది’.   
 -   పిళ్లా వెంకటేశ్వరరావు

>
మరిన్ని వార్తలు