‘న్యాయ’ రిజర్వేషన్లు అవసరమే

20 Apr, 2016 00:56 IST|Sakshi
‘న్యాయ’ రిజర్వేషన్లు అవసరమే

 సందర్భం
 
హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపిక గురించి ఏర్పాటు చేసిన కమిషన్‌ని సుప్రీం కోర్టు  రద్దు చేసి కొలీజియమ్ పద్ధతిని సమర్థిస్తూ తీర్పును ప్రకటించింది. న్యాయమూర్తుల ఎం పిక పద్ధతిపై ఒక విజ్ఞాపన పత్రం (అఫిడవిట్)ను కేంద్ర ప్రభుత్వం సమర్పించాలని సుప్రీం కోర్టు ఆ తీర్పులో కోరింది. 1999లో రూపొందించిన జడ్జీల ఎంపిక పద్ధతిని మార్చాలని కూడా సుప్రీంకోర్టు డిసెంబర్ 16, 2015న ఆ తీర్పులో చెప్పింది. కానీ ఇప్పటికీ ఆ ఎంపిక పద్ధతి గురించిన విజ్ఞాపన పత్రం తుది రూపు దాల్చలేదు. పత్రికల్లో వస్తున్న సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విజ్ఞాపన పత్రంలో పారదర్శకత, అర్హత, సచివా లయ వివరాలు, ఫిర్యాదుల విచారణ తదితర అంశాలు ప్రాధాన్యత సంతరించు కున్నాయి. కానీ సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో రిజర్వేషన్ల ప్రస్తావన ఎక్కడా లేదు. జడ్జీల నియామకాల్లో రాజ్యాంగం ఎలాంటి రిజర్వేషన్లు  నిర్దేశించ లేదు కానీ అన్ని వర్గాల ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల ప్రజల్లో అసంతృప్తి నెలకొనే అవకాశం ఉంది. అదే విధంగా ఉన్నత వర్గాలే న్యాయ మూర్తులుగా ఉండటం వల్ల వారి వర్గ దృక్పథం ప్రకారం తీర్పులు వెలువడే అవకాశం కూడా వుంది.

ఉన్నత న్యాయస్థానాల్లోని న్యాయమూర్తుల ఎంపికలో రిజర్వేషన్లు ఉండాలని అప్పటి కేంద్ర సహాయమంత్రి నాచియప్పన్ 2007 సంవత్సరంలో గొంతెత్తారు. జస్టిస్ సదాశివం భారత ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్య తలు స్వీకరించే ముందు ఒక ఇంటర్వ్యూలో ఇలాంటి అభిప్రాయమే వెలిబుచ్చారు. షెడ్యూల్డు కులాలకి, తెగలకి, వెనుకబడిన తరగతులకి చెందిన వ్యక్తులకి ప్రాతినిధ్యం కలిగేలా రిజర్వేషన్లు ఉండాలని అయితే కనీస ప్రమాణాలు వున్న వ్యక్తులనే ఎంపిక చేస్తామని కూడా ఆయన అన్నారు. జనవరి 19, 2016వ తేదీన మద్రాస్ హైకోర్టు న్యాయ మూర్తులు హరిపరంతమన్, పి.ఆర్ శివకుమార్‌లు మదురై న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడుతూ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో రిజర్వేషన్లు ఉండాలని గొంతెత్తారు. దేశవ్యాప్తంగా వున్న 1200 మంది న్యాయ వాదుల్లో షెడ్యూల్డు కులాలకు చెందిన వ్యక్తులు 18 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు

జడ్జీల ఎంపిక కమిషన్ చట్టాన్ని కొట్టివేసిన తర్వాత తీసుకొని రావాల్సిన సంస్కరణల గురించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జె.ఎస్.కెహర్ అధ్యక్షతన గల బెంచ్ విచారి స్తున్నపుడు మహిళల రిజర్వేషన్ ప్రస్తావన వచ్చింది. మహి ళలని న్యాయమూర్తులుగా ఎంపిక చేసే ఆలోచనలకి వ్యతిరే కంగా న్యాయమూర్తులు ఉండకూడదని మహిళా న్యాయ వాదులు కోర్టు ముందు గట్టిగా వాదించారు. దేశంలోని హైకోర్టు న్యాయమూర్తులలో 611 మంది పురుషులు న్యాయవాదులుగా ఉంటే 62 మంది మాత్రమే మహిళలు ఉన్నారని వాళ్లు కోర్టుకు విన్నవించారు.

దిగువ కోర్టులో రిజర్వేషన్లు ఉన్నాయి కానీ హైకోర్టు, సుప్రీంకోర్టులో రిజర్వేషన్లు లేవు. ప్రధాన న్యాయమూర్తుల పదోన్నతులలో అన్ని రాష్ట్రాలకు చెందిన న్యాయమూర్తులకి ప్రాతినిధ్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్టు అన్పి స్తుంది. కానీ న్యాయమూర్తుల ఎంపికలో అన్ని వర్గాలకు సరైన ప్రాతినిధ్యం కన్పించటం లేదు. అదే విధంగా సర్వీసెస్ నుంచి వచ్చే న్యాయమూర్తులకు తీవ్రమైన అన్యాయం జరుగుతోంది. ఇపుడున్న 601 న్యాయ మూర్తుల్లో 378 మంది న్యాయవాదుల వృత్తి(బార్) నుంచి వచ్చిన వాళ్లే. 168 మంది మాత్రమే సర్వీసెస్ నుంచి వచ్చిన వాళ్లు. ఈ నిష్పత్తిని సమానంగా ఉంచకపోవడం ఒక రకంగా వివక్షే. బార్ నుంచి ఎంపికయ్యే న్యాయమూర్తుల సగటు వయస్సు 48 సంవత్సరాలు ఉంటే సర్వీసెస్ నుంచి వచ్చిన న్యాయమూర్తుల సగటు వయస్సు 56 సంవత్స రాలు వుంటుంది. వయస్సు రీత్యా సీనియారిటీలో కింద పెట్టడం వల్ల సర్వీసెస్ నుంచి వచ్చిన న్యాయమూర్తులు కొలీజియమ్‌లోకి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి.

దేశవ్యాప్తంగా హైకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య 60 మాత్రమే. సుప్రీంకోర్టులో ఒకే ఒక మహిళా న్యాయమూర్తి.  8 హైకోర్టులలో ఒక్క మహిళా న్యాయ మూర్తి కూడా లేరు. షెడ్యూల్ తెగలకి, వెనుకబడిన తరగ తులకి, మైనార్టీలకి సంబంధించి ఎంత మంది న్యాయ మూర్తులు ఉన్నారో తెలియదు గానీ వారి సంఖ్య పరిమి తంగా ఉందని చెప్పవచ్చు. రిజర్వేషన్లు లేకపోయినా అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం ఉండేలా న్యాయమూర్తుల ఎంపిక జరగాలి. చదువు అనేది వ్యాపారంగా మారిన మనదేశంలో యోగ్యత ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తామని అనడం ఎంత వరకు సమంజసమన్న ప్రశ్న కూడా వస్తుంది. అట్లా అని యోగ్యత లేని వాళ్లని ఎంపిక చేయమని అనడం కూడా  సరైంది కాదు. రిజర్వేషన్లు కావాలని అనడం మెరిట్‌కి వ్యతిరేకం కాదు. న్యాయవ్యవస్థలో అన్ని వర్గాలని భాగస్వా మ్యం చేయాలన్న ఉద్దేశంతో చెబుతున్న మాట.

ఎందుకంటే ఉన్నత వర్గాలకి చెందిన, అణగారిన వర్గాల నుంచి వచ్చిన న్యాయమూర్తుల దృక్పథం వేరు వేరుగా ఉంటుంది. గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి బి. పార్ధివాలా ఓ కేసును విచారిస్తూ. ‘‘ఈ దేశాన్ని నాశనం పట్టించిన లేదా దేశం సరైన దిశలో ప్రయాణం చేయక పోవడానికి గల కారణాలు చెప్పమని నన్ను ఎవరైనా అడిగితే రెండు విషయాలు చెపుతాను. అవి రిజర్వేషన్లు, అవినీతి’’ అన్నారు.  పైగా ‘‘స్వాతంత్య్రం వచ్చిన 65 సంవత్సరాల తర్వాత కూడా రిజర్వేషన్లు  అడుగుతున్నా రంటే అంతకన్నా సిగ్గు పడాల్సిన అంశం మరొకటి లేదు. ఒక్క మన దేశంలోనే కొంత మంది వ్యక్తులు తాము వెనకబడినామని చెప్పుకోవడం అధిక్షేపం లాంటిదే. ఈ దేశాన్ని భయపెట్టిస్తున్నది అవినీతి. అందుకని రిజర్వేషన్ల కోసం కాకుండా అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలి.’’ అనేశారు.

ఆ న్యాయమూర్తిని పదవీచ్యుతుడిని చేయాలంటూ అభిశంసన తీర్మానాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన తర్వాత తన వ్యాఖ్యలను ఆ న్యాయమూర్తి తొలగించారు. రిజర్వేషన్లని, అవినీతిని ఒకే గాటన కట్టడం అగ్రవర్ణాల మనస్తత్వానికి తార్కాణం. భిన్న వర్గాలు, భిన్న మతాలు ఉన్న దేశంలో అంతే వైవిధ్యం వున్న న్యాయమూర్తులు ఉండాలి. అన్ని వర్గాల ప్రాతినిధ్యం ఉన్నప్పుడే వైవిధ్య మైన అనుభవాలు ఒక బెంచ్ నుంచి ప్రవహించి, సరైన నిర్ణయం తీసుకునే ప్రక్రియలో ఉపయోగపడుతుంది. అప్పుడే న్యాయధర్మం సుసంపన్నమవుతుంది. ఈ దిశగా న్యాయమూర్తుల ఎంపిక విజ్ఞాపన పత్రం రూపొందాలని ప్రజల ఆకాంక్ష.
 

మంగారి రాజేందర్, వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్
 కమిషన్ సభ్యులు  మొబైల్: 94404 83001
 
 

Read latest Opinion News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా