నిర్లక్ష్యానికి మూల్యం!

27 Feb, 2014 23:36 IST|Sakshi

 సంపాదకీయం
  మన తీరప్రాంత రక్ష క వ్యవస్థ పటిష్టతను ప్రశ్నార్థకంచేస్తూ మరో ప్రమాదం జరిగింది. ముంబై తీరప్రాంతంలో బుధవారం జలాంతర్గామి ఐఎన్‌ఎస్ సింధురత్నలో మంటలు చెలరేగి ఇద్దరు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన వెనువెంబడే జరిగిన మరో అసాధారణ ఉదంతం కూడా అందరినీ దిగ్భ్రాంతిపరిచింది. ప్రమాదానికి నైతిక బాధ్యతవహిస్తూ నావికాదళ ప్రధానాధికారి చీఫ్ అడ్మిరల్ డీకే జోషి తన పదవికి రాజీనామా చేశారు. ఆ వెనువె ంటనే ఆ రాజీనామా ఆమోదం కూడా పొందింది. గత ఆరునెలల కాలంలో నావికాదళంలో ప్రమాదాలు చోటుచేసుకోవడం ఇది పదోసారి. ఇందులో మూడు ప్రమాదాలు జలాంతర్గాములకు సంబంధించినవి. గత ఏడాది ఆగస్టులో జలాంతర్గామి ఐఎన్‌ఎస్ సింధురక్షక్‌లో పేలుళ్లు సంభవించి 18మంది నావికాదళ సిబ్బంది మరణించారు. అటు తర్వాత వరసబెట్టి చిన్నా పెద్దా ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.  మన దేశాన్ని శత్రు దుర్భేద్యంగా మలచడానికి త్రివిధ దళాల సిబ్బంది అత్యంత క్లిష్టమైన పరిస్థితులమధ్య అను నిత్యమూ ప్రమాదాలతో సావాసం చేస్తున్నారు. అలాంటివారికి అవసరమైన అత్యాధునిక సామగ్రిని అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్న పర్యవసానంగానే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.
 
  రక్షణ దళాల్లో చేరేవారు ఆ బాధ్యతల్లో ఇమిడివున్న ప్రమాదాలేమిటో, పొంచివున్న ప్రాణాంతక పరిణామాలేమిటో తెలుసుకునే అందులో చేరతారు. శత్రువుతో తలపడే క్రమంలో ఎదురయ్యే ఇలాంటివాటన్నిటినీ వారు ఎదుర్కోవడానికి సిద్ధమే. కానీ, ప్రాణాలను పణంగా పెట్టే పనిలో ఉన్నారు గనుక వారిని విపత్కర పరిస్థితుల్లోకి నెట్టడమో లేదా అలాంటి పరిస్థితులున్నా పట్టించుకోక పోవడమో చేస్తే వారు ఎవరికి చెప్పుకోవాలి? రక్షణ దళాల అవసరాలపై పాలకుల్లో ఉన్న నిర్లక్ష్య ధోరణి, నిర్ణయరాహిత్యమూ, దాదాపు ప్రతి రక్షణ ఒప్పందంలోనూ చోటుచేసుకుంటున్న కుంభకోణాలు... ఇవన్నీ  ప్రమాదాలకు హేతువులవుతున్నాయి. వాస్తవాలు ఇవికాగా, వీటిలో ఏ ఒక్కదాని తోనూ సంబంధమూలేని చీఫ్ అడ్మిరల్ డీకే జోషి రాజీనామా చేయాల్సిరావడం బాధాకరమైన విషయం. అయితే, రక్షణ దళాల అవసరాలను తీర్చడంలో అత్యంత మందకొడిగా వ్యవహరిస్తున్నట్టు అపఖ్యాతిపాలైన యూపీఏ ప్రభుత్వం ఆయన రాజీనామాను మాత్రం ఆగమేఘాలమీద ఆమోదించింది! డీకే జోషి 38 సంవత్సరాల సర్వీసు కాలమంతా మచ్చలేనిది.
 
 
  యుద్ధ నౌకలను ముందుండి నడిపించడంలోనూ, శత్రు జలాంతర్గాముల పనిపట్టడంలోనూ ఆయన చరిత్ర ఉన్నతమైనది. ఇటు రక్షణమంత్రి ఏకే ఆంటోనీకి కూడా నిజాయితీపరుడన్న పేరుంది. కానీ, రక్షణరంగ అవసరాలను పట్టించుకోవడంలో, తీర్చడంలో ఈ నిజాయితీ అక్కరకు రాలేదు. ఏ జలాంతర్గామినైనా రెండు దశాబ్దాలకు మించి వాడకూడదని నిపుణులు చెబుతారు. ఆ ప్రమాణాలతో తూకంవేసి చూస్తే మన నావికాదళానికున్న 13 జలాంతర్గాముల్లో కనీసం అయిదు పూర్తి వార్ధక్యంలో ఉన్నవే. కానీ, వాటి కి మరమ్మతులు చేసి మళ్లీ మళ్లీ వినియోగించాలనుకోవడమే ప్రమాదాలకు ప్రధాన హేతువు.
 
 
  మన నావికాదళం దాదాపు లక్ష కోట్ల రూపాయల విలువైన సామగ్రి అవసరమని కోరి చాలాకాలమైంది. ఇందులో రూ. 50,000 కోట్లు వ్యయమయ్యే 6 జలాంతర్గాములు, రూ. 20,000 కోట్లు అవసరమయ్యే 16 బహుళవిధ హెలికాప్టర్లు, రూ. 5,000 కోట్లు కాగల 9 మధ్యశ్రేణి నిఘా విమానాలు వగైరాలున్నాయి. ఇంకా ఆ జాబితాలో మైన్‌స్వీపర్లు, జలాంతర్గాములు ప్రమాదాల్లో చిక్కుకున్నప్పుడు వినియోగించే రెస్క్యూ వెసల్స్, ఫ్రైగేట్స్, నావీ శాటిలైట్‌లున్నాయి. కానీ, వీటిలో ఏ ఒక్కటీ నావికాదళానికి చేరలేదు.  2008లో రష్యాలో ప్రమాదానికిలోనై 20 మంది సిబ్బంది మరణానికి దారితీసిన జలాంతర్గామినే మన దేశం కొనుగోలు చేసి ఐఎన్‌ఎస్ చక్ర పేరుతో దాన్ని నావికాదళంలో ప్రవేశపెట్టింది. ఇప్పుడు మంటలు ఎగిసిపడిన సింధురత్నను కూడా రష్యానుంచే కొనుగోలుచేశారు. దాన్ని గత ఏడాదే తొలగించాల్సి ఉండగా మరమ్మతులు చేసి మళ్లీ వాడటం ప్రారంభించారు. ఎన్నడో 2006లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం సింధురక్షక్‌లో సంచరించినప్పుడు ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వినియోగించడం కోసమని అమెరికానుంచి అప్పటికప్పుడు సహాయ నౌకను అరువు తెచ్చుకోవాల్సివచ్చింది.
 
 ఇంత పెద్ద దేశాన్ని కంటికి రెప్పలా రక్షించడానికి అవసరమయ్యే సామగ్రిని సమకూర్చడంలో పాలకులు తీవ్రంగా విఫలమవుతున్నారు. మొన్నటికి మొన్న కేంద్ర ఆర్ధికమంత్రి చిదంబరం ప్రవేశపెట్టిన రూ. 18లక్షల కోట్ల బడ్జెట్‌లో రక్షణ రంగానికి రూ. 2.24 లక్షల కోట్లు కేటాయించారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 10 శాతం ఎక్కువ. అంతేకాదు... మొత్తం బడ్జెట్‌లో రక్షణ రంగ వాటా13శాతం. రక్షణ కొనుగోళ్లకు సంబంధించిన ఒప్పందాల్లో స్కాంలున్నాయని గుప్పుమన్నాక అవి నిలిచిపోయాయి. కొనుగోళ్లు పారదర్శకంగా ఉండేలా గత ఏడాది జూన్‌లో కొత్త విధానాన్ని రూపొందించారు. అయితే, మన యుద్ధ సన్నద్ధత సరిగాలేదని కాగ్ చెప్పిన ఏడెనిమిదేళ్లకు గానీ ఇది సాధ్యపడలేదు. 2012నాటికి కనీసం 12 కొత్త జలాంత ర్గాముల్ని సమకూర్చుకోవాలని 1999లో నిర్ణయించినా గత పదేళ్లలో కొత్తది ఒక్కటీ రాలేదు. ఒకపక్క మన పొరుగుదేశాలైన చైనా, పాకిస్థాన్‌లు సాగరజలాల్లో రక్షణ పాటవాన్ని పెంచుకుంటూ సవాళ్లు విసురుతుంటే మనం మాత్రం ఆనాటికానాటికి క్షీణిస్తున్నాం. ఈ దుస్థితిని గుర్తెరిగి ఇప్పటికైనా ప్రభుత్వం లోపాలను గుర్తెరగాలి. పటిష్ట కార్యాచరణకు దిగాలి.
 
 

మరిన్ని వార్తలు