‘సంఘ్’ తొలి రాజకీయ విజయం

9 Apr, 2016 08:22 IST|Sakshi
‘సంఘ్’ తొలి రాజకీయ విజయం

జాతిహితం
అడుక్కొచ్చో, అరువుతెచ్చో, దొంగిలించో తెచ్చిన దక్షతగల వారితో, ఒక మైనారిటీ పార్టీ గురించి మెజారిటీలో ఉన్న భయంపై స్వారీ చేస్తూ, ఎదురేలేని శక్తిగా ఉన్న కాంగ్రెస్‌ను ఏకాకిని చేసి రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయశక్తి  వృద్ధి చెందింది. ఆర్‌ఎస్‌ఎస్ తన వారితో... అర్‌ఎస్‌ఎస్‌యేతర నాయకులు అత్యధికులుగా ఉన్న ఇతరుల కోసం బలీయమైన అధికార పునాదిని నిర్మించడమే అది సాగించిన ఈ దండయాత్రలోని అత్యద్భుతమైన అంశం. అందుకే అస్సాంలో బీజేపీ ప్రబలశ క్తిగా ఆవిర్భవించడం ఆర్‌ఎస్‌ఎస్ విజయం.
 
ప్రతి బీజేపీ విజయాన్నీ అలవాటుగా ఆర్‌ఎస్‌ఎస్‌కు అంటగట్టేస్తుంటారు. ఆర్‌ఎస్‌ఎస్ సహాయపడ్డా, 2014 ఎన్నికల విజయం నరేంద్ర మోదీదనీ, 1989-99 విజయాలు అటల్ బిహారీ వాజ్‌పేయివనీ తెలిసిందే. నేడు ముగియనున్న అస్సాం ఎన్నికల ఫలితాలు ఎలాగున్నా... నేను మాత్రం ఆర్‌ఎస్‌ఎస్ ఇక ఇప్పుడు తాను స్వయంగా సాధించిన తొలి రాజకీయ విజయానికి సంబరపడొచ్చని అనుకుంటున్నాను.

ఓడినా, గెలిచినా మూడేళ్ల క్రితం అస్సాంలో ఉనికిలోనే లేని బీజేపీయే నేటి ఎన్నికల్లో ముందున్నది. లేదా అక్కడ ఆ పార్టీ అస్తిత్వంలో లేక దేశం నలుమూలల నుంచి వేలాది మంది నిబద్ధతగల ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు, ప్రచారక్‌లు, వ్యూహకర్తలను అక్కడ దించిన స్థితి నుంచే అనుకోండి. ఏదేమైనా వారక్కడ తమ తొలి భావ జాల విత్తనాలను ఎలా నాటారో, అత్యంత జనాదరణగల అస్సాం ఉద్య మాన్ని ఎలా విలీనం చేసుకున్నారో, దాని జాతి దురహంకార ధోరణులను ముస్లిం వ్యతిరేకతగా (మూడు దశల్లో) ఎలా మార్చారో, బీజేపీ రంగప్రవే శానికి వేదికను ఎలా నిర్మించారో, స్థానిక నేతలంటూ ఎవరూ లేని అక్కడ వారు ఎలా పుట్టుకొచ్చారో అదంతా పలు జానపద గాథలను తలపిస్తుంది.

బీజేపీ నేడు అక్కడ ప్రథమ స్థానంలో ఉండడమే కాదు, అనూహ్యమైన రీతిలో బోడో గిరిజనులతో కూటమిని నిర్మించింది. అసోం గణపరిషత్ నేతల నుంచి అత్యుత్తమ నైపుణ్యాలున్నవారిని అతి జాగ్రత్తగా ఎంపిక చేసి పార్టీలో చేర్చుకుంది. ఇప్పుడు ప్రాంతీయ కాంగ్రెస్ నాయకుల నుంచీ అదే చేస్తున్నది. గతంలో వారికి ఎన్నడూ ఆర్‌ఎస్‌ఎస్‌తో ఎలాంటి సంబంధాలు లేకున్నా ఫర్వాలేదని భావిస్తోంది. ఆసు (అఖిల అస్సాం విద్యార్థి సంఘం) నేతృత్వం లోని ఉద్యమం కుర్తా అంచులకు ఆర్‌ఎస్‌ఎస్ 70ల చివరి నుంచి అంటిపెట్టు కుంది. ఆ తదుపరి 1985 నాటి రాజీవ్ గాంధీతో శాంతి ఒప్పందాన్ని అనుసరించి అది అసోం గణపరిషత్‌కు అతుక్కుపోయింది. ఆసు, గణపరి షత్‌లు ఆ ఒప్పందానికి అంటిపెట్టుకుని పూర్తిగా ప్రధాన స్రవంతిలో విలీనం కావడానికి చాలా వరకు బాధ్యత ఆర్‌ఎస్‌ఎస్‌దే.

 అంతుచిక్కని మార్మిక దరహాస వదనుడు
 దీనంతట అర్థాన్ని గ్రహించడం కోసం నేను బ్రహ్మపుత్ర వెంబడే విహరిస్తూ పోయాను. ఎడమ వైపు ఆ నది ప్రవహిస్తూ పోతుండగా, దాన్ని అనుకుని ఉన్న ప్రాంతం అస్సాం ఉద్యమానికి కేంద్రం నేను మెల్లగా ఒకప్పటి నా పాత బాటనే నది కట్టకు కొద్ది దూరంలో ఉన్న చిన్న శుక్రేశ్వర్ ఆలయానికి వెళ్లాను. అప్పట్లో, ఇతర పాత్రికేయులందరిలాగే నేనూ... సదా మార్మిక అర్ధహాస వదనంతో కనిపించే ఒకే ఒక్క మనిషిని కలుసుకోడానికి అక్కడికి పలుమార్లు ఆ మెట్లెక్కాను. ఆయన పేరు కుముద్ నారాయణ్ శర్మ, అప్పట్లో ఆయన గౌహతి విశ్వవిద్యాలయం న్యాయశాఖకు డీన్‌గా ఉండేవారు. ఆ గుడి ఆయన కుటుంబ వారసత్వ నియంత్రణలోనిది. ఆయన ఆ గుడి ఆవరణలోని చిన్న గదిలో నివసించేవారు.

ఆయనకున్న పేరు ఆయన విద్వద్వ సంపద వల్ల గాక, ఆయన అభిమాన ‘విద్యార్థుల’’ వల్ల వచ్చినది. వారంతా ఆసు నాయకులు. ఆయన ఆ సంస్థకు లాంఛనప్రాయమైన సలహాదారు. చర్చలకు చర్చలు, పోరాటానికి పోరాటం అనే తన వైఖరితో నాటి కేంద్ర హోం మంత్రి జైల్‌సింగ్‌కు ఆగ్రహం కలిగించిన ఆ ఆసు ప్రధాన మధ్యవర్తిలో ఏదో అంతు బట్టనిది ఉందనిపించేది. అదిగానీ, ఆయన అతి సాధా రణ జీవన శైలిగానీ ఆర్‌ఎస్‌ఎస్‌తో ఆయనకున్న లోతైన సంబంధం ఫలితమే నని నేనెన్నటికీ  నిస్సంశయంగా చెప్పలేను. ఆయన తన చేతుల్లో ఉన్న అపార అధికారాన్ని ఎంత వినమ్రంగా ఉపయోగించేవారో ఎంత చెప్పినా తక్కువే. ఆయనే కాదు, ఆయన శిష్యులు కూడా ఎలాంటి ప్రలోభాలకు గురికానివారు.

 బీజేపీకి విలువైన కానుక
 నేను ఈ వారం హేమంత బిస్వా శర్మతో కలసి ఈ ప్రాంతంలో నడుస్తుండగా ఆయన పేరు మళ్లీ మాటల్లోకి వచ్చింది. బిస్వా శర్మ ఒకప్పుడు ఆసు నేతగా ఉండి, ఉల్ఫా కార్యకర్తగా మారి, కాంగ్రెస్‌వాది అయ్యారు. ఇప్పుడాయన, 2014 తదుపరి బీజేపీ జాతీయ స్థాయిలోనే సంపాదించిన అత్యంత విలువైన కానుక. ఆయనది గొగోయ్ మంత్రివర్గంలో ఆచరణలో రెండవ స్థానం, రాజ కీయ సంబంధాల నిర్వహణకు సంబంధించి కాంగ్రెస్‌కు చెందిన ప్రమోద్ మహాజన్, దక్షతగల మంత్రిగా నితిన్‌గడ్కరీ, అన్నీ ఒక్కరుగా కలసిన అస్సాం నేత. పైగా ఆయన తనంత తానుగా మీడియా మహారాజుగా ఎదిగిన వారు (మీడియా రాణి రినికి భర్తగానే). గొగోయ్ కుమారుడు ఎదుగుతున్న తీరును చూసి విసుగెత్తిన ఆయన గత ఏడాది ఆగస్టులో బీజేపీలోకి ఫిరాయిం చారు.

ఆసు నుంచి బీజేపీ వరకు ఆయన రాజకీయ ప్రయాణమే ఆర్‌ఎస్‌ఎస్ పట్టుదలతో ఓపికగా చూపిన మేధస్సుకు దర్పణం పడుతుంది. అస్సాం అప్పుడప్పుడే తిరుగుబాటు దిశగా పయనిస్తుండగా, 12 ఏళ్ల కుర్రాడిగా బిస్వా ఆసులో చేరి, అనివార్యంగా తీవ్రవాద ఉల్ఫాలో చేరాడు. కిడ్నాపులు, బెదిరింపుల వసూళ్లు, బాంబుదాడులు, మాటుదాడులు, వాటితోపాటే అని వార్యంగా పోలీసులు సాగించే రహస్య హత్యలు, వారి నిఘా దళాలు... అది అస్సాం చరిత్రలోని అత్యంత చీకటి దశ. భ్రమలు కోల్పోయిన శర్మ కాంగ్రె స్‌లో చేరాడు. అత్యంత బలీయుడైన భృగు ఫుకాన్‌కు సవాలు విసిరాడు. 2001 ఎన్నికల్లో ఫుకాన్‌ను కాంగ్రెస్ ఎన్నటికీ గెలవలేని ఝలుక్‌బరీ నుంచి ఓడించి ఆయన సుప్రసిద్ధుడయ్యారు. ఆసు కర్మ భూమిగా ప్రసిద్ధి చెందిన గౌహతి విశ్వవిద్యాలయం క్యాంపస్ ఆ నియోజకవర్గంలో భాగం.

శరణార్థుల వ్యతిరేకత నుంచి ముస్లిం వ్యతిరేతకు మార్పు  
ఆయన బీజేపీలోకి ఫిరాయించడం ఆ పార్టీ విజయావకాశాలలో నాటకీయ మైన మార్పును తెచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్/బీజేపీలతో ఎన్నడూ సంబంధాలు లేని ఆయన తనది ఇంకా కాంగ్రెస్‌వాది హృదయమేనని చెబుతున్నారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి శరబానంద సోనోవాల్ కూడా తన హృదయం ఇంకా ఆసు కార్యకర్తదేనని చెబుతారు. బీజేపీలోని ప్రతి కీలక నేతా అదే మాట అంటారు. భావజాల పరిశుద్ధత లేదా ఎదుగుదల గురించి పట్టించుకో కుండా ఆసు (ఏజీపీ)లోని నైపుణ్యంగలవారిని, కాంగ్రెస్‌లోని కీలక నేతను ఆకర్షించడంతో ఆ పార్టీకి మొత్తంగానే ఒక కొత్త నాయకత్వం పుట్టుకొచ్చింది.  


అస్సాం ఉద్యమం విదేశస్తులకు వ్యతిరేకంగా జాతీయ ఉన్మాదంతో ప్రారంభమైనది. అది ప్రధానంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిం, హిందూ బెంగాలీలకు, మర్వారీలకు వ్యతిరేక మైనది. ఆర్‌ఎస్‌ఎస్‌కు ఇందులో చక్కటి అవకాశం కనిపించింది. కాకపోతే జాతి, మతాల మధ్య ఉన్న వైరుధ్యాన్ని పరిష్కరించాలి. 1982లో నేను నాటి ఆర్‌ఎస్‌ఎస్ ‘‘బౌద్ధిక్ ప్రముఖ్ ’’  లేదా భావజాల అధిపతి (తర్వాతి కాలంలో సర్‌సంఘ్‌చాలక్) కేఎస్ సుదర్శన్‌తో జరిపిన సంభాషణలో ఆయన... ఆందోళనకారులు హిందూ, ముస్లిం బెంగా లీలిద్దరినీ లక్ష్యం చేసుకోవడం గురించి ఆందోళన వెలిబుచ్చారు. ‘‘హిందు వులకు రక్షణ లేకుండా ఉంది’’ అని పదేపదే అంటూ బంగ్లాదేశ్ హిందువులు భారత్‌కు కాక ఇంకెక్కడికి వస్తారు అని స్ఫురింపజేశారు.

అస్సాం ఉద్యమానికి ఆర్‌ఎస్‌ఎస్ చేసిన అతి పెద్ద మేలు...  అది జాతి వ్యతిరేకమైనదన్న దేశవ్యాప్త ముద్రను మార్చడమేనని సోనోవాల్ నేటి అభిప్రాయం. ముడిచమురు సరఫరాలు దేశ ప్రధాన భూభాగానికి రాకుండా వారు సాగించిన ముట్టడి కారణంగా అప్పట్లో ఆ అభిప్రాయమే ఉండేది. దీంతో ఉద్యమ నేతలు ఆర్‌ఎస్‌ఎస్‌ను తమకు మిత్రునిగా చూడటం ప్రారం భించారు. సానుభూతిపరుల సహాయంతో ఆర్‌ఎస్‌ఎస్ చాలా ఓపికగా మెల్లగా బెంగాలీ శరణార్థుల వ్యతిరేక ఉద్యమాన్ని ముస్లిం శరణార్థులకు వ్యతి రేకమైనదిగా మార్చడానికి కృషిచేసింది. అత్యంత జనాకర్షకమైనదిగా, భయంగొలిపేదిగా ఉండిన ‘‘బొంగాలి’’ స్థానంలో ముస్లిం శరణార్థి లేదా ‘‘మియా మనుస్’’కు అది భావజాల పరివర్తనను కలిగించింది.

ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యానికి దేవుడిచ్చిన వరంలాగా మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ ఆవిర్భవించారు. ముస్లింలు, ప్రత్యేకించి బంగ్లాదేశ్ శరణార్థి ముస్లింలు మూకుమ్మడిగా ఆయన చుట్టూ చేరారు. దీంతో కాంగ్రెస్ ఓటు బ్యాంకు క్షీణించిపోగా, గందరగోళంలో పడింది. మౌలానాతో కలిస్తే అది తన ఓటు బ్యాంకును కోల్పోతుంది. లేకపోతే అది పూర్తిగా చీలిపోతుంది. అయినా గొగోయ్ సమాధానపరచే వ్యక్తిత్వం కారణంగా శాంతిని, వృద్ధిని, ఆత్మవిశ్వాసాన్ని తిరిగి రాష్ట్రానికి తీసుకురావడంలో  సఫలమైంది. దీనికి తోడు ఏజీపీ పలు చీలికలకు గురై, మహంత నేతృత్వంలోని నాసిరకం సరుకు శాశ్వత క్షీణతలో పడింది.

అలాగే అస్సామీయుల ఓటు బ్యాంకు కూడా చీలిపోయింది. దీంతో కాంగ్రెస్ కొంత దీనివల్లా, దానివల్లా (ముస్లింలు, ఆదివాసులు, అస్సామీ హిందువులు), మిగతా వారందరిలో అధికులనూ కలుపుకుని నెట్టుకొచ్చింది. ఆ మిగతావారిలో అహోం (గొగోయ్ ప్రాతినిథ్యం వహించేవారు) తదితర ఐదు ఉప-తెగల బృందాలు, టీ తోటల కూలీలు, బెంగాలీ హిందువులు ఉన్నారు.  వారిలో దశాబ్దాల తరబడి ఓపికగా చేసిన కృషి ద్వారా ఆర్‌ఎస్‌ఎస్ దాన్ని మార్చింది.    

ఇతరుల కోసం అధికార పునాది నిర్మాణం
మోదీ-షా నాయకత్వపు వ్యవహారవాదం, ఆర్‌ఎస్‌ఎస్ భావజాల వెసులు బాటుల మధ్య... సొంత క్యాడర్ల నుంచి నాయకులను తయారుచేసుకోవ డానికి వేచి చూసేకంటే, ఏజీపీ నాయకత్వాన్నంతటినీ దొంగిలించాలనే నిర్ణ యం జరిగింది. 2014 నాటికి, సోనోవాల్ సహా బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల్లో అత్యధికులు ఏజీపీ ఫిరాయింపుదార్లే. అజ్మల్ మాటలు మరింత మతోన్మాద పూరితంగా ఉండి వ్యతిరేక ధృవానికి (హిందుత్వశక్తులకు) సహాయపడి, కాంగ్రెస్‌ను అస్పష్ట ప్రాంతంలో లేదా ఓటర్లు లేని ప్రాంతంలో వదిలేసి.. అది ఒక్క స్థానానికి కుదించుకుపోయేలా చేసింది. ఆర్‌ఎస్‌ఎస్/బీజేపీ హేమంత్ బిస్వా శర్మను దొంగిలించి గొగోయ్‌ను బలహీనపరచి ఈ ఎన్నికల్లో కాంగ్రె స్‌ను చావు దెబ్బతీయాలని నిర్ణయించింది.

రామ్ మాధవ్, బిస్వాతో సంబం ధాలు పెట్టుకున్నారు, ఇక ఆ తర్వాత అంతా చకచకా సాగిపోయింది. అజ్మ ల్‌తో కలవడమా లేక పోరాడటమా అని కాంగ్రెస్ ఇంకా గుంజాటన పడు తూనే ఉంది. అంతలోనే జరిగిన ఈ రాజకీయ నాటకాన్ని అది చూస్తూ ఉండి పోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో అడుక్కొచ్చో, అరువుతెచ్చో, దొంగిలించో తెచ్చిన దక్షతగల వారితో, ఒక మైనారిటీ పార్టీ గురించి మెజారిటీలో ఉన్న భయంపై స్వారీ చేస్తూ, ఎదురులేని శక్తిగా మూడుసార్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను ఏకాకిని చేసి రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయశక్తి  వృద్ధి చెందింది. ఆర్‌ఎస్‌ఎస్ తన వారితో... అర్‌ఎస్‌ఎస్‌యేతర నాయకులు అత్యధికులుగా ఉన్న ఇతరుల కోసం బలీయమైన అధికార పునాదిని నిర్మించడమే అది సాగించిన ఈ దండయాత్రలోని అత్యద్భుతమైన అంశం. అందుకే అస్సాంలో బీజేపీ ప్రబలశ క్తిగా ఆవిర్భవించడం ఆర్‌ఎస్‌ఎస్ విజయం.


 twitter@shekargupta
 శేఖర్ గుప్తా

మరిన్ని వార్తలు