ఫిరాయింపుల పీచమణగాలి!

15 Mar, 2016 01:12 IST|Sakshi
ఫిరాయింపుల పీచమణగాలి!

రెండో మాట

 

‘ఒక పార్టీ టికెట్ పైన ఎన్నికలలో గెలిచిన లెజిస్లేటర్లు మరో పార్టీలోకి ఉడాయించడం అనేది జాతీయ స్థాయిలో ప్రబలిపోతున్న జబ్బు. ఈ జబ్బు మన ప్రజాస్వామ్య వ్యవస్థ జవజీవాలను తోడేస్తున్నది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం రాజకీయ పక్షాలు నిర్దిష్ట ప్రవర్తనా నిబంధనావళికీ, నియమబద్ధ సంప్రదాయాలకూ  బద్ధమై ఉండడం వల్లనే సాధ్యం. అలాగే ప్రజాస్వామ్య సంస్థలను, కార్యకలాపాలను శాసించగల మౌలికమైన యోగ్యతా మర్యాదల ను, ఔచిత్యాన్ని పరిగణనలోనికి తీసుకుని పార్టీలు వ్యవహరించేలా ఉండాలి.’

(ఫిబ్రవరి 18, 1969న నాటి కేంద్ర హోంమంత్రి వైబీ చవాన్ కమిటీ పార్లమెంట్‌కు సమర్పించిన నివేదిక)

 

ఆనాటి లోక్‌సభలో సోషలిస్ట్ నాయకుడు మధు లిమాయే ప్రతిపాదించిన సవరణలతో ఏర్పడిన చవాన్ కమిటీ, ఒక పార్టీ టికెట్ మీద గెలిచి అనంతరం మరో పార్టీ ఒరలోకి దూరిపోయే జంప్ జిలానీల (ఆయారామ్ గయారామ్‌లు) ప్రవర్తన అరికట్టేందుకు తన నివేదికలో అనేక విలువైన ప్రతిపాదనలు  చేసింది. అయినా, ‘బుద్ధి గడ్డి తినడానికి’ అలవాటు పడినప్పుడు ఈ గోడ దూకుడు గాళ్లకు ఏ రాజ్యాంగం గానీ, ఏ నిబంధన గానీ, ఏ చట్టం గానీ అడ్డంకాదని స్వతంత్ర భారత లె జిస్లేచర్లలో ఇన్నేళ్లుగానూ జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి.

 

లెజిస్లేచర్లలో (పార్లమెంట్/ అసెంబ్లీలు) మెజారిటీ ఉన్న అధికార పార్టీలు కూడా విద్వేషభావంతో ప్రతిపక్షాలకు శాసన వేదికలలో ప్రాతినిధ్యం అంటూ లేకుండా అందులో ఉన్న సభ్యులను కూడా రకరకాల ప్రలోభాలతో అధికార పార్టీలో చేర్చుకుంటున్నాయి. అలా ప్రతిపక్షాన్ని క్రమంగా నిశ్శేషం చేసే ఓ కొత్త రాజకీయ క్రీడకు పాల్పడుతున్నాయి. అధికార పార్టీలు (రెండు తెలుగు రాష్ట్రాలు సహా) ఆది నుంచి జంప్ జిలానీల మీదనే ఆధారపడుతూ వచ్చాయి. ఈ రెండు రకాల అధికార పార్టీలూ ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలలోను అధికార పీఠాలను ఇలాగే కాపాడుకోజూస్తున్నాయి. 

 

ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పక్షం ఒక తెలుగు రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వంలో చిన్న భాగస్వామిగా కూడా ఉంది. అయితే రేపోమాపో ఏ మిషతో అయినా ఆ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంటే తమ ఉనికి ప్రమాదంలో పడుతుందని ఈ ప్రాంతీయ పార్టీ మొదటి నుంచి భావిస్తూ బలమైన విపక్షంగా ఉన్న పార్టీ లెజిస్లేటర్లను ప్రలోభ పెట్టే దశకు చేరుకుంది. అదే రెండు తెలుగు రాష్ట్రాలలోను ప్రతిబింబిస్తున్నది.

 

కప్పదాట్లు సాగుతూనే ఉన్నాయి

ఈ నేపథ్యంలో ఒక్కసారి గతంలోకి వెళితే, లెజిస్లేటర్ల కప్పదాట్లను అరికట్టడం కోసం 1973లో ఆనాటి కేంద్రం రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యాంగంలో చేర్చడానికి సిద్ధంచేసిన ఎనిమిది అధికరణలకు అవకాశవాద రాజకీయాల వల్ల విలువ లేకుండా పోయింది. ఎందుకంటే పార్టీ విధానాలతో సంబంధం లేకుండా లెజిస్లేటర్లు జంప్ జిలానీలుగా మారుతున్న దశలో చవాన్ కమిటీ నివేదిక లోని సిఫారసులను బిల్లులో చేర్చకుండా స్వార్థం కొద్దీ తప్పించారు.

 

1977 వచ్చేసరికి ఎవరో కొందరు ధనవంతులు, అవకాశవాదుల కుట్ర వల్ల లోక్‌సభ రద్దయింది. అలా 395 అధికరణలతో 12 షెడ్యూల్స్‌తో పలు సవరణలతో కూడిన రాజ్యాంగం మనకు ఉండి కూడా ఆచరణలో ప్రజలు మోసాలకు గురి కావలసి వస్తున్నది. కమిటీలతో పాలకపక్షం, ప్రతిపక్షం చేస్తున్న కాలయాపన కారణంగా నివేదికలకు విలువ లేకుండా పోయింది. అయినా కమిటీల మీద కమిటీలు వస్తూనే ఉన్నాయి. జనతా పాలనలోనూ ఇదే తంతు నడిచింది. ఫిరాయింపులు అరికట్టడమనే మిషతో చరణ్‌సింగ్ హోంమంత్రిగా మరో రాజ్యాంగ సవరణ బిల్లు వచ్చింది. ఈ బిల్లు పార్టీ ఫిరాయించే లెజిస్లేటర్లపై అనర్హత వేటు వేయాలని సిఫారసు చేసింది (102,191 అధికరణల కింద). ఇది రాజ్యాంగం 10వ షెడ్యూల్ కింద అనివార్యమయింది.

 

అయినా ప్రలోభాల ద్వారా ప్రతిపక్షం నుంచి లెజిస్లేటర్ల ఫిరాయింపులను బాహాటంగా ప్రోత్సహించి మొత్తం ప్రజాస్వామ్య ప్రక్రియనే అవహేళన చేసే దశకు పాలక పక్షాలు చేరుకున్నాయి. సభ్యుల భిన్నాభిప్రాయ ప్రకటనకు, పార్టీ ఫిరాయింపులకు తేడాను గుర్తించలేనంత గుడ్డివాళ్లుగా జంప్ జిలానీ లెజిస్లేటర్లు తయారవుతున్నారు. పార్టీనీ, పార్టీ విప్‌నూ లెక్క చేయకుండా ప్రలోభం మత్తులో గోడ దూకే లెజిస్లేటర్ లెజిస్లేచర్ సభ్యునిగా అనర్హుడని సుప్రీంకోర్టు తీర్పులు (1987/1992) తీర్పు ఇచ్చిందని మరచిపోరాదు. ‘ఒక రాజకీయ పార్టీ గుర్తు మీద ఎన్నికైన లెజిస్లేటర్ ఆ పార్టీ నిర్ణయం లేదా అనుమతి లేకుండా మరో పార్టీలోకి దూకేయడాన్ని విభీషణ పాత్రగా, లేదా కప్పగంతుగా పరిగణించాల్సిందే’నని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

 

ఫిరాయింపుదారు అనర్హుడే

1967-1977 మధ్య 542 ఫిరాయింపు కేసులు నమోదైనాయి. అందులో ఒక్క ఏడాది మాత్రం 438 కేసులు నమోదైనాయి. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా గెలిచిన వారిలో 157 మందికి పైగా వివిధ పార్టీల తీర్థం పుచ్చుకున్నారు. 1985లో రాజ్యాంగానికి వచ్చిన 52వ సవరణ ప్రకారం ఇలాంటి ఫిరాయింపుల గురించి సుప్రీంకోర్టు  ఇలా ఘాటైన హెచ్చరిక చేసింది:  ‘మన ప్రజాస్వామిక వ్యవస్థ ఒక గర్వకారణమైన వ్యవస్థగా మాత్రమే మిగిలిపోకుండా, బాహ్య ప్రపంచానికి ఆదర్శనీయమైన పాలనా వ్యవస్థగా కూడా భావించేలా ఉండాలి’. బహుశా అందుకే బ్రిటిష్ రాజ్యాంగ వ్యవహారాల మీద సాధికార వ్యాఖ్యాతలలో ఒకరైన ఐవర్ జెన్నింగ్స్  కూడా ‘మధ్యలో ఒక పార్టీని విడనాడడమంటే తరువాతి ఎన్నికలలో ఆ పార్టీ మద్దతును కోల్పోవడమే’ అన్న స్పృహ ఉండాలన్నాడు. అంతేగాదు, ఓటు హక్కును వినియోగించుకునే సగటు సామాన్య ఓటరు పార్టీ గుర్తుకు మాత్రమే ఓటు వేస్తాడు.

 

అంటే అంతకు ముందు ఆ పార్టీని అర్ధాంతరంగా ఫిరాయించిన లెజిస్లేటర్ ఇక ఎన్నిక కాబోడనే దాని అర్థం కూడా అని జెన్నింగ్స్ అన్నాడు. అందుకని భారత రాజ్యాంగానికి వచ్చిన 52వ సవరణ ఎందుకంత కీలకమైంది? లెజిస్లేటర్ లేదా ఫిరాయింపుదారు ఈ సవరణ ప్రకారం లెజిస్లేచర్ సభ్యత్వాన్ని వదులుకోవలసిందే, సీటు ఖాళీ చేయవలసిందే, లెజిస్లేటర్‌గా అనర్హుడు కావలసిందేనని ఆ సవరణ స్పష్టం చేసింది. అందుకే సుప్రీం కోర్టు లెజిస్లేటర్ల ఫిరాయింపుల నిషేధ చట్టం రాజ్యాంగ బద్ధతను ఖాయం చేస్తూ 1993లోనే విలువైన తీర్పు చెప్పింది. ఈ తీర్పు చెప్పిన ఐదుగురు సభ్యులుగల సుప్రీంకోర్టు ధర్మాసనంలో సుప్రసిద్ధ న్యాయమూర్తి వెంకటాచలయ్య కూడా ఉన్నారు (కిహోటా హల్లోహన్ జాబిల్హూ కేసు). చివరికి ఇలా ఫిరాయించే లెజిస్లేటర్లు స్వతంత్ర/ ఇండిపెండెంట్ అభ్యర్థులుగా సభలో కూర్చోవడానికి సిద్ధపడడం కూడా ‘ఓటర్లను మోసగించడం’గా ఆస్ట్రేలియా రాజ్యాంగ చట్టం, మరికొన్ని దేశాల రాజ్యాంగాలు పరిగణించాయి.

 

మన దేశంలో కూడా ఎన్నికల కమిషన్‌లు, ప్రజాప్రాతినిధ్య చట్టం లాంటి అనేక రాజ్యాంగ సంస్థలు పదే పదే ఫిరాయింపులను గురించి హెచ్చరిస్తూ వచ్చినా రాజకీయాలలో నేరపూరిత వ్యూహాలు, పద్ధతులు పెరిగిపోతున్నాయి తప్ప, ఆగడం లేదని ప్రజల అనుభవం. ఇదే అంశాన్ని పాతికేళ్ల క్రితం ప్రస్తావించి నపుడు హోంశాఖ మాజీ కార్యదర్శి ఓరా కమిటీ పోలీసులు, రాజకీయులు, మాఫియా మధ్య బలమైన పీటముడి ఉందని హెచ్చరించ వలసి వచ్చింది. నేరమయ రాజకీయాలలో ఫిరాయింపులు ఒక భాగం. రాజకీయాలు నేరమయం కావడం గురించి కోర్టులు, సుప్రీంకోర్టులలో అనేక ఫిర్యాదులు అప్పీళ్ల రూపంలో పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి. అయితే కోర్టులు మాత్రం ఎన్ని పెండింగ్ కేసులని  పరిష్కరిస్తాయి? బలవంతులకు, ధనవం తులకు కొమ్ము కాసే స్థితికి పాలకపక్షం, ప్రభుత్వాల రాజకీయ స్థాయి చేరకూ డదు. రైతుల, మధ్య తరగతి ప్రజల సమస్యలను పరిష్కరించే నాథుడు లేడు.

 

నియంతృత్వ శక్తులకు ఊతం

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి రాజీనామా చేయకుండా మరో పార్టీలోకి గెంతి స్పీకర్స్ చాటున దాగి నెలల తరబడి గుర్తింపు పొందాలన్న తహతహను కూడా సుప్రీం నిరసించింది. ఒక పార్టీ అభ్యర్థి ఒకే రోజున మూడు పార్టీలు ఫిరాయించిన చరిత్ర కూడా ఇక్కడ ఉంది. స్పీకర్ నిర్ణయానికి తిరుగులేదనుకునే వారికి కూడా సమాధానంగా అత్యున్నత ధర్మాసనానికి స్పీకర్ల నిర్ణయాలను కూడా సమీక్షించే హక్కు ఉందని చెప్పవలసి వచ్చిందని మరువరాదు.

 

అంతేగాదు, 2007లో లోక్‌సభలో ఆ తరువాత రాష్ట్ర శాసనసభలలో ఫిరాయింపులను ప్రోత్సహించడానికి లేదా సభలో ఫలానా ప్రశ్న వేస్తే ఇంత రొఖ్ఖం చెల్లిస్తామని బేరాలాడే సందర్భాలలో సుప్రీం ముందుకు ఒక కేసు విచారణకు వచ్చింది (రాజారాంపాల్ వర్సెస్ లోక్‌సభ స్పీకర్: క్యాష్ ఫర్ క్యారీ). ఆ కేసులో వాదించిన సుప్రీం న్యాయవాది డాక్టర్ చౌహాన్ ఒక సందర్భంలో ఫిరాయింపులలో ఎక్కువ భాగం తమను మంత్రులుగా నియమించవచ్చునన్న ఆశలతో ఉండి ఆ పదవులు రాకపోతే హతాశులైన సభ్యులని వెల్లడించాడు.

 

ఇందుకు ఉదాహరణగా ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్, బహుజన సమాజ్‌వాది పార్టీల నుంచి వచ్చిన ఫిరాయింపుదారులతో (1997)బీజేపీ  కల్యాణ్‌సింగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే. అలాగే 2008లో కాంగ్రెస్‌పార్టీలో ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా కర్ణాటకలో బీఎస్ ఎడ్యూరప్ప (బీజేపీ) మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇలా ఎన్నో ఉదాహరణలు ఇవ్వవచ్చు.

లెజిస్లేటర్లలో వక్రీకరించే బుద్ధుల నుంచి పుట్టే ఫిరాయింపుల సంస్కృతికి ధనిక వర్గ రాజకీయ పక్షాలే ప్రధాన కారణం. ఈ సంస్కృతి వల్ల ప్రజాతంత్ర శక్తుల ఉదాసీనత వల్ల ఫిరాయింపుల ద్వారా విపక్షాన్ని నిశ్శేషం చేసి నియంతృత్వ శక్తులు పెట్రేగిపోయే ప్రమాదం ఉంది. 

 

-  ఏబీకే ప్రసాద్

 సీనియర్ సంపాదకులు

abkprasad2006@yahoo.co.in

>
మరిన్ని వార్తలు