రామాయణ మహామాలా రత్నం!

23 May, 2014 02:00 IST|Sakshi
రామాయణ మహామాలా రత్నం!

అతులిత బలధాముడూ, జ్ఞానులలో ఆగ్రగణ్యుడూ, సకల సద్గుణవంతుడూ, రఘుపతి ప్రియభక్తుడూ హనుమంతుడు. రామాయణ కథలో ఆయన నిర్వహించిన ఘనకార్యాల సింహావలోకనం కంటే, హనుమజ్జయంతినాడు ఆనందదాయకమైన కర్తవ్యం ఏముంటుంది?
 
 కిష్కింధకాండలో రామలక్ష్మణులను దూరం నించి చూసి వాళ్లు వాలి మనుషులేమోనని సుగ్రీవుడు వణికిపోతుంటే, ‘సురక్షిత ప్రదేశంలో ఉన్నా, నువ్వు నీ శాఖా మృగ లక్షణం వల్ల అనవసరంగా భయపడుతున్నావు. రాజు అనే వాడు బుద్ధిని ఉపయోగించి ప్రవర్తించాలి!’ అని తన రాజుకు నిర్మొహమాటంగా, హితమైన సలహా ఇచ్చే మంత్రిగా హనుమంతుడు మొదటిసారి కనిపిస్తాడు. రాజాజ్ఞతో, రామలక్ష్మణులను సమీపించి, సన్యాసి వేషంలో వాళ్ల ముందు నిలబడి పలకరిస్తాడు.
 
 హనుమంతుడు నాలుగు మాటలు పలకగానే శ్రీరాముడు చకితుడౌతాడు. ‘ఈ దూత వాక్యజ్ఞుడు, మధురభాషి. సంస్కారవంతంగా, అసందిగ్ధంగా మనసును ఆకట్టుకొనేలా మాట్లాడే ఇలాంటి దూతగల రాజెవరో గానీ అదృష్టవంతుడు!’ అని మెచ్చుకుంటాడు. హనుమంతుడు రామలక్ష్మణులకు విశ్వాసం కలిగించి, వారిని తన భుజం మీద ఎక్కించుకు వెళ్లి, రామ సుగ్రీవులకు మైత్రి కుదురుస్తాడు.
 
 తరువాత వాలి మరణానంతరం, దుఃఖసాగరంలో మునిగిన తారను ఊరడించేది కూడా హనుమంతుడే. ఆ తరువాత, రాజ్యం చేకూరి భార్యలతో సుఖిస్తూ కర్తవ్యాన్నీ, కాలాన్నీ మరచిపోయిన సుగ్రీవుడిని సరైన సమయంలో హనుమంతుడే హెచ్చరించి మేలుకొలుపుతాడు. రాముడు రావణుడితో యుద్ధానికి ప్రణాళిక తయారు చేసేటప్పుడు లంకా నగరం రక్షణవ్యవస్థ గురించీ, గుట్టుమట్ల గురించి ఆయనకు వివరించగలవాడు హనుమంతుడొక్కడే. ‘రామా! ఎలాగోలా వానరసేన సముద్రం దాటే ఏర్పాటు ఒక్కటి చెయ్యగలిగావంటే నీ విజయం తథ్యం’! అని కిటుకు చెప్తాడు.
 
 ఇంద్రజిత్తుతో యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు, హనుమంతుడు హుటాహుటిన హిమాలయాలకు వెళ్లి సంజీవని పర్వతాన్నే పెళ్లగించి తెచ్చి ప్రాణరక్షణ చేయటం, మొదటిసారి సముద్ర లంఘనం కంటే బృహత్కార్యం. రామపట్టాభిషేక సమయంలో సీత తన కంఠహారాన్ని తీసి దాన్ని ఎవరికి బహూకరించటమా అని సందేహిస్తుంటే, ‘ఓ భామినీ! ఈ వీరులందరిలో పౌరుషమూ, పరాక్రమమూ, బుద్ధి బలాలలో సర్వవిధాలా అధికుడైన వాడు అని నువ్వు భావించిన వాడికి హారం కానుకగా ఇవ్వమని’ రాముడు సూచిస్తాడు. సీత హారాన్ని హనుమంతుడికి బహూకరిస్తుంది.
 
 గోష్పదీకృత వారాశిం, మశకీ కృత రాక్షసం
 రామాయణ మహామాలా రత్నం వందే-(అ)నిలాత్మజం!
 (మహాసముద్రాన్ని గోవు అడుగుజాడను దాటినంత తేలికగా దాటినవాడూ, రాక్షస యోధులను దోమలను చంపినంత తేలికగా జయించినవాడూ, రామాయణ కథ అనే మాలలో మణిలా ప్రకాశించేవాడూ అయిన హనుమంతుడికి ప్రణామాలు.)
 -ఎం. మారుతి శాస్త్రి

మరిన్ని వార్తలు