వ్యథార్తులను వెక్కిరించకండి!

14 May, 2015 00:41 IST|Sakshi
వ్యథార్తులను వెక్కిరించకండి!

 (కొత్త కోణం )

రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 మనిషికి జీవించే హక్కును- గౌరవంగా జీవించే హక్కును ప్రసాదించింది. మనిషికీ జంతువుకీ జీవించే విషయంలో ఉన్న తేడాను గమనించాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాలను హెచ్చరించింది. ఎటువంటి ఆధారం లేని, ఆదరణ లేని వ్యక్తులకు నీడనివ్వడానికి షెల్టర్లను నిర్మించాలనీ అందులో అన్నిరకాల మౌలిక సౌకర్యాలను కల్పించాలనీ ఆదేశించింది. ఏ వ్యక్తీ కూడా రోడ్ల మీద, దుర్భర స్థితిలో ఉండకూడదని కూడా సుప్రీంకోర్టు హెచ్చరించింది.
 

 ఆకలి...పేగులు లుంగలు చుట్టుకుపోయే ఆకలి... ఒంటిమీద చింకి పేలికైనా లేని దారిద్య్రం... చిట్టచివరికి శవాన్ని పూడ్చి పెట్టేందుకు సైతం అడుక్కుం టున్న ఇంటి ఇల్లాలు. ‘ఏం ఎందుకు? వాళ్లెందుకు చనిపోతున్నారు? తినడానికి బ్రెడ్ ముక్కలేదా?’ ఫ్రెంచి మహారాణి ప్రశ్నించింది. ‘అవును బ్రెడ్ లేకనే చనిపోతున్నారు’ రాజప్రాసాదంలోని సిబ్బంది నుంచి వచ్చింది సమాధానం. ‘అలా అయితే పేస్ట్రీ (కేక్) తినమని చెప్పండి’ అంటూ ఫ్రెంచి రాణి చేసిన వ్యాఖ్యలో అపహాస్యం, అధికార దురహంకారం ధ్వనించాయి. అవివేకమైన, అహంకార పూరితమైన ఈ వ్యాఖ్యే ఫ్రెంచి విప్లవాగ్నిని రగు ల్కొల్పింది. రాచరిక వ్యవస్థ పునాదులను కూకటివేళ్ళతో పెకిలించింది. తిరు గుబాటుకు ఆజ్యం పోసింది. అది 1770వ సంవత్సరం మధ్య కాలం. ఫ్రాన్స్ ప్రజలు ఆకలితో అల్లాడుతోన్న సందర్భం.

వరుస కరువులతో విలవిల్లాడు తున్న జనం ఒక పక్క. విలాసాల్లో తేలియాడుతున్న ఫ్రెంచి రాజకుటుంబం మరోపక్క. అప్పుడే ఆకలిచావులపై జరిగిన చర్చలో మహారాణి వ్యాఖ్యలు ఫ్రెంచి విప్లవానికి నిప్పునందించాయి. ఆనాడు ఫ్రాన్స్‌లో ఉన్న ఆర్థిక, రాజ కీయ, సామాజిక పరిస్థితులకు ఫ్రెంచి మహారాణి వ్యాఖ్యలు తోడైనాయన్నది చరిత్ర చెప్పిన సత్యం. ఫ్రెంచి విప్లవానికి తాత్వికతను అందించిన మహా మేధావి, రాజకీయ తత్వవేత్త, రచయిత, సంగీత విద్వాంసులు జాన్ జాక్ రూసో ఈ విషయాన్ని స్వీయ చరిత్ర ‘కన్‌ఫెషన్స్’లో ప్రస్తావించాడు. ఈ ఉదంతం ఫ్రెంచి ప్రజలను ఆలోచింపజేసింది. జూలై, 14, 1789న ప్రారం భమైన ఫ్రెంచి విప్లవం 1799 వరకు సాగింది. ఫ్రాన్స్‌నే కాదు, యూరప్ మొత్తాన్నీ, ప్రపంచాన్నీ ప్రభావితం చేసిన గొప్ప విప్లవం అది. పారిస్ కమ్యూన్‌లో కమ్యూనిజం తొలకరి జల్లులే ఆ పోరాటాలు.

 ఆకలినీ, దారిద్య్రాన్నీ పరిహసిస్తారా?
 ఆకలినీ, దారిద్య్రాన్నీ పరిహసిస్తే ఏం జరిగిందో చరిత్ర స్పష్టంగా చెబుతోంది. అలాంటి పరిహాసం నేటి సినీ ప్రపంచంలో పునరావృతం కావడం ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. కండల వీరుడి కండకావరానికి మద్దతుగానో, లేక లక్షలాది మంది ప్రేక్షకుల అభిమాన హీరో సల్మాన్‌ఖాన్ నిజ జీవితంలోని నటనకు ప్రతిస్పందించో తెలియదు కానీ, ఆ ముంబై గాయకుడు అభిజిత్ భట్టాచార్య చేసిన వ్యాఖ్యలు ఈ దేశంలో పేదవాడి పట్ల కలవారికున్న నీచ మైన స్వభావాన్ని తేటతెల్లం చేశాయి.

 ఫుట్‌పాత్ మీద పడుకున్న వారిపై నుంచి కారు నడిపి ఒకరి మరణానికీ, మరికొంతమంది గాయపడడానికీ కారణమైన బాలీవుడ్ నటుడు సల్మాన్‌కు న్యాయస్థానం ఐదేళ్లు శిక్ష వేసిన సందర్భంగా అభిజిత్ భట్టాచార్య ఆవేశంతో ఊగిపోయి ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘‘రోడ్ల మీద కార్లు, కుక్కలు మాత్రమే తిరు గుతాయి. వీళ్ళకేంపని అక్కడ పడుకోవడానికి? అటువంటప్పుడు జరిగే సం ఘటనకు శిక్షపడడం అన్యాయం’’ అన్న అభిజిత్ వ్యాఖ్యలు అనాలోచితమై నవి మాత్రమే కాదు. డబ్బు మత్తులో చిత్తవుతున్న వేనవేల బడాబాబుల మనస్తత్వానికి మచ్చుతునకలు. సల్మాన్ నేరం కంటే ఈ వ్యాఖ్య పదింతలు ఎక్కువ నేరపూరితమైనదని నేను భావిస్తున్నాను. అది ఉద్దేశపూరితంగా చేసిన వ్యాఖ్య కాకపోవచ్చు. కానీ నిష్కారణంగా నిరుపేదల ప్రాణాలను తీయడాన్ని తేలికగా తీసివేయడం, అల్పంగా భావించడం ప్రమాదకరం.

 ఫ్రెంచి విప్లవానికి ముందు రాజకుటుంబం ప్రజల అవస్థలను సవ్యమైన దృష్టితో పరిశీలించి, పరిష్కారాలను వెదికి ఉంటే పరిస్థితి అంత దూరం వెళ్ళేది కాదు. రాజకుటుంబం ఘోరమైన చావుకి గురయ్యేది కాదు. ఏదైనా ఒక సంఘటన జరిగితే, కారణాలను వెదికి, సమస్య పరిష్కరించడానికి పూనుకోవడం మనవల్ల కాకపోతే, దానికి సహకరించడం, అది కూడా చేత కాకపోతే కనీసం సానుభూతితోనైనా సమస్యను అర్థం చేసుకోవడం విజ్ఙుల పని. అంతేకానీ అగ్నికి ఆజ్యం పోసినట్టు ఆకలి, అవమానం, అన్యాయంతో రగిలిపోయే పేదల పట్ల మూర్ఖంగా ప్రవర్తించడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం అహంకారులు చేసే పని.

అభిజిత్ లాంటి వాళ్లు చేసే వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని భావించటం లేదు. ఈ వ్యాఖ్యలకు ఒక స్వభావం ఉన్నది. పేదల పట్ల ద్వేషం, కోపం, అపహాస్యం దాని లక్షణం. ఎప్పుడైనా పేదలు, దిక్కులేని వాళ్ళు, అన్నార్తుల చర్చ వస్తే వీళ్లు నిలువెల్లా రగిలిపోతారు. కానీ ఫుట్‌పాత్‌ల మీద, ఇతర పబ్లిక్, ప్రైవేట్ స్థలాల్లో తలదాచుకుంటున్న లక్షలాది మంది ఎవరు? ఎవరికారణంగా వీళ్ళు ఈ స్థితిలో ఉన్నారనే విషయం వీరికి పట్టదు. అయితే మానవత్వం ఉన్న మనుషులుగా, పాలకులుగా ప్రజల స్థితిగతులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం అందరి బాధ్యత.

 రోడ్ల మీద బతికేవాళ్లు 20 లక్షలు
 2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో నిలువ నీడలేకుండా బతుకు లీడుస్తున్న వాళ్లు దాదాపు 20 లక్షలని అంచనా. ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగి ఉండవచ్చు. ఇందులో 9 లక్షల వరకు పట్టణాలు, నగరాల్లో ఉన్నట్టు, 11 లక్షల మందికి పైగా గ్రామాల్లో ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇటీవల ప్రణాళికా సంఘం అనుమతి మేరకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి హర్షమందర్ ఆధ్వర్యంలో జరిగిన అధ్యయనంలో అనేక విషయాలు వెలుగుచూశాయి.

 నిలువనీడలేని వాళ్లు ఎక్కువ మంది దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్థనా స్థలాలు, రైల్వే, బస్ స్టేషన్లు, రోడ్లు, ఫుట్‌పాత్‌లు, పార్క్‌లు, ఫ్లైఓవర్ల కింద, దుకాణ సముదాయాల అరుగుల మీద, బ్రిడ్జిల కింద జీవనం సాగిస్తున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. వీళ్లలో ఎక్కువ మంది భిక్షాటన, ఇతర దానధర్మాల మీద ఆధారపడి బతుకులీడుస్తున్నారు. రోజువారీ పనులకు వెళ్లే వాళ్లు కూడా ఉంటారు. వీటికి తోడు పోలీసుల వేధింపులు నిత్యకృత్యం. దొంగలుగా, పిక్‌పాకెటర్‌లుగా, సెక్స్ వర్కర్లుగా ముద్రవేసి ఎక్కడ ఏదైనా దొంగతనం జరిగితే ఇటువంటి వాళ్లను ఆ కేసుల్లో ఇరికించే సంఘటనలు కోకొల్లలు. అందువల్లనే వీరెవ్వరికీ కూడా ప్రభుత్వం పైన, పోలీసులపైన సదభిప్రాయం ఉండదని ఈ అధ్యయనం వెల్లడించింది.

 వీధుల్లో నిలువనీడ లేకుండా జీవనం సాగించే వాళ్లు ఎవరు? ఎందుకు అలా గడుపుతున్నారనేది లక్షల డాలర్ల ప్రశ్న. తినడానికి తిండిలేకపోయినా, కనీసం గుడిసెల్లోనైనా బతికే జనం చాలా మంది ఉన్నారు. మరెందుకు ఇన్ని లక్షల మంది రోడ్ల మీద జీవనం సాగిస్తున్నారనేది ప్రశ్న. ఈ అధ్యయనం ఈ ప్రశ్నకి సమాధానం వెదికింది. కొన్ని కారణాలను బయటపెట్టింది. పిల్లలు, మహిళలు ఇంట్లో ఉండే హింస, బాధలు తట్టుకోలేక బయట పడుతుంటారు. సవతితల్లి, రెండో తండ్రి, లేదా తల్లి లేని పిల్లలు తొందరగా ఇల్లు విడిచిపెడు తుంటారు. తాగుడుకు బానిసలై, బాధ్యతలు విస్మరించిన మగవాళ్లు, పైసా సంపాదన లేని వాళ్లు కూడా ఇందులో చేరతారు. మానసిక రుగ్మత, నయం కాని జబ్బులతో బాధపడేవాళ్ళు, దిక్కులేని వృద్ధులు కూడా వీధుల పాలవు తున్నారు. ఉపాధికోల్పోయిన యువకులు, వికలాంగులు, ఏ దిక్కూలేక వీధుల్లోకొస్తున్నారు. అల్లర్లలో, హింసాకాండలో సర్వస్వం కోల్పోయిన వాళ్లు, చెదిరిపోయిన కుటుంబాలవాళ్లు, కుటుంబం, సమాజం, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల వీళ్లు కూడు, గూడులేని దీనులుగా మారుతున్నారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలేవీ కూడా ఈ అభాగ్యులను పట్టించుకోక పోవడం శోచనీయం.

 ఇదే విషయంపై స్పందించిన కొంతమంది సామాజిక కార్యకర్తలు సమ స్య పరిష్కారం కోసం 2001వ సంవత్సరంలో సుప్రీంకోర్టును ఆశ్రయిం చారు. ఇందులో ఢిల్లీ గురించి ప్రత్యేక ప్రస్తావన ఉన్నప్పటికీ మిగతా పట్ట ణాలు, నగరాల పరిస్థితి గురించి సుప్రీంకోర్టు సమాచారాన్ని తెప్పించు కున్నది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 మనిషికి జీవించే హక్కును- గౌరవంగా జీవించే హక్కుని ప్రసాదించింది. మనిషికీ జంతువుకీ జీవించే విషయంలో ఉన్న తేడాను గమనించాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాలను హెచ్చరించింది. ఎటువంటి ఆధారం లేని, ఆదరణ లేని వ్యక్తులకు నీడనివ్వడానికి షెల్టర్లను నిర్మించాలనీ అందులో అన్నిరకాల మౌలిక సౌకర్యాలను కల్పించాలనీ ఆదేశించింది. ఏ వ్యక్తీ కూడా రోడ్ల మీద, దుర్భరస్థితిలో ఉండకూడదని కూడా సుప్రీంకోర్టు హెచ్చరించింది.

 గాలికి కొట్టుకుపోయిన సుప్రీం ఆదేశాలు
 ఇందులో సుప్రీంకోర్టు 62 నగరాలను ప్రస్తావించింది. వాటిలో ఇరవైనాలుగు గంటలు పేదలు ఆశ్రయం పొందే విధంగా సౌకర్యాలు కల్పించాలని పేర్కొ న్నారు. మహిళలకు, పిల్లలకు కూడా ప్రత్యేక షెల్టర్లను నిర్మించాలనీ అందులో ప్రభుత్వమే ఉద్యోగులను నియమించాలనీ మహిళల షెల్టర్లలో మహిళలనే సంరక్షకులుగా నియమించాలనీ సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే సుప్రీం కోర్టు తీర్పును ఏ ప్రభుత్వాలూ చిత్తశుద్ధితో పట్టించుకున్న పాపాన పోలేదు. ఢిల్లీ లాంటిచోట్ల తప్ప మిగతా నగరాల్లో ఈ సమస్యను పట్టించుకోలేదు. 2011 సంవత్సరంలోనే సుప్రీంకోర్టు ఐదుసార్లు ఆదేశాలు ఇచ్చింది. చివరగా 2011 డిసెంబర్ 12వ తేదీన ఇచ్చిన ఆదేశంలో అన్ని రాష్ట్రాలు శాశ్వతమైన వసతిగృహాలను నిర్మించాలని, ఒకవేళ అది ఆలస్యమైతే కనీసం వర్షం, ఎండా, చలి నుంచి తట్టుకోవడానికి తాత్కాలిక వసతి గృహాలను తక్షణమే నిర్మించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. అయినా స్పందన అంతం త మాత్రమే.
 

కారణమేమిటంటే అభిజిత్ భట్టాచార్యకు పేదలపట్ల ఉన్న విద్వేషమే రాజకీయ నాయకులకు, అధికారులకు సమాజంలోని కొన్ని వర్గా లకు ఉన్నది. పేదల పట్ల, అణగారిన వర్గాలపట్ల జాలి, దయ కాదు; బాధ్యత కలిగి ఉండాలి. అది లేకపోతే, ఒకవేళ ఇది ఇలాగే కొనసాగితే ఫ్రెంచి విప్లవాల లాంటి తిరుగుబాట్లు రగిలి, ఆగ్రహజ్వాలలో అమానవీయ సమాజాన్ని అంతం చేసి నూతన, మానవీయ వ్యవస్థకు పునాదులు వేస్తాయి.

 

(మల్లేపల్లి లక్ష్మయ్య)

(వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213
 

మరిన్ని వార్తలు