పతకాల వెనుక పథకాలు

24 Aug, 2016 09:16 IST|Sakshi

డేట్‌లైన్ హైదరాబాద్

రొహతక్‌కు చెందిన సాక్షి మలిక్‌కి కానీ, హైదరాబాద్‌కు చెందిన సింధుకు కానీ - ఇలాంటి విజయాలు ఎవరు సాధించి వచ్చినా ప్రభుత్వాలూ ఇతర సంస్థలూ పోటాపోటీగా కానుకలు ఇవ్వడం కొత్తేమీ కాదు కూడా. గతంలో సానియా మీర్జా, సైనా నెహ్వాల్ ఇంకా అనేకమంది దేశవ్యాప్తంగా ఇటువంటి సత్కారాలు అందుకున్నారు. ప్రశ్న ఒక్కటే. మొత్తంగా మన దేశం అంతర్జాతీయ క్రీడారంగంలో రాణించడానికి ఇది చాలా? చాలదని చెప్పడానికి అనేక అంశాలను ప్రస్తావించవచ్చు.

సింధుకు జననీరాజనం(ఇన్ సెట్: కొలిపాక ఉమ)

రెండురోజులుగా హైదరాబాద్, విజయవాడ నగరాల్లో సాగిన అత్యంత అనాగరిక రాజకీయ క్రీడను మనం వీక్షించాం. ఈ ఆట ఆడింది రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, వాటి అధినేతలే. ప్రపంచ క్రీడాభిమానులు ఎవ్వరూ హర్షించని రాజకీయ క్రీడ అది. రియో ఒలింపిక్స్ క్రీడోత్సవంలో మొట్టమొ దటిసారి యువ క్రీడాకారిణి పి.వి. సింధు ఆడిన ఆట చూసి గత శుక్రవారం ప్రపంచం అబ్బురపడింది, జేజేలు పలికింది. చివరి మ్యాచ్ ఓడినా అత్యంత క్రీడాస్పూర్తిని ప్రదర్శించి తన మీద గెలిచిన స్పెరుున్ క్రీడాకారిణిని తానే పల కరించి, అభినందించింది. ఆమె పుట్టి పెరిగిన సికింద్రాబాద్, హైదరాబాద్ లలో గానీ, ఆమె బంధుకోటి ఉన్న విజయవాడలో కానీ ఆ క్రీడాస్ఫూర్తి ఎందుకు కనిపించలేదు? ఫైనల్స్‌లో ఓడిపోతూ కూడా అద్భుతంగా ఆడిన సింధును ఆనందంగా చూసిన వాళ్లే; హైదరాబాద్, విజయవాడ వీధుల్లో ఆమె పాల్గొన్న సర్కారీ ఊరేగింపులు చూసీ, పోటీలు పడి ప్రకటించిన నజరానాలతో ఏలినవారు ఆమెను తమ సొంతం చేసుకునే ప్రయత్నాలు చూసీ అసహ్యించుకుంటూ టీవీలు కట్టేసిన మాట నిజం.

ఇంతకూ సింధు ఎవరు? ఆంధ్రప్రదేశ్ అమ్మాయా, తెలంగాణ  బిడ్డా, భారతీయురాలా? క్రీడా కారులకు దేశం, ప్రాంతం, కులం, మతం ఉంటాయా? ఉంటే అవి క్రీడలెట్లా అవుతారుు? ఆమె అంతర్జాతీయ మహిళ. తన పుట్టుక రీత్యా, చదువు    సంధ్యల రీత్యా, వృత్తి వ్యాపకాల రీత్యా ఏ విజయవాడకో, హైదరాబాద్‌కో చెంది ఉండొచ్చు. కానీ క్రీడారంగానికీ, అందునా ఆమె ఆడి నిలిచిన బాడ్మిం టన్ క్రీడకూ సింధు అంతర్జాతీయ మహిళే. అటు ఆంధ్రప్రదేశ్‌కు కానీ, ఇటు తెలంగాణ కు కానీ, ఆమాటకొస్తే యావద్భారతానికి గానీ - ఇది నిజంగా సంతోషించవలసిన సమయమే. అదే సమయంలో మనమేమిటో సమీక్షించు కోవలసిన సమయం కూడా. ఒక్కసారి రియో ఒలింపిక్స్ దృశ్యాన్ని రివైండ్ చేసి చూడండి. ఇంత జనాభా ఉన్న దేశానికి ఒక రజతం మరో కాంస్యమేనా అనిపించకమానదు. 119 మంది క్రీడాకారులు వెళ్లి తెచ్చిన పతకాలు రెండు.

రాజకీయ క్రీడ

క్రీడాకారులు స్వశక్తితో పోరాడి పతకాలు సాధించుకొస్తే, అప్పుడు మాత్రం వారిని గుర్తించి పోటీలు పడి నగదు బహుమానాలు ప్రకటించి, క్రీడలను మేమే ప్రోత్సహిస్తున్నామని చెప్పుకోవడం మినహా మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నారుు? మనకు సరైన క్రీడా విధానం లేదు కాబట్టే అంతర్జాతీయ క్రీడా వీధుల్లో నగుబాటు తప్పడం లేదు. 2020 ఒలింపిక్స్‌లో సింధు స్వర్ణం సాధిం చాలని మనందరం కోరుకోవాల్సిందే, అందుకోసం దేశం మొత్తం ఆమెను ప్రోత్సహించవలసిందే. ఆ విజయం సాధించడం కోసం సింధు కృషి చేసే క్రమంలో ఆమెకు ఎటువంటి అడ్డంకులూ, ఇబ్బందులూ ఉండకూడదు. దానికి అవసరమైన వాతావరణం, పరిస్థితులు ఉండాలి. వాటిని కల్పించా ల్సిన విధి ప్రభుత్వాలది. ప్రభుత్వాలు ఆ పని చేస్తే వందమంది సింధులు తయారవుతారు రాష్ట్రంలో, దేశంలో.

రొహతక్‌కు చెందిన సాక్షి మలిక్‌కి కానీ, హైదరాబాద్‌కు చెందిన సింధుకు కానీ- ఇలాంటి విజయాలు ఎవరు సాధించి వచ్చినా ప్రభుత్వాలూ ఇతర సంస్థలూ పోటాపోటీగా కానుకలు ఇవ్వడం కొత్తేమీ కాదు కూడా. గతంలో సానియా మీర్జా, సైనా నెహ్వాల్ ఇంకా అనేకమంది దేశ వ్యాప్తంగా ఇటువంటి సత్కారాలు అందుకున్నారు. ప్రశ్న ఒక్కటే. మొత్తంగా మన దేశం అంతర్జాతీయ క్రీడారంగంలో రాణించడానికి ఇది చాలా? చాలదని చెప్ప డానికి అనేక అంశాలను ప్రస్తావించవచ్చు. మరుగున పడిన మాణిక్యాలను పట్టించుకోకుండా, తమ గొప్ప కోసం రాజకీయ నాయకులు విజేతలకు నజరానాలు ప్రకటించి, వారే విమర్శల పాలవుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఒక చర్చకు అవకాశం కలిగినందుకు సంతోషించవలసిందే.

‘సాక్షి’ (23-8-16) సంపాదకీయ పేజీలో లేఖల కాలమ్‌లో నీలం వెంకన్న పడ్డ ఆవేదన చూడండి! ఆయన మాటల్లోనే ‘పేదరికంలో పుట్టి కాయ కష్టం చేస్తూ, కనీస సదుపాయాలు లేని స్కూళ్లల్లోనే అద్భుత ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తున్న గ్రామీణ సింధువులెందరో కన్నీటి బిందువులుగా మారిపోతు న్నారు’ అంటున్న ఆయన వరంగల్ జిల్లా కేసముద్రంలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న కొలిపాక ఉమ దైన్యాన్ని గురించి లోకానికి చాటారు. క్రీడారంగంలో ప్రతిభను మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నామో చెప్పారు. ఖోఖోలో ఉమ రాష్ట్ర స్థాయి పోటీల్లో ఎనిమిదిసార్లు జిల్లాకు బంగారు పతకాలు సాధించిపెట్టింది. రెండుసార్లు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అయి కూడా ఆర్థిక సాయం లేక వెళ్లలేక పోయింది. తండ్రి అకాల మరణంతో క్రీడలకు దూరమై ఇస్త్రీ పెట్టెను పట్టి బ్రతుకుతో పోరాడుతున్నది. కొలిపాక ఉమ లాంటి వాళ్లు వేల సంఖ్యలో ఉంటారు, వీళ్ళందరికీ గోపీచంద్ అకాడమి లాంటి చోట శిక్షణ పొందే అవకాశం జీవితంలో లభిస్తుందా? లభించినప్పుడే కదా, మన పతకాల సంఖ్య గౌరవప్రదంగా కనిపిస్తుంది.

నాణేనికి మరోవైపు

క్రీడల పట్ల, వాటి అభివృద్ధి పట్లా నిజాయితీ, చిత్తశుద్ధీ లేని పరిస్థితి దేశమంతా ఉంది. కొలిపాక ఉమలు దేశమంతటా ఉన్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన సీతా సాహు ఒలింపిక్స్‌లో రెండుసార్లు భారతదేశానికి కాంస్య పతకాలు తెచ్చిపెట్టింది. 2011లో ఏథెన్స్ లో జరిగిన స్పెషల్ ఒలింపిక్స్‌లో తన పదిహేనవ ఏటనే సీతా సాహు 200 ,1600 మీటర్ల పరుగు పందెంలో గెలిచి రెండు కాంస్యాలు సాధించి పెట్టింది.  బ్రతకడం కోసం చిన్న కొట్టు పెట్టుకుని కాలం గడుపుతున్నది. ఇప్పుడు ఆమెను పట్టించుకున్న ప్రభుత్వాలే లేవు. కొలిపాక ఉమలు, సీతా సాహూలు అనేకమంది. వీరి పరిస్థితి ఇట్లా ఉంటే, ప్రభుత్వాలు మాత్రం ఈ వాస్తవాల జోలికి పోకుండా తాజా విజేత లకు పోటీ పడి నజరానాల వర్షం కురిపించాయి.

ఒక పక్క నేతలు కొత్త విజేత లను సత్కరిస్తూ ఉండగానే పంజాబ్‌కు చెందిన జాతీయ స్థారుు హ్యాండ్‌బాల్ క్రీడాకారిణి పూజ తన 20వ ఏటనే ఉరేసుకుని తనువు చాలించింది. కాలేజీలో చదువుకీ, హాస్టల్ ఫీజులు చెల్లించే స్తోమత లేక ఆత్మహత్య చేసుకున్న పూజ తన వంటి పేద ఆడపిల్లలకు ఉచిత విద్య ఏర్పాటు చెయ్యాలని కోరుతూ ప్రధానమంత్రికి లేఖ రాసి పోయిది. పూజ తండ్రి కూరగాయలు అమ్మి కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఏమయింది మన బేటీ బచావో, బేటీ పడావో? క్రీడల పట్ల ఆసక్తి ఉండి, ప్రతిభ ఉండి అవకాశాలు లేక, ప్రధానంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా రాణించలేక పోతున్న క్రీడాకారులు మన దేశంలో లక్షల్లో ఉంటారు. ఆ ప్రతిభను గుర్తించి వారికి సరైన వనరులు, వసతులు కల్పించే క్రీడా విధానం మనకెక్కడిది? అది లేదు కాబట్టే రియో ఒలింపిక్స్‌లో ఒకరికి రజతం, ఒకరికి కాంస్యం. వాటితోనే రాజకీయ పబ్బం గడుపుకోవాలని మన నేతలు రాజకీయ క్రీడను ఆరంభించారు.

క్రీడలకు ఏదీ ప్రోత్సాహం?

ముగిసిన రియో ఒలింపిక్స్‌లో అమెరికాకు 30 పైగా స్వర్ణ పతకాలోచ్చాయి, మొత్తం మీద ఎక్కువ పతకాలు గెలుచుకుని ప్రథమ స్థానంలో నిలిచింది ఆ దేశమే. ఎందుకు? అది సంపన్న దేశం కాబట్టా? కాదు. అక్కడి ప్రభుత్వా లకు, ప్రజలకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు అంత కంటే ముఖ్యం కాబట్టి. మురళీ చల్లా చాలా ఏళ్ల క్రితమే అమెరికాలో స్థిరపడ్డాడు. ఇద్దరు పిల్లలు ఆయనకు. స్కూల్‌కు పోతున్నారు. అమెరికా వదిలేసి భారతదేశం వచ్చి స్థిరపడాలనుకున్నారు మురళీ, ఆయన సతీమణి కల్పన. దాదాపుగా నిర్ణయం అయిపోయింది. నెల్లూరు వాస్తవ్యులయినా చిన్నప్పటి నుండి హైద రాబాద్‌లో పెరిగారు కాబట్టి, రాజధాని కూడా కాబట్టి హైదరాబాద్‌కే రావాలనుకున్న మురళీ కుటుంబం ఆ నిర్ణయాన్ని మార్చుకుని అమెరికాలోనే ఉండి పోవాల్సివచ్చింది. కారణం ఏమిటంటే ఆయన ఇద్దరు పిల్లలూ అమె రికాలో టెన్నిస్ నేర్చుకుంటున్నారు. దాన్ని హైదరాబాద్‌లో కొనసాగించడా నికి సరైన వసతులు, శిక్షణ  సంస్థలు లేకపోవడం ఒక కారణం కాగా, అసలు స్కూళ్లలో క్రీడల ఊసే లేకపోవడం రెండో కారణం.

అమెరికాలో ప్రతి విద్యార్థి చదువుతో పాటు ఏదో ఒక ఆట నేర్చుకోవడం, అందులో ప్రావీణ్యం సంపా దించడం తప్పనిసరి. అది ప్రభుత్వ విధానం. అందుకే అమెరికాకు మెడల్స్ వస్తాయి, మనకు రావు. ఉన్న మైదానాలనే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎప్పుడెప్పుడు ఇచ్చేద్దామా, షాపింగ్ కాంప్లెక్స్‌లు ఎప్పుడు కట్టేద్దామా అని మనం ఉబలాట పడిపోతుంటామాయే. మొన్న సింధు రియోలో సెమీ ఫైనల్స్ ఆడుతున్నప్పుడు నాతో పాటు ఆట చూస్తున్న సంజు, రాజు చెపుతు న్నారు, ‘‘ వారంలో ఒక పీటీ క్లాస్ ఉంటే, దాన్ని కూడా రద్దు చేసి  పోర్షన్ పూర్తికాలేదని వేరే సబ్జెక్టులు చెపుతుంటే ఇండియాకు మెడల్స్ ఎట్లా వస్తాయి, ఒక్కపూట అన్నా ఆడనిస్తున్నారా మమ్మల్ని?’’అని. మన విద్యా విధానం ఎన్ని వెర్రితలలు వేస్తున్నదో చెప్పారు.

ఆ ఇద్దరిలో ఒకడు హైస్కూల్ విద్యార్థి, మరొకడు కాలేజీ విద్యార్థి. ఒక ప్రభుత్వ స్కూల్‌లో పీటీ సార్ ఒక టెన్నిస్ రాకెట్, బాల్ కొనుక్కొచ్చి 50 రూపాయలు బిల్లు పెడితే ఆ డబ్బు మంజూరు చెయ్యడానికి వందసార్లు తిరగాలి. స్కూళ్లలో ఆటస్థలాల మాటే లేదు. అసలు చదువు తప్ప ఇంకో ముచ్చటే లేదు. మనం స్కూళ్లలో బ్రాయిలర్ కోళ్లను తయారు చేస్తున్నాం తప్ప మానసికంగా, శారీరకంగా ఆరోగ్యవంతులరుున పౌరులను ఎక్కడ ఎదగనిస్తున్నాం? విద్యా, క్రీడా విధానాల పట్ల మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి మారి ఒక పటిష్టమయిన విధానం వస్తే తప్ప లాభం లేదు. లేదంటే మళ్లీ ఒకటి రెండు పతకాలకే పరిమితమై, వాటిని చూసి మురిసిపోవలసిందే. ఇంకా-గోపీచంద్ అకాడమికి నేను భూమి ఇచ్చాను, కాబట్టి సింధు రియోలో పతకం సాధించగలిగింది, అది కూడా నా ఘనతే అంటూ నేతలు పలికే డంబాలు మళ్లీ వినకతప్పదు.

- దేవులపల్లి అమర్

datelinehyderabad@gmail.com 

మరిన్ని వార్తలు