'చట్టం'తో ఓటు హక్కుకు కత్తెర

15 Dec, 2015 00:21 IST|Sakshi
'చట్టం'తో ఓటు హక్కుకు కత్తెర

రెండోమాట
పార్లమెంటు సభ్యులలో సుమారు 300 పైచిలుకు యథావిధిగా అవినీతికి ఏతమెత్తగా, మరికొన్ని వందల మంది స్విస్ బ్యాంకుల్లో  24 లక్షల కోట్ల రూపాయల్ని అక్రమంగా దాచారు. ఇంకొన్ని వందల మంది శాసనసభ్యులు నేరగాళ్లుగా నమోదై ఉన్నవాళ్లు. ఇలాంటి 'ప్రజా ప్రతినిధులే'ఈ దేశ 'ప్రజాస్వామ్య'రక్షణకు 'పూచీ'పడుతున్నంత కాలం, ఈ వింత దృశ్యాన్ని ఆసక్తితో తిలకిస్తున్న ప్రభుత్వాలు, పాలకులున్నంత కాలం 'నిరక్షరాస్యత'నుంచి సామాన్య ప్రజలు విమోచన పొందడం అసాధ్యం! ఈ సత్యాన్ని న్యాయమూర్తులు గుర్తిస్తే చాలు.
 
 ఒకవైపున ఉత్తరప్రదేశ్లోని ఓ మారుమూల గ్రామం (మన్సూర్పూర్ మాఫీ) పంచాయతీ చరిత్రలోనే మొదటిసారిగా సంభవించిన అసాధారణ పరిణామానికి అంకురార్పణ జరిగిన మరుసటి రోజునే (10.12.2015) కీలకమైన సుప్రీంకోర్టు తీర్పు ఒకటి వెలువడటం విశేషం! ఉత్తరప్రదేశ్ సంభాల్ జిల్లాలోని ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ (గ్రామ్ ప్రధాన్) పదవికి జరిగిన ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా మహిళలు ఆ రోజున (9.10.2015) తమ ఓటు హక్కును, పోటీ చేసే హక్కును నిలబెట్టుకోడానికి ముందుకు రావటం, తెగించి వినియోగించుకోవడం ఒక చారిత్రక సన్నివేశం! మన్సూర్పూర్ మాఫీ దేశ రాజధాని ఢిల్లీకి 150 కిలోమీటర్లు,  యూపీ రాజధాని లక్నోకు 350 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ గ్రామంలోని మైనారిటీలకు చెందిన మహి ళలు పంచాయతీ ఎన్నికల్లో ఓటు చేయకుండా మగాళ్లు అడ్డుకునే వారు. అయితే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వారు ఓటు వేయడాన్ని అనుమతించేవారు.

కాని ఈసారి పంచాయతీ అధ్యక్ష పదవిని స్త్రీలకు కేటా యించారు. అయినా, మహిళలు ఓటు వేయడానికి వీల్లేదని పురుషులంతా అడ్డుకున్నారు! ఉన్నతాధికారుల జోక్యం తర్వాత కొందరు మహిళలు తెగించడంతో కొంత ఫలితం కలిగింది. ఓటు వేయగలిగిన వారు కేవలం తొమ్మిది మందే! ఆ మాత్రం ప్రోత్సాహంతోనే, వచ్చే ఎన్నికల్లో గ్రామ మహిళలంతా ఓటింగ్లో పాల్గొనేట్టు చేస్తామని గ్రామీణులు హామీ పడ్డారు! సంభాల్ జిల్లాలో మొత్తం సగటు అక్షరాస్యత 57 శాతం ఉన్నా పురుషుల అహంకారం వల్ల మహిళలు ఓటు హక్కు వినియోగించుకోడానికి తీవ్ర విఘాతం కలిగింది!

 బహుజన స్త్రీపురుషుల హక్కుల హరణానికే
 ఇదంతా ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే- రాజ్యాంగం ప్రజలకు కల్పించిన సార్వత్రిక వయోజన ఓటింగ్ హక్కును మింగేసేలా హరియాణా పంచాయతీ రాజ్ సవరణ చట్టం (2015) వచ్చింది కాబట్టి. దీని ప్రకారం ఏ నిరక్షరాస్యులైన స్త్రీ, పురుషులూ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కాదు! అంటే, ప్రజాబాహుళ్యంలోని నిరక్షరాస్యులుగా ఉన్న వారందరి ఎన్నికల్లో పోటీకి నిలబడే హక్కుకూ, తద్వారా ఓటు హక్కుకు 'కత్తెర'వేయడం అవసరమని నేటి బీజేపీ పాలకులు భావిస్తున్నారు! అందుకే ఈ కొత్త చట్టం విన్యాసాలు, కొత్త రకం 'కొలబద్దలూ' ప్రాథమిక విద్యను, ప్రాథమిక వైద్య, ఆరోగ్య రంగాలను భారీ ఎత్తున ప్రైవేటీకరించి ఇప్పటికే పాలకులు సామాన్య ప్రజాబాహుళ్యానికి అవి అందుబాటులో లేకుండా చేశారు.

దీని పర్యవసానమే, హరియాణా తెచ్చిన కొత్త సవరణ చట్టం 'సర్పంచ్'పదవికి పోటీ చేసే అభ్యర్థులకు విధించిన 'కొలబద్దలు' సాధారణ అభ్యర్థులయితే మెట్రిక్యులేషన్ (ఎస్ఎస్ఎల్సీ) పాసయి ఉండాలి. మహిళలయితే 8వ తరగతి, షెడ్యూల్డ్ తరగతి స్త్రీలయితే 5వ తరగతి పాసయి ఉండాలి! ఈ కొలబద్ద అమలులోకి వస్తే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయదలచుకున్న ఎస్సీ మహిళల్లో 60 శాతం, పురుషుల్లో 41 శాతం పోటీకి అర్హులు కాకుండా పోతారు! ఈ పరిస్థితిని సమీక్షించుకున్న తరవాతనైనా సుప్రీం ధర్మాసనం (జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ అభయ మనోహర్ సప్రీ) రాజ్యాంగం నిర్దేశించని ఈ కొత్త కొలబద్దల్ని అనుమతించి ఉండాల్సింది కాదు. ఒకవేళ ఇతర రాష్ట్రాలకన్నా హరియాణా 'సంపన్న రాష్ట్ర'మని కోర్టు భావించినా అది తన తీర్పు హరియాణాకే వర్తిస్తుందని స్పష్టం చేయవలసింది.

ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ 'ప్రజాప్రయోజన వ్యాజ్యం'దాఖలు చేసిన ముగ్గురు మహిళలూ- 'అక్షరశూన్యులయినంత మాత్రాన'ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వహణలో వారు (నిరక్షరాస్యులు) పాల్గొనడాన్ని అనర్హులను చేసే చట్ట నిబంధనను సవాలు చేశారు! హరియాణాలోని  'దారిద్య్ర రేఖకు ఇంకా దిగువనే ఉండిపోయిన 8.5 లక్షల కుటుంబాలలో 7.2 లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో మరుగుదొడ్ల సౌకర్యం కలిగింద'ని ధర్మాసనం భావించి ఉండొచ్చు. కానీ, ఆ కారణంగా, 'నిరక్షరాస్యుల'న్న కారణంగా పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్ణయాల్లో భాగస్వాములుగా ఉండటం కోసం ప్రాథమిక హక్కుగా ఉన్న వయోజన ఓటింగ్ హక్కును దళిత బహుజన వర్గాల స్త్రీ, పురుషులకు నిరాకరించేలా సవరణ చట్టం తేవటం వేరు!

 ఓటర్లలో రెండు అసమ వర్గాలా?
 ప్రాథమిక విద్య, ఆరోగ్య, ఉపాధి, సౌకర్యాలను ప్రజాబాహుళ్యానికి అందించాలన్న రాజ్యాంగ లక్ష్యం నెరవేరిందా? అన్నదే నేటి ప్రాథమిక ప్రశ్న అని మరచిపోరాదు. ఎలాంటి వివక్షకూ చోటివ్వకుండా స్త్రీ, పురుషులకు సార్వత్రిక ఓటు హక్కును ఇచ్చిన రాజ్యాంగం లక్ష్య నిర్వచనా పత్రమే ఇది 'భారత ప్రజలమైన మేము రూపొందించుకున్న పత్రమ’’ని ప్రకటించు కుంది! ప్రజల్ని అక్షరాస్యుల్ని చేసే బాధ్యతను విస్మరించి, వారిని చీకట్లో ఉంచేసిన పాలకుల నిర్వాకం కొనసాగుతున్నంత కాలం ‘ఆ పాపం ఎవరిదని'బొడ్లో చేయి వేసి ప్రశ్నించే హక్కు నిరక్షరాస్యులకు ఉంటుందని గుర్తించాలి! ఈ విషయాన్ని ధర్మాసనం బోళాగా ఒప్పేసుకుంది కూడా: 'హరియాణా చట్టం రెండు రకాల ఓటర్లను సృష్టించింది. ఒక రకం: విద్యారంగంలో తమ ప్రతిభ, సామర్థ్యం వల్ల పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులైన వారు కాగా, రెండవ రకం: ఆ అర్హతలు పొందని వారనీ’'వర్గీకరించింది అని పేర్కొంది! కాని తీర్పు చెప్పిన జస్టిస్ చలమేశ్వర్ ఆ సవరణ చట్టానికి ఆమోదం ప్రకటించారే గాని, తామే అన్నట్టు 'ఓటర్లలో రెండు వర్గాలను సృష్టించిన హరియాణా చట్టాన్ని'కాలదన్నలేకపోయారు!

 అందుకే, చదువు సంధ్యలు లేని నిరక్షరాస్యులైన కోట్లాది మంది స్త్రీ, పురుషుల్ని ప్రజాస్వామ్య మనుగడకు మూల స్తంభాలైన పంచాయతీరాజ్ వ్యవస్థ విధివిధానాల నుంచి, నిర్వహణ నుంచి తప్పించే ప్రక్రియను రాజ్యాంగం తిరస్కరించవలసివచ్చింది! భారత వ్యవస్థలో కుల, మత, రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో దగా పడుతున్న దళితులతో పాటు, సంపన్న వర్గాల స్త్రీలు కూడా అనేక రకాల దోపిడీకి, వివక్షకు గురవుతు న్నందున ఆ స్త్రీలు కూడా 'దళిత వర్గం కిందికే వస్తారని' అంబేడ్కర్ అన్నారు. చారిత్రక పరిణామక్రమంలో అక్షరాస్యులైన 'బడా చదువరుల'కన్నా, కొంత మంది బడా మేధావులకన్నా నిరక్షరాస్యులైన ప్రజలే స్వాతంత్య్ర ఉద్యమాలలోనూ, విప్లవాలలోనూ ముందుకురికి, అశేష త్యాగాలు చేశారు! భారత స్వాతంత్య్ర సంగ్రామంలో నిరక్షరాస్యుల అసామాన్యమైన పాత్రే అందుకు ఉదాహరణ. దెబ్బదెబ్బకూ ‘వందేమాతరం'నినాదాన్ని శంఖంగా పూరించి తోటి వారిని మేల్కొల్పిన నిరక్షరాస్యులున్నారు! నాడు ఎంతో చైతన్యంతో సంచలనం సృష్టించిన ఉద్యమాలలో పాల్గొనదలిచిన సామాన్యులకు 'కనీస విద్యార్హత'ల కొలబద్దలు లేవు!

 నిరక్షరాస్య సామాన్యులే చరిత్ర నిర్మాతలు
 'స్త్రీ'చుట్టూ కంచెలు, ముళ్లపొదలు అనాదిగా అల్లుతూ వారి ఎదుగుదలను అడ్డుకున్న మగవారిలోని స్వార్థపరులే 'ఆడదాని మాట ఆపదలకు మూలం'అనీ, 'ఆడది తిరిగి చెడుతుంద'నీ అన్నారు. మాతృస్వామిక వ్యవస్థ వర్థిల్లినన్నాళ్లూ స్త్రీమూర్తే సమాజాన్నీ కుటుంబ వ్యవస్థనూ సజావుగా తీర్చిదిద్దింది. పితృస్వామిక వ్యవస్థ వచ్చిన తర్వాతనే స్త్రీ జాతికి రకరకాల కష్టాలూ, నష్టాలూ. కాని వర్షాలు లేక, పంటలు ఎండిపోయిన చెరువుల కోసం ఆత్మాహుతి చేసుకున్న 'చిన్నక్కమ్మ/పెద్దక్కమ్మ'లు సామాన్య నిరక్షరాస్య స్త్రీలేనని గ్రామ చరిత్రలు వెల్లడిస్తున్నాయి! చెరువు తెగిపోకుండా ఆపడం కోసం ప్రాణత్యాగం చేసిన ఒక ముసలమ్మ కట్టమంచి రామలింగా రెడ్డి చేతిలో 'ముసలమ్మ మరణం'కావ్యంగా రూపొందింది.

1975 ఎమర్జెన్సీ ఎత్తివేసిన వెంటనే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చీపుళ్లతో ఊడ్చేసినట్లు ఉత్తరాదిలో ఇందిరాగాంధీని ఓడించిన వాళ్లు నిరక్షరాస్యులైన సామాన్యులే! ప్రసిద్ధ సాహితీ విమర్శకులు ఆచార్య రాచపాళెం వ్యాఖ్యానించినట్లు 'మనం అనుభవిస్తున్న ప్రకృతి సంపదను అనేక సందర్భాలలో సామాన్య మహిళల బలిదానాలే పరిరక్షించాయి.'తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వీరవనితలే చరిత్రకు రూపురేఖలు దిద్దారు! శ్రీకృష్ణదేవరాయల అంతఃపురంలో వంటావార్పులు చూసే సామాన్య మహిళలు (బోనకత్తెలు) కామక్క, ఎర్రక్కలు చెరొక చెర్వు తవ్వించారని కైఫీయత్తులు నమోదు చేశాయి! కాని పార్లమెంటు సభ్యులలో సుమారు 300 పైచిలుకు యథావిధి అవినీతికి ఏతమెత్తగా, మరికొన్ని వందల మంది స్విస్ బ్యాంకుల్లో  24 లక్షల కోట్ల రూపాయల్ని అక్రమంగా దాచారు. ఇంకొన్ని వందల మంది శాసనసభ్యులు నేరగాళ్లుగా నమోదై ఉన్నవాళ్లు. ఇలాంటి ‘ప్రజా ప్రతినిధులే'ఈ దేశ 'ప్రజాస్వామ్య'రక్షణకు 'పూచీ'పడుతున్నంత కాలం, ఈ వింత దృశ్యాన్ని ఆసక్తితో తిలకిస్తున్న ప్రభుత్వాలు, పాలకులు న్నంత కాలం ‘నిరక్షరాస్యత'నుంచి సామాన్య ప్రజలు విమోచన పొందడం అసాధ్యం! ఈ సత్యాన్ని న్యాయమూర్తులు గుర్తిస్తే చాలు. చదవేస్తే ఉన్న మతికాస్తా పోయిందనే సామెత ఎందుకు పుట్టుకొచ్చిందో ఒక్కసారి అందరం ఆలోచించాలి!

http://img.sakshi.net/images/cms/2015-07/41437415774_Unknown.jpg
సీనియర్ సంపాదకులు: ఏబీకే ప్రసాద్
abkprasad2006@yahoo.co.in
 

మరిన్ని వార్తలు