పులుల వృద్ధి నిలిస్తేనే ఫలం

23 Jan, 2015 01:20 IST|Sakshi
దిలీప్ రెడ్డి

 సమకాలీనం
 పులుల వృద్ధి ఊర్ధ్వముఖంగా, ఆవరణ ఆరోగ్యం నిలకడగా ఉండాలి. కేంద్రం తీసుకుంటున్న తెంపరి నిర్ణయాలు ప్రమాద సంకేతాల్ని సూచిస్తున్నాయి. అభివృద్ధి లక్ష్యంతో సంస్కరణల పేరిట విచ్చలవిడిగా పర్యావరణ అనుమతులిస్తున్న తీరు ఆందోళనకరం. జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్, ఈశాన్య రాష్ట్రాల్లో అడవులు అంతరించి, పులుల సంఖ్య తగ్గింది. ఆ ప్రాంతాల్లో ఖనిజ తవ్వకాలు, ఇతర ప్రాజెక్టులతో బహుళజాతి కంపెనీలు పాగా వేస్తున్నాయి. మోదీ సర్కార్ గత జూలైలో ఏర్పాటు చేసిన ‘జాతీయ పన్య ప్రాణి బోర్డు’ ఏకంగా పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపే వంద ప్రాజెక్టులను అనుమతించింది.
 
 అభినందించదగ్గ స్థాయిలో దేశంలో పులుల సంఖ్య పెరిగింది. ఘనవిజయ మని కేంద్ర పర్యావరణ మంత్రి జవదేకర్ మూడు రోజుల కింద ‘విజయ గాథ’ వినిపించారు. నిజమే! ఇది ఖచ్చితంగా ఘనవిజయమే! ఏ ప్రమాణా లతో చూసినా ప్రపంచ పులుల జనాభాలో 70 శాతం మన దేశంలోనే ఉండ టం, వాటి సంఖ్య గడచిన నాలుగేళ్లలోనే బాగా, అంటే 30 శాతం పైన పెరగ డం ఆహ్వానించదగ్గ పరిణామమే. అది కూడా... అడవులు నశిస్తుండటం, అటవీ నడవల (కారిడార్స్) మధ్య సంబంధాలు తెగిపోవడం, అడ్డగోలు ఖనిజ తవ్వకాలు, పులిని చంపడం, దాని ఆహారమైన ఇతర వన్యమృగాల వేట, కలప తదితర అటవీ ఉత్పత్తుల స్మగ్లింగ్ వంటి దుష్పరిణామాల తర్వాత కూడా పులుల జనాభా వృద్ధి అభినందనీయమే! అంతరించిపోతున్న జాతిగా ఐక్యరాజ్యసమితి గుర్తించిన మన జాతీయ జంతువు, వారసత్వ సంపద పులిని బతికించుకుంటున్న బలమైన సంకేతమిది. అటవీ చట్టాల్ని సవరించడం, ప్రత్యేక జోన్లను ప్రకటించడం, టైగర్ రిజర్వుల్ని పెంచడం వంటి కార్యక్రమాల ద్వారా పులుల సంరక్షణ చర్యలు చేపట్టారు. ముఖ్యంగా అడవి బిడ్డలకు ప్రత్యామ్నాయ నివాస ప్రాంతాలు చూపి, అడవిలో జనసం చారాన్ని తగ్గించడం ద్వారా పులి-మనిషి స్పర్థని నివారించారు. అయితే, ముందుంది ముసళ్ల పండుగ అన్నట్టు ఇక అసలైన కార్యభారం రాబోయే రోజుల్లో ఉంది. పూర్వ ప్రభుత్వాల మంచి-చెడులకు తర్వాతి ప్రభుత్వాలు ప్రాతినిధ్యం వహించాల్సి రావడమన్నది ప్రజాస్వామ్య పాలనావ్యవస్థ లక్షణాల్లో ఒకటి. చెడు జరిగితే వారికే ఆపాదించి, మంచయితే తమ ఖాతాలో వేసుకోవడం పరిపాటి. ఇప్పుడదే జరిగింది. ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వపు తాజా నిర్వాకాల ఫలితాలు వెనువెంటనే కనబడవు. ముఖ్యంగా పులుల సంరక్షణ వంటి దీర్ఘకాలిక పథకాల నిర్వహణ ఫలితాలు ఎప్పుడో నాలుగేళ్లకు మళ్లీ పులుల గణన జరిగినపుడు తెలుస్తాయి. అప్పటివరకు అటు పర్యావర ణానికి, ఇటు అభివృద్ధికి మధ్య సమతుల్యత సాధించాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపైనే ఉంది. కానీ, ఇప్పటి వరకు ఈ దిశలో కనిపిస్తున్న సంకేతాలు సందేహాల్నే రేకెత్తిస్తున్నాయి.

 ఎలా సాధ్యమైంది?
 2006లో దేశంలో 1,411 పులులుండేవి. 2010లో ఆ సంఖ్య 1,706కి, 2014లో అది 2,226 కి పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మొత్తం 3,200 పులులలో ఇది 70 శాతం పైనే. రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న శ్రీశైలం-నాగార్జునసాగర్ టైగర్ ప్రాజెక్టుతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవాల్లోని అడవుల్లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది.  ఇంకా, అక్కడక్కడ అటవీ నడవల మధ్య ఖాళీలుండి పులులు స్వేచ్ఛగా సంచరించే అవకాశం లేకుండా పోతోంది. దేశంలోని 18 రాష్ట్రాల్లో 3.78 లక్షల చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతంలోని పులుల గణన ద్వారా ఈ గణాం కాలు తీశారు. పులుల పాదముద్రల సేకరణకు తోడు, దాదాపు వెయ్యి సీసీ కెమెరాలను వినియోగించి 1,500లకు పైగా పులుల ఫోటోలను విశ్లేషించి, శాస్త్రీయంగా ఈ గణన జరిపారు. ‘ఈ వృద్ధి కాకతాళీయంగా సాధ్యమైంది కాదు, తగు సంరక్షణ చర్యలు, సమర్థ నిర్వహణ, నిబద్ధత కలిగిన కొందరు అటవీ అధికారులు, సడలని రాజకీయ సంకల్పం వల్లే ఇది సాధ్యమైంది’ అని భారత వన్యప్రాణి సంరక్షణ సంఘం అంటోంది. వేటను నిరోధించే చర్యలు కూడా ఇందుకు తోడ్పడ్డాయి. అటవీ ప్రాంతంలోని గిరిజన తెగల విష యంలో ద్విముఖ వ్యూహాన్ని అనుసరించారు. పులులు సంచరించే ప్రధాన అటవీ ప్రాంతం నుంచి వారి నివాసాల్ని బయళ్లకు, అటవీ అంచు ప్రాంతా లకు తరలింపజేశారు. అటవీ ఉత్పత్తుల్లో వారికి వాటా కల్పించడం, వారినే అటవీ సంరక్షకులు (ఎఫ్జీ)గా నియోగించడం ద్వారా కూడా మంచి ఫలితాలొ చ్చాయి. మన నల్లమలలో ఉన్న మన్ననూరు, ఆమ్రాబాద్, శ్రీశైలం, మార్కా పురం వంటి అటవీ ప్రాంతాల్లో గిరిజనుల్ని ఈవిధంగా వినియోగించు కున్నారు. ‘రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్’ (ఆర్బీయస్) ఆర్థిక సహా యంతో పలు కార్యక్రమాలు చేపట్టారు. దేశ వ్యాప్తంగా టైగర్ రిజర్వుల్లో చేపట్టిన చర్యలు మంచి ఫలితాలిచ్చాయి. భారత ప్రభుత్వం 1970లో పులుల సంరక్షణ ప్రాజెక్టును చేపట్టింది. 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని 2006లో సవరించడం సత్ఫలితాలనిచ్చింది. ఫలితంగా పులుల రక్షణకు జాతీయ సంస్థ (ఎన్టీసీయే), పులి తదితర అంతరించిపోయే జీవజాతుల క్రైమ్ కంట్రోల్ బ్యూరో వంటివి ఏర్పడ్డాయి. చర్మం, గోళ్లు తస్కరించే వేటగాళ్ల నుంచి పులికి రక్షణ కల్పించడంతో పాటు, పులి ఆవాస ప్రాంతాల్ని సంరక్షించే ఉద్దేశంతో టైగర్ రిజర్వుల్ని క్రమంగా పెంచుతూవచ్చారు. 1970లో తొమ్మిది రిజర్వు లుంటే ఇప్పుడా సంఖ్య 39కి చేరింది. ఇవి కాకుండా బయటి అడవుల్లో కూడా పెద్ద సంఖ్యలోనే పులులున్నాయి.

 పులులు పెరిగితే ఏంటంట?
 పులుల సంఖ్య పెరగటం వల్ల ఏమొస్తుంది? అని అడిగే వారూ ఉంటారు. ‘జూ’లలోనూ, బయటా క్లోనింగ్, తదితర సాంకేతిక పరిజ్ఞానంతో పులుల సంఖ్యను పెంచొచ్చు. కానీ, దాని వల్ల ప్రయోజనం ఉండదు. దేశంలోని జూలలోని పులుల సంఖ్య ఎక్కువైందని, ఇతర దేశాల వారికి ఇస్తామని అధికారులు ప్రకటిస్తున్నారు. కానీ అడవిలో పులుల సంఖ్య పెరగడం పర్యా వరణ సమృద్ధికి ప్రతీక. పులులు ఆ సంఖ్యలో ఉన్నాయంటే, వాటికి ఆహార మైన దుప్పులు, లేళ్లు, కణితలు, అడవి పందులు ఇతర జీవులున్నట్టు. అవన్నీ సంచరిస్తున్నాయంటే వాటికి ఆహారమైన గడ్డి, గాదం పుష్కలంగా లభించ డమే కాక మంచి, దట్టమైన అడవి ఉన్నట్టు లెక్క. జీవ ఆహార శృంకలం సమృద్ధిని బట్టి సమతుల్య జీవవైవిధ్యం, పర్యావరణం, అడవి, నేల నీటి సామర్థ్యం, భూగర్భనీటి మట్టాలు బాగా ఉన్నట్టు గ్రహించవచ్చు. అది ఆవ రణ వ్యవస్థ ఆరోగ్య స్థితి. ఒకసారి వచ్చిన ఆరోగ్యస్థితి శాశ్వతం కాదు, దాన్ని నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే, అన్ని సందర్భాల్లో పులుల సంఖ్య పెరుగుదలతో పర్యావరణ సమృద్ధి జరిగినట్టే అనుకోవడానికీ లేదని టైగర్ ప్రాజెక్టుల అనుభవజ్ఞులు డాక్టర్ తులసీరావు అంటారు. అది ఆవాస అభి వృద్ధి వల్ల పెరిగిందా? వేటను నియంత్రించడం వల్లనా? ఇతరేతర కార ణాలా? అనేది ఆవాస నేపథ్యంలో మాత్రమే చూడాలి. పులుల ప్రకృతి సిద్ధమైన వృద్ధి వాటి ఆవాస పరిమాణం, ప్రమాణాల్ని బట్టి ఉంటుంది. వాటి ఆవరణ వ్యవస్థ పరిధిని బట్టి చూస్తే దేశంలో పులుల సంఖ్య, ఉండవలసిన దానికన్నా తక్కువే. వేర్వేరు అడవుల మధ్య నడవలు నశించి, పులుల సంచా రానికి పరిమితులేర్పడ్డాయి. ప్రత్యేక చర్యలతో నడవల్ని మెరుగుపరచాలి.

 సంకేతాలిప్పుడు సానుకూలంగా లేవు!
 పులుల సంఖ్య వృద్ధి గ్రాఫ్ ఊర్ధ్వ ముఖంగా, ఆవరణ ఆరోగ్యం నిలకడగా ఉండాలి. ఆ నమ్మకం కలిగించకపోగా, నిర్వచనం లేని ‘అభివృద్ధి’ నినాదం కింద ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న తెంపరి నిర్ణయాలు ప్రమాద సంకే తాల్నే సూచిస్తున్నాయి. అభివృద్ధి లక్ష్యంతో సంస్కరణల పేరిట విచ్చలవిడిగా పర్యావరణ అనుమతులిస్తున్న తీరు ఆందోళనకరం. జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్, ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికే అడవులు అంతరించి, పులుల సంఖ్య రమారమి తగ్గింది. ఆ ప్రాంతాల్లో ఖనిజ తవ్వకాలు, ఇతర ప్రాజెక్టులతో బహుళజాతి కంపెనీలు పాగా వేస్తున్నాయి. మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే, గత జూలైలో ‘జాతీయ వన్యప్రాణి బోరు’్డను ఏర్పాటు చేసిం ది. అది ఆశ్చర్యకరంగా పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపే వంద ప్రాజెక్టులను అనుమతించేసింది. ఆ అనుమతులు రాజ్యాంగ వ్యతిరేకమని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఇక బోర్డు అనుమతితో నిమిత్తం లేకుండానే వన్య ప్రాణి సంరక్షణ క్షేత్రాలకు 5 కిలోమీటర్ల పరిధిలో పలు ప్రాజెక్టుల్ని పర్యా వరణశాఖ ఏకపక్షంగా మంజూరు చేసింది. అడవుల రక్షణలో ఇవన్నీ తిరోగ మన చర్యలని పర్యావరణ ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థల వారంటున్నారు. సమర్థులైన, తపన కలిగిన అధికారుల్ని నియోగించడం ఎంతో అవసరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపితేనే పులుల పెరుగుదలకు సార్థకత. అప్పుడే పులుల, జీవవైవిధ్య, పర్యావరణ పరిరక్షణకు మోక్షం.
 
ఈమెయిల్: dileepreddy@sakshi.com  

మరిన్ని వార్తలు