సహనంతోనే విజ్ఞత సాధ్యం

20 Feb, 2014 01:40 IST|Sakshi
సహనంతోనే విజ్ఞత సాధ్యం

అసహనం జ్ఞాన విచక్షణలను క్షణంలో పెడదారి పట్టించగలదని చెప్పే వృత్తాంతాలు అనేకం ఉన్నాయి. వ్యాస విరచితమైన మహాభారతంలో ధర్మరాజు, ద్రౌపది, భీముడు మధ్య జరిగిన ఒక సంవాదంలో కూడా సహనం, దాని ఫలితం, స్వభావం గురించిన ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. బలి తన తాతగారైన ప్రహ్లాదుడిని అడిగిన సంశయాన్ని ప్రస్తావించి ద్రౌపది ఈ చర్చకు తెరలేపుతుంది. ‘సహనం గొప్పదా? క్షాత్రం గొప్పదా? ఏది శ్రేయస్కరం?’ అని బలి అడిగాడు. అందుకు ప్రహ్లాదుడు జవాబిస్తూ ‘రెండూ అతిగా ఉండరాదు.
 
  సహనం ఎక్కువైతే నీకింద పనిచేసేవాళ్లు కూడా నీ మాట లక్ష్యపెట్టరు.  ఇక అతి కోపాన్ని క్షాత్రంగా భావిస్తే సర్వనాశనం తప్పదు’ అని చెప్పాడు. ద్రౌపది ధర్మరాజుకు ఈ వృత్తాంతం చెప్పి కౌరవుల విషయంలో అతి సహనం పనికిరాదని సూచించింది. కానీ, ధర్మజుడు అంగీకరించలేదు. ‘దెబ్బతిన్నవాడు దెబ్బకొట్టినవాడిని దెబ్బతీస్తూ పోతే ఇక ఈ లోకంలో ఎవడూ మిగలడు’ అంటూ ‘సహనంతోపాటు క్షమాగుణమే జీవనశాంతినిస్తుంది. ఈ రెండూ మహనీయగుణాల’ని ద్రౌపదిని చల్లబరిచేందుకు ప్రయత్నించాడు. ద్రౌపది సహనం కోల్పోయింది. ‘నీకూ, నీ బుద్ధికీ మోహం కలిగించిన విధి, ప్రారబ్ధాలకు ఓ నమస్కారం’ అని ధర్మజుడిపై చిరాకుపడిందామె.
 
 జ్ఞాన సముపార్జన కావాలనుకుంటూనే అందుకు చదువుకోవాలన్న విషయంలో సహనంలేని రుషిపుత్రుడి కథ మరోటి ఉంది. భరద్వాజ మహర్షి కొడుకు యువక్రీతుడు ఎలాంటి గట్టి అధ్యయనం లేకుండా వేదాలు, వాటి సారం తెలుసుకోవాలన్న ఆలోచన చేశాడు. ‘సూక్ష్మంలో మోక్షం’ అన్నట్టుగా దానికోసం యాగం చేశాడు. కృషి, సహనం, పట్టుదల లేనిదే వేదాధ్యయనం సాధ్యంకాదని యువక్రీతుడికి మారువేషంలో వచ్చిన ఇంద్రుడు హితోపదేశం చేశాడు.
 
 తననే ఉదహరించుకుంటూ జన సౌకర్యం కోసం గంగానదిపై ఉత్త ఇసుకతో వంతెన నిర్మించే పనిచేయబోయి ఎలా భంగపడ్డాడో చెప్పాడు. గోగ్రహణంలో విజయుడై తిరిగొచ్చినది తన కొడుకు ఉత్తరుడని, బృహన్నల కాదని వాదించి, సహనం కోల్పోయి తన చేతిలోని పాచికలను కంకుభట్టుగా తన కొలువులో ఉంటున్న ధర్మరాజు మొహాన కొట్టాడు విరటుడు. ఈ ఘటన తర్వాత విరటుడు జరిగినదానికి విచారం వ్యక్తంచేశాడు. ధర్మరాజు కూడా స్థిమితపడ్డాడు. అయితే, ఈ సంగతి తెలుసుకున్న పాండవ సోదరులు మాత్రం విరటుడిని తొక్కిపడేద్దామనుకున్నారు. అటు తర్వాత సహనం కోల్పోవడం మంచిది కాదని గ్రహించి శాంతపడ్డారు.
 
 అయితే, ఎంతో సహనంగా ఉండే ధర్మరాజు సైతం కంకుభట్టు వేషం తీసేసి విరటునికి తామెవరిమో చెప్పాక సహనం కోల్పోతాడు. తిన్నగా వెళ్లి విరటుడి సింహాసనంపైనే కూర్చున్నాడు! ఎంతటివారైనా సహనం, విచక్షణ కోల్పోయి ప్రవర్తించడం అసహజమేమీ కాదని, సహనం వహించి సత్ఫలితాలు సాధించేవరకూ కృషిచేసేవారే విజ్ఞులనీ, విజేతలనీ భారతం పలుమార్లు ఉదాహరణ సహితంగా చెబుతుంది.
 తల్లావ ఝ్జల శివాజి

మరిన్ని వార్తలు