రోడ్లమీద ప్రాణాల రవాణా

26 Mar, 2016 05:28 IST|Sakshi
రోడ్లమీద ప్రాణాల రవాణా

విశ్లేషణ
 
గోల్డెన్ అవర్‌ను గుర్తించి క్షతగాత్రులను ఆస్పత్రి ప్రాంగణంలోకి చేరిస్తే ఫలితం ఉంటుందన్న మాట వాస్తవమే. కానీ మన దేశంలోను, కాకుంటే మన తెలుగు రాష్ట్రాలలోను ఉన్న ఆస్పత్రులన్నీ ఇలాంటి కేసులను స్వీకరించి బాగు చేయగలిగిన స్థితిలో ఉన్నాయా? దీనికి సమాధానం చెప్పడం కష్టం. ఇటీవల కాలంలో వైద్యరంగం బాగా వృద్ధి చెందింది. కానీ చాలా ఆస్పత్రులకు పరిమితులు ఉన్నాయి. క్షతగాత్రులకు సేవలు అందించడానికి కావలసిన సంసిద్ధత, మార్గదర్శకత్వం నగరాలలో ఉన్న చాలా ఆస్పత్రులలో కూడా లేదు.
 
ఈ నెల 14వ తేదీన విజయవాడ నగర శివారు ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వైద్య విద్యార్థులు దుర్మరణం చెందడం మనందరినీ కలచివేసింది. ‘తాగిన మైకంలో’ ప్రైవేటు బస్సును నడుపుతున్న డ్రైవర్ కూడా మరణించాడు. ఘటన మనకు తెలిసిన ప్రాంతంలో జరగడం, మిగిలిన ప్రయాణికులు చెప్పిన హృదయ విదారక వివరాలు పత్రికలలో చదవడం వంటి కారణాలతో ఇలాంటి ప్రమాదంలోని పెను విషాదం మనకు కళ్లకు కట్టింది. అందులోని తీవ్రతను ఊహించడం సాధ్యమైంది. నిజానికి ఇలాంటి దురదృష్టకర దుర్ఘటనలు దేశంలో ఏదో ఒక మూల జరుగుతూనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రతి నిత్యం ఎక్కడో ఒకచోట, ఏదో ఒక స్థాయి రోడ్డు ప్రమాదం నమోదవుతూనే ఉంటుంది. ప్రపంచంలోని వాహనాలలో ఒక శాతం భారతదేశంలోనే ఉన్నాయని మనం ఘనంగా చెప్పుకుంటూ ఉంటాం. అదే సమయంలో ప్రపంచంలో జరుగుతున్న రోడ్డు రవాణా ప్రమాదాలు, వాటి మూలంగా సంభవిస్తున్న చావులలో మన వాటా ఆరు శాతమన్న చేదు వాస్తవాన్ని కూడా గుర్తించవలసి ఉంటుంది.

2009లో ఒకసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశంలో జరిగే రోడ్డు ప్రమాదాలు, విపరీత సంఖ్యలో ఉండే మరణాలను గురించి ఒక నివేదిక ఇచ్చింది. దాని ప్రకారం- భారతదేశంలో ప్రతి లక్ష జనాభాలో 16.8 శాతం రోడ్డు రవాణా ప్రమాదాల కారణంగా చనిపోతున్నారు. ఇక ఆ ప్రమాదాల కారణంగా క్షతగాత్రులుగా మిగిలినవారు ఇరవై లక్షలు. రోడ్డు ట్రాన్స్‌పోర్టు అథారిటీ లెక్కల ప్రకారం ప్రతి వేయి మందిలో 35 మంది వాహనాలు కలిగి ఉన్నారు. ఇది ప్రపంచంలోనే చెప్పుకోదగిన నిష్పత్తి. కానీ ప్రతి 10,000 వాహనాలలో  25.3 శాతం ప్రమాదాలకు కారణమవుతూ ప్రాణాలను హరిస్తున్నాయి. ఇది కూడా ప్రపంచంలో చెప్పుకోదగిన రికార్డే. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం 2030 సంవత్సరం నాటికి భూమ్మీద సంభవించే మానవ మారణాలకు కొన్ని కారణాలను చెప్పుకుంటే అందులో ఐదో స్థానం రోడ్డు ప్రమాదాలకు దక్కుతుంది. ఆ కాలానికి రోడ్డు ప్రమాదాల కారణంగా ఏటా 24 లక్షల మంది కన్నుమూస్తారని ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

గోల్డెన్ అవర్‌ను గుర్తించాలి
రోడ్డు ప్రమాదాలను నివారించడం ప్రస్తుత తరుణంలో అత్యంతావశ్యకమైనదని అంతా గుర్తించాలి. ఇందుకు క్షేమకరమైన రవాణా, సురక్షితమైన రోడ్లు దోహదం చేస్తాయి. అంతేకాదు, సురక్షితమైన వాహనాలు, బాధ్యతతో వ్యవహరించే డ్రైవర్లు, ప్రజలలో ట్రాఫిక్ నిబంధనలను గౌరవించాలన్న భావన కూడా అవసరమే. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడితే వింతగా చూడవచ్చు. చర్వితచర్వణంగా చాలా మంది భావించవచ్చు కూడా. కానీ ఈ అంశాల అమలు మొదటి నుంచి పెద్ద సమస్యగా మారిందన్న వాస్తవాన్ని గమనిస్తే వాటిని పదే పదే గుర్తు చేసుకోవడం ఎందుకో అర్థమవుతుంది. ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థులను, డ్రైవర్‌ను బలిగొన్న ఈ తాజా ప్రమాదాన్ని విశ్లేషించుకున్నా ఈ సంగతే అవగతమవుతుంది.

విజయవాడ శివార్లలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదం మళ్లీ కొన్ని పాత పాఠాలనే కొత్తగా నేర్పుతోంది. ఇలాంటి రోడ్డు దురంతాలు భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్త పడడం ఎలా అన్న విషయాన్ని కూడా ఇది బోధపరచగలదు. డ్రైవర్ మద్యం సేవించి బస్సును నడపడం వల్లనే ఈ ఘోరం జరిగిందని ప్రత్యక్ష సాక్షులంతా ముక్త కంఠంతో చెప్పారు. ఇదే ప్రమాదానికి మొదటి కారణం. విరామం లేకుండా పనిచేసిన డ్రైవర్ అలసట కారణంగా సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం, మెదడు చురుకుగా పనిచేయలేక పోవడం ప్రమాదానికి రెండో కారణంగా భావించవచ్చు. ప్రమాదం జరిగిన తరువాత క్షతగాత్రులను వెనువెంటనే ఆస్పత్రులకు తరలించకపోవడం, వైద్యం అందించలేకపోవడం ప్రాణ నష్టానికి దారితీసింది. క్షతగాత్రులను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆస్పత్రికి చేర్చగలిగితే ఫలితం ఉంటుంది. అందుకే ప్రమాదం స్థలి నుంచి ఆస్పత్రిలో చేర్చే మధ్య కాలాన్ని గోల్డెన్ అవర్ అంటారు. ఆ కొద్ది సమయం అంత విలువైనది. అయితే జరిగినది గమనిస్తే గోల్డెన్ అవర్‌కు విలువ ఇవ్వలేదు. చాలా ప్రమాదాలలో మృతుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం ఇదే.

ఊపిరి పరీక్షలు అవశ్యం
మద్యం సేవించి వాహనం నడపడం సర్వసాధారణంగా జరిగిపోతూ ఉంటుంది. కానీ రోడ్డు ప్రమాదాలను పెంచుతున్న మహమ్మారి ఇదేనన్నది వాస్తవం. బెంగళూరుకు చెందిన ఒక ఆస్పత్రి నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు స్పష్టమైనాయి. మద్యం సేవించి వాహనం నడిపిన కారణంగా జరిగిన ప్రమాదాలలో 40 శాతం అప్పటికి గంట ముందే తాగి వాహనమెక్కిన వాళ్ల కారణంగా జరిగినవే. 33 శాతం ప్రమాదాలు రెండు గంటల ముందు తాగి వాహనం ఎక్కిన వారి కారణంగా జరిగినవి. భారతదేశంలోని పలు నగరాలలో జరిగిన అధ్యయనాలు కూడా దాదాపు ఇవే ఫలితాలను చూపిస్తున్నాయి. అసలు రోడ్డు ప్రమాదాలలో 15 నుంచి 20 శాతం తాగి ఉన్న డ్రైవర్ల కారణంగా జరుగుతున్నవేనని ఆ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్లు వాహనాలు నడపకుండా నిరోధించడం ఎలా అనేది తీవ్రంగా ఆలోచించవలసిన అంశం.

కనీసం జాతీయ రహదారుల మీద నడిచే వాహనాల డ్రైవర్లనయినా దీని నుంచి నిరోధించడం ఎలా అన్నది కీలకమే. ఎందుకంటే ఘోర  ప్రమాదాలు, సాధారణ ప్రమాదాలు కూడా జాతీయ రహదారుల మీద చాలా జరుగుతూ ఉంటాయి. పశ్చిమ దేశాలు ఈ విషయంలో తీసుకున్నంత స్థాయిలో జాగ్రత్తలు సాధ్యం కాకున్నా, కనీసం జాతీయ రహదారుల మీద నడిచే వాహనాల డ్రైవర్లకు ఊపిరి పరీక్షలు నిర్వహించాలి. జాతీయ రహదారుల మీదకు వాహనాలు ప్రవేశించే కీలక ప్రదేశాలలో అయినా టోత్ బూత్‌లు పెట్టి ఈ పరీక్షలు నిర్వహించాలి. ఈ పరీక్షలను జాతీయ రహదారుల మీద, మరీ ముఖ్యంగా రాత్రివేళ కచ్చితంగా నిర్వహించే విధానాన్ని కఠినంగా అమలు చేయాలి.

విశ్రాంతి లేకుండా రాత్రంతా వాహనాలు నడపడం కూడా ప్రమాదాలకు ఇంకొక కారణంగా చెప్పుకోవచ్చు. దీనితో తీవ్రమైన బలహీనత ఏర్పడి, సామర్థ్యం తగ్గుతుంది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారు కాబోయే డాక్టర్లు కాబట్టి ఒక సంగతి ఇక్కడ ప్రస్తావించవచ్చు. డాక్టర్లకు తర్ఫీదు ఇచ్చినప్పుడు అమెరికాలో పని గంటలను తగ్గిస్తున్నారు. వారానికి ఎనభయ్ కంటే తక్కువ పని గంటలు ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. అలసట, నిద్రలేమి కారణంగా వైద్యసేవకు కూడా న్యాయం చేయలేరన్నది వాస్తవం. నిజానికి ప్రభుత్వ వాహనాల మాదిరిగానే, ప్రైవేటు వాహనాలలో కూడా దూర ప్రయాణాలలో ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. అయితే విజయవాడ దగ్గర ప్రమాదం జరిగిన రోజున ఆ బస్సులో ఒక్కడే డ్రైవర్ ఉండి ఉండాలి. మరణించిన ఆ డ్రైవర్ కూడా ఉదయం నుంచీ వాహనాన్ని నడిపి తీవ్రంగా అలసిపోయి ఉండాలి. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు సరైన మార్గాన్ని అన్వేషించక తప్పదు.

ఆస్పత్రుల మాటా చెప్పుకోవాలి
గోల్డెన్ అవర్‌ను గుర్తించి క్షతగాత్రులను ఆస్పత్రి ప్రాంగణంలోకి చేరిస్తే ఫలితం ఉంటుందన్న మాట వాస్తవమే. కానీ మన దేశంలోను, కాకుంటే మన తెలుగు రాష్ట్రాలలోను ఉన్న ఆస్పత్రులన్నీ ఇలాంటి కేసులను స్వీకరించి బాగు చేయగలిగిన స్థితిలో ఉన్నాయా? దీనికి సమాధానం చెప్పడం కష్టం. ఇటీవల కాలంలో వైద్యరంగం ఇతోధికంగా వృద్ధి చెందిన మాట వాస్తవం. కానీ చాలా ఆస్పత్రులకు పరిమితులు ఉన్నాయి. క్షతగాత్రులకు సేవలు అందించడానికి కావలసిన సంసిద్ధత, మార్గదర్శకత్వం  నగరాలలో ఉన్న చాలా ఆస్పత్రులలో కూడా లేదన్నది ఒక చేదు నిజం. తీవ్ర గాయాలతో, చావుబతులకు మధ్య తీసుకు వచ్చిన ఒక రోడ్డు ప్రమాద బాధితుడిని ఆస్పత్రిలో చేరిస్తే అతడికి తగిన వైద్యం అందించే నైపుణ్యం అన్నిచోట్లా లేదు. అయితే ఈ సామర్థ్యం ఉన్న ఆస్పత్రుల జాబితాను అందుబాటులో ఉంచాలి. కాబట్టి క్షతగాత్రులను ఆస్పత్రులకు చేర్చడమనే వ్యవహారాన్ని మరింత సమర్థతతో నిర్వహించే విధంగా వాతావరణం తయారుకావాలి.

విజయవాడ ప్రమాదాన్ని చూసి, ఆ ప్రాంతంలోనే రోడ్డు దుర్ఘటనలు ఎక్కువన్న నిర్ణయం సరికాదు. తెలంగాణ ప్రాంతంలో కూడా ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు, మరణాలు, గాయపడటాలు విపరీతంగా పెరిగిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రుడిని ఆస్పత్రికి చేర్చడం ఎంత ముఖ్యమో, అతడికి ఇతర వ్యాధులు సంక్రమించకుండా జాగ్రత్త పడడం కూడా అంతే ముఖ్యం. వారిని ఏ ఆస్పత్రికి తీసుకువెళ్లాలో నిర్ణయించుకోవడం కూడా ప్రధానమైన అంశమే. ఈ వివరాలను ప్రభుత్వాలు ఇంకా అందుబాటులోకి తేవలసి ఉంది. రోడ్డు ప్రమాదంలో గాయపడినవారిని చేర్చే ఆస్పత్రులలో కనీసం ఈ సౌకర్యాలు ఉండాలి. న్యూరోసర్జన్ వెంటనే అందుబాటులోకి రావాలి. ఆర్థోపీడిక్ సర్జన్, అనస్థీటిస్ట్, జనరల్ సర్జన్ కూడా కావాలి. ఇంత వ్యవస్థ ఇవాళ కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులలోనే అందుబాటులో ఉంది.

నివారణ సాధ్యమే
నిపుణులు చెబుతున్నదాని ప్రకారం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో 85 శాతం నివారించడానికి అవకాశం ఉన్నవే. ప్రమాదాల వల్ల సంభవిస్తున్న మరణాలలో 75 శాతం వరకు నిరోధించగలిగినవే. జరిగే ప్రమాదాలలో అత్యధికం మానవ తప్పిదాల ఫలితమే. అంటే అతి వేగం, మద్యం సేవించి వాహనం నడపడం, సీటు బెల్టుల పట్ల, హెల్మెట్ల పట్ల అశ్రద్ధ, అలసి సొలసి ఉండి కూడా వాహనాలు నడపడం వంటి కారణాల వల్లనే ప్రమాదాలు సంభవిస్తున్నాయి. విజయవాడ దగ్గర జరిగిన బస్సు ప్రమాదం డ్రైవర్ మద్యం సేవించి నడిపినందువల్ల జరిగిందేనని విస్మరించరాదు. రోడ్ల లోపాలు, ఇంజన్ లోపాల కారణంగా కూడా కొన్ని ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి.  లెసైన్సులు మంజూరు పద్ధతిలో కూడా కఠిన నిబంధనలు, వాటి అమలు అవసరం. ఆఖరికి నగరాలలో వాహనాలు నడిపేవారిలో చాలామంది దగ్గర లెసైన్సులు ఉండవు. సరైన చట్టం, కఠిన నిబంధనలు ఈ లోపాన్ని సరిదిద్దే అవకాశం ఉంది. చిత్రం ఏమిటంటే ఈ రోడ్డు మీద ఎంత వేగంతో వాహనం ప్రయాణించాలన్న అంశం మీద ఇప్పటి వరకు స్పష్టత లేదు. అంటే వేగ పరిమితిని గుర్తించలేదు. చివరిగా ఒకమాట- రోడ్ల నిర్మాణం అభివృద్ధికి అవసరం. అవి రక్తసిక్తం కాకుండా చూసుకుంటేనే అభివృద్ధి కుంటుపడకుండా సాగుతుంది.

- డా.దేమె రాజారెడ్డి


(వ్యాసకర్త ప్రముఖ వైద్యులు మొబైల్: 98480 18660)

>
మరిన్ని వార్తలు