ఆరెస్సెస్‌ రాముడు

11 Jun, 2016 06:16 IST|Sakshi
ఆరెస్సెస్‌ రాముడు

అక్షర తూణీరం

భక్తి ఆసరా కూడా డెమోక్రసీ లాంటిదే. కొందరు దేవుణ్ణి ఆసరా చేసుకుని అందర్నీ నియంత్రిస్తుంటే, చాలామంది గతిలేక దేవుణ్ణి నమ్మి జీవితం వెళ్లదీస్తుంటారు.

ఆరెస్సెస్‌ డ్రెస్‌ని రాములోరి అడ్రస్‌గా మార్చారని విన్నాక, మనిషి ఎంతకైనా తెగిస్తాడని మరోసారి రుజువైంది. ఆరెస్సెస్‌ ఒఖ్ఖ రాముణ్ణే దేవుడిగా కొలు స్తుంది. రాముడు అవతార పురుషుడు. రామకథకి ఆయన ఎలాంటి విశేషాలూ లేని వట్టి మానవుడై ఉండాలి. లేకపోతే వచ్చిన పని నేరవేరదు. అందుకని నీతినియమాలున్న సంపూర్ణ మానవుడిగా రాముడు నమోదయాడు. ఎటొచ్చీ వాలి వెన్నుపోటు, రామ బాణాన్ని పక్షికి గురిపెట్టడం లాంటి లొసుగులు అతి కొద్దిగా ఉన్నాయి. సీతని అగ్నిప్రవేశం చేయించడం లాంటి ఓవర్‌ యాక్షన్లూ లేకపోలేదు. ‘మరి మనిషంటే అంతేమరి! తప్పొప్పులు పడుతూ పడుగూ పేకాగా నేసిన వస్త్రం మనిషి’ అంటూ పెద్దలు సమర్థించి క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. చాలా మంది ప్రపంచ మేధా వులు శంభూక వధ జాబాలి వృత్తాంతం స్టడీ చేసి రాముణ్ణి చీల్చి చెండాడే ప్రయ త్నం చేశారు. ప్రజా రాజ్యంలో మెజారిటీ వాదమే సత్యమై నిత్యమై నిలుస్తుంది. ‘లోపములున్నను రాముడు దేవుడు’ అని  ముక్తకంఠంతో అరిచి కొలిచారు.

రేపు వినాయక ఉత్సవాలు వస్తాయ్‌. విఘ్నరాజుని నానా రకాలుగా అలం కరించి వినోదిస్తారు. ఆయన్ని క్రికెట్‌ ప్లేయర్‌గా, కంప్యూటర్‌ ఇంజనీర్‌గా సెల్ఫీలు తీసుకుంటున్న భంగిమలో చూస్తూనే ఉన్నాం. ఆలోచనే వస్తే– ఓ కొత్త రూపం రానే వస్తుంది. వినాయకుడి విషయంలో ఎవరూ తప్పు పట్టరు. అదే శివుడి జోలికో, విష్ణువు జోలికో వెళితే మాత్రం సహించరు. త్రిమూర్తుల్లో బ్రహ్మదేవుణ్ణి పెద్దగా స్మరించరు. ‘నాలుగు తలలతో విరాజిల్లే బ్రహ్మ మన సిటీ ట్రాఫిక్‌ నియంత్రణకి అద్భుతంగా వినియోగపడతారండీ’ అని ఓ ఆధునికుడు చమ త్కరించాడు. కలియుగంలో భూమ్మీద ఆయనకు స్థానం లేదని చెప్పాడు.

మనిషి దేవాంతకుడు. దేవుణ్ణి కూడా రెండు చేతులు, రెండు కాళ్లతో అచ్చం తన కొలతలతోనే తయారు చేసి ఆ బొమ్మలకే ప్రాచుర్యం తెచ్చాడు. గుళ్లో పెట్టి, పూజలు పునస్కారాలు డిజైన్‌ చేశాడు. టెంకాయలు, కర్పూరం, అగరుబత్తీలకు కోట్లాది రూపాయల మార్కెట్‌ తెచ్చాడు. తనకు లాగే పెళ్లిళ్లు, పేరంటాలు, పవళింపు సేవలు సమస్తం దేవుళ్లకి మప్పాడు. భక్తి ఆసరా కూడా డెమోక్రసీ లాంటిదే.  కొందరు దేవుణ్ణి ఆసరా చేసుకుని మిగతా అందర్నీ నియంత్రిస్తూ, నిమంత్రిస్తూ ఉంటారు. చాలామంది గతిలేక దేవుణ్ణి మితంగానో, అమితంగానో నమ్మి జీవితం వెళ్లదీస్తుంటారు.

త్రిమూర్తులు ఒకచోట కూడి, విశ్వసృష్టిపై చర్చాగోష్టి పెట్టుకున్నారు. ‘బ్రహ్మదేవా! తమరి తెలివి తెల్లారినట్లే ఉంది. మానవుడికి అంత తెలివా’ అని శివుడు వాపోయాడు. ఔనన్నట్లు విష్ణుమూర్తి తల పంకించాడు. చిరునవ్వుతో, ‘నేను ఏదైనను జీర్ణించుకోగలను. దురద మందు వ్యాపార ప్రకటనకి రామ బాణం వాడితే ఏమన్నాను? సంజీవని పర్వతం తెస్తున్న హనుమ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీకి గుర్తు అయితే కాదన్నానా? భాజపా వారు రామనామాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో వాడితే ఉదాసీనంగా ఉండిపోలేదా? ఏరుదాటాక తెప్ప తగలేసి చలికాచుకోమన్నారు కదా. రాబోయే రోజుల్లో ముఖ్యనేత దుస్తులతో రామ విగ్రహాలను అలంకరించి, రామరాజ్యాన్ని జనం కళ్లముందు చూపినా ఆశ్చర్యంపోను. అయినా, వగపేటికి చల్ల చిందినన్‌’ అంటూ విష్ణుమూర్తి ముగించాడు.

- శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

మరిన్ని వార్తలు