అభివృద్ధి పథకాలకు ఆద్యుడు సంజీవయ్య

14 Feb, 2016 01:09 IST|Sakshi
అభివృద్ధి పథకాలకు ఆద్యుడు సంజీవయ్య

భారతదేశంలో కెల్లా ముఖ్యమంత్రి పదవి నిర్వహించిన వారిలోను, అఖిల భారత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నలంకరించిన వారిలోనూ అతిపిన్న వయస్కుడు దామోదరం సంజీవయ్య. ఒక హరిజనుడు రాష్ర్టంలో ముఖ్యమంత్రి కావడం, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు కావడం దేశ చరిత్రలో సంజీవయ్యతోనే మొదలైంది. ఆయన అనేక కష్టాలకోర్చి పట్టుదలతో చదువుకుని ఎదిగివచ్చారు. ఉమ్మడి మద్రాసు రాష్ర్టంలో రాజాజీ మంత్రి వర్గంలో చేరే నాటికి ఆయన వయసు 31 ఏళ్ళు మాత్రమే. 1950లోనే 29వ ఏట పార్లమెంటుకు ఎంపికై ఏడాది పాటు సభ్యుడిగా వ్యవహరించారు.
 
1952లో జరిగిన సాధారణ ఎన్నికలలో మద్రాసు శాసన సభకు కర్నూలు రిజర్వుడ్ సీటు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొంది రాజగోపాలాచారి ప్రభుత్వంలో సహకారశాఖకు మంత్రిత్వం వహించారు. 1953లో టంగుటూరి ప్రకాశం పంతులు గారి మంత్రి వర్గంలో కూడా సాంఘిక సంక్షేమ, ప్రజారోగ్య శాఖల మంత్రిగా పనిచేశారు. 1955 మధ్యంతర ఎన్నికలలో ఎమ్మిగ నూరు నుండి ఎన్నికై  బెజవాడ గోపాలరెడ్డి మంత్రి వర్గంలో రవాణా, సహకార శాఖల మంత్రిగా, రాష్ట్రావతరణ (1956) జరిగిన తదుపరి నీలం సంజీవరెడ్డి మంత్రి వర్గంలో స్థానిక సంస్థలు, కార్మికశాఖల మంత్రిగా పనిచేశారు.
 
 1960లో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారిగా దళితుడైన దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి కావడం దేశంలోనే ఒక సంచలనం. 1960 జనవరి 11వ తేదీన పదవీ ప్రమాణ స్వీకారం చేసేనాటికి ఆయన వయసు 38 ఏళ్లు మాత్రమే. అప్పటికే మంత్రిగా 8 ఏళ్ళ అనుభవం ఉన్న ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసింది కేవలం (1960-1962) రెండేళ్ళ స్వల్పకాలమే అయినా సామాజికాభ్యుదయ కార్యక్రమాలను చేపట్టారు. ఆనాడు ఆయన చేపట్టిన పలు విధానాలు ముందు తరాలకు మార్గదర్శకాలైనాయి.
 
  పులిచింతల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది వీరే. అవినీతి నిరోధక శాఖల ఏర్పాటు, వృద్ధాప్య పెన్షన్‌లు, కార్మికులకు బోనస్ ఇచ్చే పద్ధతికి వీరే ఆద్యులు. ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో భూసంస్కరణలను కట్టుదిట్టంగా అమలు చేసి ఆరులక్షల ఎకరాల భూమిని నిరుపేదలకు పంచిపెట్టారు. చట్టాలను సమన్వయ పర్చడానికి ‘లా కమిషన్’ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు లోనే విధిగా ఉత్తరప్రత్యుత్తరాలు జరగాలని ఉత్తర్వులు జారీచేశారు. పరిశ్రమాభివృద్ధి కోసం భారీ పరిశ్రమలు, లఘుపరిశ్రమల విభాగాలు, గనుల అభివృద్ధి కోసం మూడు కార్పొరేషన్‌లను స్వతంత్ర ప్రతిపత్తి హోదాలో ఏర్పాటు చేశారు. అప్పటి వరకు వేరుగా ఉన్న హైదరాబాద్,  సికింద్రాబాదు కార్పొరేషన్‌లను ఏకం చేసి ‘గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్‌ఎంసీ) కార్పొరేషన్’ గా రూపొందించారు.
 
 1962లో జరిగిన ఎన్నికల్లో కోడుమూరు నుండి ఎంపికైనా ముఖ్యమంత్రి పదవికి పోటీ చేయలేదు. సంజీవరెడ్డి ముఖ్య మంత్రి అయ్యారు. తర్వాత నెహ్రూ జాతీయ కాంగ్రెస్ పదవిని సంజీవయ్యకు కట్టబెట్టారు. సంజీవయ్యను రెండేళ్ళు దాటి ముఖ్య మంత్రిగా అంగీకరించలేకపోయిన సమాజం మనది.  ఆయన కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. 1967లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయి ఆపై రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. శ్రీమతి ఇందిరాగాంధీ, లాల్‌బహదూర్‌శాస్త్రిల మంత్రి వర్గాల్లో కూడా పనిచేశారు.
 
 దామోదరం సంజీవయ్య స్వయంగా కవి, సాహితీప్రియుడు, నటుడు. కాలేజి రోజుల్లోనే ‘కృష్ణలీలలు’లో పద్యాలు రాశారు. భీష్మజననం, శశిరేఖాపరిణయం, గయోపాఖ్యానం వంటి నాట కాలు కొన్నింటికి పద్యాలు వాశారు. సంజీవయ్య కందం ఎంత తేలికగా చెప్పగలరో, ఆటవెలదిని అంత తియ్యగా అల్లగలరు. ప్రసిద్ధి నటులచే ప్రదర్శనలిప్పించారు. తానుగా స్వయంగా ‘‘షాజహాన్ నాటకంలో’’ షాజహాన్ పాత్రను అద్భుతంగా పోషించినట్లు వినికిడి. ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన అధ్యక్షతలోనే  అఖిలభారత తెలుగు రచయితల మహాసభ మొదటిసారిగా హైదరాబాద్‌లో జరిగినది. ఆనాటి భారత ఉప రాష్ర్టపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ మహాసభలను ప్రారంభించారు. అప్పటి కేరళ గవర్నర్ బూర్గుల రామకృష్ణారావు, కేంద్రమంత్రి బెజవాడ గోపాలరెడ్డి వంటి వారు ఈ మహాసభల్లో పాల్గొని సంజీవయ్య కృషిని అభినందించారు. ఆయన స్వయంగా వేదాలు, భారత, భాగవత, రామాయణాది గ్రంథాలను అధ్యయనం చేసి ఉండటం ఆ రోజుల్లో అంత సామాన్య విషయంకాదు.
 
 నేటి భారత రాజకీయ పరిస్థితుల్లో షెడ్యూల్ కులాలు, ఇతర వెనుకబడిన తరగతుల వారి జీవన పరిస్థితులు మెరుగు పడాలంటే, ప్రధాని, ముఖ్యమంత్రుల పదవులు కనీసం శతాబ్దం పాటైనాఈ వర్గాలకు రిజర్వేషన్ చేయాలి. యుగయుగాలు బాధలకు, అవమానాలకు గురైన ఈ వర్గాలకు ఆపాటి రిజర్వేషన్ రాజ్యాంగ బద్దంగా కల్పించడాన్ని అన్ని రాజకీయ పార్టీలు నిజాయితీతో ముందుకు వస్తేనే అసలుసిసలైన సామాజిక న్యాయం జరుగుతుంది. రాజాకీయ పార్టీలు మాటలుగాక, చేతల ద్వారా తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాలి. దేశంలో మార్పును నిజంగా కోరుకునే వారు, బడుగుల ఆత్మగౌరవం కాపాడుతామనే వారు, బడుగులకు రాజ్యాధికారం కట్టబెడతామనేవారు తమ బడుగుల మెజారిటీ, వారిదే అధారిటీ అనేవారు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పదవుల రిజర్వేషన్‌కు అంగీకరిస్తేనే వారి అంకితభావానికి అర్దం, పరమార్ధం ఉంటాయి.
 
 దళితులు తాము భారతీయులమని సగర్వంగా చెప్పుకునే రోజుల కోసం ఎదురుచూస్తున్నారు. రాజ్యాంగాన్ని సవరించి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పదవులను రిజర్వేషన్ కిందకు తీసుకురావాలి. దళితులకు, తాము దళితులమనే భావన నుంచి దూరం చేయాలి. ప్రస్తుత సామాజిక పరిస్థితులు వారిని వేధిస్తున్నాయి. కుల వ్యవస్థను తొలగించడానికి ఆరున్నర దశాబ్దాల్లో జరిగినది శూన్యం. చట్టపరంగా సమానహక్కులు వున్న ఈ చట్టాలు అమలుకు నోచుకోనులేదు. సామాజిక న్యాయానికి కట్టుబడివు న్నామని గొప్పలు చెప్పుకునే పాత్రలు ఈ దశగా ఆలోచించవల్సిన తరుణం ఆసన్నమైంది. ఉద్యమాలకు తావులేని విధంగా రాజకీయ పార్టీలు స్పందించాలి.  
 
 దామోదరం సంజీవయ్య 1921 ఫిబ్రవరి 14న కర్నూలు జిల్లా పెద్దపాడు గ్రామంలో (కర్నూలుకు 8 కి.మీ. దూరం) మాలదాసరులైన మునెయ్య, సుంకలమ్మ దంపతులకు కడపటి (5వ) సంతానంగా జన్మించారు.  తల్లిదండ్రులు సంగీతం, కళాత్మక సాంప్రదాయ కుటుంబ నేపథ్యము కలిగియుండుట వలన ఆయన నావి జీవతంలో సాహితీ, కళల రంగాలపట్లా ఆసక్తి కలగటానికి ప్రేరణ కలిగిందాయనకు. కుల వివక్షత ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ సమాజంలో తాను ఉన్నతస్థ్థితికి ఎదగాలనే పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యపడుతుందని సంజీవయ్య నిరూపించారు. ప్రతి పదవిలోను ఆయన రాణించారు.

ఎన్నో పదవులలో ఎంతో కాలంపాటు కొనసాగినప్పటికీ ఆయన నిర్దనుడే. ఏదో ఒక ప్రాంతమునకు ఒక వర్గమునకు చెందిన వ్యక్తిగాదు. రాజకీయ రంగంలో అతి చిన్నవయసులో అత్యున్నత శిఖరాలను అందుకుని ప్రజాసేవాయే పరమావదిగా, నిస్వార్ధపరునిగా స్వలాభపేక్ష లేకుండా ప్రజల మనిషిగా ఎదిగిన దామోదరం సంజీవయ్య లాంటి జనాదరణ కలిగిన దళిత నేత నేడు సీమాంధ్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా కావాలి.
 (నేడు దామోదరం సంజీవయ్య 95వ జయంతి)
 వ్యాసకర్త విశ్రాంత ఉద్యోగి, భారత ప్రభుత్వ
 అణుఇంధన సంస్థ  మొబైల్ : 80081 89979
 - వి. సర్వేశ్వరరావు

మరిన్ని వార్తలు