అంతరిక్షంలో ఆలాపనలు

14 Feb, 2016 01:30 IST|Sakshi
అంతరిక్షంలో ఆలాపనలు

మనం ఇప్పుడు హద్దులను చెరిపేసి, జ్ఞానం కొత్త అంచుల దగ్గర ఉన్నాం. ఆవిష్కరణలోని నాటకీయతను చూసినప్పుడు ఎక్కువ ఆశించడం సులభమే. అయితే అతిశయోక్తుల గురించి శాస్త్రవేత్తలు మనలను హెచ్చరిస్తూనే ఉన్నారు. వారు ఈ అవిష్కరణలో ప్రతి అడుగులోను ఎంతో శ్రమించారు. ఆ శ్రమ అనేది ప్రయోగశాలలో కావచ్చు లేదా అబ్జర్వేటరీలో కావచ్చు. అందిన సమాచారాన్ని వాస్తవంగా మలచడానికి కొన్ని జీవితాలు పట్టాయి.

 ఒక ఆవిష్కరణ గురించిన ఉద్వేగం అందుబాటులో దొరికే సమాధానాలను గమనించడం కంటే, మరిన్ని ప్రశ్నలను సంధించడానికే చూస్తుంది. రెండువేల సంవత్సరాలకు పైగా వినిపించిన ప్రశ్నలు పైథాగరస్ నుంచి ఐన్‌స్టీన్‌ను వేరు చేసి చూపాయి. అలాగే ఐన్‌స్టీన్‌కీ, విర్గో కొలాబిరేషన్-లీగో బృందాలకీ మధ్య వందేళ్ల పాటు సాగిన ప్రయత్నం ఉంది.  
 
 తెలుసుకోవాలనుకున్నప్పుడు విజ్ఞానశాస్త్రం నన్ను సదా గజిబిజి చేసిపోయేది. పాఠశాల స్థాయిలో మొదట్లో భౌతికశాస్త్ర పాఠాలు విన్నప్పుడు అంతా గందరగోళంగానే ఉండేది. రసాయనశాస్త్రం కాస్త అర్థమైనప్పుడు ఏదో కుట్ర పన్నుతున్నట్టు ఉండేది. తర్కంతో, అంచనాలతో సాగే గణితం మాత్రం బాగుండేది. కానీ లేని సున్నాతో ఏమైనా లెక్కకట్టాలని చూస్తే దానిని మాత్రం తత్వశాస్త్రంగా పరిగణించాలి.
 
 ఇకపోతే, ఒక హోటల్ గదిలో ఈ వారంలోనే ఒక వేకువ నిశ్శబ్ద వేళ అనుకోకుండా టీవీ పెట్టి, ఒక న్యూస్ చానల్ చూస్తున్నాను. హఠాత్తుగా నన్ను వివశత్వంలో ముంచెత్తుతూ భూతభవిష్యద్వర్తమానాలు, ఇంకా అనేక భవిష్యత్తు అంచనాలు కలగలసిన కలగూరగంప వంటి, ఇంకా అంతులేని కథనాలను జోడించుకుని ఓ సైన్స్ విషయం దర్శనమిచ్చింది. గూడు కట్టినట్టున్న ఆ నిశ్శబ్దంలోనే సాహిత్య గుబాళింపు ఉన్న ఒక వాక్యం వినిపించింది. విశ్వాసానికి అతీతమైనదానిని నిరాకరించమని హేతువు చెప్పినప్పుడు మనం దేని గురించి ఎదురు చూడవచ్చునో ఆ వాక్యం చెప్పి, మనోహరమైన వాస్తవం దగ్గరకి తీసుకుపోయింది. అదే- గోళాల సంగీతం. వందకోట్ల కాంతి సంవత్సరాల క్రితం గురుత్వాకర్షణ కారణంగా రెండు కృష్ణబిలాలు డీకొన్నప్పుడు జనించిన అంతరిక్ష సంబంధమైన, మరచిపోలేని శ్రావ్యమైన సంగీతం అందులో విన్నాను. మేధావుల స్థాయిలో చెప్పాలంటే పైథాగరస్ వచ్చి ఐన్‌స్టీన్‌ను కలుసుకున్నాడు. ఖగోళంలోని రాశులన్నీ లయాత్మకంగా కదులుతున్నాయని ఆ పురాతన గ్రీకు మార్మిక గణితశాస్త్రవేత్త ఏనాడో ప్రతిపాదించాడు. ఆ రాశులన్నీ కదిలిపోతూ మనిషి చెవులకు సోకని ఒక అనుపమానమైన ఆలాపన చేస్తున్నాయని కూడా చెప్పాడాయన. కవులని సూదంటురాయి వలే ఆకర్షించే ఆ అంశమే గోళాల స్వర సమ్మేళనం.
 
 కింది తరాలవారి అద్భుత మేధస్సునూ, ఈ తరం శాస్త్రవేత్తల సాహసోపేతమైన జ్ఞానదీప్తినీ ఒక ప్రేక్షకునిలా వీక్షించే నాలాంటి వ్యక్తి బుద్ధికి ఆ నాదం పదును పెడుతుంది. కొత్త ఆలోచనలు రేకెత్తిస్తుంది.  స్థలకాలాలు, ఉనికిల సారం గురించి వినూత్న విశ్లేషణలు ఇచ్చే ఒక ప్రపంచంతో మన బుద్ధిని అనుసంధానింపచేస్తుంది. జీవితం అంటే కాలం గడిచిపోవడమే. అది ఒక శూన్యంలో అర్థంతరంగా ఎక్కడో ముగిసిపోతుంది. ఆ తరువాత ఏమవుతుందన్నది అంతుచిక్కని అంశం. దీనికి సమాధానం కేవలం  నిర్దిష్ట విశ్వాసం, సిద్ధాంతాల ద్వారా లభిస్తుంది తప్ప, మనిషి మేధస్సుతో చేసే అనిర్దిష్ట ప్రయత్నంతో కాదు.
 
 కానీ, విశ్వంలో గురుత్వాకర్షణతో పాటే, మనిషి చెవికి సోకని కొన్ని శబ్దాలు ఉన్నాయని మేధస్సుతో చే సిన ప్రయత్నంతోనే ఇప్పుడు రుజువైంది. ఇంకో మాటలో చెప్పాలంటే మానవాళి అనుభవాల మౌలిక ధర్మాలు ఎక్కడెక్కడో ఉన్న ఇతర ప్రపంచాలలో కూడా ఉనికిలో ఉన్నాయి. ఇకపై శబ్దం వినడం మనిషి ఇంద్రియాలు చేసే పనులలో ఒకటి మాత్రమే కాదు, ఈ శాశ్వత ఉనికిలో కూడా దాని జాడ ఉంది. ‘లిగో’ (లేజర్ ఇంటర్‌ఫెరోమీటర్ గ్రేవిటేషనల్ - వేవ్ అబ్జర్వేటరీ)బృందంలో సభ్యుడు, కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు సబోల్క్స్ మర్కా న్యూయార్క్ టైమ్స్ పత్రికకు చెప్పిన మాటను ఇక్కడ ఉటంకిస్తాను.
 
  ‘‘ఈ ఆవిష్కరణ చాలా కాలం తరువాత భౌతికశాస్త్ర పరిశోధన లు సాధించిన అతి గొప్ప పురోగతిగా నేను భావిస్తున్నాను. ఖగోళశాస్త్రంలో వేరే అన్నీ అంశాలు చర్మచక్షువులకు కనిపించేవే. ఇప్పుడు ఈ శాస్త్రానికి వినికిడి శక్తి కూడా వచ్చింది. ఇంతకు ముందు ఇలాంటి శక్తి ఏనాడూ లేదు.’’ఎంతో వాగ్ధాటితో వివరించిన ఈ అంశంలోని లోతైన ఆ భేదం గురించి ఆలోచించండి. దృష్టి మానవుల చూపు ద్వారా ఆవిర్భవిస్తుంది. అది వారి సామర్థ్యం మేరకు ప్రయాణిస్తుంది. నాదం మరెక్కడి నుంచో ఉద్భవిస్తుంది. ఇప్పుడు మనకు తెలిసిన దానిని బట్టి వంద కోట్ల కాంతి సంవత్సరాల క్రితం ఆ నాదం వెలువడింది. కన్ను ఆత్మాశ్రయం లేదా వ్యక్తి అనుభవం. చెవి బాహ్యమైనది.
 
 మనం ఇప్పుడు హద్దులను చెరిపేసి, జ్ఞానం కొత్త అంచుల దగ్గర ఉన్నాం. ఆవిష్కరణలోని నాటకీయతను చూసినప్పుడు ఎక్కువ ఆశించడం సులభమే. అయితే ఉత్ప్రేక్షల గురించి, అతిశయోక్తుల గురించి శాస్త్రవేత్తలు మనలను హెచ్చరిస్తూనే ఉన్నారు. వారు ఈ అవిష్కరణలో ప్రతి అడుగులోను ఎంతో శ్రమించారు. ఆ శ్రమ అనేది ప్రయోగశాలలో కావచ్చు లేదా అబ్జర్వేటరీలో కావచ్చు. అందిన సమాచారాన్ని వాస్తవంగా మలచడానికి కొన్ని జీవితాలు పట్టాయి. అయితే తెలియని కోణం వైపు మరో కొత్త అడుగు పడే వరకు ఈ  వాస్తవాన్ని కూడా తాత్కాలికమైనదిగానే పరిగణిస్తారు.
 
 అలాగే ఒక ఆవిష్కరణని తక్కువ చేసి చూడడం కూడా చాలా సులభం. ఈ ఉద్వేగంలో నేను అతిగా స్పందిస్తూ ఉండాలి. కానీ నేను ఆశావాదంలోని దోషాన్ని చూడడానికే ప్రాధాన్యం ఇస్తాను. ఒక ఆవిష్కరణ గురించిన ఉద్వేగం అందుబాటులో దొరికే సమాధానాలను గమనించడం కంటే, మరిన్ని ప్రశ్నలను సంధించడానికే చూస్తుంది. రెండువేల సంవత్సరాలకు పైగా వినిపించిన ప్రశ్నలు పైథాగరస్ నుంచి ఐన్‌స్టీన్‌ను వేరు చేసి చూపాయి. అలాగే ఐన్‌స్టీన్‌కీ, విర్గో కొలాబిరేషన్-లీగో బృందాలకీ మధ్య వందేళ్ల పాటు సాగిన ప్రయత్నం ఉంది.
 
 ఊహకు కూడా అందని ఈ విశాల విశ్వం నిరీశ్వరవాదుల రచనలు వాదించినట్టు  కొన్ని యాదృచ్చిక పరిణామాల మాలిక అనుకోవాలా? అంతకు మించి నైపుణ్యంతో  మలచిన ఆకృతి అనకోవాలా? లేకపోతే ఈ భూగోళానికి అందకుండా బయట కాలానుక్రమణికలు ఉన్నాయా?  కాలాన్ని వెనక్కు జరపవచ్చన్న వాగ్దానం ద్వారా మన ఊహలు ఎల్లప్పుడూ ప్రభావితమవుతూ వచ్చాయి. అల్బర్ట్ ఐన్‌స్టీన్ తన భావాలను రూపుదిద్దుతున్నప్పుడు, హెచ్.జి. వెల్స్ ‘ది టైమ్ మిషన్’ను రాస్తూ ఉండేవారు. భారతీయ తత్వశాస్త్రం అన్ని వేళలా  కాలాన్ని పునర్జన్మలో విశ్వాసానికి తప్పనిసరి అవ సరంగా ఒక భ్రమగా కొట్టిపారేసింది. కాలంలోని వంపును, చపలతను లిగో శాస్త్రజ్ఞులు నమోదు చేశారు. మన మనస్సు సూచించేదానికంటే ఎక్కువ పరిమాణాలను కాలం కలిగి ఉంది. తర్వాతేమిటి? తర్వాత ఎక్కడ?
 
జ్యోతిషశాస్త్రాన్ని ప్రస్తావించడం అనేది ఉత్కృష్ట స్థితినుంచి పరిహాసాస్పద స్థాయికి దిగజారడమే అవుతుందా? జ్యోతిషశాస్త్రానికి సైన్స్ అంత పరిపక్వత, కచ్చితత్వం ఉండదు కానీ అది సామూహిక అభద్రత కంటే ఎక్కువగా స్పష్టమైన రుజువుగా మన విశ్వాసాల్లో బలంగా నిలిచిపోయింది. మీడియాలో కనిపించే రోజువారీ లేదా వారాంతపు జోస్యాలు, అంచనాలు విస్పష్టంగానే అర్ధరహితమైనవి కానీ అన్ని సంస్కృతులను ఆదేశిస్తున్న జాతకచక్రం పట్ల పూజ్య భావం అనేది విలువ కోల్పోయిన పురాగాధనే సూచిస్తోంది. నాకు సమాధానాలు తెలియవు. ప్రశ్నలు మాత్రమే తెలుసు. వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు: బీజేపీ అధికార ప్రతినిధి
 - ఎం.జె. అక్బర్
 సీనియర్ సంపాదకులు

మరిన్ని వార్తలు