అంధకారంలో...

26 Apr, 2014 00:31 IST|Sakshi
అంధకారంలో...

  మన నవలలు
 
‘మీరెందుకు ఈ వృత్తిలోకి వచ్చారండీ. ఇలా ఎలా చెడిపోయారు?’
 చెడిపోవడం ఏంటి? ఈ పని చేసినవాళ్లు చెడిపోయినట్టయితే ఈ పని చేయడానికి వచ్చినవాళ్లు చెడిపోయినట్టు కాదా?
 ఈ ప్రశ్నకు ఎప్పుడూ జవాబు దొరకలేదు రాజేశ్వరికి. అవును. ఈ వృత్తిలోకి తానెందుకు వచ్చింది? ఒళ్లు కొవ్వెక్కి వచ్చిందా. దుర్గ ఎందుకు వచ్చింది. వాళ్ల నాన్న తాగుడు ఇల్లు గుల్ల చేసి- చాలక కడుపున పుట్టిన ఆడపిల్లలను కూడా గుల్ల చేస్తుంటే వచ్చింది. సావిత్రి ఎందుకొచ్చింది? కట్టుకున్నవాడు నాలుగునాళ్లు కాపురం చేసి నెపం వేసి పారిపోతే ఏం చేయాలో తోచక దిక్కు తెలియక వచ్చింది. సత్తులు ఎందుకు వచ్చింది? మద్రాసు వెళ్లి సినిమాల కోసం స్టూడియోలు తిరిగి ఉన్న అందం హూనం చేసుకొని పట్టెడు మెతుకులు దొరక్క నెత్తిన ఇంత నీడ దొరక్క వచ్చింది. మరి రాజేశ్వరి ఎందుకు వచ్చింది?
 మగ అహంకారం వల్ల వచ్చింది. ఉత్త మగ అహంకారం.
 రాజేశ్వరి తల్లి రాధ బంగారుబొమ్మ. ఊరి పెద్దమనిషి కూతురు. కలిగిన ఇంట పుట్టిన కల్పవల్లి. కాని తప్పు చేసింది. పోయి పోయి పాలేరును ప్రేమించింది. తండ్రి అహంకరిస్తే- కులం మర్యాద పరువు అని ప్రేలాపిస్తే పాలేరుతో పారిపోయింది. కష్టజీవి తన భర్త. రెండు పొట్టలకు సంపాదించకపోడు. అతడలాగే సంపాదించాడు. తన కోసం వచ్చేసిన పెద్దంటి అమ్మాయిని గుండెల్లో పెట్టుకొని చూశాడు. కాని రోడ్డున పడి తిరిగే బతుకులకు గ్యారంటీ లేదు. పాలేరు బండిని లారీ గుద్దేసింది. రాధ బతుకు చితికిపోయింది. ఇంటికి వచ్చేయొచ్చు. అంత ఆస్తి ఉందే! తండ్రి మళ్లీ చేరదీసి అక్కున జేర్చుకుంటే ఎంత భరోసా. కాని కులం, పరువు, మర్యాదా.... లేచిపోయిన కూతురిని ఇంట పెట్టుకుంటారా ఎవరైనా? అహంకారం. వద్దన్నాడు. ఆడది ఏం చేయాలి. వయసులో ఉన్న ఆడది. బయట బతకడానికి వీల్లేని పరిస్థితులున్న ఒంటరి ఆడది. ఒక ఆడపిల్ల పుట్టి మగదిక్కు లేని ఆడది. వేరే మార్గం లేదు. వేలాది ఏళ్లుగా వేసిన రాజమార్గం ఉండనే ఉంది. అదే సరైనది. ఒక రాజుగారికి ఉంపుడుగత్తెగా పోయింది. పడుపుగత్తెగా ఉండటం కంటే ఇది కాస్త మేలు. అంధత్వం కంటే చత్వారమే నయం. రాజుగారు బానే చూసుకున్నారు. రెండు గుడ్డలు పడేశారు. నాలుగు మెతుకులు పడేశారు. బదులుగా నిత్యం సేవ చేయించుకున్నారు. కాని ఉంపుడుగత్తె కూతురు తన కూతురు అవుతుందా? దాని పెళ్లి మాటే ఎత్తడే. అదే దిగులు రాధకి. ఆ దిగులుతోనే తీసుకు తీసుకు పోయింది. రాజుగారికి చాలా బాధ వేసింది. పోయినందుకు కాదు. రోజూ సుఖం ఇచ్చే ఒక ప్రాణి లేకుండా పోయినందుకు. రాజుగారు చాలా మంచివారు. తల్లి లేని లోటును కూతురిలో చూసుకోబోయారు. వయసొచ్చిన కూతురు. తనకు పుట్టలేదు కాబట్టి, తాను తండ్రిని కాదు కాబట్టి, తల్లి తనకు ఉంపుడుగత్తె అయినా పిల్ల మాత్రం తన కూతురు కానేరదు. కూతురు వరస కూడా కానేరదు. అయితే గియితే ఉంపుడుగత్తే అవుతుంది. రాజుగారు రాత్రికి రాత్రి పిశాచంలా మారి పిల్లను కాటేశారు. నమిలేశారు. మింగేశారు. నాన్నా... నాన్నా... అని పెనుగులాడుతున్న కూతురు... రాజేశ్వరి.... ఈ మృగానికి మూర్ఖుడికి మగాడికి భయపడి పారిపోయింది. పారిపోయి పారిపోయి ఎక్కడ తేలుతుంది? తెలిసిందేగా. అవే ఇరుకు సందులు. తరతరాలుగా ఇలాంటివారి కోసమే సిద్ధమై ఉన్న మురికివాడలు. పడుపుగొందులు.
ఈ కథ ఎవరికి చెప్పుకోవాలి? ఈ కథ ఎవరికి చెప్పినా ఏం అర్థమవుతుంది? కాని ప్రతివాడూ పెద్ద ఆపద్బాంధవుడిలాగా ప్రశ్నించడమే- మీరీ వృత్తిలోకి ఎలా వచ్చారండీ.
 ‘ఏం పెళ్లి చేసుకుంటారా?’
 ‘పెళ్లా?’
 ‘ఏం ఎందుకు చేసుకోకూడదు?’
 ‘పడుపుగత్తెను పెళ్లాడతారా ఎవరైనా?’
 ‘విటుడైన వెధవ ఏమీ ఎరగనట్టు దర్జాగా అమ్మాయిని దొరకబుచ్చుకుని పెళ్లి చేసుకుంటుంటే పడుపుగత్తె ఎవణ్ణో ఒకణ్ణి పెళ్లి చేసుకుంటే తప్పేంటి! ఇద్దరూ చేసింది ఒకటే తప్పు అయినప్పుడు ఒకరికో న్యాయం ఇంకొకరికో న్యాయమా?’
 దెబ్బకు పరార్. మళ్లీ కనిపించడు.
 ‘అసలు ఈ ఆడవాళ్లు ఎందుకు వ్యభిచారం చేస్తారో?’
 ఎంత పనికిమాలిన ప్రశ్న ఇది. వ్యభిచారం అనే మాటను కేవలం నాలుగ్గోడల మధ్య, మూడు నిమిషాల పాటు జరిగే పనికి కుదించుకోవడం వల్ల వచ్చే ప్రశ్న. వ్యభిచారం అంటే అసలర్థం ఏమిటి? చాలా పెద్ద నేరం. శీలం అంటే? నేరం చేయకపోవడం. కాని అలా ఉందా? రాజకీయ నాయకులకు తమ రాజకీయల పట్ల శీలం లేదు. వ్యాపారస్తులకు తమ వ్యాపారాల పట్ల శీలం లేదు. ఉద్యోగులకు తమ ఉద్యోగాల పట్ల శీలం లేదు. టీచర్లకు, లెక్చరర్లకు, వైద్యులకు, న్యాయవాదులకు, చట్టాన్ని నిలబెట్టాల్సిన పోలీసులకు తమ తమ వృత్తుల పట్ల శీలం లేదు. ఈ శీలం తప్పి ఉండటం మనకు నేరం కాదు. కాని స్త్రీ తన శీలం తప్పడం మాత్రం నేరం. ఇక్కడంతా శీలం ఏర్పడినప్పుడు స్త్రీలు తమ శీలం కోల్పోయే పరిస్థితులు పోతాయి. ఇక్కడ వ్యభిచారం పోతే స్త్రీలు చేసే వ్యభిచారం కూడా పోతుంది.
 రాజేశ్వరి తన జీవితంలో చాలామందిని చూసింది. గొప్ప గొప్పవాళ్లని. రూపాయికి ఠికానా లేని వాళ్లని. అందరూ ఇదే బాపతు. దివాలా తీసినవారు. లేదా లోన దివాలా తీసి పైకి వేదాంతం వల్లించే వెధవలు. ఎలా బయటపడతారు తనలాంటివాళ్లు ఈ ఊబి నుంచి. ఎలా బయటపడతారు ఈ పుణ్యభూమిలో లక్షలాది మంది ఆడవాళ్లు ఈ నరకం నుంచి.
 ‘శ్రమదోపిడి పోతే బయటపడతారు’ అని జవాబు చెప్పాడు కృష్ణారావు. అతడు సమాజంలోని అవకతవకల గురించి ఆలోచించే సంస్కారవంతుడు. ‘దానికీ దీనికీ ఏం సంబంధం?’ అని అడిగాడు స్నేహితుడు.
 ‘ఉంది. ఈ భూమి అందరిదీ. కాని కొందరి చేతుల్లో ఉంది. వనరులు అందరివి. కాని కొందరి చేతుల్లోనే ఉన్నాయి. పరిశ్రమల వల్ల, పెట్టుబడుల వల్ల, భారీ వ్యాపారాల వల్ల వచ్చే ఆదాయం అందరిది. కాని కొందరి జేబుల్లోనే ఉంది. అందరూ చేస్తే వచ్చిన ఫలం అందరిదీ కాకపోతే కొందరు శ్రీమంతులవుతారు. కొందరు దరిద్రులవుతారు. ఈ దరిద్రులను ఆ శ్రీమంతులు పీక్కుతింటూనే ఉంటారు. దరిద్రం ఏం చేస్తుందిరా అంటే మన దగ్గర ఏం ఉంటే అది అమ్ముకునేలా చేస్తుంది. ఆడవాళ్లు మానం అమ్ముకుంటారు. మగవాళ్లు విలువలు అమ్ముకుంటారు. శ్రమను దోచే వ్యవస్థ ఉన్నంతకాలం శరీరాన్ని దోచే వ్యవస్థ కూడా ఉంటుంది’
 కాని ఈ పరిస్థితి ఎప్పటికి పోవాలి? నలిపే శరీరాల కింద రాజేశ్వరిలాంటివాళ్లు ఎంతకాలం నలగాలి. నలిగి నలిగి... అదిగో ఆమె కడుపున పుండు పడింది. కేన్సర్. ఆ సందు చివర చిన్నపాకలో వేదన పడుతూ బాధ అనుభవిస్తూ పుట్టిన పిల్లను తనలాంటి పతిత చేతుల్లో పెట్టి కన్ను మూసింది రాజేశ్వరి.
 బతికినంతకాలం ఈ రాజేశ్వరి అంధకారంలో బతికింది.
 రేపు ఆ పిల్ల?
 నవల ముగిసింది.
 రంగనాయకమ్మ 1969లో రాసిన నవల ఇది. తెలుగులో ఒక విశిష్టమైన నవల. వేశ్యాజీవితాల మీద, వారి దగ్ధపూరితమైన అవస్థల మీద మొదటిసారిగా రష్యన్ రచయిత కుప్రిన్- ‘యమకూపం’ నవల రాయడం ద్వారా వెలుగు ప్రసరింపజేశాడని అంటారుగాని అంతకంటే ముందే అంటే 1899లోనే మన ప్రఖ్యాత ఉర్దూ రచయిత మిర్జా హదీ రుస్వా ఉత్తర భారతదేశంలోని తవాయిఫ్‌ల మీద (నాట్యం చేసే వేశ్యల మీద) ‘ఉమ్రావ్‌జాన్ అదా’ నవల రాసి (సినిమా ప్రసిద్ధం) సంచలనం సృష్టించాడు. అయితే ఈ ఇద్దరూ మగవాళ్లు. కాని ఒక స్త్రీ అయి ఉండి స్త్రీ చర్చించడానికి వీలులేని విషయంగా ఎంచబడుతూ స్త్రీ రచయిత ప్రవేశించి చూడలేని చీకటిదారిగా ఉంటూ వచ్చిన వేశ్యా జీవితాన్ని దగ్గరి నుంచి చూసి, పరిశీలించి రాయడం సామాన్యమైన విషయం కాదు. వేశ్యల మీద ఎవరు రాసినా ఎంత రాసినా వాస్తవిక చిత్రణ చేయడంతోనే ముగుస్తారు. కాని రంగనాయకమ్మ ఈ నవలను మార్క్సిజం వెలుగులో చూస్తారు. మార్క్సిజం వెలుగులో శాశ్వత పరిష్కారం చూపుతారు. శ్రీకృష్ణదేవరాయల పాలనలో వేశ్యావాటికలు కళకళలాడటం విన్నాం. వాటి ఆదాయమే రాజ్య ఆదాయంలో కీలకం కావడం తెలుసుకున్నాం. రాజరికం అయినా, ఫ్యూడల్ వ్యవస్థ అయినా, పెట్టుబడిదారీ వ్యవస్థ అయినా భోక్తలుగా కొందరు ఉండాలని నిశ్చయించుకున్నప్పుడే భుజించడానికి స్త్రీ మాంసం అవసరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగానే కాదు ఈ దేశంలో కూడా ఇప్పుడప్పుడే పోయేలా లేదు. కాని అంతవరకూ సమాజాన్ని సంస్కరించడానికి సాహిత్యమే తోడు. ఆ పనిని చాలా సమర్థంగా చేసే నవల, వేశ్యా వృత్తి మూలాలపై విపులమైన అవగాహన కలిగించే నవల- అంధకారంలో.
 
 నవల: అంధకారంలో
 రచయిత: రంగనాయకమ్మ
 తొలి ముద్రణ: 1972

 తెలుగులో వేశ్యావృత్తిపై విపుల చర్చను పెట్టిన తొలి నవల. వేశ్యల జీవితాలను, విటుల వికృతత్వాలను, మనస్తత్వాలను, మలిన పరిస్థితులను కళ్లకు కట్టినట్టుగా చూపి ఒక విముఖత్వం ఏర్పరచడం ద్వారా చైతన్యం కలిగించే నవల. బజారున పడిన ఆడవాళ్ల గురించే గాక ఇళ్లలో ఉండే ఆడవాళ్లు పడే హింసను కూడా చూపుతుంది. భార్యాభర్తల నడుమ ఉండవలసిన సహజమైన ప్రేమ కూడా వ్యభిచారానికి ఒక విరుగుడే. స్త్రీల సంగతి ఏమోగాని ప్రతి మగవాడూ తప్పక చదవాల్సిన నవల ఇది.  మార్కెట్‌లో అందుబాటులో ఉంది. వెల: రూ.50

మరిన్ని వార్తలు