తథాగతుడు రాహుల్!

18 Apr, 2015 00:33 IST|Sakshi
తథాగతుడు రాహుల్!

అక్షర తూణీరం
 
కొన్నేళ్లుగా తన కుటుంబ పార్టీగా జీవిస్తున్న కాంగ్రెస్‌కి వృద్ధాప్యం, అనారోగ్యం సంక్రమిస్తోందని స్వయంగా గ్రహించి రాహుల్ మొదటిసారి ఆలోచనలో పడ్డాడు. సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీకి జర రుజ సమస్యలే కాదు, మరణం కూడా తప్పదని రాహుల్‌కి మొదటిసారి అర్థ్ధమైంది. దానితో బుర్ర తిరిగిపోయింది.
 
యువరాజు తిరిగివచ్చాడు! కోటంతా వెలుగులతో నిండి పోయింది. బాణసంచా కాల్చి పండగ చేసుకున్నారు. ఎక్క డికి వెళ్లాడో తెలియదు. ఎం దుకు వెళ్లాడో తెలియదు. తిరి గి ఎందుకు వచ్చాడో తెలియ దు. ఎనిమిది వారాల తర్వాత రాహుల్ సొంత గూటికి చేరా డు. రాహుల్ తథాగతుడు. ఇక చుక్కలు చూపిస్తాడని పార్టీ శ్రేణులు వ్యూహాత్మకంగా విశ్వసిస్తున్నాయి. ఆ తల్లి ఆనందిస్తోంది.

ఆనాడు గౌతముడు అర్ధర్రాతి కోటవదిలి, భార్యని కొడుకుని త్యజించి నిష్ర్కమించాడు. దానికి కారణాలు న్నాయి. రాహుల్‌కి కారణాలున్నాయా అంటే ఉన్నా యనే తలపండిన రాజకీయ వేత్తలు చెబుతున్నారు. కొన్నేళ్లుగా తన కుటుంబ పార్టీగా జీవిస్తున్న కాంగ్రెస్‌కి వృద్ధాప్యం, అనారోగ్యం సంక్రమిస్తోందని స్వయంగా గ్రహించి రాహుల్ మొదటిసారి ఆలోచనలో పడ్డాడు. సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీకి జర రుజ సమస్యలే కాదు, మరణం కూడా తప్పదని రాహుల్‌కి మొదటిసారి అర్థమైంది. దానితో బుర్ర తిరిగిపోయింది. దానికి తోడు చుట్టూ ఉన్న ప్రథమ శ్రేణి నాయకులంతా వారి నిజ రూపాలలో రాహుల్‌కి కనిపించారు. ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు. కలయో, వైష్ణవ మాయయో, ఇతర సంక ల్పార్థమోనని ఇటలీ భాషలో అనుకున్నాడు.

తల్లికి తాను చూసిన నిజరూపాలను విశదంగా వర్ణించి మరీ చెప్పాడు. తల్లి చిరునవ్వి కుమారుని వెన్నుచరిచి, తల నిమిరింది. అయినా, నిద్రలో మెలకువలో ఏవేవో పీడ కలలు బాల రాహుల్‌ని పీడించసాగాయిట. అందుకే చినబాబు రాత్రికి రాత్రి తల్లి దీవెన కూడా తీసుకో కుండా, కట్టు వస్త్రాలతో గమ్యం లేకుండా బయటకు నడి చాడని కొందరు నమ్మకంగా చెబుతున్నారు. అయితే, బోధి వృక్షం కింద కూచున్నారా, రాహుల్‌కి జ్ఞానోదయం అయిందా అనే సంగతులు మనకు తెలియదు. విజ్ఞులు ఏమంటున్నారంటే - అయివుండదని, జ్ఞానోదయమే అయి ఉంటే మళ్లీ ఢిల్లీలో ఎందుకు దిగుతాడు, తుగ్లక్ మార్గ్‌కి ఎందుకు వస్తాడని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు యీరోజు వదిలేస్తే యాభై నాలుగు రోజులు రాహుల్ అజ్ఞాతంలో ఉన్నట్టు లెక్క. సొంత కుటుంబ వ్యవహారం ఇది. దీనికింత ప్రచారం అవసరమా అం టూ సోనియా కోపం చేసుకుంటున్నారు. రాజ మంది లాలలో జరిగేవన్నీ వార్తలే అవుతాయి.

 కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం కొట్టొచ్చినట్టు కరవవచ్చినట్టు కనిపిస్తోంది. ఇన్నేళ్లూ ప్రత్యేకంగా చెప్పు కోడానికి పార్టీకి పాయింట్ లేదు. ఇప్పుడు దొరికింది. మా భావి భారత నేత, ఇందిరమ్మ వారసుడు కొత్త నెత్తురు నింపుకుని నూతన ప్రవేశం చేశాడని చెప్పుకో వచ్చు. ఇక అలక తీరగ జాగు సేయక పార్టీ అత్యుత్తమ పదవిని కట్టబెట్టవచ్చు. కాంగ్రెస్ గవ్వలాటని మొదటి గడి నించి ప్రారంభించుకోవాలి. ఎక్కడా ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు. పాత మట్టిని, పోత మట్టిని తీసేసి పునాదులు వెయ్యాల్సి ఉంది. ‘ఇప్పుడే కదా వచ్చింది ఒక్క వారం గాలిపోసుకోనీయండి’ అంటు న్నారు కొందరు పెద్ద ముత్తైవలు. నలుగులు పెట్టి తలంట్లు పొయ్యాలి, ఇష్టమైనవి వండి తినిపించాలి, అంగరక్షలు పెట్టి దిష్టితీయాలి, అబ్బాయి తేరుకోవాలి అంటున్నారు. పోనీ అలాగే కానివ్వండి.

 ఒక పక్క ప్రపంచస్థాయి నగరంగా చేస్తామంటున్న హైదరాబాద్‌లో, ఆంధ్రుల స్వప్న నగరం అమరావతి పరిసరాలలో మనుషుల్ని వీధి కుక్కలు పీక్కుతింటుంటే - మీకవేమీ పట్టలేదా అని నన్ను నిగ్గదీశారు. ‘మా నీతి సూత్రాల ప్రకారం కుక్క మనిషిని కరిస్తే అది వార్త కాదు. మనిషి కుక్కని కరిచినపుడే వార్త’ అని ధైర్యంగా చెప్పాను. నాకేంటి భయం?
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)  శ్రీరమణ
 

మరిన్ని వార్తలు